central hospital
-
యాదాద్రి భువనగిరి: మృతదేహాన్ని కొరికేసిన ఎలుకలు!
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్ (38) కుటుంబం 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్‌కు వివాహం జరగా, ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి ఆమె చనిపోవడంతో, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఏడాది క్రితం రెండో భార్య రవికుమార్‌ను వదిలివెళ్లింది. దీంతో ఆయన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న రవికుమార్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తగాదా పడుతుండడంతో తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. తిరిగి రాత్రి 11:30 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి రవికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా బయట భద్రపరిచారు. ఆ ఆనవాళ్లు చూసి.. రవికుమార్ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నానాయక్ తెలిపారు. -
కామారెడ్డి ఆస్పత్రి ఐసీయూలో ఎలుకలు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఐసీయూలో ఎలుకలు తిరుగుతుండగా ఆదివారం కొందరు రోగులు గమనించి ఫొటోలు తీశారు. ఐసీయూతో పాటు ట్రామాకేర్ సెంటర్, అత్యవసర మందులుంచే చోట కూడా ఎలుకలు కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. గోడలు, ఆక్సిజన్ పైప్‌ల వద్దకే కాకుండా పడకలపైకి కూడా వస్తున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఎలుకల నివారణకు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. దీనిపై కాగా, జిల్లా ఆస్పత్రి ఆర్ఎంవో శ్రీనివాస్‌ను వివరణ కోరగా, ‘ఆస్పత్రిలోకి ఎలుకలు రాకుండా నెట్లు ఉన్నాయి. ఎలా వచ్చాయో తెలియదు. సోమవారం శానిటేషన్ కాంట్రాక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. -
ఎన్నాళ్లీ యాతన..!
విజయనగరం ఫోర్ట్: కేంద్రాస్పత్రికి వచ్చే రోగులకు సేవలు అందని ద్రాక్షగా మారాయి. సకాలంలో స్పందించేవారు లేకపోవడంతో ఆపదలో ఉన్న రోగులు, వారి బంధువులు ఆవేదన చెందుతున్నారు. కొన్నిసార్లు వార్డుబాయ్‌లుగా మారి రోగులను వార్డులు, ఎక్స్‌రే, స్కానింగ్ విభాగాలకు తీసుకెళ్తున్నారు. కళ్లముందే సేవలు అందకపోయినా పట్టించుకునే అధికారులే కరువయ్యారంటూ గగ్గోలు పెడుతున్నారు. అధికారులు రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పడం తప్ప చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని వాపోతున్నారు. జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో రోగులు అధిక సంఖ్యలో వస్తారు. ఆస్పత్రికి అవుట్ పేషేంట్లు 800 నుంచి 1000 మంది వరకు వస్తారు. ఇన్‌పేషెంట్లు 150 నుంచి 160 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో కంటి, ఎముకల, పిల్లల, ఈఎన్టీ, దంత, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, చర్మ, గైనిక్, మానసిక సంబంధిత వ్యాధులకు వైద్య సేవలు అందిస్తారు. అయితే, సేవల్లో అసౌకర్యాలు ఉండడం రోగులకు ఆవేదన మిగుల్చుతోంది. నడవలేకపోతే నరకమే.... ఆస్పత్రికి వచ్చే రోగులు నడవగలిగితే ఫర్వాలేదు. లేదంటే నరకం చూడాల్సిన పరిస్థితి. నడవలేని స్థితిలో ఉన్నాం తీసుకుని వెళ్లండని వైద్య సిబ్బందిని అడిగినా పట్టించుకునే వారే కరువయ్యారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. నిత్యం జరుగుతున్న తంతే ఆరోపణలకు ఊతమిస్తుంది. పునరావతం కాకుండా చూస్తాం నడవలేని స్థితిలో ఉన్న రోగులను వీల్‌చైర్, లేదంటే స్ట్రెచ్చర్‌పై తరలించేలా చర్యలు తీసుకుంటాం. రోగి బంధువులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. – కె.సీతారామరాజు,సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి -
కేంద్రాస్పత్రిలో డిజిటల్ ఎక్సరే ఫిల్మ్‌ల కొరత..!
జిల్లాకే తలమానికమైన కేంద్రాస్పత్రికి రోగులు ఎక్స్‌రే కోసం వెళ్తే ముప్పతిప్పలు పడాల్సిందే...ఎక్స్‌రే తీసుకున్న మరుసటి రోజు దాని కోసం మళ్లీ వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో రోగులు ఎక్స్‌రే కోసం డబ్బులు మిగిలాయనుకుంటే తిరగడానికి చేతి చమురు వదులుతోందని ఆవేదన చెందుతున్నారు. – వేపాడ మండలానికి చెందిన సోములమ్మ కడుపు నొప్పితో ఈ నెల 9న కేంద్రాస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఎక్స్‌రే తీయించమని చీటి రాసి ఇచ్చారు. అది పట్టుకుని డిజిటల్ ఎక్స్‌రే విభాగానికి వెళ్లగా అక్కడ వారు ఎక్స్‌రే తీసారు. ఫిల్మ్ అడిగితే ఫిల్మ్‌లు లేవు. రిపోర్టు మరోసటి రోజు ఇస్తామని చెప్పారు. దీంతో గత్యంతరం లేక వేపాడ వెళ్లిపోయారు. – గంట్యాడ మండలానికి చెందిన సిహెచ్.ముత్యాలునాయుడు ట్రాక్టర్‌పై నుంచి పడిపోవడంతో కొద్ది రోజుల కిందట కేంద్రాస్పత్రిలో చూపించుకున్నాడు. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీసుకోమని చీటి రాసి ఇచ్చారు. అది పట్టుకుని వెళ్లగా అక్కడ సిబ్బంది ఎక్స్‌రే తీశారు. ఫిల్మ్ అడిగితే ఫిల్మ్‌లు లేవని చెప్పారు. రిపోర్టు కోసం మరుసటి రోజు రమ్మని చెప్పారు. విజయనగరం ఫోర్ట్: ఇది ఈ ఇద్దరి రోగుల పరిస్థితే కాదు. అనేక మంది రోగులు కేంద్రాస్పత్రిలో ఎదుర్కొంటున్న దుస్థితి. ఆస్పత్రిలో డిజిటల్ ఎక్స్‌రేలు తీస్తున్నామని అధికారులు గొప్పలు చెబుతున్నారు. వాటి ఫిల్మ్‌లు ఇవ్వకపోవడం వల్ల రోగులు రోజుల తరబడి రిపోర్టు కోసం తిరగాల్సిన పరిస్థితి. గత 15 రోజులుగా కేంద్రాస్పత్రిలో ఇదే పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజులో 40 నుంచి 50 మంది వరకు... జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వాస్పత్రి కావడంతో అధిక సంఖ్యలో కేంద్రాస్పత్రికి వస్తారు. రోజుకు సగటున 40 నుంచి 50 మంది వరకు డిజిటల్ ఎక్సరేలు కోసం వస్తారు. కొద్ది రోజులు కిందట వరకు డిజిటల్ ఎక్స్‌రే ఫిల్మ్‌లు రోగులకు ఇచ్చేవారు. దీంతో అవి పట్టుకుని వైద్యులకు చూపించేవారు. వచ్చిన రోజే రోగులకు ఊరట లభించేది. ఫిల్మ్‌లు అయిపోవడంతో అధికారులు తెప్పించకుండా నాన్చుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్‌లు ఇవ్వకపోవడం వల్ల రోగులు రిపోర్టు కోసం మరుసటి రావాల్సిన దుస్థితి. ఫిల్మ్‌లు ఇవ్వడం వల్ల ప్రభుత్వం టెలీ రేడియాలజికి చెల్లిస్తున్న డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అవస్థలు పడుతున్న రోగులు ఒక రోజు ఎక్స్‌రే తీసుకుంటే దాని రిపోర్టు కోసం మరుసటి రోజు రావాల్సిన దుస్థితి. దీని వల్ల రోగులకు ప్రయాణ చార్జీలు, భోజన వసతి కోసం చేతిచమురు వదలించుకోవాల్సిన దుస్థితి. అన్ని వసతులు ఉంటాయని జిల్లా నలుమూలాలు నుంచి రోగులు వస్తారు. సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వల్ల అవస్థలు పడుతున్నారు. డిజిటల్ ఫిల్మ్‌లు వచ్చాయి... ఎక్స్‌రే విభాగానికి ఎందుకు ఇవ్వడం లేదో కనుగొంటాం. ఫిల్మ్‌లు రోగులు చేతికి ఇవ్వకూడదు. వార్డు బాయ్‌లు పట్టుకుని వెళ్లి వైద్యునికి చూపించాలి. రోగులకు ఇవ్వకూడదని ఆదేశాలు వచ్చాయి. –కె. సీతారామరాజు, కేంద్రాస్పత్రి, సూపరింటెండెంట్ -
కేంద్రాస్పత్రికి వస్తే కేజీహెచ్‌కే...
గంట్యాడ మండలానికి చెందిన కె.రమణమ్మ నాలుగు రోజులు కిందట కిడ్నీ సంబంధిత వ్యాధితో కేంద్రాస్పత్రిలో చేరింది. చేరిన పది గంటల్లోనే ఆమెను కిడ్నీ సంబంధిత వైద్యులు లేరని అక్కడి వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్ చేసేశారు. ఇది ఒక్క రమణమ్మ పరిస్థితే కాదు. కేంద్రాస్పత్రికి వచ్చే రోగులకు నిత్యం ఎదురువుతున్న పరిస్థితి ఇది. విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో జిల్లా నలుమూలలు నుంచి రోగులు కేంద్రాస్పత్రికి వస్తారు. పెద్దాస్పత్రిలోనే వైద్యం అందకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రాస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఉన్నా ఒకసారి డయాలసిస్ చేసిన రోగులకు మాత్రమే కేంద్రాస్పత్రిలో చేస్తున్నారు. డయాలసిస్ అవసరం రోగికి నేరుగా డయాలిసిస్ చేసే సౌకర్యం( ఎ.వి.ఫిస్టులా) లేదు. ఈ సౌకర్యం లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. డయాలసిస్ సెంటర్ రోగులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకసారి కేజీహెచ్‌లోగాని ప్రైవేటు ఆస్పత్రుల్లోగాని డయాలసిస్ చేసుకుంటే తప్ప డయాలసిస్ చేయని పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి డయాలసిస్ చేయడం లేదు. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి రోగులు విశాఖపట్నం కేజీహెచ్‌కుగాని కార్పొరేట్ ఆస్పత్రికిగాని వెళ్లాల్సిన పరిస్థితి. ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాలంటే రూ.వేలల్లో ఖర్చువుతుంది. డబ్బులు లేని నిరుపేదలు వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా డయాలసిస్ చేయాలి. ఎ.వి. ఫిస్టులా సౌకర్యం లేకపోవడం వల్ల డయాలసిస్ జరగడం లేదు. అమలు కాని ఆదేశాలు రెండు నెలలు కిందట వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య కేంద్రాస్పత్రిని పరిశీలించారు. ఆ సమయంలో కేంద్రాస్పత్రిలో కిడ్నీ రోగులకు ఎ.వి. ఫిస్టులా సౌకర్యం అందలేదని గుర్తించి నెల రోజుల్లో ఎ.వి. ఫిస్టులా సౌకర్యం కేంద్రాస్పత్రిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండు నెలలవుతున్నా ఇంతవరకు కేంద్రాస్పత్రిలో కిడ్నీ రోగులకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. త్వరలో ఏర్పాటు చేస్తాం... కిడ్నీ రోగులకు నేరుగా డయాలసిస్ సౌకర్యం కేంద్రాస్పత్రిలో ప్రస్తుతానికి లేదు. త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. –కె. సీతారామరాజు,కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ -
కేంద్ర ఆస్పత్రి ఆశలు ఆవిరి !
దశాబ్దాల కలనెరవేరుతోందని ఆశించిన పాలకొండ ప్రాంతవాసుల ఆశలు ఆవిరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రిని పాలకొండలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు పాతరేసే దిశగా ఓ ముఖ్యనేత పావులు కదుపుతుండడంతో ఈ ప్రాంత వాసులు రగిలిపోతున్నారు. ఏజెన్సీ ముఖద్వారమైన ఇక్కడకు శ్రీకాకుళంలో ఉన్న కేంద్ర ఆస్పత్రిని తరలించాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్ణయించారు. దీని కోసం దాదాపు అన్ని రకాల అనుమతులు, పరిశీలనలు పూర్తయ్యాయి. ఆస్పత్రి ఏర్పాటే తరువాయి అనే సమయంలో ప్రభుత్వం మారడంతో విషయం మరుగున పడింది. తాజాగా కేంద్ర ఆస్పత్రిని టెక్కలి డివిజన్ కేంద్రానికి తరలించే యోచన తెరపైకి రావడంతో పాలకొండకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నాయకులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ: పదేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో రిమ్స్ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. దీంతో కేంద్ర ఆస్పత్రిని జిల్లాలోని వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో నేతల మధ్య పోటీ పెరిగి తమ ప్రాంతంలోనే ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చాయి. అప్పటి కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి టెక్కలి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయాలని పట్టుపట్టగా.. జైడ్పీ చైర్మన్‌గా పని చేసిన పాలవలస రాజశేఖరం పాలకొండలో ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో జిల్లాలో ఎక్కడ కేంద్ర ఆస్పత్రి అవసరమన్నది గుర్తించేందుకు కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని ప్రాంతాల్లో సర్వే జరిపి పాలకొండ ప్రాంతానికి అవసరమని నివేదికలు అందించింది. ఇదే విషయమై అప్పటి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో 250 పడకల కేంద్ర ఆస్పత్రిని పాలకొండలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రస్తుతమున్న వంద పడకల ఏరియా ఆస్పత్రిలో పరిశీలిన పూర్తి చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రైన రోశయ్య కూడా పాలకొండలో కేంద్ర ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని ప్రకటించారు. అయితే ఆ తరువాత ప్రభుత్వాలు మారడంతో ఈ విషయం మరుగునపడిపోయింది. తాజాగా కేంద్ర ఆస్పత్రిని టెక్కలిలో ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అనడంపై ఈ ప్రాంతంలో అసంతృప్తి రగులుతుంది. ఏజెన్సీకి అన్యాయం.. పలుమార్లు జరిపిన సర్వేలో పాలకొండలోనే కేంద్ర ఆస్పత్రి నిర్మాణం జరపాలనడానికి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలన్నది సారాంశం. నిత్యం వ్యాధులు విజృభిస్తుండటం, స్థానికంగా వైద్యం అందకపోవడంతోప్రతి చిన్న రోగానికి జిల్లా కేంద్రానికి పరుగులు తీయాల్సి వస్తుంది. పాలకొండను ఆనుకుని ఉన్న వీరఘట్టం, సీతంపేట, భామిని, కొత్తూరు, రేగిడి తదితర మండలాల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యం కొంతమంది నేతల తీరు కారణంగా నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలి: పాలవలస ప్రభుత్వాలు మారుతుంటాయి.. పాలకలు మారుతుంటారు.. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరముందని జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం అన్నారు. ఏజెన్సీ ప్రాంతంతో కూడుకున్న పాలకొండలో కేంద్ర ఆస్పత్రి ఏర్పాటుకు అన్ని రకాల అడ్డంకులు గతంలోనే తీరిపోయావని, సర్వేలో సైతం పాలకొండలో ఏర్పాటు చేయాలని తేలిందన్నారు. ప్రధానంగా గిరిజనులకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం కృషి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం నాయకులు తమ స్వార్థం కోసం గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని కుంటిపర్చటం సమంజసం కాదన్నారు. దీనిపై అన్ని పక్షాల నేతలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.