సాక్షి ప్రతినిధి, గుంటూరు
జిల్లాలోని ఇసుక రీచ్‌లన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు కూడా ఇలాంటి విధానాన్నే అనుసరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. తెనాలి, వేమూరు, మంగళగిరి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో నదీ పరివాహక భూముల్లో ఇసుక తవ్వకాలకు దరఖాస్తు చేసుకున్న రైతులు, ఆయా ప్రాంతాల్లో భూములున్న రైతులతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.
{పభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు అనుమతులు తీసుకువస్తామని, ఇసుక తవ్వకాలకు పొక్లయిన్లు, లారీలు సమకూరుస్తామని, పోలీసులతో ఇబ్బంది లేకుండా చూస్తామని రైతులకు చెబుతున్నారు.
దరఖాస్తు చేసుకున్న ప్రతీ రైతుకు ఎకరాకు ఆరు నెలలకు రూ.4 నుంచి రూ.6 లక్షల కౌలు ఇస్తామని చెబుతున్నారు.
ఇందులో భాగంగా కొల్లిపర మండలంలో ఒక గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు ఇసుక తవ్వకాలకు ప్రభుత్వ అనుమతి పొంది పూర్తికాలం నడప లేకపోయారు.
వారికి ఇంకా రెండు నెలలే తవ్వకాలకు అనుమతి ఉంది. అయినా ఆ రీచ్‌లకు కోటి రూపాయల లీజు చెల్లించినట్టు తెలిసింది.
ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించడం వెనుక పెద్ద కారణం లేకపోలేదని వ్యాపారులు చెబుతున్నారు.
ఆ రీచ్‌లకు సమీపంలో ఎస్సీలకు చెందిన 132 ఎకరాల విస్తీర్ణంలో ఇసుక రీచ్‌లు ఉన్నాయని, అక్కడి నుంచి ఇసుక తరలించేందుకు ఈ ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది.
ఈ రీచ్‌లు కొనుగోలు చేసిన వ్యాపారికి ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని, త్వరలోనే కొల్లిపర మండలంలో ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు భారీ ఎత్తున ప్రారంభం కానున్నాయని చెబుతున్నారు.
ఎస్సీలకు చెందిన 132 ఎకరాల రీచ్‌ల్లోని ఇసుకను తరలించేందుకు అక్రమంగా నిర్మించిన అప్రోచ్‌రోడ్డు ఇటీవల వరదలకు దెబ్బతిన్నది.
ఆ రోడ్‌ను బాగు చేసేందుకు శనివారం ఒక పొక్లయిన్‌ను అక్కడకు తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అనుమతి లేని ప్రాంతంలో పొక్లయిన్ ఉండకూడదని చెప్పి అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించారు.
వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలూమూరు, ఈపూరు రీచ్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్న సిండికేట్లు మిగిలిన రీచ్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు వ్యాపార వర్గాల కథనం.
అదే జరిగితే ఇసుక ధర సామాన్యులకు అందనంతగా పెరిగే ప్రమాదం లేకపోలేదంటున్నారు.
నెలకు కౌలు రూ.లక్ష !
Published Wed, Oct 22 2014 12:03 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement