Sonipat
-
ఇంట్లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి, ఏడుగురికి గాయాలు
ఓ ఇంట్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి ఇల్లు ద్వంసమైంది. ఇంట్లోని ముగ్గురు సజీవ దహనమయ్యారు.మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం సోనిపట్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఖార్ఖోడా తాలూకాలోని రిదౌ గ్రామంలో ఇంట్లో అక్రమంగా బాణా సంచా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన సమయంలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండటంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయని హర్యానా పోలీసులు తెలిపారు. #WATCH | Sonipat, Haryana: 3 killed and 7 injured in an explosion in a house in Ridhau village of KharkhodaSonipat ACP Jeet Singh says, "Information was regarding a blast in a house and we have found material used in firecrackers from the spot.Some people said a cylinder… pic.twitter.com/j6olCoJNCc— ANI (@ANI) September 28, 2024 సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారని సోనెపట్ ఏసీపీ జీత్ సింగ్ చెప్పారు. ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. పేలుడు సంభవించిన ఇంట్లో పటాకుల తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలను గుర్తించినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి చెందిన బృందం పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుందని చెప్పారు. -
PM Narendra Modi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విధ్వంసమే
సోనిపట్: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ హరియాణాలో పొరపాటున అధికారంలోకి వస్తే విధ్వంసం తప్పదని అన్నారు. అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుందని, అస్థిరత రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు అధికారం అప్పగించవద్దని ప్రజలకు సూచించారు. బుధవారం హరియాణాలోని సోనిపట్ జిల్లా గొహానాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అస్థిరత, అవినీతి, బంధుప్రీతి తదితర అవలక్షణాలన్నీ ఉంటాయని ఆరోపించారు. కర్ణాటకలో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందని గుర్తుచేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య అంతర్గత యుద్ధం సాగుతోందన్నారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ అదే కథ అని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ పట్ల హరియాణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో బడుగులకు అన్యాయం రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి మండిపడ్డారు రిజర్వేషన్ల పట్ల ద్వేషం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ రాజ కుటుంబంలోని నాలుగో తరం రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో లేనప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు హక్కులు లభించాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయా వర్గాల హక్కులను లాక్కుందని, తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. పారిశ్రామికీకరణతో పేదలు, రైతులు, దళితులకు లబ్ధి ఇటీవల జరిగిన అమెరికా పర్యటన గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. అమెరికాలో పలువురు ముఖ్య నాయకులను, ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులను కలిశానని చెప్పారు. భారతీయ యువత నైపుణ్యాల గురించి వారికి వివరించానని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు నేడు భారత్‌లో ఫ్యాక్టరీలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. దేశంలో పారిశ్రామికీకరణ పెరిగితే పేదలు, రైతులు, దళితులు అధికంగా లబ్ధి పొందుతారని స్పష్టంచేశారు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో బీజేపీ ప్రభుత్వం హరియాణాను అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దిందని ఉద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ బీజేపీకి ఆదరణ నానాటికీ పెరుగుతోందని, కాంగ్రెస్ దిగజారిపోతోందని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తంచేశారు. -
Rahul Gandhi: పొలం బాట పట్టిన రాహుల్ గాంధీ
ఛండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతులతో ములాఖత్ అయ్యారు. శనివారం ఉదయం హర్యానా సోనిపట్‌లో ఆకస్మిక పర్యటన చేసిన ఆయన.. అక్కడి రైతులతో కలిసి వ్యవసాయ పనుల్లో భాగం అయ్యారు. ఆ సమయంలోనే వాళ్ల మంచీచెడులు అడిగి తెలుసుకున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి అక్కడి గ్రామాల్లో పర్యటించిన రాహుల్ గాంధీ.. స్థానికులతో ముచ్చటించారు. ఆపై పొలంబాట పట్టి ట్రాక్టర్ నడపడంతో.. నాట్లు వేయడంలోనూ హుషారుగా రైతులతో పాల్గొన్నారాయన. ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్న క్రమంలో.. ఆయన అక్కడికి వెళ్లి ఉంటారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక ఇక్కడా ఆయన తన మార్క్ వైట్ టీషర్ట్లోనూ కనిపించడం గమనార్హం. हरियाणा में किसानों के बीच पहुंचे जननायक @RahulGandhi जी। pic.twitter.com/bfX3iUgkxt — Congress (@INCIndia) July 8, 2023 ఇంతకు ముందు ట్రక్కు నడుపుతూ.. ఆ డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్న రాహుల్, ఆపై ఢిల్లీ కరోల్‌బాగ్‌లో మెకానిక్ దుకాణాలకు వెళ్లి అక్కడా జన్ కీ బాత్ నిర్వహించారు. భారత్ జోడో యాత్ర.. తదనంతర కర్ణాటక విజయం కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నింపాయి. ఇదే జోష్‌లో రాహుల్ గాంధీ ఇలా సర్ప్రైజ్ ములాఖత్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్, కాంగ్రెస్ వెరీ డేంజర్ -
గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఆరుగురు యువకులు మృతి
చండీగఢ్: హర్యానాలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మహేంద్రగఢ్, సోనిపత్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన వేరు వేరు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మహేంద్రగఢ్‌లో ఏడు అడుగుల వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కాలువలోకి దిగిన 9 మంది యువకులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మిగతా ఐదుగురిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోనిపత్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు సరయూ నదిలోకి దిగిన ఇద్దరు యువకులు నీటమునిగి చనిపోయారు. ఈ విషాద ఘటనలపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గణేష్ నిమజ్జనంలో పాల్గొనేందుకు వెళ్లి వీరంతా ప్రాణాలు కోల్పోవడం తన హృదయాన్ని కలచివేసిందని ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే సహాయక చర్యల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రశంసించారు. महेंद्रगढ़ और सोनीपत जिले में गणपति विसर्जन के दौरान नहर में डूबने से कई लोगों की असामयिक मृत्यु का समाचार हृदयविदारक है। इस कठिन समय में हम सभी मृतकों के परिजनों के साथ खड़े हैं। NDRF की टीम ने कई लोगों को डूबने से बचा लिया है, मैं उनके शीघ्र स्वस्थ होने की प्रार्थना करता हूँ। — Manohar Lal (@mlkhattar) September 9, 2022 చదవండి: అడ్డు తొలగించుకునేందుకే హత్య.. భార్య అంగీకారంతోనే.. -
‘దీక్షా’దక్షతకు సలాం
ఒకే డిమాండ్, ఒకే ఒక్క డిమాండ్ మూడు ‘నల్ల’ సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలనే ఆ ఒక్క డిమాండ్ సాధన కోసం రైతన్నలు ఏడాది పాటు సుదీర్ఘ పోరాటం చేశారు లాఠీలు విరిగినా, కేసులు పెట్టినా, హింస చెలరేగినా వాహనాలే యమపాశాలై ప్రాణాలు తీసినా అదరలేదు, బెదరలేదు, వెనకడుగు వెయ్యలేదు ఎండనక వాననక, గడ్డకట్టించే చలిని లెక్కచేయక కరోనా మహమ్మారికి బెదిరిపోక ఢిల్లీ, హరియాణా సరిహద్దుల్లోనే ఏడాదిగా మకాం వేసి చివరికి ఎలాగైతేనేం కేంద్రం మెడలు వంచారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన పోరాటం పంజాబ్‌లో మొదలై హరియాణాకి వ్యాపించి, ఉత్తరప్రదేశ్‌లో హింసకు దారి తీసి దేశవ్యాప్తంగా అన్నదాతల్ని ఏకం చెయ్యడంతో కేంద్రం దిగొచ్చింది. కరోనాని లెక్కచేయకుండా, చలి ఎండ వాన వంటి వాతావరణ పరస్థితుల్ని తట్టుకొని, భార్యాపిల్లల్ని విడిచిపెట్టి, రోడ్లపైనే నిద్రించి మొక్కవోని దీక్షతో ఏడాది పాటు సుదీర్ఘంగా సాగిన ఉద్యమంలో రైతన్నలు చివరికి విజయం సాధించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020 జూన్‌లో వ్యవసాయ చట్టాలను ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడంతో ఈ చట్టాలను దొడ్డదారిలో తెచ్చింది తమ పుట్టి ముంచడానికేనని రైతన్నలు బలంగా నమ్మారు. కిసాన్ సంఘర్‡్ష సమన్వయ కమిటీ సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా నిరసనలకు దిగింది. సెప్టెంబర్ 27న రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను ఆమోదించడంతో రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్3 న వివిధ రైతు సంఘాలు చేసిన రైతు నిరసనలు మొదట్లో పంజాబ్ చుట్టుపక్కల ప్రాంతానికే పరిమితమయ్యాయి. నవంబర్ 25న రైతు సంఘాలు ఛలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి దానిపై పడింది. కేంద్ర ప్రభుత్వం పదకొండు రౌండ్లు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఏడాదిన్నర పాటు చట్టాలను వెనక్కి తీసుకుంటామన్న కేంద్రం ప్రతిపాదనలకు కూడా రైతులు అంగీకరించలేదు. చట్టాల రద్దు తప్ప మరి దేనికీ తలవంచమంటూ పోరుబాట పట్టారు. ప్రతీ దశలోనూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ఎంతలా అణిచివేయాలని చూస్తే అంతలా పైపైకి లేచింది. ఒక్కో ఎదురుదెబ్బ తగిలినప్పుడలా మరింత బలం పుంజుకుంటూ వచ్చింది. దేశవ్యాప్తంగా 40 సంఘాలకు చెందిన రైతులు ‘సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)’ పేరిట ఒకే గొడుకు కిందకు వచ్చి ఢిల్లీ, హరియాణా, యూపీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ వద్ద శిబిరాలు వేసుకొని అక్కడే మకాం వేశారు. కుటుంబాలను విడిచిపెట్టి వచ్చిన రైతులు