ఎవరైనా సరే జీవితంలో ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుని, అందుకు అనుగుణంగా పనిలోకి దిగితే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరని అంటుంటారు. అటువంటి వారిని ఆర్ధిక ఇబ్బందులు కూడా ఏమీ చేయలేవని చెబుతుంటారు. కర్ణాటకలోని ఓ కుగ్రామానికి చెందిన సురేష్ పూజారి తాను ఏదో ఒకరోజు 22 రెస్టారెంట్లకు యజమానిని అవుతానని ఎన్నడూ అనుకోలేదు.
సురేష్‌ను బాల్యంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. చదువు కొనసాగించేందుకు కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. అవి 1950 నాటి రోజులు.. పదేళ్ల వయసులోనే సురేష్ పూజారి కూలీగా మారాడు. ఊరిలో పెద్దగా పనులు దొరకకపోవడంతో ముంబైకి తరలివచ్చాడు. అప్పట్లో సురేష్‌కు ముంబై గురించి ఏమీ తెలియదు. ఎలాగోలా ఓ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న చిన్న దాబాలో ఉద్యోగం సంపాదించాడు. రోజంతా అక్కడ పనిచేసినందుకు సురేష్‌కు నెలకు నాలుగు రూపాయలు అందేది.. అక్కడ రెండేళ్లు పనిచేశాడు. తర్వాత అతనికి తెలిసిన వ్యక్తి జ్యూస్ షాపులో ఉద్యోగం ఇప్పించాడు. జీతం పెద్దగా పెరగలేదు. కానీ అక్కడ పనిలో నైపుణ్యాలను నేర్చుకున్నాడు.
కొద్ది రోజుల్లోనే సురేష్‌కు ఓ క్యాంటీన్‌లో ఉద్యోగం వచ్చింది. జీతం ఆరు రూపాయలకు పెరిగింది. చదువు లేకుండా ముందుకు సాగడం కష్టమని అర్థం చేసుకున్నాడు. దీంతో రాత్రిపూట పాఠశాలకు వెళుతూ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. తన దగ్గరున్న కొద్దిపాటి సొమ్ముతో గిర్గామ్ చౌపటీ సమీపంలో సురేష్ ఒక చిన్న పావ్ భాజీ దుకాణాన్ని తెరిచాడు.
నాటి ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఒకసారి తన సురేష్ దుకాణంలో పావ్ భాజీ రుచి చూశారు. ఆ రుచి అతనికి బాగా నచ్చడంతో మళ్లీ మళ్లీ అక్కడికి రావడం మొదలుపెట్టారు. జార్జ్ ఫెర్నాండెజ్, సురేష్ పూజారి స్నేహితులు అయ్యారు. తదనంతర కాలంలో సురేష్ తయారు చేసే పావ్ భాజీకి జనం నుంచి అమితమైన ఆదరణ లభించింది. దీంతో ఆయన క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. కొద్ది కాలంలోనే అతని దుకాణాలు దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. నేడు సురేష్ పూజారి నెలకొల్పిన ‘సుఖ్ సాగర్’ రెస్టారెంట్ల గురించి తెలియనివారుండరు. దేశంలో 22కు మించిన సుఖ్ సాగర్ రెస్టారెంట్ బ్రాంచీలు ఉన్నాయి.
సుఖ్ సాగర్ రెస్టారెంట్ దక్షిణ భారత ఆహారాలకు తోడు పావ్ భాజీ, పంజాబీ ఆహారాలకు ప్రసిద్ధి చెందింది. ఐస్‌క్రీమ్ పార్లర్, షాపింగ్ మాల్, త్రీస్టార్ హోటల్ యజమానిగా సురేష్ పూజారి మారారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ సహా పలువురు స్టార్స్ సుఖ్ సాగర్ రెస్టారెంట్ రుచులను మెచ్చుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకుంటూ, వ్యాపారంలో విజయం సాధించిన సురేష్ పూజారి యువతకు స్ఫూర్తిదాయకుడనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment