ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో రేబిస్‌తో 14 ఏళ్ల బాలుడు హృదయవిదారక స్థితిలో కన్నుమూశాడు. నాలుగు రోజుల క్రితం బాలునిలో రేబిస్ లక్షణాలు కనిపించాయి. గాలికి, నీటికి భయపడటంతో పాటు చీకటిలో ఉండేందుకు ఇష్టపడసాగాడు. పిల్లాడి విచిత్ర ప్రవర్తన, అనారోగ్య పరిస్థితులను గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు.
ఈ ఉదంతం విజయ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చరణ్‌సింగ్ కాలనీలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన యూకూబ్ పెద్ద కుమారుడు సాబేజ్‌ను నెల రోజుల క్రితం కుక్క కరిచింది. భయం కారణంగా సాబేజ్ ఈ విషయాన్ని ఇంటిలోని వారికి చెప్పలేదు. అయితే నాలుగు రోజుల క్రితం ఆ కుర్రాడిలో రేబిస్ లక్షణాలు బయటపడ్డాయి. మొదట్లో ఇంటిలోని వారికి ఏమీ అర్థం కాలేదు. అయితే రానురాను సాబేజ్ ఆరోగ్యం క్షీణించసాగింది.
పిల్లాడి ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు సాబేజ్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యపరీక్షలు చేసిన అనంతరం వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. వైద్యం అందని స్థితిలో సాబేజ్ హృదయవిదారక స్థితిలో కన్నుమూశాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమారునిడి చికిత్స కోసం ఘాజియాబాద్‌లోని ఎంశ్రీం ఆసుపత్రితో పాటు మీరఠ్, ఢిల్లీలోని జీటీబీ, ఎయిమ్స్ ఆసుపత్రులకు చికిత్స కోసం తీసుకువెళ్లామన్నారు. అయినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సాబేస్‌ను పొరుగింటిలోని వారి కుక్క కరిచింది. ఒక మహిళ ఆ కుక్కను సంరక్షిస్తోంది. అలాగే ఆమె వీధి కుక్కలను ఆహారం కూడా అందిస్తుంటుంది. దీంతో ఐదారు కుక్కలు ఆమె ఇంటి వద్దనే ఉంటాయి. ఆ మహిళ పెంచుకుంటున్న కుక్క కరవడంతోనే తమ కుమారుడు మరణించాడని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లాడికి జరిగిన విధంగా ఎవరికీ జరగకూడదని వారు అంటున్నారు. ఈ ఉదంతం నేపద్యంలో నగరపాలక అధికారులు ఆ కుక్కను పెంచుకుంటున్న మహిళకు నోటీసు అందజేశారు. తదుపరి చర్యలకు ఉపక్రమించారు.
ఇది కూడా చదవండి: విద్యాదానం వీరి జీవన విధానం!
Comments
Please login to add a commentAdd a comment