Patients Problems
-
‘ఓపీ’ శాపమే..!
ఖమ్మంవైద్యవిభాగం: ఆరోగ్యం బాగోలేక పరీక్షలు చేయించుకునేందుకు పెద్దాస్పత్రికి వస్తే అవస్థలే ఎదురవుతున్నాయి. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ నిర్ణయాలతో రోగులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ముందస్తు సమాచారం, ప్రచారం లేకుండా రోగులకు ఆధార్, సెల్ నంబర్ తప్పనిసరి చేయడంతో ఉరుకులు పరుగులు తీయాల్సి వస్తోంది. ఔట్ పేషెంట్(ఓపీ) చిట్టీ రాసే సమయానికి ఆస్పత్రి సిబ్బంది ఇలాంటి నిబంధనలు పెట్టడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు రోగులు వెనుదిరుగుతుండగా.. మరికొందరు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం నుంచి కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చారు. ఔట్ పేషెంట్ రోగులు చిట్టీ రాయించుకోవాలంటే ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరి కావాలని చెప్పడంతో అయోమయానికి గురయ్యారు. ఇప్పటికిప్పుడు ఆధార్ నంబర్ ఎలా తీసుకొస్తామని చాలా మంది రోగులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలమైన తాము ఉచితంగా ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించుకోవచ్చని ఇక్కడకు వస్తే కొత్త నిబంధనలు పెట్టి తమను ఇబ్బందులుపాలు చేయడం ఏమిటని పలువురు రోగులు అసహనం వ్యక్తం చేశారు. సేవలు పెంచినా.. నిబంధనలు అడ్డు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కొన్నాళ్లుగా వైద్య సేవలు విస్తృతమయ్యాయి. అప్పట్లో నామమాత్రంగా సేవలు అందగా.. ప్రస్తుతం ఇతర జిల్లాల నుంచి కూడా రోగులు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా సరిహద్దు జిల్లాలు సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాల నుంచి కూడా రోగుల తాకిడి ఎక్కువైంది. ప్రతీ రోజు 1,200 నుంచి 1,500 మంది రోగులు వైద్య సేవలు పొందేందుకు పెద్దాస్పత్రికి వస్తున్నారు. గతంలో 250 పడకల ఆస్పత్రి ఉండగా.. ఇప్పుడు 400 పడకలకు చేరింది. పెద్దాస్పత్రిలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం ద్వారా ప్రసవాలు పెరిగాయి. దీంతో సాధారణ రోగులే కాకుండా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సేవలు మరింత విస్తృతమయ్యాయి. అయితే ప్రభుత్వం సేవలు పెంచినా.. రోగుల తాకిడి ఎక్కువవుతున్న సందర్భంలో ఆధార్, సెల్ నంబర్ వంటి నిబంధనలు పెట్టడంతో సేవలకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా ఆధార్, సెల్ నంబర్ నమోదు చేయాలని కొర్రీ పెడుతుండడంతో చాలా మంది రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా పెద్దాస్పత్రికి వచ్చే రోగులు చాలా మంది నిరుపేదలు, వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండడంతో వారికి ఏం చేయాలో పాలుపోక వెనుదిరగాల్సి వస్తోంది. పీహెచ్‌సీల స్థాయి నుంచి ముందస్తుగా ప్రజల్లో అవగాహన కల్పించి.. ఆ తర్వాత ఇటువంటి నిబంధనలు తెస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని పలువురు ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఉద్యోగులకు ‘కొత్త’ ఇక్కట్లు రాష్ట్ర ప్రభుత్వం రోగులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు ఆధార్, సెల్ నంబర్ నమోదు చేయాలనే నిబంధనలు విధించింది. ఓపీ, ఐపీ సేవలు ఆన్లైన్లో నమోదు చేయడం ద్వారా సేవలపై రోగులను నేరుగా సంప్రదించే అవకాశం ఉంటుంది. దీంతో సేవలు మరింత మెరుగుపడి ప్రజలకు మేలు జరుగుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎలాంటి ప్రచారం లేకుండా నిబంధనలు తేవడం మంచిది కాదని పలువురు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి నెల 40వేల మందికి పైగా రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. అయితే ఇప్పటివరకు రోగి పేరు, వయసు నమోదు చేసి ఓపీ చిట్టీ రాసే వారు. అలా చేయడం వల్ల ఉద్యోగులకు, రోగులకు ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు. కానీ.. కొత్త నిబంధనలతో ఓపీ రాసే ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో రోగి వివరాలు నమోదు చేసేందుకు సమయం పడుతుండడంతో వారిపై పని ఒత్తిడి ఎక్కువైంది. దీనికి తోడు ఒక్కో రోగి నమోదుకు సమయం తీసుకుంటుండడంతో క్యూలో రోగులు గంటలతరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మధ్యాహ్నం వరకు రోగులు లైన్లో అవస్థలు పడ్డారు. ఓపీ రాయించుకున్నా.. చాలా మంది రోగులు వైద్యులు లేక వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటికే సమయం అయిపోవడంతో డాక్టర్లు డ్యూటీలు పూర్తి చేసుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో రోగులు మరింత ఇబ్బందిపడ్డారు. ఈ పరిస్థితి ప్రతి రోజు ఉండే అవకాశం ఉండడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉండే పరిస్థితి ఉంది. ముందుగా సిబ్బందిని పెంచి ఇటువంటి నిబంధన తీసుకొస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తేవి కావని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆరోగ్యానికి శ్రీరామరక్ష
మెదక్‌జోన్: ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దావఖానాకు అన్న ప్రజలు నేడు క్యూ.. కడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో అనేక రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందుతోంది. దీంతో ఏ సమస్య వచ్చినా ప్రైవేట్ హాస్పటిల్‌కు వెళ్లకుండా ప్రభుత్వాస్పత్రి వైపు చూస్తున్నారు. ఈ వైద్యశాలలో ఏడాదికాలంలో ఐదు వేల శస్త్రచికిత్సలు చేసి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. మెదటి స్థానంలో హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్పత్రి ఉంది. సగటున నెలకు నాలుగువందల నుంచి 430 వరకు ఆపరేషన్లు చేస్తున్నారు. ఇందులో అపెండెక్స్, వరిబీజం, థైరాయిడ్, కంటి సమస్యలకు, ఎముకలు విరిగినా శస్త్ర చికిత్స ద్వారా సరిచేయడం, గర్భిణులకు సర్జరీ చేసి పురుడుపోయడం లాంటి అనేక రకాల రకాల ఆపరేషన్లు చేస్తూ నిరుపేదలకు భరోస కలిగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి 100 పడకలు కాగా ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం నియమించిన సిబ్బందితోనే ఇంతకాలంగా ఆస్పత్రిని నడిపించారు. నాలుగు నెలల క్రితం సరిపడ వైద్యులను నియమించారు. అయినా నేటికీ పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్‌తో పాటు ల్యాబ్‌టెక్నిషన్స్ తక్కువగానే ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలవడం హర్షించదగ్గ విషయమని పలువురు పేర్కొంటున్నారు. ఐసీయూలో అత్యవసర చికిత్సఏడాది క్రితం అత్యవసర చికిత్స విభాగంవిభాగం(ఐసీయూ)ని ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులు, పక్షవాతం లాంటి వ్యాధుల బారిన పడిన రోగులకు అన్నిరకాల శస్త్రచికిత్సలు అందుతున్నాయి. వెంటిలెటర్ అందుబాటులో ఉండటంతో రోగుల ప్రాణాలకు భరోసాకలిగే విధంగా వైద్యం అందుతోంది. దీంతో వేలాది శస్త్రచిత్సలతోపాటు అన్నిరకాల వ్యాధులను నయం చేస్తున్నారు. డయాలసిస్‌తో.. ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో కిడ్నీ వాధిగ్రస్థులకు స్థానికంగానే డయాలసిస్ చేస్తూ చికిత్స అందిస్తున్నారు. ఈ డయాలసిస్ కేంద్రంలో ఒకేసారి ఐదుగురికి డయాలసీస్‌ను నిర్వహించే వెసులు బాటు ఉండటంతో చికిత్స త్వరతగతిన అందుతోంది. జిల్లా వ్యాప్తంగా 35 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. గతంలో డయాలసిస్ చేయించుకునేందుకు హైదరాబాద్ వెళ్లేవారు. మాతాశిశు ఆస్పత్రికి శంకుస్థాపన జిల్లా కేంద్రంలో మాతాశిశు సంక్షేమ ఆస్పత్రి నిర్మాణం కోసం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి రూ.17 కోట్లను మంజూరు చేయించారు. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా శంశుస్థాపనను సైతం చేయించారు. ఇందుకు సంబంధించి టెండర్ పక్రియ జిల్లాకేంద్ర ఆస్పత్రిలోనే జరిగింది. కానీ ఆస్పత్రి నిర్మాణానికి స్థలం సరిపోవడం లేదనే సందిగ్ధంలో కాంట్రాక్టర్ ఉన్నట్లు తెలిసింది. ఈ మాతా శిశుఆస్పత్రి నిర్మాణం పూర్తి అయితే మాతాశిశు వ్యాధులకు ఇక్కడే పూర్తిస్థాయి చికిత్సలు అందే అవకాశం ఉంది. దీంతో మాతాశిశు మరణాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. కంటి జబ్బుల నివారణ కోసం... కంటి జబ్బుల నివారణకోసం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రత్యేకంగా నిర్మించేందుకు 20 పడకల ఆస్పత్రి నిర్మాణంకోసం రూ.20 లక్షలు మంజూరి కాగా ప్రస్తుతం ఆస్పత్రిపై భాగంలో మొదటి అంతస్తుగా కంటివెలుగు ఆస్పత్రిని ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. త్వరలో నిర్మాణం పూర్తికానుంది. ఇది పూర్తయితే కంటిజబ్బు వ్యాధిగ్రస్థులకు ప్రత్యేకమైన చికిత్సలు అందే అవకాశం ఉంది. -
నేనురాను బిడ్డో..!
పరిగి వికారాబాద్ : సర్కారు దవాఖానాలపై ప్రజలు రోజురోజుకు నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఆస్పత్రులపై నమ్మకాన్ని పాదుగొల్పేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలేవీ పెద్దగా ఫలితాలనివ్వటంలేదు. చివరకు పేద నిరుపేదలు సైతం ప్రభుత్వ ఆస్పత్రులకు దూరమవుతున్నారు. మందుబిల్లల కోసమో.. సూదిమందు కోసమో అయితే ప్రభుత్వాసుపత్రి పరవాలేదనుకుంటున్నారు కాని .. ఆస్పత్రిలో అడ్మిట్ కావటం, కాన్పులు లాంటివి చేసుకోవటమంటే జంకుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిని నమ్మి తమ జీవితాలను ఫణంగా పెట్టలేమని చెప్పకనే చెబుతున్నారు. సర్కారు దవఖానాల్లో ఆయా వైద్యం కోసం వచ్చి వెళుతున్న రోగుల గణాంకాలే ఈ విషయాలను నిరూపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సహకాలు ప్రకటించినా.. కేసీఆర్ కిట్లు ఇస్తున్నా.. కాన్పుల సంఖ్య పెరగటంలేదు. ప్రధానంగా ప్రభుత్వ దవాఖానాలకు పాయిజన్ కేసులు, ప్రమాదాలు జరిగే సమయంలో ప్రథమ చికిత్సలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు తప్పిస్తే సాధారణ రోగాలతో ఎవరూ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరటంలేదు. ప్రసవాలు అంతంతే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల కోసం చేరుతున్న వారి సంఖ్య మొత్తం కాన్పుల్లో 20 శాతం కూడా ఉండటంలేదు. 70నుంచి 80 శాతం వరకు ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. పేదలు సైతం అప్పు చేసైనా ప్రైవేటు ఆస్ప్రతుల్లోనే చేరుతున్నారు. ఇప్పటికీ గ్రామీణ, గిరిజన తండాల్లో 10 శాతానికి పైగా ఇళ్ల వద్దే కాన్పులు అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు పరిగి మండలంలో ప్రతి నెలా కొత్తగా 300 నుంచి 400 వరకు గర్భిణులు నమోదవుతున్నారు. ఇదే క్రమంలో నెలలో సరాసరి 300 పై చిలుకు మహిళలు ప్రసవిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో సగటున 50 మించి కాన్పులు కావడంలేదు. కేసీఆర్ కిట్ పథకం ప్రాభుత్వం ప్రారంభించక ముందు పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు నెలల్లో 246 కాన్పులు కాగా.. పథకం ప్రారంభించాక ఆరు నెలల్లో 240 కాన్పులు జరిగాయి. పరిగి లాంటి క్లస్టర్ స్థాయి ఆస్పత్రిలో మహిళా వైద్య నిపుణులు లేకపోవటం కూడా ప్రసవాల తగ్గుదలకు కారణమని స్పష్టమవుతోంది. మండల కేంద్రాల్లోని దవఖానాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ప్రతి సర్కారు డాక్టర్‌కు ప్రైవేటు క్లీనిక్ ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యుల్లో 90శాతానికి పైగా వారి సేవలను ప్రైవేటు ఆస్పత్రులకు అందిస్తున్నారు. ఇందులో కొందరు నర్సింగ్ హోంలు నిర్వహిస్తుండగా మరి కొందరు క్లీనిక్‌లు, వేరే ప్రైవేటు ఆస్పత్రులలో పనిచేయం సర్వసాధారణమైపోయింది. పరిగిలో ప్రధానంగా పది క్లీనిక్‌లు, నర్సింగ్ హోంలలో ఒకటి రెండు మినహా అన్నింటిలోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులే నిర్వహిస్తుండటం గమనార్హం. ఓ రకంగా చెప్పాలంటే గుర్తింపుకోసమే వారు ప్రభుత్వ ఆస్పత్రులలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం లక్షలు వెచ్చించి పంపిణీ చేస్తున్న వైద్య పరికరాలు సైతం చిన్నచిన్న కారణాలతో మూలకు పడేస్తున్నారు. పర్యవేక్షణ గాలికి.. ప్రభుత్వ ఆస్పత్రుల పర్యవేక్షణ పూర్తిగా గాలికొదిలేశారు. గతంలో క్లస్టర్ స్థాయిలో ఎస్పీహెచ్ఓ పేరుతో ప్రతి క్లస్టర్‌కు ఒక పర్యవేక్షణాధికారి ఉండేవారు. తెలంగాణా ప్రభుత్వం చిన్న జిల్లాలతో పాలన ప్రజలకు చేరువవుతుందంటూ ఊదరగొడుతూనే జిల్లాకో డీఎంఅండ్ హెచ్ఓను నియమించి క్లస్టర్ స్థాయి ఎస్పీ హెచ్ఓ పోస్టులకు ఉద్వాసాన పలికింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పర్యవేక్షణ కరువైంది. వైద్యులు, వైద్య సిబ్బందికి తమనడిగేవారెవరున్నారులే అని అడిందే ఆట పాడిందే పాటగా తయారయ్యింది. -
కేంద్రాస్పత్రిలో డిజిటల్ ఎక్సరే ఫిల్మ్‌ల కొరత..!
జిల్లాకే తలమానికమైన కేంద్రాస్పత్రికి రోగులు ఎక్స్‌రే కోసం వెళ్తే ముప్పతిప్పలు పడాల్సిందే...ఎక్స్‌రే తీసుకున్న మరుసటి రోజు దాని కోసం మళ్లీ వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో రోగులు ఎక్స్‌రే కోసం డబ్బులు మిగిలాయనుకుంటే తిరగడానికి చేతి చమురు వదులుతోందని ఆవేదన చెందుతున్నారు. – వేపాడ మండలానికి చెందిన సోములమ్మ కడుపు నొప్పితో ఈ నెల 9న కేంద్రాస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఎక్స్‌రే తీయించమని చీటి రాసి ఇచ్చారు. అది పట్టుకుని డిజిటల్ ఎక్స్‌రే విభాగానికి వెళ్లగా అక్కడ వారు ఎక్స్‌రే తీసారు. ఫిల్మ్ అడిగితే ఫిల్మ్‌లు లేవు. రిపోర్టు మరోసటి రోజు ఇస్తామని చెప్పారు. దీంతో గత్యంతరం లేక వేపాడ వెళ్లిపోయారు. – గంట్యాడ మండలానికి చెందిన సిహెచ్.ముత్యాలునాయుడు ట్రాక్టర్‌పై నుంచి పడిపోవడంతో కొద్ది రోజుల కిందట కేంద్రాస్పత్రిలో చూపించుకున్నాడు. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీసుకోమని చీటి రాసి ఇచ్చారు. అది పట్టుకుని వెళ్లగా అక్కడ సిబ్బంది ఎక్స్‌రే తీశారు. ఫిల్మ్ అడిగితే ఫిల్మ్‌లు లేవని చెప్పారు. రిపోర్టు కోసం మరుసటి రోజు రమ్మని చెప్పారు. విజయనగరం ఫోర్ట్: ఇది ఈ ఇద్దరి రోగుల పరిస్థితే కాదు. అనేక మంది రోగులు కేంద్రాస్పత్రిలో ఎదుర్కొంటున్న దుస్థితి. ఆస్పత్రిలో డిజిటల్ ఎక్స్‌రేలు తీస్తున్నామని అధికారులు గొప్పలు చెబుతున్నారు. వాటి ఫిల్మ్‌లు ఇవ్వకపోవడం వల్ల రోగులు రోజుల తరబడి రిపోర్టు కోసం తిరగాల్సిన పరిస్థితి. గత 15 రోజులుగా కేంద్రాస్పత్రిలో ఇదే పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజులో 40 నుంచి 50 మంది వరకు... జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వాస్పత్రి కావడంతో అధిక సంఖ్యలో కేంద్రాస్పత్రికి వస్తారు. రోజుకు సగటున 40 నుంచి 50 మంది వరకు డిజిటల్ ఎక్సరేలు కోసం వస్తారు. కొద్ది రోజులు కిందట వరకు డిజిటల్ ఎక్స్‌రే ఫిల్మ్‌లు రోగులకు ఇచ్చేవారు. దీంతో అవి పట్టుకుని వైద్యులకు చూపించేవారు. వచ్చిన రోజే రోగులకు ఊరట లభించేది. ఫిల్మ్‌లు అయిపోవడంతో అధికారులు తెప్పించకుండా నాన్చుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్‌లు ఇవ్వకపోవడం వల్ల రోగులు రిపోర్టు కోసం మరుసటి రావాల్సిన దుస్థితి. ఫిల్మ్‌లు ఇవ్వడం వల్ల ప్రభుత్వం టెలీ రేడియాలజికి చెల్లిస్తున్న డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అవస్థలు పడుతున్న రోగులు ఒక రోజు ఎక్స్‌రే తీసుకుంటే దాని రిపోర్టు కోసం మరుసటి రోజు రావాల్సిన దుస్థితి. దీని వల్ల రోగులకు ప్రయాణ చార్జీలు, భోజన వసతి కోసం చేతిచమురు వదలించుకోవాల్సిన దుస్థితి. అన్ని వసతులు ఉంటాయని జిల్లా నలుమూలాలు నుంచి రోగులు వస్తారు. సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వల్ల అవస్థలు పడుతున్నారు. డిజిటల్ ఫిల్మ్‌లు వచ్చాయి... ఎక్స్‌రే విభాగానికి ఎందుకు ఇవ్వడం లేదో కనుగొంటాం. ఫిల్మ్‌లు రోగులు చేతికి ఇవ్వకూడదు. వార్డు బాయ్‌లు పట్టుకుని వెళ్లి వైద్యునికి చూపించాలి. రోగులకు ఇవ్వకూడదని ఆదేశాలు వచ్చాయి. –కె. సీతారామరాజు, కేంద్రాస్పత్రి, సూపరింటెండెంట్ -
‘ఓపి’కుంటేనే వైద్యం!
ఇది హిందూపురం ప్రభుత్వాసుపత్రి. వైరల్ ఫీవర్‌తో పాటు డెంగీ లక్షణాలతో వందలాది రోగులు తరలిరావడంతో కిక్కిరిసింది. చిన్న పిల్లల వార్డులు మంచం దొరకడం గగనమైంది. ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురికి వైద్యం అందించాల్సి వచ్చింది. అదనంగా వచ్చే రోగులకు నేలపైనే చికిత్స చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరీక్షిస్తే తప్ప వైద్యులను చేరుకునే పరిస్థితి లేకపోవడంతో రోగులతో పాటు సహాయకులకు చుక్కలు కనిపించాయి. కూలైన్లో తోపులాట.. వాగ్వాదాలతో పాటు చిన్నారుల రోదన.. రోగుల అవస్థలతో ఆసుపత్రి ఆవరణ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఇక్కడ మొత్తం 19 మంది వైద్యులు అవసరం కాగా.. 13 మంది మాత్రమే ఉండటంతో రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. ఇకపోతే ఓపీ సమయం మధ్యాహ్నం 12 గంటలు కాగా.. వైద్యులు 2 గంటల వరకు పని చేస్తూ అందరికీ వైద్యం అందించారు. నియోజకవర్గ కేంద్రంలోని ఆసుపత్రిలో నెలకొన్న ఈ సమస్యను ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్దామని భావించే ప్రజలకు ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియక తమలో తామే కుమిలిపోతున్నారు. - హిందూపురం అర్బన్ ప్రతి రోజు ఓపీ – 2వేల మంది వైరల్ ఫీవర్స్ – 1,200 మంది డెంగీ లక్షణాలు – 150 కేసులు జ్వరాలు – 250 మంది గైనిక్ పరీక్షలు – 200 మంది గాయాలు – 100 కంటి, ఇతర పరీక్షలు–200 మంచాలు : 100 చేరికలు : 300 -
సర్వ‘జన’ దైన్యం!
