యాదాద్రి భువనగిరి: మృతదేహాన్ని కొరికేసిన ఎలుకలు! | Rats that bit the dead body | Sakshi
Sakshi News home page

యాదాద్రి భువనగిరి: మృతదేహాన్ని కొరికేసిన ఎలుకలు!

Published Tue, Aug 1 2023 1:25 AM | Last Updated on Tue, Aug 1 2023 4:40 PM

Rats that bit the dead body - Sakshi

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్‌ (38) కుటుంబం 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్‌కు వివాహం జరగా, ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి ఆమె చనిపోవడంతో,  రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు.

ఏడాది క్రితం రెండో భార్య  రవికుమార్‌ను వదిలివెళ్లింది. దీంతో ఆయన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి  పట్టణంలోని ప్రగతినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తగాదా పడుతుండడంతో తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. తిరిగి రాత్రి 11:30 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి రవికుమార్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని  జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా బయట భద్రపరిచారు.

ఆ ఆనవాళ్లు చూసి..
రవికుమార్‌ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి  ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చిన్నానాయక్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement