10 రోజుల కష్టంతో తండ్రి శవం సాధించిన బాలుడు | Minor Boy Gets Her Father Body After 10 Days In Mortuary | Sakshi
Sakshi News home page

10 రోజుల కష్టంతో తండ్రి శవం సాధించిన బాలుడు

Published Wed, May 5 2021 3:55 PM | Last Updated on Wed, May 5 2021 3:55 PM

Minor Boy Gets Her Father Body After 10 Days In Mortuary - Sakshi

లక్నో: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నో విషాద.. అమానవీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా కథలు ఎన్ని చెప్పిన తక్కువే. తాజాగా ఓ ఆస్పత్రి అధికారులు కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహం అప్పగించకుండా పది రోజులుగా మార్చురీలోనే పడేశారు. మృతుడికి సంబంధించిన బంధువులు రాలేదంట.. వచ్చిన అతడి కుమారుడు మైనర్‌ బాలుడు కావడంతో అతడికి మృతదేహం అప్పగించడం కుదరదని అధికారులు చెప్పారు. దీంతో ఆ పిల్లాడు కాళ్లరిగేలా తండ్రి మృతదేహం తీవ్రంగా కష్టపడ్డాడు. చివరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలగజేసుకోవడంతో ఎట్టకేలకు తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఉన్న దీన్‌దయాల్‌ ఆస్పత్రికి రోజువారీ కూలీ రాజు ఏప్రిల్‌ 21వ తేదీన వచ్చాడు. ఆరోగ్యం విషమించడంతో ఏప్రిల్‌ 23వ తేదీన మృతి చెందాడు. దీంతో కొడుకు తన తండ్రి మృతదేహం అప్పగించాలని అధికారులను కోరాడు. అయితే పిల్లాడు మైనర్‌ కావడంతో అధికారులు శవం అప్పగించడానికి నిరాకరించారు. ఎవరైనా పెద్దవారిని తీసుకురా అని చెప్పాడు. అయితే ఆ బాలుడికి తండ్రి తప్ప నా అనేవారు ఎవరూ లేరు. బంధువులను బతిమిలాడాడు. అయితే కరోనా భయంతో మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు వారు నిరాకరించారు. దీంతో పది రోజులుగా రాజు మృతదేహం ఆస్పత్రి మార్చురీలోనే ఉండిపోయింది.

చివరకు స్థానికుడు మహేశ్‌ స్పందించి ఎమ్మెల్యే అనిల్‌ పరషార్‌, ఎమ్మెల్సీ మాన్‌వేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సహాయంతో ఆ బాలుడి తండ్రి మృతదేహాన్ని పది రోజుల అనంతరం బయటకు తీసుకువచ్చారు. అయితే తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు బాలుడి వద్ద డబ్బు కూడా లేకపోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చి అంత్యక్రియలను జరిపించారు. ఈ విధంగా తండ్రి మృతదేహం కోసం ఆ బాలుడు తీవ్రంగా కష్టపడి చివరకు అతికష్టమ్మీద తన తండ్రికి పున్నామ నరకం నుంచి తప్పించాడు. అయితే ఆస్పత్రి అధికారులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలుడి తండ్రి మృతదేహం అప్పగించడంలో నిబంధనల పేరిట ఇబ్బందులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

చదవండి: ఆక్సిజన్‌ కొరత లేదు.. కరోనా కంట్రోల్‌లోనే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement