Bitten
-
విద్యార్థిని తొడ కొరికిన కీచక టీచర్
కోడూరు: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు అభం శుభం తెలియని చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాక్షసానందం పొందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నరసింహపురంలో చోటుచేసుకుంది. నరసింహపురం ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు పది మంది పిల్లలు చదువుతున్నారు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న అవనిగడ్డకు చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు కటికల వేణుగోపాలరావు.. విద్యాశాఖ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ టీచర్‌ను నియమించుకుని విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. బాధ్యత మొత్తం ఆ టీచర్ మీద వదిలేసి వేణుగోపాలరావు పాఠశాలలో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వేణుగోపాలరావు మూడో తరగతి విద్యార్థినితో నాలుగు రోజుల నుంచి అసభ్యంగా ప్రవరిస్తున్నాడు. చెప్పుకోలేని చోట తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. సోమవారం ఉదయం ఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లగానే వేణుగోపాలరావు వేరే గదిలోకి తీసుకువెళ్లి బెంచిపై కూర్చొబెట్టి తొడపై కొరికాడు. విద్యార్థిని వద్దు సార్ అని ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరికాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించినట్టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది. ఉపాధ్యాయుడు నాలుగు రోజుల నుంచి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నాడని చెప్పింది. తల్లిదండ్రులు విద్యార్థిని తొడపై పంటిగాట్లు గమనించారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోడూరు పోలీసులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వేణుగోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
పాము కాటు వేయగానే ఏం జరుగుతుందో లైవ్‌లో చూసేయండి!
మన దేశంలో పాము కాటుకు ఏటా వేలాదిమంది చనిపోతున్నారు. పాము కాటు వేసిన వెంటనే విషం బాడీలోకి వెళ్లి..మనిషి నురగలు కక్కుకుంటూ చనిపోవడం జరుగుతుంది. మరింత విషపూరితమైన పాము అయితే అంతా క్షణాల్లో అయిపోతుంది. ఒక్కోసారి మనం వైద్యుడు వద్దకు తీసుకువెళ్లే వ్యవధి కూడా సరిపోదు. సకాలంలో రోగికి విరుగుడు ఇంజెక్షన్ అందితే ఓకే లేందంటే అంతే సంగతి. ఇక్కడ విషం శరీరంలోకి వెళ్లిన వెంటనే ఏం జరగుతుందనేది అందరికి కుతుహలంగానే ఉంటుంది కదా. అయితే పాము విషం ఎలా మన శరీరంలో రక్తంతో రియాక్షన్ చెందుతుందో ఈ వీడియో ద్వారా ప్రత్యక్ష్యంగా తెలుసుకోండి పాము మానవ రక్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ప్రయోగం చేసి మరీ చూపించారు.ఈ వీడియోలో, ఒక నిపుణుడు గాజు పాత్రలో పాము విషాన్ని సేకరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ విషం ఇప్పటికే నిల్వ చేయబడిన మానవ రక్తంతో ఎలా రియాక్షన్ చెందుతుందో చూపించడం జరగుతుంది. పాము విషం జస్ట్ ఒక్క చుక్క రక్తంలో కలవగానే రక్తం గడ్డకట్టడం కనిపిస్తుంది. ఒక్క విషపు చుక్క ఎంత స్పీడ్‌గా ప్రభావితం చేస్తుందో వీడియోలో క్లియర్‌గా తెలుస్తుంది. ఎప్పుడైతే రక్తం గడ్డకట్టుకుపోతుందో అప్పుడూ గుండెకు రక్తం సరఫరా అవ్వడం నిలిచిపోతుంది. వెంటేనే సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అందవల్ల పాము ఎలాంటిది కరిచినా వెంటనే ఆ ప్లేస్‌ని క్లాత్‌తో గట్టిగా కట్టి సకాలంటో వైద్యుల వద్దకు తీసుకువెళ్లి విరుగుడు ఇంజెక్షన్ ఇవ్వాలి. అంతేగాదు ఈ పాము కాటు కారణంగా భారతదేశంలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నట్లు ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడించిది. గత 20 ఏళ్లలో ఏకంగా 2 లక్షల మంది పాముకాటుతోనే చనిపోయినట్లు ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంటే ప్రతీ ఏడాది పాముకాటు కారణంగా దాదాపు 58 వేలమంది దాక చనిపోతున్నట్లు లెక్కలు వేసి మరీ పేర్కొంది. అలాగే ప్రభుత్వ లెక్కల్లోకి రాని పాము కాటు మరణలు ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఆరోగ్య సంస్థ తెలపడం గమనార్హం. Effect of snake venom on blood! pic.twitter.com/QDUC9I2vtg — Learn Something (@cooltechtipz) March 7, 2024 (చదవండి: సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి త్రీ సీక్రెట్స్ ఇవే!) -
