మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎదురీతే
కాలూచేయీ కూడదీసుకునే యత్నం
కదనోత్సాహంతో కమలనాథులు
భౌగోళికంగా భారత్‌కు గుండెకాయ వంటిది మధ్యప్రదేశ్. ఈ హిందీ బెల్టు రాష్ట్రంలో ఎన్నికల పోరు ఎప్పుడూ జాతీయ పార్టీల మధ్యే. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపిన బీజేపీ ఉరిమే ఉత్సాహంతో లోక్‌సభ సంగ్రామంలో దూకగా కాంగ్రెస్ కూడా విపక్ష ఇండియా కూటమి దన్నుతో సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది...
మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. కాకపోతే దాదాపు పాతికేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ ఆధిపత్యమే సాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లతో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించి బీఎస్పీ, స్వతంత్రుల సాయంతో గద్దెనెక్కినా అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. అసంతృప్త కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా 2020లో తిరుగుబాటు చేయడంతో కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలింది.
శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో మళ్లీ బీజేపీ సర్కారే కొలువుదీరింది. మధ్యప్రదేశ్‌లో 29 లోక్‌సభ సీట్లున్నాయి. 10 సీట్లను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 28 సీట్లు కొల్లగొట్టగా కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ జోరే కొనసాగింది. 230 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 163 స్థానాలను ఒడిసిపట్టింది.
బీజేపీ ఓబీసీ కార్డు, కాంగ్రెస్ మైనారిటీ జపం
మధ్యప్రదేశ్ ఎన్నికల సమీకరణాల్లో కులాలదీ కీలక పాత్రే. అగ్రవర్ణ ఓటు బ్యాంకును పటిష్టపరుచుకుంటూనే ఇతర సామాజిక వర్గాలను కూడా తమవైపు తిప్పుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుల గణన హామీని విస్తృతంగా ప్రచారం చేసినా ఓబీసీ ఓట్లను సాధించడంలో విపలమైంది. 2018తో పోలిస్తే బీజేపీ మరింత మంది ఓబీసీలను, ఆదివాసీలను తమవైపు తిప్పుకోగలిగింది. అనూహ్యంగా యాదవ సామాజికవర్గానికి చెందిన మోహన్ యాదవ్‌ను సీఎం చేయడం ఓబీసీల ఓట్లు సాధించి పెడుతుందని ఆశిస్తోంది. ఇతర హిందీ బెల్ట్ రాష్ట్రాల్లోనూ కీలకమై యాదవ ఓటు బ్యాంకు తనవైపు మళ్లుతుందని భావిస్తోంది. రాష్ట్రంలో 7 శాతం ఓటు బ్యాంకున్న ముస్లింలతో పాటు ఎస్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు.
కాషాయ దళంలో జోష్
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు జోష్‌లో ఉన్న బీజేపీ ఈసారి మొత్తం 29 స్థానాలనూ చేజక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయోధ్య రామమందిర నిర్మాణం, మోదీ, అభివృద్ధి, హిందుత్వ నినాదం ఈసారి కమలనాథులు ప్రచా రా్రస్తాలుగా ఉన్నాయి. సీఎంగా దాదాపు పాతికేళ్లు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన శివరాజ్ సింగ్ ఈసారి విదిశ నుంచి లోక్‌సభ బరిలోకి దిగుతుండటం విశేషం! కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య గుణ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.
రాష్ట్రంలో బీజేపీ సింగిల్‌గా పోటీ చేస్తోంది. నాలుగు విడతల్లో పోలింగ్ జరుగుతుండగా ఇప్పటికే అభ్యర్థులందరినీ ప్రకటించింది. ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌లో సుడిగాలి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. తాజాగా మంగళవారం బాలాఘాట్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో విపక్షాలపై పదునైన వాగ్బాణాలు సంధించారు. తాను అభివృద్ధి చేస్తుంటే దూషిస్తున్నారని, దేశ భద్రతకు గ్యారంటీ ఇస్తుంటే బురద జల్లుతున్నారని, అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నప్పుడూ అనరాని మాటలన్నారని విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్‌పై పదునైన విమర్శలతో వేడి
పుట్టిస్తున్నారు.
కాంగ్రెస్ కోలుకునేనా...!
అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం చతికిలపడుతోంది. సింధియా వంటి కీలక యువ నేతను చేజార్చుకోవడం ఈసారి హస్తం పార్టీకి మరింత ప్రతికూలంగా మారింది. ఇండియా కూటమి దన్నుతో బీజేపీని ఢీకొట్టి పూర్వ వైభవాన్ని అందుకునేందుకు ప్రయతి్నస్తోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ప్రచారా్రస్తాలుగా మలచుకుంటోంది. కులగణన హామీ ద్వారా ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకులపై కన్నేసింది. రాహుల్ ప్రకటించిన యువతకు 30 లక్షల ప్రభుత్వోద్యోగాల హామీపైనా ఆశలు పెట్టుకుంది. 6 న్యాయాలు, 25 గ్యారంటీల మ్యానిఫెస్టోతో ప్రచారాన్ని మ్మురం చేసింది. సమాజ్‌వాదీ పార్టీకి ఖజురహో స్థానం కేటాయించి మిగతా 28 చోట్ల పోటీ చేస్తోంది.
బీజేపీకే ఓటేస్తున్న సర్వేలు
సాధారణంగా మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సరళి జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటుంది. ఆ లెక్కన మొత్తం 29 సీట్లనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని పలు సర్వేలు అంచనా వేశాయి. మరికొన్ని 27 సీట్లిచ్చాయి. కాంగ్రెస్ గట్టిగా పుంజుకోని పక్షంలో 2 సీట్లకు మించకపోవచ్చన్నది మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనా.
‘సరికొత్త భారత నిర్మాణమే నా మిషన్. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇందుకు ప్రజల దీవెనలు కావాలి. నేను మహాకాలుడి భక్తున్ని. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు’
– మంగళవారం మధ్యప్రదేశ్‌లోని
బాలాఘాట్‌లో ఎన్నికల ర్యాలీలో మోదీ
, – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment