‘ఓపి’కుంటేనే వైద్యం!
ఇది హిందూపురం ప్రభుత్వాసుపత్రి. వైరల్ ఫీవర్‌తో పాటు డెంగీ లక్షణాలతో వందలాది రోగులు తరలిరావడంతో కిక్కిరిసింది. చిన్న పిల్లల వార్డులు మంచం దొరకడం గగనమైంది. ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురికి వైద్యం అందించాల్సి వచ్చింది. అదనంగా వచ్చే రోగులకు నేలపైనే చికిత్స చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరీక్షిస్తే తప్ప వైద్యులను చేరుకునే పరిస్థితి లేకపోవడంతో రోగులతో పాటు సహాయకులకు చుక్కలు కనిపించాయి. కూలైన్లో తోపులాట.. వాగ్వాదాలతో పాటు చిన్నారుల రోదన.. రోగుల అవస్థలతో ఆసుపత్రి ఆవరణ యుద్ధ వాతావరణాన్ని తలపించింది.
ఇక్కడ మొత్తం 19 మంది వైద్యులు అవసరం కాగా.. 13 మంది మాత్రమే ఉండటంతో రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. ఇకపోతే ఓపీ సమయం మధ్యాహ్నం 12 గంటలు కాగా.. వైద్యులు 2 గంటల వరకు పని చేస్తూ అందరికీ వైద్యం అందించారు. నియోజకవర్గ కేంద్రంలోని ఆసుపత్రిలో నెలకొన్న ఈ సమస్యను ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్దామని భావించే ప్రజలకు ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియక తమలో తామే కుమిలిపోతున్నారు.
- హిందూపురం అర్బన్
ప్రతి రోజు ఓపీ – 2వేల మంది
వైరల్ ఫీవర్స్ – 1,200 మంది
డెంగీ లక్షణాలు – 150 కేసులు
జ్వరాలు – 250 మంది
గైనిక్ పరీక్షలు – 200 మంది
గాయాలు – 100
కంటి, ఇతర పరీక్షలు–200
మంచాలు : 100
చేరికలు : 300