సింధు, సాక్షిలకు ‘ఖేల్రత్న’
* జీతూ రాయ్, దీపలకు కూడా...
* అథ్లెటిక్స్ కోచ్ రమేశ్‌కు ద్రోణాచార్య
* సత్తి గీతకు ధ్యాన్‌చంద్ అవార్డు
* రహానేకు అర్జున పురస్కారం
* 29న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మలిక్‌లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్రత్న దక్కింది. అలాగే పట్టువదలని పోరాటంతో అందరి మనస్సులు గెలుచుకున్న షూటర్ జితూ రాయ్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌లను కూడా ఈ పురస్కారం వరించింది.
సోమవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈమేరకు ప్రకటించింది. దేశం నుంచి తొలిసారి ఒలింపిక్ రజతం సాధించిన మహిళగా సింధు ఘనత సాధించగా... తొలి మహిళా రెజ్లర్‌గా కాంస్యం దక్కించుకున్న సాక్షి ఆకట్టుకుంది. అలాగే కాంస్య పతకాన్ని కేవలం 0.15 పాయింట్ల తేడాతో కోల్పోయిన దీపా కర్మాకర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా పేరు తెచ్చుకుంది. ఇక గత రెండేళ్లుగా షూటర్ జీతూ రాయ్ ఆరు అంతర్జాతీయ పతకాలు సాధించాడు. వీరికి పురస్కారం కింద రూ.7.5 లక్షల నగదు ఇవ్వనున్నారు. ఒకే ఏడాది నలుగురికి ఖేల్త్న్ర ఇవ్వడం భారత క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి.
ఎన్.రమేశ్‌కు ద్రోణాచార్య
తెలంగాణకు చెందిన అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్‌కు ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్ మాజీ అథ్లెట్ సత్తి గీత (అథ్లెటిక్స్) ధ్యాన్‌చంద్ అవార్డ్‌కు ఎంపికయ్యింది. క్రికెటర్ అజింక్య రహానే, హాకీ క్రీడాకారులు వీఆర్ రఘునాథ్, రాణీ రాంపాల్ అర్జున అవార్డు అందుకోనున్నారు. ఈ పురస్కారాలను ఆగస్ట్ 29న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందిస్తారు.
15ఏళ్ల శ్రమకు గుర్తింపు: రమేశ్
అల్వాల్: శిక్షణలో మానవీయ కోణం జోడిస్తే క్రీడాకారులకు నమ్మకం కలిగి మరింత ప్రోత్సాహం అందుతుందని ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ అన్నారు. ‘15 సంవత్సరాల పాటు నా శిక్షణ అనుభవానికి తగిన గుర్తింపు లభించింది. నాకు ఈ గౌరవం దక్కుతుందని గోపీచంద్, లక్ష్మణ్ తరచూ చెప్పేవారు’ అని సంతోషం వ్యక్తం చేశారు.
అవార్డుల జాబితా
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (రూ.7.5 లక్షలు)
పీవీ సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్).
అర్జున అవార్డులు (రూ.5 లక్షలు)
అజింక్య రహానే (క్రికెట్), రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్,స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్ (హాకీ), వి.ఆర్ రఘునాథ్ (హాకీ), గురుప్రీత్ సింగ్ (షూటింగ్), అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మాన్ (పారా అథ్లెటిక్స్), వీరేందర్ సింగ్ (రెజ్లింగ్).
ద్రోణాచార్య అవార్డు లు(రూ.5 లక్షలు)
నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), సాగర్ మాల్ దయాళ్ (బాక్సింగ్), రాజ్‌కుమార్ శర్మ (క్రికెట్), విశ్వేశ్వర్ నంది (జిమ్నాస్టిక్స్), ఎస్. ప్రదీప్ కుమార్ (స్విమింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్).
ధ్యాన్ చంద్ అవార్డులు (రూ.5 లక్షలు)
సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రసాద్ షెల్కే ( రోయింగ్).