అభివృద్ధి ఆగిపోతుంది,
అస్థిరత రాజ్యమేలుతుంది
హరియాణా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
సోనిపట్: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ హరియాణాలో పొరపాటున అధికారంలోకి వస్తే విధ్వంసం తప్పదని అన్నారు. అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుందని, అస్థిరత రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు అధికారం అప్పగించవద్దని ప్రజలకు సూచించారు.
బుధవారం హరియాణాలోని సోనిపట్ జిల్లా గొహానాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అస్థిరత, అవినీతి, బంధుప్రీతి తదితర అవలక్షణాలన్నీ ఉంటాయని ఆరోపించారు. కర్ణాటకలో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందని గుర్తుచేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య అంతర్గత యుద్ధం సాగుతోందన్నారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ అదే కథ అని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ పట్ల హరియాణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కాంగ్రెస్ పాలనలో బడుగులకు అన్యాయం
రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి మండిపడ్డారు రిజర్వేషన్ల పట్ల ద్వేషం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉందని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ రాజ కుటుంబంలోని నాలుగో తరం రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో లేనప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు హక్కులు లభించాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయా వర్గాల హక్కులను లాక్కుందని, తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.
పారిశ్రామికీకరణతో పేదలు, రైతులు, దళితులకు లబ్ధి
ఇటీవల జరిగిన అమెరికా పర్యటన గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. అమెరికాలో పలువురు ముఖ్య నాయకులను, ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులను కలిశానని చెప్పారు. భారతీయ యువత నైపుణ్యాల గురించి వారికి వివరించానని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు నేడు భారత్‌లో ఫ్యాక్టరీలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. దేశంలో పారిశ్రామికీకరణ పెరిగితే పేదలు, రైతులు, దళితులు అధికంగా లబ్ధి పొందుతారని స్పష్టంచేశారు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో బీజేపీ ప్రభుత్వం హరియాణాను అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దిందని ఉద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ బీజేపీకి ఆదరణ నానాటికీ పెరుగుతోందని, కాంగ్రెస్ దిగజారిపోతోందని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment