డిజిటల్ ఎక్స్‌రే మిషన్
జిల్లాకే తలమానికమైన కేంద్రాస్పత్రికి రోగులు ఎక్స్‌రే కోసం వెళ్తే ముప్పతిప్పలు పడాల్సిందే...ఎక్స్‌రే తీసుకున్న మరుసటి రోజు దాని కోసం మళ్లీ వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో రోగులు ఎక్స్‌రే కోసం డబ్బులు మిగిలాయనుకుంటే తిరగడానికి చేతి చమురు వదులుతోందని ఆవేదన చెందుతున్నారు.
– వేపాడ మండలానికి చెందిన సోములమ్మ కడుపు నొప్పితో ఈ నెల 9న కేంద్రాస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఎక్స్‌రే తీయించమని చీటి రాసి ఇచ్చారు. అది పట్టుకుని డిజిటల్ ఎక్స్‌రే విభాగానికి వెళ్లగా అక్కడ వారు ఎక్స్‌రే తీసారు. ఫిల్మ్ అడిగితే ఫిల్మ్‌లు లేవు. రిపోర్టు మరోసటి రోజు ఇస్తామని చెప్పారు. దీంతో గత్యంతరం లేక వేపాడ వెళ్లిపోయారు.
– గంట్యాడ మండలానికి చెందిన సిహెచ్.ముత్యాలునాయుడు ట్రాక్టర్‌పై నుంచి పడిపోవడంతో కొద్ది రోజుల కిందట కేంద్రాస్పత్రిలో చూపించుకున్నాడు. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీసుకోమని చీటి రాసి ఇచ్చారు. అది పట్టుకుని వెళ్లగా అక్కడ సిబ్బంది ఎక్స్‌రే తీశారు. ఫిల్మ్ అడిగితే ఫిల్మ్‌లు లేవని చెప్పారు. రిపోర్టు కోసం మరుసటి రోజు రమ్మని చెప్పారు.
విజయనగరం ఫోర్ట్: ఇది ఈ ఇద్దరి రోగుల పరిస్థితే కాదు. అనేక మంది రోగులు కేంద్రాస్పత్రిలో ఎదుర్కొంటున్న దుస్థితి. ఆస్పత్రిలో డిజిటల్ ఎక్స్‌రేలు తీస్తున్నామని అధికారులు గొప్పలు చెబుతున్నారు. వాటి ఫిల్మ్‌లు ఇవ్వకపోవడం వల్ల రోగులు రోజుల తరబడి రిపోర్టు కోసం తిరగాల్సిన పరిస్థితి. గత 15 రోజులుగా కేంద్రాస్పత్రిలో ఇదే పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోజులో 40 నుంచి 50 మంది వరకు...
జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వాస్పత్రి కావడంతో అధిక సంఖ్యలో కేంద్రాస్పత్రికి వస్తారు. రోజుకు సగటున 40 నుంచి 50 మంది వరకు డిజిటల్ ఎక్సరేలు కోసం వస్తారు. కొద్ది రోజులు కిందట వరకు డిజిటల్ ఎక్స్‌రే ఫిల్మ్‌లు రోగులకు ఇచ్చేవారు. దీంతో అవి పట్టుకుని వైద్యులకు చూపించేవారు. వచ్చిన రోజే రోగులకు ఊరట లభించేది.
ఫిల్మ్‌లు అయిపోవడంతో అధికారులు తెప్పించకుండా నాన్చుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్‌లు ఇవ్వకపోవడం వల్ల రోగులు రిపోర్టు కోసం మరుసటి రావాల్సిన దుస్థితి. ఫిల్మ్‌లు ఇవ్వడం వల్ల ప్రభుత్వం టెలీ రేడియాలజికి చెల్లిస్తున్న డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
అవస్థలు పడుతున్న రోగులు
ఒక రోజు ఎక్స్‌రే తీసుకుంటే దాని రిపోర్టు కోసం మరుసటి రోజు రావాల్సిన దుస్థితి. దీని వల్ల రోగులకు ప్రయాణ చార్జీలు, భోజన వసతి కోసం చేతిచమురు వదలించుకోవాల్సిన దుస్థితి. అన్ని వసతులు ఉంటాయని జిల్లా నలుమూలాలు నుంచి రోగులు వస్తారు. సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వల్ల అవస్థలు పడుతున్నారు.
డిజిటల్ ఫిల్మ్‌లు వచ్చాయి...
ఎక్స్‌రే విభాగానికి ఎందుకు ఇవ్వడం లేదో కనుగొంటాం. ఫిల్మ్‌లు రోగులు చేతికి ఇవ్వకూడదు. వార్డు బాయ్‌లు పట్టుకుని వెళ్లి వైద్యునికి చూపించాలి. రోగులకు ఇవ్వకూడదని ఆదేశాలు వచ్చాయి. –కె. సీతారామరాజు, కేంద్రాస్పత్రి, సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment