అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్సులో భద్ర పరుస్తానంటూ మార్చురీ సిబ్బంది మృతుడి బంధువులను డిమాండ్ చేశారు. బాధితులు ఈ విషయాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మలక్‌పేట ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు కుటుంబీకులతో కలిసి మృతదేహాన్ని సోమవారం రాత్రి ఉస్మానియా మార్చురీకి తరలించారు.
మార్చురీ వద్ద మద్యం మత్తులో విధుల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి రాజు మృతదేహాన్ని భద్ర పరచాలంటే రూ.1000 ఇవ్వాల్సిందేనని భీష్మించాడు. ఎందుకు ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రాజు పోలీసులను సైతం తోసివేస్తూ మార్చురీ గదిని మూసివేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. మృతుడి కుటుంబీకులు మంగళవారం ఉదయం అతడిపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ కాంట్రాక్ట్ ఉద్యోగిపై ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం అతడిని విధుల్లోంచి తొలగించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి.నాగేందర్ మాట్లాడుతూ.... ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లు, వార్డులు సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, మార్చురీ, రోగ నిర్ధారణ కేంద్రాల్లోని సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే ఎంత టి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఆసుపత్రి గ్రేవియన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఔట్‌పేషెంట్ బ్లాకు, ఆర్‌ఎంఓ రూమ్ దగ్గర ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేశామని సలహాలు, సూచనలతో పాటు తమ ఫిర్యాదులను ఆ బాక్సులో వేస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.
(చదవండి: టార్చర్ ఫ్రమ్ హోమ్!)
Comments
Please login to add a commentAdd a comment