దశాబ్దాల కలనెరవేరుతోందని ఆశించిన పాలకొండ ప్రాంతవాసుల ఆశలు ఆవిరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రిని పాలకొండలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు పాతరేసే దిశగా ఓ ముఖ్యనేత పావులు కదుపుతుండడంతో ఈ ప్రాంత వాసులు రగిలిపోతున్నారు. ఏజెన్సీ ముఖద్వారమైన ఇక్కడకు శ్రీకాకుళంలో ఉన్న కేంద్ర ఆస్పత్రిని తరలించాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్ణయించారు. దీని కోసం దాదాపు అన్ని రకాల అనుమతులు, పరిశీలనలు పూర్తయ్యాయి. ఆస్పత్రి ఏర్పాటే తరువాయి అనే సమయంలో ప్రభుత్వం మారడంతో విషయం మరుగున పడింది. తాజాగా కేంద్ర ఆస్పత్రిని టెక్కలి డివిజన్ కేంద్రానికి తరలించే యోచన తెరపైకి రావడంతో పాలకొండకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నాయకులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాలకొండ: పదేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో రిమ్స్ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. దీంతో కేంద్ర ఆస్పత్రిని జిల్లాలోని వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో నేతల మధ్య పోటీ పెరిగి తమ ప్రాంతంలోనే ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చాయి. అప్పటి కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి టెక్కలి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయాలని పట్టుపట్టగా.. జైడ్పీ చైర్మన్‌గా పని చేసిన పాలవలస రాజశేఖరం పాలకొండలో ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో జిల్లాలో ఎక్కడ కేంద్ర ఆస్పత్రి అవసరమన్నది గుర్తించేందుకు కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని ప్రాంతాల్లో సర్వే జరిపి పాలకొండ ప్రాంతానికి అవసరమని నివేదికలు అందించింది. ఇదే విషయమై అప్పటి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో 250 పడకల కేంద్ర ఆస్పత్రిని పాలకొండలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రస్తుతమున్న వంద పడకల ఏరియా ఆస్పత్రిలో పరిశీలిన పూర్తి చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రైన రోశయ్య కూడా పాలకొండలో కేంద్ర ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని ప్రకటించారు. అయితే ఆ తరువాత ప్రభుత్వాలు మారడంతో ఈ విషయం మరుగునపడిపోయింది. తాజాగా కేంద్ర ఆస్పత్రిని టెక్కలిలో ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అనడంపై ఈ ప్రాంతంలో అసంతృప్తి రగులుతుంది.
ఏజెన్సీకి అన్యాయం..
పలుమార్లు జరిపిన సర్వేలో పాలకొండలోనే కేంద్ర ఆస్పత్రి నిర్మాణం జరపాలనడానికి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలన్నది సారాంశం. నిత్యం వ్యాధులు విజృభిస్తుండటం, స్థానికంగా వైద్యం అందకపోవడంతోప్రతి చిన్న రోగానికి జిల్లా కేంద్రానికి పరుగులు తీయాల్సి వస్తుంది. పాలకొండను ఆనుకుని ఉన్న వీరఘట్టం, సీతంపేట, భామిని, కొత్తూరు, రేగిడి తదితర మండలాల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యం కొంతమంది నేతల తీరు కారణంగా నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.
ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలి: పాలవలస
ప్రభుత్వాలు మారుతుంటాయి.. పాలకలు మారుతుంటారు.. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరముందని జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం అన్నారు. ఏజెన్సీ ప్రాంతంతో కూడుకున్న పాలకొండలో కేంద్ర ఆస్పత్రి ఏర్పాటుకు అన్ని రకాల అడ్డంకులు గతంలోనే తీరిపోయావని, సర్వేలో సైతం పాలకొండలో ఏర్పాటు చేయాలని తేలిందన్నారు. ప్రధానంగా గిరిజనులకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం కృషి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం నాయకులు తమ స్వార్థం కోసం గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని కుంటిపర్చటం సమంజసం కాదన్నారు. దీనిపై అన్ని పక్షాల నేతలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ఆస్పత్రి ఆశలు ఆవిరి !
Published Fri, Mar 20 2015 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM
Advertisement
Advertisement