గాలి తగిలితే వణుకు, నీటిని చూస్తే భయం.. రేబిస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో రేబిస్‌తో 14 ఏళ్ల బాలుడు హృదయవిదారక స్థితిలో కన్నుమూశాడు. నాలుగు రోజుల క్రితం బాలునిలో రేబిస్ లక్షణాలు కనిపించాయి. గాలికి, నీటికి భయపడటంతో పాటు చీకటిలో ఉండేందుకు ఇష్టపడసాగాడు. పిల్లాడి విచిత్ర ప్రవర్తన, అనారోగ్య పరిస్థితులను గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. ఈ ఉదంతం విజయ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చరణ్‌సింగ్ కాలనీలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన యూకూబ్ పెద్ద కుమారుడు సాబేజ్‌ను నెల రోజుల క్రితం కుక్క కరిచింది. భయం కారణంగా సాబేజ్ ఈ విషయాన్ని ఇంటిలోని వారికి చెప్పలేదు. అయితే నాలుగు రోజుల క్రితం ఆ కుర్రాడిలో రేబిస్ లక్షణాలు బయటపడ్డాయి. మొదట్లో ఇంటిలోని వారికి ఏమీ అర్థం కాలేదు. అయితే రానురాను సాబేజ్ ఆరోగ్యం క్షీణించసాగింది. పిల్లాడి ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు సాబేజ్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యపరీక్షలు చేసిన అనంతరం వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. వైద్యం అందని స్థితిలో సాబేజ్ హృదయవిదారక స్థితిలో కన్నుమూశాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమారునిడి చికిత్స కోసం ఘాజియాబాద్‌లోని ఎంశ్రీం ఆసుపత్రితో పాటు మీరఠ్, ఢిల్లీలోని జీటీబీ, ఎయిమ్స్ ఆసుపత్రులకు చికిత్స కోసం తీసుకువెళ్లామన్నారు. అయినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సాబేస్ను పొరుగింటిలోని వారి కుక్క కరిచింది. ఒక మహిళ ఆ కుక్కను సంరక్షిస్తోంది. అలాగే ఆమె వీధి కుక్కలను ఆహారం కూడా అందిస్తుంటుంది. దీంతో ఐదారు కుక్కలు ఆమె ఇంటి వద్దనే ఉంటాయి. ఆ మహిళ పెంచుకుంటున్న కుక్క కరవడంతోనే తమ కుమారుడు మరణించాడని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లాడికి జరిగిన విధంగా ఎవరికీ జరగకూడదని వారు అంటున్నారు. ఈ ఉదంతం నేపద్యంలో నగరపాలక అధికారులు ఆ కుక్కను పెంచుకుంటున్న మహిళకు నోటీసు అందజేశారు. తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ఇది కూడా చదవండి: విద్యాదానం వీరి జీవన విధానం! -
పాము కాటుకు గురైన ప్రముఖ మంత్రి..
చంఢీగర్: పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ పాముకాటుకు గురయ్యారు. రూపనగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సంచరిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. ఆగష్టు 15 రాత్రి పాముకాటుకు గిరికాగా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పాంగ్, భాక్రా డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయగా.. పంజాబ్‌లో రూప్‌నగర్, గుర్దాస్పూర్, హోసియాపూర్, కపుర్తలా, ఫిరోజ్‌పూర్ ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఈ డ్యామ్‌ల నుంచి విడదలైన నీటితో బియాస్, సట్లేజ్ నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. With God's grace, the flood situation in my constituency, Shri Anandpur Sahib, is better now. During the rescue operations, I was bitten by a venomous snake on the intervening night of 15th Aug, but that didn’t deter my determination to help my people. With God’s grace and… pic.twitter.com/vQkX14xltK — Harjot Singh Bains (@harjotbains) August 19, 2023 మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తన సొంత నియోజకవర్గమైన ఆనంద్‌పూర్ సాహిబ్‌లో సహాయక చర్యలు చేపట్టారు. తానే స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా..పాముకాటుకు గురయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా రక్షించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్ చేరి.. -
యాదాద్రి భువనగిరి: మృతదేహాన్ని కొరికేసిన ఎలుకలు!
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్ (38) కుటుంబం 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్‌కు వివాహం జరగా, ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి ఆమె చనిపోవడంతో, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఏడాది క్రితం రెండో భార్య రవికుమార్‌ను వదిలివెళ్లింది. దీంతో ఆయన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న రవికుమార్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తగాదా పడుతుండడంతో తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. తిరిగి రాత్రి 11:30 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి రవికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా బయట భద్రపరిచారు. ఆ ఆనవాళ్లు చూసి.. రవికుమార్ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నానాయక్ తెలిపారు. -
వెంటాడుతున్న కుక్కలు.. జనగామలో ఒకేరోజు 21 మందికి గాయాలు
జనగామ: వీధి కుక్కల స్వైరవిహారంతో పలు ప్రాంతాల్లో 23మంది తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలోనే ఏకంగా 21 మంది వీధి కుక్కల బారిన పడి గాయాలపాలయ్యారు. కుర్మవాడ(సుమారు 4 వార్డుల పరిధి), హనుమాన్ స్ట్రీట్ తదితర ప్రాంతాలకు చెందిన స్థానికులు రోడ్డుపై వెళ్తుండగా కుక్కలు దాడి చేశాయి. సమీప వాసులు కర్రలు, రాళ్లతో తరిమికొట్టడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వెంటనే బాధితులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కుక్క కాటుకు సంబంధించిన ఇంజక్షన్ తీసుకుని చికిత్స పొందారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట పద్మానగర్‌కు చెందిన పదేళ్ల బాలుడు మహ్మద్ అర్స్లాన్ రోడ్డుపై ఆడుకుంటుండగా కుక్క కరవడంతో చేతికి గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఇక హనుమకొండ జిల్లా కాజీపేటలో స్కూలుకు వెళ్లి వస్తున్న తొమ్మిదేళ్ల బాలుడు ముస్త ఫాను స్థానిక శైలేందర్ సింగ్‌కు చెందిన పెంపుడు కుక్క కరిచింది. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కుక్క యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: విషాదం.. కొడుకు పుట్టినరోజే.. తండ్రి ఆత్మహత్య.. -
న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ..పాముతో కాటు వేయించుకుని మరీ..
ఓ వ్యక్తి న్యూ ఇయర్ రోజున విషపూరితమైన పాముతో ఆడుకుంటూ చనిపోయాడు. కొత్త ఏడాది వేడుకల సంబరాలతో మత్తులో ఉన్న ఆ వ్యక్తి పాము కాటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మణికందన్ అనే వ్యక్తి న్యూ ఇయర్ వేడుకల సంబరాల్లో ఆడి పాడి తాగుతూ.. ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే పక్కనే ఉన్న పొదల్లో పాము పాకుతున్నట్లు చూశాడు. చుట్టుపక్కలవారు పామును పట్టుకోవద్దని అతన్ని హెచ్చరించిన లక్ష్య పెట్టకుండా పట్టుకునేందుకు యత్నించాడు. చివరికీ మణికందన్ ఆ పామును పట్టుకుని చుట్టుపక్కల వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రమంలో ఆ పాము అతన్ని కాటు వేసింది. అయినా సరే నూతన సంత్సరం కానుక అంటూ దానిని మరింత ఎత్తుగా పట్టుకుని దానితో ఆటలాడుతున్నాడు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే అతను కుప్పకూలిపోయాడు. దీంతో అతని స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా...అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వైద్యులకు ఏ పాము కాటేసిందో చూపించేందుకు గోనె సంచెలో వెంట తెచ్చుకున్న పామును చూపిస్తుండగా.. అతను స్నేహితుడు సైతం పాము కాటుకు గురైయ్యాడు. ప్రస్తుతం అతను కడలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని అధికారులు చెప్పారు. (చదవండి: ఒకేఒక్క వ్యక్తి రోడ్డుపై సృష్టించిన బీభత్సం చూస్తే..వామ్మో! అని నోరెళ్లబెడతారు) -
పేదరికపు కాటు: ఇల్లు ఉంటే ఇలాగయ్యేది కాదు
తిరువంతపురం: ఆదిత్య పదేళ్ల పాపాయి. అమ్మానాన్న, తను మాత్రమే ఉన్నామనుకుంది. తమతోపాటు మరో ప్రాణి కూడా తమ ఇంటికి వస్తూ పోతూ ఉందని ఆ పాపాయికి తెలియదు. ఆ ప్రాణి ఓ రోజు నాన్న ఇంట్లో లేనప్పుడు వచ్చింది. ఐదవ తరగతి చదువుతున్న ఆదిత్య హోమ్‌వర్క్ చేసుకుని, అమ్మ పెట్టిన అన్నం తిని నేల మీద పరుపు పరుచుకుని నిద్రపోయింది. ఆమె పడుకున్న తర్వాత ఆ ప్రాణి ఎప్పుడు వచ్చిందో తెలియదు. వచ్చి పాపాయిని కాటేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు ఆదిత్య పడుకున్న పరుపు కిందకు దూరింది. తెల్లవారింది. ఆదిత్య ఎప్పటిలాగ నిద్రలేవలేదు. తల్లి సింధు ఆమెను నిద్రలేపుతుంటే బలవంతంగా కళ్లు తెరుస్తోంది, అంతలోనే కళ్లు మూతలు పడుతున్నాయి. ముఖం ఉబ్బి ఉంది. ఆదిత్య తల్లికి ఏదో అనుమానం వచ్చింది. రాత్రి ఏదో కుట్టినట్లు అనిపించిన మాట నిజమేనని, చీమ కాబోలని చెప్పింది ఆదిత్య. నిజానికి అది చీమ కాదు. పరిస్థితులు ఎదురుతిరిగినప్పుడు చలిచీమల చేత చిక్కి నిస్సహాయంగా ప్రాణాలు వదిలే విషసర్పం. ఆదమరిచి నిద్రపోతున్న ఆదిత్య దగ్గర తన ప్రతాపం చూపించిందా సర్పం. పాపాయిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ ఆమెను కాటేసినది అత్యంత విషపూరితమైన సర్పం. మనిషి ఒంట్లోకి చేరగానే నరాల మీద ప్రభావం చూపిస్తుంది. న్యూరోపెరాలసిస్‌కు దారి తీస్తుంది. ఆదిత్య పరిస్థితి మరింతగా విషమించడంతో శనివారం నాడు పుష్పగిరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు మార్చారు. ఆదిత్య ప్రాణాలు కాపాడడం కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. శాశ్వత నిద్రలోకి జారిపోయింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లా, పాథనాపురం, అంబేద్కర్ కాలనీలో జరిగింది. ఇల్లు ఉంటే ఇలాగయ్యేది కాదు ఆదిత్య తండ్రి రాజీవ్ కంటికి మంటకి ఏకధాటిగా ఏడుస్తున్నాడు. నా బంగారు తల్లిని పొట్టనపెట్టుకున్నది పాము కాదు ప్రభుత్వం అంటున్నాడు. ‘‘మాకు పక్కా ఇల్లు ఇచ్చి ఉంటే మా పరిస్థితి ఇలాగయ్యేది కాదు. పక్కా ఇంటికోసం ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నప్పటికీ ప్రభుత్వానికి పట్టనేలేదు. ఇప్పుడు నా బిడ్డ బలయిపోయింది’’ అని కన్నీళ్ల పర్యంతం అవుతున్నాడు ఆదిత్య తండ్రి. అతడి ఆవేదనలో అర్థం ఉంది. ఆ కుటుంబం నివసిస్తున్న ఇల్లు అత్యంత దయనీయంగా ఉంది. బొంతరాళ్లను గోడలుగా పేర్చుకుని, పైన నీలం రంగు పాలిథిన్ పట్ట పరుచుకున్నాడు. గోడలకు ఉన్న రంధ్రాల నుంచి తేళ్లు, జెర్రుల వంటివి ఇంట్లోకి ప్రవేశించడం కష్టమేమీ కాదు. ఇప్పుడు ఏకంగా పామే వచ్చింది. పేదరికానికి పేగుబంధాన్ని బలి చేసింది. పైకి పాము కాటుగా కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది పేదరికపు కాటు. పేదరికం మీద ప్రభుత్వ వేసిన నిర్లక్ష్యపు వేటు. -
మాస్కు పెట్టుకోమన్నందుకు చాతి కొరికాడు
డబ్లిన్ : కరోనా నేపథ్యంలో ఇప్పుడు మాస్క్ అనివార్యంగా మారింది. ఎవరైనా సరే బయటకు వెళ్తే కచ్చితంగా మాస్క్ ధరించాలంటూ ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నారు. ఇంతచెప్పినా కొందరు మాత్రం లెక్కచేయడంలేదు. చాలా మంది ఏదో మొక్కుబడిగా మాస్కును ధరిస్తున్నారే తప్ప నిజంగా తమ రక్షణకే అన్న విషయం మరిచిపోయారు. అయితే మాస్క్ ధరించమని చెప్పినందుకు ఎన్నోసార్లు భౌతిక దాడులతో పాటు వ్యక్తుల ప్రాణం కూడా తీసిన ఘటనలు చాలానే చూశాం. తాజాగా మాస్క్ పెట్టుకోమని సూచించిన వ్యక్తిని కొరికి బస్సులో నుంచి పారిపోయిన ఘటన ఐర్లాండ్‌లో చోటుచేసుకుంది.(మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష) వివరాలు.. బెల్జియంలో నివసించే రాబర్ట్ మర్ఫీ బస్సులో ప్రయాణిస్తుండగా, వెనుకనున్న వ్యక్తి అదే పనిగా ముక్కు చీదాడు. అయితే మర్ఫీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మాస్కును ధరించాలని కోరాడు. అవతలి వ్యక్తి క్షమాపణ కోరుతూ మాస్కు ధరించాడు. కొద్దిసేపటికి అదే బస్సులోకి ఒక జంట ఎక్కింది. ఆ జంట వచ్చి మర్ఫీ ఎదుట కూర్చున్నారు. వారిలో యువకుడు మాస్క్ సరిగా ధరించకపోవడంతో మాస్క్ సరిగా పెట్టుకోవాలని మర్ఫీ సూచించాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. సదరు వ్యక్తి అకస్మాత్తుగా మర్ఫీపై దాడికి దిగాడు. మర్ఫీ చాతిపై తన పళ్లతో గట్టిగా కొరికి ప్రేయసితో కలిసి బస్సు దిగి పారిపోయాడు. వెంటనే మర్పీని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా ఆ జంటను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
కొత్తజంటకు ఊహించని షాక్!
ఫోర్ట్ కొలిన్స్: ఓ జంట తమ పెళ్లి గురించి అందరిలాగే ఎన్నో కలలుకంది. తమ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను కొన్ని నెలల ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకొని రంగంలోకి దిగారు. వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాట్లను ఘనంగా చేసుకున్నారు. అయితే అక్కడ వారు ఊహించని మలుపొకటి చోటుచేసుకుంది. మరికాసేపట్లో రిసెప్షన్ అనగా పెళ్లి కొడుకును ప్రమాదకరమైన ర్యాటిల్ స్నేక్ కాటేసింది. అమెరికాలోని కొలరాడోలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. జానీ, లారా జంట సోమవారం ఫోర్ట్ కొలిన్స్ పట్టణంలోని క్యాథలిక్ చర్చిలో పెళ్లి చేసుకున్నారు. ఇంకాసేపట్లో రిసెప్షన్ ఉందనగా.. అవుట్ డోర్లో వారు సరదాగా పెళ్లి ఫోటోలు దిగుతున్నారు. ఫోటో గ్రాఫర్ మ్యాడీ కొత్త జంట నవ్వులు, ముద్దులను తన కెమెరాలో బంధిస్తున్న సమయంలో.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఓ రాటిల్ స్నేక్ జానీ కాలి మడమపై కాటేసింది. ఫోటోలకు ఫోజులివ్వడంలో బిజీగా ఉన్న జానీ తన కాలిపై ఏదో తగలడంతో కిందకు చూడగా అక్కడ ర్యాటిల్ స్నేక్ కనిపించింది. అంతే.. ఒక్కసారిగా ఫోటో షూట్ కాస్తా హారర్‌గా మారిపోయింది. అటుగా వచ్చిన అధికారి ఒకరు వారికి సహాయం అందించాడు. అనంతరం పారామెడికల్ సిబ్బంది జానీని అత్యవసర సేవల విభాగానికి తరలించి చూడగా.. ర్యాటిల్ స్నేక్ కరిచింది గానీ విషాన్ని ఇంజెక్ట్ చేయలేదని గుర్తించారు. దీంతో ఊపిరిపీల్చుకున్న కొత్తజంట సంతోషంగా రిసెప్షన్‌కు బయలు దేరింది. ఈ ఘటనపై జానీ మాట్లాడుతూ.. పాము కరిచిన సమయంలో తాను దేని గురించీ అలోచించలేదు గానీ.. ఎంతో ప్లాన్ చేసి ఏర్పాటు చేసిన రిసెప్షన్ ఎలా అని మాత్రం ఆలోచించానని వెల్లడించాడు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మ్యాడీ మాత్రం పెళ్లి ఫోటోలతో పాటు ఈ పాము ఎపిసోడ్‌ను కూడా తన కెమెరాలో బంధించాడు. -
కలగంటూ తన చేతినే తాను కొరుక్కుతిన్నాడు
బీజింగ్: సాధారణంగా నిద్రలో కలకనడం సహజం.. పక్కవాళ్లు భయపడేలా గట్టిగా నిద్రలోనే అరవడం కూడా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఒక్కోసారి మంచంపై నుంచి దొర్లికిందపడటం కూడా జరుగుతుంది. ఇలాంటి కలలు కనే సమయంలో మనసు మాత్రమే పరుగెడుతుంది. శరీరం మాత్రం దానికి తగినట్లు ఎప్పుడోగానీ స్పందించదు. కానీ, చైనాలో మాత్రం ఓ యువకుడు హాయిగా కలలోకి జారుకొని మంచి రుచి కరమైన పోర్క్ లెగ్ పీస్ తింటున్నట్లుగా ఊహించుకొని తన చేతిని తానే కొరుక్కున్నాడు. రక్తం కారుతున్నా సోయిలేకుండా కండపీక్కొచ్చేలా కొరికేసుకున్నాడు. మెలకువ వచ్చి చూసుకునే వరకు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆ సీన్ చూసి బెంబేలెత్తిపోయి మెలకువలో కూడా గట్టిగా కేకలు వేయడం అతడివంతైంది. జిజియాంగ్ ప్రావిన్స్ లోని లాంగో పట్టణంలో లీ అనే 20 ఏళ్ల కుర్రాడు ఈ పనిచేశాడు. ఫిబ్రవరి 16న తన సోదరి ఇంటికి వెళ్లిన లీ ఆ రోజు హాయిగా వైన్ తాగాడు. రుచికరమైన భోజనం చేసి సోయిలేకుండా నిద్రపోయి ఆ నిద్రలో కలగని ఆ కలకు తగినట్లు ప్రవర్తించాడు. ఫలితంగా చేతికండ ఊడిరాగా తన నోరంతా రక్తంతో నిండింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతోపాటు వేరేవరో ఈ పనిచేసి ఉంటారని భ్రమపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కుక్కకాటుకు రెండు లక్షలు
నైనితాల్ : ఉత్తరాఖండ్ హైకోర్టు అసాధారణ తీర్పును వెల్లడించింది. కుక్కకాటు బాధితులకు రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ జస్టిస్ అలోక్‌నాథ్, జస్టిస్ సర్వేష్ కుమార్ ల డివిజన్ బెంచ్ గురువారం తీర్పు చెప్పింది. తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వీధి కుక్కలు, కోతులు, గిబ్బన్స్ దాడిలో గాయపడిన వారికి కూడా ఈ ఆ దేశాలు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది . ఈ పరిహార మొత్తాన్నిమున్పిపల్ కార్పోరేషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో విధిగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అది కూడా ఘటన జరిగిన ఒక వారం రోజుల లోపే ఈ చెల్లింపు జరగాలని సూచించింది. నైనితాల్ పట్టణంలో గత మూడేళ్ల కాలంలో జరిగిన నాలుగువేల వీధి కుక్కకాటు కేసులను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపాలిటీ సంస్థకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. రోజురోజుకు పెరుగుతున్న కుక్కకాటు సంఘటలను నివారించడానికి వాటికోసం తక్షణమే షెల్టర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే కోతులు, గిబ్బన్స్ దాడికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలని కోరింది. చిత్రంగా ఈ ఆదేశాలను జారీ చేసిన సీనియర్ న్యాయవాది భార్యతో పాటు నలుగురు అదేరోజు వీధికుక్కల బారిన పడి గాయాల పాలయ్యారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కోర్టు ఈ తాజా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.