సర్వ‘జన’ దైన్యం!
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్య సేవలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. ప్రైవేట్‌కు వెళ్లే స్థోమత లేక ఇక్కడికొస్తే.. కనీస వైద్యం కూడా మృగ్యమవుతోంది. శనివారం చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. అనంతపురంలోని ఐదో రోడ్డుకు చెందిన అరుణ శుక్రవారం సాయంత్రం కడుపునొప్పి తాళలేక విష ద్రావకం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. శనివారం మధ్యాహ్నానికి ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగు పడడంతో ఏఎంసీ నుంచి ఫిమేల్ మెడిసిన్(ఎఫ్‌ఎం) వార్డుకు వెళ్లాలని సూచించారు. అప్పటికే అరుణకు సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్నారు. కనీసం వార్డుకు వెళ్లేందుకు స్ట్రెచర్, వీల్ చైర్ కానీ సమకూర్చలేదు.
దీంతో తన సోదరిని వెంటబెట్టుకుని సెలైన్ బాటిల్‌ను చేతపట్టుకుని అడ్మిషన్ కౌంటర్ వరకు వెళ్లింది. అంతలో సెక్యూరిటీ సూపర్‌వైజర్ బాబా ఫరూక్ స్పందించి ఆమెను మళ్లీ క్యాజువాలిటీ వద్దకు చేర్చారు. ఆ తర్వాత స్ట్రెచర్‌ను ఏర్పాటు చేయించి వార్డుకు తీసుకెళ్లారు. వాస్తవానికి ఏఎంసీలో చికిత్స పొంది వార్డులకు తరలించే రోగులను ఎంఎన్‌ఓలు, ఎంఎన్‌ఓ అసిస్టెంట్లు తీసుకెళ్లాలి. అయితే సిబ్బంది కొరతను కారణంగా చూపుతుండటంతో రోగులకు నరకయాతన తప్పట్లేదు.