సామూహిక వంటశాలలు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసుకొని ఏడాదిగా అక్కడే ఉంటున్నారు. ‘కిసాన్ ఏక్తా జిందాబాద్’ అన్న నినాదం ఢిల్లీలో మారుమోగడమే కాదు, అదే ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎర్రకోట సాక్షిగా మలుపు తిరిగిన ఉద్యమం ఒకానొక దశలో సాగు చట్టాలపై రైతుల ఉద్యమం నీరుగారిపోతుందని అందరూ భావించారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్రదినోత్సవం నాడు రైతు సంఘాల నాయకులు ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింస, ఘర్షణలు ఉద్యమాన్ని మరో మలుపు తిప్పాయి. కొంతమంది నిరసనకారులు ఎర్రకోట గోడలు మీదుగా ఎక్కి సిక్కు మతం చిహ్నమైన నిషాన్ సాహిబ్ జెండాని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జీలు, బాష్పవాయువు ప్రయోగాలతో రాజధాని రణరంగంగా మారింది. రైతు ఉద్యమం ఖలిస్తాన్ వేర్పాటువాద చేతుల్లోకి వెళ్లిపోయిందన్న ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో రైతులు సరిహద్దులు ఖాళీ చేసి వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఆ సమయంలో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ పెట్టుకున్న కన్నీళ్లు మళ్లీ ఉద్యమ నిప్పుకణికని రాజేసాయి. ఇంటి బాట పట్టిన నిరసనకారులందరూ తిరిగి ఢిల్లీ సరిహద్దుల్లో మకాం వేశారు. ఏడాదిగా జరుగుతున్న ఈ పోరాటంలో ఘర్షణలు, హింసాత్మక ఘటనలు, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యంతో 700 మందికి పైగా రైతులు మరణించారు. మరెందరో రైతులపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. యూపీకి వ్యాపించి, రణరంగంగా మారి: ఆ తర్వాత నుంచి రైతు సంఘం నాయకులు పక్కా ప్రణాళికతో రహదారులు దిగ్బంధించడం, రైలు రోకోలు, నిరసన ర్యాలీలు, బ్లాక్ డే వంటివి చేస్తూ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో రాకేశ్ తికాయత్ ర్యాలీలు చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రైతు ఉద్యమం ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ పాప్ స్టార్ రిహన్నా దీనిపై మనం ఎందుకు మాట్లాడడం లేదు అంటూ లేవనెత్తిన ప్రశ్నతో అంతర్జాతీయంగా అన్నదాతలకు మద్దతు లభించింది. టీనేజీ పర్యావరణవేత్త గ్రేటా థెన్‌బర్గ్ , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు లాయర్ అయిన మీనా హ్యారిస్ వంటివారు రైతుల గళానికి బలంగా నిలిచారు.మే 27న రైతు ఉద్యమానికి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా బ్లాక్ డే పాటించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో 200 మందికిపైగా రైతులు జంతర్మందర్ దగ్గర కిసాన్ సంసాద్ నిర్వహించారు. సెప్టెంబర్5న యూపీలోని ముజఫర్‌నగర్‌లో రైతు సంఘం నాయకులు బలప్రదర్శన చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఇదీ తమ బలం అంటూ చూపించారు. ఇక యూపీలోని లఖీమ్‌పూర్‌ఖేరిలో అక్టోబర్ 3న జరిగిన హింసాత్మక ఘటనలతో కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడింది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకి వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన రైతన్నలపై ఎస్యూవీ దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు బలి కావడం , ఆ వాహనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నారన్న ఆరోపణలు మోదీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో రైతులపై ప్రజల్లో సానుభూతి పెల్లుబుకింది. వచ్చే ఏడాది అత్యంత కీలకమైన యూపీ, పంజాబ్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతు ఉద్యమం అంతకంతకూ బలం పుంజుకుంటూ ఉండడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ఏడాది పాటు జరిగిన జరిగిన ఉద్యమం విజయతీరాలకు చేరుకుంది. సుప్రీం నిలిపివేసినా... ఉద్యమం ఆగలేదు! వ్యవసాయ చట్టాలపై ఒకవైపు రైతులు వివిధ రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తూనే మరోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాల నాయకులు డిసెంబర్ 11న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టాల రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ కోర్టులో దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి విచారించడానికి ఈ ఏడాది జనవరి 7న సుప్రీం కోర్టు అంగీకరించింది. వ్యవసాయ చట్టాలపై నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక కమిటీ వేయడానికి జనవరి 11న అంగీకరించింది. ఆ మర్నాడు జనవరి 12న వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ నిపుణులు అనిల్ ఘన్వత్, అశోక్ గులాటీ, ప్రమోద్ జోషిలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికని మార్చి 19న సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో సమర్పించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దాని ప్రక్రియను పూర్తి చేస్తే ఇక న్యాయస్థానంలో కేసే ఉండదు. ఆ పిటిషన్లన్నీ ప్రయోజనం లేకుండా మిగిలిపోతాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
పొట్టి బట్టలు వేసుకోవద్దన్నారు.. ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు
‘ఆటలాడితే ఏమొస్తుంది’ అన్నారు తల్లిదండ్రులు. ‘నేను ఆడతాను’ అంది నిషా. ‘పొట్టి బట్టలు వేసుకోకూడదు’ అన్నారు మత పెద్దలు. ‘నేను లెగ్గింగ్స్ వేసుకుని ఆడతాను’ అంది నిషా. ‘మేము బూట్లు బ్యాటు ఏమీ కొనివ్వ లేము’ అన్నారు అయినవాళ్లు. ‘నేనే ఎలాగో తిప్పలు పడతాను’ అంది నిషా. హర్యానాలో సోనిపట్‌లో 25 చదరపు మీటర్ల ఇంట్లో నివాసం ఉండే నిషా ఇవాళ మహిళా హాకీ టీమ్ లో ఇంత పెద్ద దేశానికి పతకం కోసం పోరాడుతోంది.. ‘మాకు మూడో కూతురుగా నిషా పుట్టింది. మళ్లీ ఆడపిల్లా అని బంధువులు హేళన చేశారు. ఇవాళ బ్యాట్‌తో సమాధానం చెప్పింది’ అని ఆనందబాష్పాలు రాలుస్తున్నారు తల్లిదండ్రులు. ఒక సన్నివేశం ఊహించండి. తొమ్మిదేళ్ల వయసు నుంచి హాకీ ఆడుతోంది ఆ అమ్మాయి. గుర్తింపు వచ్చి జాతీయ స్థాయిలో ఆడే రోజులు వచ్చాయి. ఇక దేశానికి పేరు తెలియనుంది. ఏమో... రేపు ప్రపంచానికి తెలియవచ్చేమో. కాని ఆ సమయంలోనే తండ్రికి పక్షవాతం వస్తుంది. ముగ్గురు కూతుళ్లున్న ఆ ఇంట్లో ఆ తండ్రి జీవనాధారం కోల్పోతే తినడానికి తిండే ఉండదు. ఇప్పుడు తండ్రి స్థానంలో బాధ్యత తీసుకోవాలా బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి దిగాలా? దిగినా కుదురుగా ఆడగలదా తను? అలాంటి పరిస్థితిలో ఆడగలరా ఎవరైనా అని ఆలోచించండి. ఆడగలను అని నిరూపించిన నిషా వర్శీని చూడండి. ఆమె పోరాటం తెలుస్తుంది. ఆమె నుంచి ఎలా స్ఫూర్తి పొందాలో తెలుస్తుంది. టైలర్ కూతురు హర్యానాలోని సోనిపట్‌లో పేదలవాడలో పుట్టింది నిషా వర్శి. తండ్రి షొహ్రబ్ వర్శి టైలర్. ముగ్గురు కూతుళ్లు. మూడో కూతురుగా నిషా