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్య సేవలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. ప్రైవేట్‌కు వెళ్లే స్థోమత లేక ఇక్కడికొస్తే.. కనీస వైద్యం కూడా మృగ్యమవుతోంది. శనివారం చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. అనంతపురంలోని ఐదో రోడ్డుకు చెందిన అరుణ శుక్రవారం సాయంత్రం కడుపునొప్పి తాళలేక విష ద్రావకం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. శనివారం మధ్యాహ్నానికి ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగు పడడంతో ఏఎంసీ నుంచి ఫిమేల్ మెడిసిన్(ఎఫ్ఎం) వార్డుకు వెళ్లాలని సూచించారు. అప్పటికే అరుణకు సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్నారు. కనీసం వార్డుకు వెళ్లేందుకు స్ట్రెచర్, వీల్ చైర్ కానీ సమకూర్చలేదు. దీంతో తన సోదరిని వెంటబెట్టుకుని సెలైన్ బాటిల్‌ను చేతపట్టుకుని అడ్మిషన్ కౌంటర్ వరకు వెళ్లింది. అంతలో సెక్యూరిటీ సూపర్వైజర్ బాబా ఫరూక్ స్పందించి ఆమెను మళ్లీ క్యాజువాలిటీ వద్దకు చేర్చారు. ఆ తర్వాత స్ట్రెచర్‌ను ఏర్పాటు చేయించి వార్డుకు తీసుకెళ్లారు. వాస్తవానికి ఏఎంసీలో చికిత్స పొంది వార్డులకు తరలించే రోగులను ఎంఎన్ఓలు, ఎంఎన్ఓ అసిస్టెంట్లు తీసుకెళ్లాలి. అయితే సిబ్బంది కొరతను కారణంగా చూపుతుండటంతో రోగులకు నరకయాతన తప్పట్లేదు. -
పడకేసిన పాలన..!
- అభివృద్ధికి నోచుకోని ఆస్పత్రులు - నిధులున్నా ఖర్చు చేయని వైనం - వైద్యం అందక రోగుల ఇబ్బందులు సాక్షి, సిటీబ్యూరో: అవి ప్రత్యేక హోదా, గుర్తింపును సంతరించుకున్న చరిత్రాత్మకమైన ఆస్పత్రులు. ప్రస్తుతం మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆస్పత్రులను ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా.. సౌకర్యాల కొరత నేటికి వెంటాడుతోంది. ఖరీదైన కార్పొరేట్ వైద్యం సంగతేమో కానీ.. చికిత్స కోసం వచ్చిన వారికి కనీసం పడుకునేందుకు పడకలు దొరకని దుస్థితి. తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, ఛాతీ, మానసిక, ఈఎన్టీ, సరోజినిదేవి, ఎంఎన్‌జే క్యాన్సర్, ఫీవర్, ఆ స్పత్రుల బలోపేతానికి ఎన్నడూ లేని విధంగా రూ.5,20 కోట్లు కేటాయించింది. రోగులు నిష్పత్తికి తగినట్లుగా పడకల సామర్థ్యం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉస్మానియాలో నేలపైనే.. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని 1925లో ప్రారంభించారు. 1925-75 వరకు కేవలం 253 పడకలు ఉండగా, 1976లో 650కి పెంచారు. ప్రస్తుతం 1,168కి చేరుకుంది. అయితే ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 1500-2000 మంది రోగులు వస్తుంటారు. అత్యవసర విభాగానికి వంద నుంచి 150 కేసులు (రోడ్డు, అగ్ని, ఇతర ప్రమాదాలు, గుండె, మూత్రపిండాలు, ఇతర జబ్బులు) వస్తుంటాయి. వీరందరికి సరిపడా మంచాలు ఆస్పత్రిలో లేవు. దీంతో రోగులను నేలపై పడుకోబెట్టి వైద్యం చేయాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చిన వారికి వెంటిలేటర్లే కాదు.. కనీసం పడకలు దొరకని దుస్థితి నెలకొంది. ఇన్ఫెక్షన్తో శిశువులు మృతి.. నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రికి ప్రతి రోజూ 800-1200 మంది వస్తుంటారు. ఇక్కడ నిత్యం వెయ్యి మంది చికిత్సలు అందజేస్తున్నారు. వీరిలో అప్పుడే పుట్టిన పిల్లలే 200కు పైగా ఉంటారు. రోగుల నిష్పత్తికి తగ్గట్లు మంచాలు ఏర్పాటు చేయక పోవడంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరు నుంచి ముగ్గురిని పడుకోబెడుతున్నారు. ఆస్పత్రిలో రోజుకు ఐదు నుంచి ఏడుగురు చనిపోతుండగా..అందులో ఇద్దరు శిశువులు కేవలం ఇన్ఫెక్షన్ వల్లే మృతిచెందుతున్నట్లు స్వయంగా వైద్యులే అంగీకరిస్తున్నారు. గర్భిణులకు తప్పని ప్రసవ వేదన.. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఓపీకి ప్రతి రోజూ సుమారు 500 మంది గర్భిణులు వస్తుంటారు. ఇక్కడ ప్రతి నెలా 800కు పైగా ప్రసవాలు జరుగుతుంటాయి. పడకలు లేక పోవడంతో ఒకే మంచంపై ఇద్దరు గర్భిణులకు వసతి కల్పిస్తున్నారు. దీంతో వారు ఇబ్బందికి గురవుతున్నారు. -
దవాఖానాలో దాహం
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తాగునీటి సౌకర్యం లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరమ్మతులు చేయాలని ఆస్పత్రి అధికారులు కోరుతున్నా ఇంజినీరింగ్ అధికారులు స్పందించడం లేదు. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు ఆస్పత్రిలోనే ఉండాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆదేశించినా ఫలితం లేకుండా పోతోంది. ఎండలు మండిపోతున్న త రుణంలో రోగులు, వారి సహాయకులు గుక్కె డు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. ఏడాదిగా ఇదే పరిస్థితి మెడికల్ కళాశాల ఏర్పాటు తరువాత జిల్లా ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా మారుస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఏడంతస్తుల అధునాతన భవనంలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను విడుదల చేసింది. కొత్త ఆస్పత్రి కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి పనుల కు అనుమతులు ఇచ్చారు. కానీ ఇక్కడి అధికారులు మాత్రం నామమాత్రపు ప నులు చేసి చేతులు దులుపుకున్నారు. ప్ర స్తుతం ఇక్కడ తాగునీటి సౌకర్యం లేదు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలకు నీటిని అం దించేందుకు 12 నీటి బోరు ఉండాలి. కానీ, రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా రోగులకు నీటిని అందించే వీలులేకుండా ఉన్నాయి. అన్ని విభాగాల లో నల్లాలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ప్రారంభ సమయంలో నే కొన్ని చోట్ల నల్లాలు చోరీకి గురయ్యూరుు. పైపులనూ ఎత్తు కెళ్లారు. వాటిని మరమ్మత్తు చేసి వినియోగం లోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీం తో రోగులు బయట నీళ్లు కొనుగోలు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఎక్కడ? ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నా, అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రతి అంతస్తులో చాలాన్గేటు ఏర్పాటు చేయూలి. ఇది కూడా అ తీగతీ లేదు. 76 ఏసీలు ఉంటే 9 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. వీటిని మరమ్మత్తులు చేయించాలని అధికారులు కోరుతున్నా ఇంజినీరింగ్ విభాగం పట్టించుకోవడ ం లేదు. అత్యవసర విభాగంలో గదులను విస్తరించాల్సి ఉంది. రెండు సింకులు ఏర్పాటు చేయూలి. మొదటి అంతస్తు నుండి ఏడవ అంతస్తు వరకు వివిధ విభాగాలను గుర్తించేందుకు ప్రతి గదికి నంబర్ వేయూలి. భవనం అప్పగించే ముందు ఇంజినీరింగ్ అధికారులే నంబరింగ్ వేయూలి. పట్టించుకునే నాథు డు లేడు. ప్రవేశమార్గం, అ త్యవసర విభాగం వద్ద ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పేరిట నేమ్‌బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించినా మార్పులేదు. డ్రెరుునేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం తో మార్పులు చేయూలని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన అనుమతించినా పనులకు మోక్షం లేదు. నీటిపైపులు, టాయిలెట్ పైపులు పగిలి మురికినీరు ప్రవహిస్తోంది. రూ.12 కోట్ల రూపాయలు మరమ్మత్తుల కోసం ఖర్చు చేస్తున్నామని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.పనులు మాత్రం జరుగ డం లేదు. ఆపరేషన్ గదులలో ఏసీలు పని చేయడం లేదు. ఆస్పత్రి ముందు భాగంలో గార్డెన్ ఏర్పాటు చేయాలని భవన నిర్మాణంలోనే అధికారులు ప్రణాళికలో చేర్చా రు. ఏడాది గడుస్తున్నా దాని జాడ లేదు. -
ఖర్మాసుపత్రులు
కాకినాడ క్రైం :ఏ చిన్న జ్వరమొచ్చినా, ఇతర అనారోగ్యం వచ్చినా అందుబాటులో ధర్మాసుపత్రికి వెళ్లారో.. అంతే సంగతులు. అరకొర వసతులు, అందుబాటులో లేని మందులు, చాలీచాలని సిబ్బందితో అవి స్వాగతం పలుకుతున్నాయి. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో విఫలమై అవి కాస్తా ఖర్మాసుపత్రులుగా మారిపోతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), అర్బన్ హెల్త్ సెంటర్ల(యూహెచ్‌సీ)పై సోమవారం చేసిన ‘సాక్షి విజిట్’లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. చాలా పీహెచ్‌సీల్లో గర్భిణులకు వైద్య పరీక్షలు చేసేందుకు కనీసం ల్యాబ్ కూడా లేదు. దీంతో స్థానికంగా ఉండే ప్రైవేటు ల్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. రెక్కాడితేనే కానీ డొక్కాడని చాలా కుటుంబాలవారు తమ ఇంట్లోని గర్భిణులకు ప్రైవేటుగా వైద్య పరీక్షలు చేయించే స్తోమత లేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రాణాల మీదకు వస్తే అప్పటికప్పుడు సుదూర ప్రాంతాల్లోని కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రులకు తరలిస్తున్నారు.పట్టణాలు, నగరాల్లోని యూహెచ్‌సీల్లో సైతం గర్భిణులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. ఈ కేంర్రాల్లో గర్భిణులను పరీక్షించి రిఫరల్ యూనిట్లకు పంపిస్తారు. అక్కడ కూడా సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో సుమారు 53 లక్షల జనాభా ఉంది. ప్రతి 15 వేల నుంచి 20 వేల జనాభాకు ఒక పీహెచ్సీ లేదా యూహెచ్‌సీ ఏర్పాటు చేశారు. కాకినాడ బోధనాస్పత్రి, రాజమండ్రి జిల్లా ఆస్పత్రితోపాటు ఏడు ఏరియా ఆస్పత్రులు, 23 కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెంటర్లు (సీహెచ్ఎన్సీ), 109 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 20 యూహెచ్‌సీలు, 809 సబ్ సెంటర్లు ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో నాలుగు విలీన మండలాల్లోని 8 పీహెచ్‌సీలు, 2 సీహెచ్‌సీలు, 2 క్లస్టర్లు జిల్లా పరిధిలోకి వచ్చాయి. పీహెచ్‌సీల్లో సుమారు 170 వైద్యాధికారుల పోస్టులుండగా వీటిలో 19 పోస్టులు ఖాళీగాా ఉన్నాయి. ప్రధానంగా గైనిక్, పీడియాట్రిక్ వైద్యులు అందుబాటులో లేరు. ఫలితంగా మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులే పేర్కొంటున్నారు. పీహెచ్‌సీలకు సొంత భవనాలున్నా వాటిలో కొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడం విచిత్రం.ఇక 809 సబ్ సెంటర్లకుగాను 667 అద్దె కొంపల్లోనే కొనసాగుతున్నాయి. కొన్ని పీహెచ్సీ, యూహెచ్‌సీల్లో మందులు, వ్యాక్సిన్లు, బీపీ మెషీన్లు, కంప్యూటర్లు అందుబాటులో లేవు. యూహెచ్సీల్లోని వైద్యాధికారులకు, సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు సక్రమంగా అందడంలేదు. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి అప్రమత్తం చేయడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇక్కట్లు పడుతున్నారు.జిల్లా కేంద్రం కాకినాడలో కూడా పరిస్థితి పెద్ద గొప్పగా లేదు. కాకినాడ రేచర్లపేట యూహెచ్‌సీలో గతంలో ప్రసూతి కేంద్రం ఉండేది. నాలుగేళ్ల కిందట దీనిని తీసివేశారు. వేల మంది నివసించే ఈ ప్రాంతంలో ప్రసూతి కేంద్రం లేకపోవడంతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం పీహెచ్‌సీలు, యూహెచ్‌సీల్లో సమస్యలపై అధ్యయనం చేసి, క్షేత్రస్థాయిలోనే వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాం. మౌలిక వసతుల కల్పనపై కూడా దృష్టి సారిస్తాం. అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతాం. సబ్ సెంటర్లకు భవనాలు సమకూర్చాల్సిందిగా ప్రభుత్వానికి నివేదించాం. 2014-15లో 98, 2015-16లో 108, 2016-17లో 128 సబ్ సెంటర్లకు భవనాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం. మిగిలిన సమస్యలపై కూడా ప్రత్యేక చర్యలు చేపడతాం. - డాక్టర్ ఎం.సావిత్రమ్మ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి