సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజుకు సగటున 5,500 వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జరిగే వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లతో పాటు ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కలిపి ఈ ఆర్థిక సంవత్సంలో ఇప్పటివరకు (ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 20 వరకు) 9.5లక్షల వరకు లావాదేవీలు జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇందులో వ్యవసాయేతర లావాదేవీలు 5.26లక్షల పైచిలుకు కాగా, వ్యవసాయ భూముల లావాదేవీలు 4.23లక్షలు కావడం గమనార్హం. ఈ లావాదేవీలపై గత ఐదు నెలల (ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) కాలంలో రూ.7 వేల కోట్లు ఖజానాకు సమకూరింది. ఇందులో వ్యవసాయేర లావాదేవీల ద్వారా రూ.5000 కోట్ల వరకు రాగా, ధరణి పోర్టల్ ద్వారా రూ.1700 కోట్ల వరకు వచ్చి ఉంటుందని, ఇక సొసైటీలు, మ్యారేజీ రిజిస్ట్రేషన్లు, ఈసీ సర్టిఫికెట్లు తదితర లావాదేవీలు కలిపి ఆ మొత్తం రూ.7వేల కోటుŠల్ దాటి ఉంటుందని అధికారులు చెపుతున్నారు.
రంగారెడ్డి జిల్లా నుంచే రూ.1,703 కోట్ల ఆదాయం
ఇక, జిల్లాల వారీ రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే రాష్ట్రంలోని 12 రిజిస్ట్రేషన్ జిల్లాల్లో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే జరుగుతున్నాయి.
ఈ జిల్లా రిజిస్ట్రేర్ పరిధిలో ఆగస్టు నాటికి 1.07లక్షల డాక్యుమెంట్ల లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.1,703 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం దాటిన జిల్లాల్లో మేడ్చల్ కూడా ఉంది. ఇక్కడ 70వేలకు పైగా లావాదేవీలు జరగ్గా రూ.1,100 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా. ఇక, రాష్ట్రంలో అతి తక్కువగా హైదరాబాద్–1 పరిధిలో లావాదేవీలు జరిగాయి.
ఇక్కడ గత ఐదు నెలల్లో 9,148 లావాదేవీలు మాత్రమే జరిగాయి. కానీ ఆదాయం మాత్రం రూ. 185 కోట్ల వరకు వచ్చింది. అదే వరంగల్ జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో 40వేలకు పైగా లావాదేవీలు జరిగినా వచ్చింది అంతే రూ.188 కోట్లు కావడం గమనార్హం. అంటే హైదరాబాద్–1 పరిధిలో ఒక్కో లావాదేవీ ద్వారా సగటు ఆదాయం రూ. 2.02 లక్షలు వస్తే, వరంగల్ జిల్లాలో మాత్రం రూ.40 వేలు మాత్రమే వచ్చిందని అర్థమవుతోంది.
బంజారాహిల్స్ టాప్..ఆదిలాబాద్ లాస్ట్
అన్ని జిల్లాల కంటే ఎక్కువగా సగటు డాక్యుమెంట్ ఆదాయం బంజారాహిల్స్ (హైదరాబాద్–2) జిల్లా పరిధిలో నమోదవుతోంది. ఖరీదైన ప్రాంతంగా పేరొందిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే లావాదేవీల ద్వారా ఒక్కో డాక్యుమెంట్‌కు సగటున రూ.2.3లక్షలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఇక్కడ 16,707 లావాదేవీలు జరిగాయని, తద్వారా రూ. 396.56 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, డాక్యుమెంట్ సగటు ఆదాయం అతితక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో వస్తోంది. ఇక్కడ సగటున ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.23వేలకు కొంచెం అటూ ఇటుగా ఆదాయం వస్తోంది. డాక్యుమెంట్ల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, ఖమ్మం చివరి స్థానంలో ఉంది. ఖమ్మం జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో గత ఐదు నెలల కాలంలో కేవలం 20వేల పైచిలుకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment