నర్సింగ్ 'డోపింగ్' వివాదంపై కేసు నమోదు
సోనేపట్: మరి కొద్ది రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభమవుతాయనగా భారత క్రీడారంగాన్ని కుదిపేసిన డోపింగ్ వ్యవహారంలో మొదటి కేసు నమోదయింది. హరియాణాలోని సోనేపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నిర్వహించిన శాంపిల్ పరీక్షల్లో డోపీగా తేలిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్.. తాను తిన్న ఆహారంలో డ్రగ్స్ కలిపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నర్సింగ్ ఫిర్యాదును అనుసరించి ఐపీసీ సెక్షన్ 328, 120 బిల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సోనేపట్ డీఐజీ హెచ్ ఎస్ డూన్ బుధవారం మీడియాకు తెలిపారు.(అయ్యో... నర్సింగ్!)
సోనేపట్ సాయ్ కేంద్రంలో తాను తిన్న ఆహారంలో ఓ జూనియర్ రెజ్లర్ల డ్రగ్స్ కలిపి ఉంటాడని నర్సింగ్ యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేంద్రంలో డెరైక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ప్రకటించారు. సదరు నిందితుడైన టీనేజర్.. సుశీల్ కుమార్ బృందంలో ఒకడని వెల్లడికావడంతో కుట్రలో సుశీల్ కుమార్ కూడా భాగస్తుడేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి, నిందితులుగా తేలినవారికి కఠిన శిక్షలు పడేలా చేస్తామని డీఐజీ డూన్ అన్నారు. (నర్సింగ్పై కుట్రలో సుశీల్ హస్తం!) నర్సింగ్ యాదవ్ నుంచి సేకరించిన నమూనాలో నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లు తేలడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అతని ఒలింపిక్ బెర్త్ రద్దైన సంగతి తెలిసిందే.