జన్మించింది. టైలర్‌గా సంపాదించి ఆ ముగ్గురు కూతుళ్లను సాకి వారికి పెళ్లి చేయడమే పెద్దపని అనుకున్నాడు షొహ్రబ్. ‘పాపం... ముగ్గురు కూతుళ్లు’ అని బంధువులు జాలిపడేవారు అతణ్ణి చూసి. మూడోసారి కూతురు పుడితే ‘మూడోసారి కూడానా. ఖర్మ’ అని అన్నవాళ్లు కూడా ఉన్నారు. షొహ్రబ్ ఏమీ మాట్లాడలేదు. ముగ్గురిని ప్రాణంగా చూసుకున్నాడు. నిషా వర్శి హాకీ ఆడతానంటే ‘మన ఇళ్లల్లో ఆడపిల్లలు ఆటలు ఆడలేదు ఎప్పుడూ’ అన్నాడు. కాని తల్లి మెహరూన్ కూతురి పట్టుదల గమనించింది. ఆడనిద్దాం అని భర్తకు సర్దిచెప్పింది. నిషా వర్శి తల్లిదండ్రులు ఎన్నో అడ్డంకులు క్రీడల్లో రాణించడం, అందుకు తగిన పౌష్టికాహారం తినడం, ట్రైనింగ్ తీసుకోవడం, అవసరమైన కిట్లు కొనుక్కోవడం ఇవన్నీ పేదవారి నుదుటిరాతలో ఉండవు. కలలు ఉండొచ్చు కాని వాటిని నెరవేర్చుకోవడం ఉండదు. కాని నిషా పట్టుపట్టింది. ప్రస్తుతం భారత హాకీ టీమ్‌లో ఆడుతున్న నేహా గోయల్ కూడా ఆమె లాంటి నేపథ్యంతో ఆమె వాడలోనే ఉంటూ ఆమెకు స్నేహితురాలై హాకీ ఆడదామని ఉత్సాహపరిచింది. ఇద్దరూ మంచి దోస్తులయ్యారు. కాని తెల్లవారి నాలుగున్నరకు గ్రౌండ్లో ఉండాలంటే తల్లిదండ్రులు నాలుగ్గంటలకు లేవాల్సి వచ్చేది. తల్లి ఏదో వొండి ఇస్తే తండ్రి ఆమెను సైకిల్ మీద దించి వచ్చేవాడు. ఒక్కోసారి తల్లి వెళ్లేది. వారూ వీరు చూసి ‘ఎందుకు ఈ అవస్థ పడతారు. దీని వల్ల అర్దనానా కాణీనా’ అని సానుభూతి చూపించేవారు. మరొకటి ఏమంటే– ఇస్లాంలో మోకాళ్ల పైభాగం చూపించకూడదని భావిస్తారు. హాకీ స్కర్ట్ మోకాళ్ల పైన ఉంటుంది. మత పెద్దల నుంచి అభ్యంతరం రాకూడదని కోచ్‌కు చెప్పి లెగ్గింగ్స్ తో ఆడటానికి ఒప్పించింది నిషా. ఒలింపిక్స్‌లో కూడా లెగ్గింగ్స్తోనే ఆడింది. కొనసాగిన అపనమ్మకం 2016లో తండ్రి పక్షవాతానికి గురయ్యాక దీక్ష వీడక ఆడి జాతీయ, అంతర్జాతీయ మేచెస్ లో గుర్తింపు పొందింది నిషా వర్శీ. రైల్వే బోర్డ్ టీమ్‌లో ఆడటం వల్ల ఆమెకు రైల్వేలో 2018లో ఉద్యోగం దొరికింది. పరిమిత నేపథ్యం ఉన్న నిషా కుటుంబానికి ఇదే పెద్ద అచీవ్మెంట్. ‘చాలమ్మా... ఇక హాకీ మానెయ్. పెళ్లి చేసుకో’ అని నిషాను ఒత్తిడి పెట్టసాగారు. అప్పటికి ఆమెకు 24 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా ఆలస్యమైతే పెళ్లికి చిక్కులు వస్తాయేమోనని వారి ఆందోళన. కాని నిషాకు ఎలాగైనా ఒలింపిక్స్‌లో ఆడాలని పట్టుదల. ‘ఒలింపిక్స్‌లో ఆడేంత వరకూ నన్ను వదిలేయండమ్మా’ అని తల్లిదండ్రులకు చెప్పింది. కుటుంబం మంచి చెడ్డలు చూసుకుంటానని మేనమామ హామీ ఇచ్చాక పూర్తిగా ఆట మీదే ధ్యాస పెట్టింది. ఆమె గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఇంటికి వెళ్లడమే లేదు. హాకీ సాధనలో, ఒలింపిక్స్ కోసం ఏర్పాటు చేసిన ట్రయినింగ్ క్యాంప్‌లో ఉండిపోయింది. చివరకు ఆస్ట్రేలియా మీద గెలిచాక సగర్వంగా ఇంటికి ఫోన్ చేసింది. అవును.. ఆడపిల్లే గొప్ప ఒకప్పుడు ఆడపిల్ల అని తక్కువ చూసి బంధువులు, అయినవారే ఇప్పుడు నిషాలోని గొప్పతనం అంగీకరిస్తున్నారు. ప్రతిభకు, ఆటకు, కుటుంబానికి, జీవితానికి కూడా ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా సమానమే అని భావన తన సమూహంలో చాలా బలంగా ఇప్పుడు నిషా తీసుకెళ్లగలిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా గోల్ కొట్టడమే అసలైన ప్రతిభ. తాను అలాంటి గోల్ కొట్టి ఇవాళ హర్షధ్వానాలు అందుకుంటోంది నిషా. -
సోనిపట్‌లో గ్యాంగ్స్టర్ల ఆటకట్టు..
చండీగఢ్ : ఖాకీలకు సవాల్ విసురుతున్న 11 మంది కరుడుగట్టిన గ్యాంగ్స్టర్లను హర్యానా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సోనీపట్‌కు సమీపంలోని బహల్గర్ ప్రాంతంలోని స్ధావరంపై పోలీసులు దాడి చేయగా వారిపై గ్యాంగ్స్టర్లు కాల్పులకు దిగారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్స్టర్లకు గాయాలయ్యాయి. మొత్తం 11 మంది గ్యాంగ్స్టర్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిపై పలు పోలీస్ స్టేషన్లలో హత్య, హత్యాయత్నం, లూటీ, కిడ్నాపింగ్ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులను క్రిషన్, పవన్, నీతూ, దినేష్, మహిపాల్, రవిందర్, అమిత్, ప్రమోద్, సునీల్ పునియా, రవిందర్లుగా గుర్తించారు. కాగా గ్యాంగ్స్టర్ల కాల్పుల్లో గాయపడిన ఓ పోలీస్తో సహా ముగ్గురిని స్ధానిక ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. గ్యాంగ్స్టర్ల నుంచి అక్రమ ఆయుధాలు, రూ 10.23 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన గ్యాంగ్స్టర్లలో కొందరి తలలపై పోలీసులు గతంలో ఒక్కొక్కరిపై రూ 50,000 రివార్డు ప్రకటించారు. -
ఆధార్ పేరుతో.. అమర జవాను భార్యను చంపేశారు!
చంఢీఘడ్ : హరియాణలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆధార్ కార్డు లేదని చికిత్సకు నిరాకరించడంతో ఓ కార్గిల్ అమరజవాను భార్య మృతి చెందింది. హరియాణలోని సోనిపత్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మృతురాలి కుమారుడు పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. తన తల్లి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆధార్ కార్డు అడిగారని, ఆసమయంలో తన దగ్గర లేకపోవడంతో మొబైల్లోని ఆధార్ కార్డు చూపించానని, చికిత్స చేయాలని, ఒక గంటలో తీసుకొస్తానని వేడుకున్నా కూడా వారు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై అమరజవాన్ల కుటుంబ సభ్యులు స్పందించారు. ఆధార్ లేక వైద్యం నిరాకరించడం మమ్మల్ని త్రీవంగా కలిచి వేసిందని, భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు. అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి వర్గాలు ఖండించాయి. ఆసుపత్రికి చెందని ఓ డాక్టర్ మాట్లాడుతూ.. ‘మేం ఎవ్వరి ట్రీట్మెంట్ను ఆపలేదు. ఈ ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎవరిని ఆసుపత్రికి తీసుకురాలేదు. ఆధార్ లేదని ఇప్పటి వరకు ఎవరికి వైద్యం నిరాకిరించలేదు. డాక్యుమెంటేషన్ ప్రక్రియకు ఆధార్ తప్పనిసరే కానీ చికిత్సకు కాదు. ఇవిన్నీ నిరాధరమైన ఆరోపణలని’ తెలిపారు. -
క్లాస్‌లో విద్యార్థిపై కాల్పులు..
-
క్లాస్‌లో విద్యార్థిపై కాల్పులు..
సాక్షి, హర్యానా: గన్ కల్చర్‌కు మనదేశంలోని విద్యార్థులు కూడా ఆకర్షితులు అవుతున్నారు. హరియాణాలోని సోనిపట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఐటీఐ)లో శనివారం ఇటువంటి ఘటనే జరిగింది. సోనిపట్‌లో ఐటిఐలో 17 ఏళ్ల ఒక విద్యార్థి తుపాకితో క్లాస్‌కు హాజరయ్యాడు. ప్రాక్టికల్స్ జరుగుతున్న సమయంలో ఆ విద్యార్థి తుపాకి తీసి.. మరో విద్యార్థిని దగ్గర నుంచి కాల్చాడు. అయితే బాధితుడికి బుల్లెట్ శరీరానికి దగ్గరగా దూసుకువెళ్లడంతో గాయపడ్డాడు. ప్రస్తుతం గాయపడ్డ విద్యార్థి రోహత్క్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌లో.. బాధితుడు ..సహ విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో.. వెనకవైపు నుంచి వచ్చిన విద్యార్థి తుపాకీ తీసి.. కాల్చిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. కాగా ఆ విద్యార్థి ఎందుకు కాల్పులు జరిపాడన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నర్సింగ్ 'డోపింగ్' వివాదంపై కేసు నమోదు
సోనేపట్: మరి కొద్ది రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభమవుతాయనగా భారత క్రీడారంగాన్ని కుదిపేసిన డోపింగ్ వ్యవహారంలో మొదటి కేసు నమోదయింది. హరియాణాలోని సోనేపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నిర్వహించిన శాంపిల్ పరీక్షల్లో డోపీగా తేలిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్.. తాను తిన్న ఆహారంలో డ్రగ్స్ కలిపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నర్సింగ్ ఫిర్యాదును అనుసరించి ఐపీసీ సెక్షన్ 328, 120 బిల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సోనేపట్ డీఐజీ హెచ్ ఎస్ డూన్ బుధవారం మీడియాకు తెలిపారు.(అయ్యో... నర్సింగ్!) సోనేపట్ సాయ్ కేంద్రంలో తాను తిన్న ఆహారంలో ఓ జూనియర్ రెజ్లర్ల డ్రగ్స్ కలిపి ఉంటాడని నర్సింగ్ యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేంద్రంలో డెరైక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ప్రకటించారు. సదరు నిందితుడైన టీనేజర్.. సుశీల్ కుమార్ బృందంలో ఒకడని వెల్లడికావడంతో కుట్రలో సుశీల్ కుమార్ కూడా భాగస్తుడేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి, నిందితులుగా తేలినవారికి కఠిన శిక్షలు పడేలా చేస్తామని డీఐజీ డూన్ అన్నారు. (నర్సింగ్పై కుట్రలో సుశీల్ హస్తం!) నర్సింగ్ యాదవ్ నుంచి సేకరించిన నమూనాలో నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లు తేలడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అతని ఒలింపిక్ బెర్త్ రద్దైన సంగతి తెలిసిందే. -
రేప్ జరిగినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం
చండీగఢ్: జాట్ల ఉద్యమం సందర్భంగా హరియాణాలోని సోనిపట్ వద్ద కొందరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిందని వచ్చిన వార్తలను ఆర్మీ అధికారులు ఖండించారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి గురువారం వరకూ ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరిగినట్టు సమాచారం లేదని చెప్పారు. కాగా చైన్ స్నాచింగ్ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. రిజర్వేషన్లు కల్పించాలని జాట్లు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నెల 22న సోనిపట్ వద్ద ఆందోళనకారులు 10 మంది మహిళా ప్రయాణికులను బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారులు వివరణ ఇచ్చారు. సోనిపట్ జిల్లాలో హింస చెలరేగడంతో శాంతి భద్రతల బాధ్యతను ఆర్మీకి అప్పగించారు. తాము బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలపై అత్యాచార ఘటన ఎక్కడా జరగలేదని కల్నల్ బీకే పాండా చెప్పారు.