ఆస్పత్రిలో క్యూలో వేచి ఉన్న ఔట్ పేషెంట్లు
ఖమ్మంవైద్యవిభాగం: ఆరోగ్యం బాగోలేక పరీక్షలు చేయించుకునేందుకు పెద్దాస్పత్రికి వస్తే అవస్థలే ఎదురవుతున్నాయి. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ నిర్ణయాలతో రోగులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ముందస్తు సమాచారం, ప్రచారం లేకుండా రోగులకు ఆధార్, సెల్ నంబర్ తప్పనిసరి చేయడంతో ఉరుకులు పరుగులు తీయాల్సి వస్తోంది. ఔట్ పేషెంట్(ఓపీ) చిట్టీ రాసే సమయానికి ఆస్పత్రి సిబ్బంది ఇలాంటి నిబంధనలు పెట్టడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు రోగులు వెనుదిరుగుతుండగా.. మరికొందరు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం నుంచి కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చారు. ఔట్ పేషెంట్ రోగులు చిట్టీ రాయించుకోవాలంటే ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరి కావాలని చెప్పడంతో అయోమయానికి గురయ్యారు. ఇప్పటికిప్పుడు ఆధార్ నంబర్ ఎలా తీసుకొస్తామని చాలా మంది రోగులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలమైన తాము ఉచితంగా ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించుకోవచ్చని ఇక్కడకు వస్తే కొత్త నిబంధనలు పెట్టి తమను ఇబ్బందులుపాలు చేయడం ఏమిటని పలువురు రోగులు అసహనం వ్యక్తం చేశారు.
సేవలు పెంచినా.. నిబంధనలు అడ్డు
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కొన్నాళ్లుగా వైద్య సేవలు విస్తృతమయ్యాయి. అప్పట్లో నామమాత్రంగా సేవలు అందగా.. ప్రస్తుతం ఇతర జిల్లాల నుంచి కూడా రోగులు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా సరిహద్దు జిల్లాలు సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాల నుంచి కూడా రోగుల తాకిడి ఎక్కువైంది. ప్రతీ రోజు 1,200 నుంచి 1,500 మంది రోగులు వైద్య సేవలు పొందేందుకు పెద్దాస్పత్రికి వస్తున్నారు.
గతంలో 250 పడకల ఆస్పత్రి ఉండగా.. ఇప్పుడు 400 పడకలకు చేరింది. పెద్దాస్పత్రిలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం ద్వారా ప్రసవాలు పెరిగాయి. దీంతో సాధారణ రోగులే కాకుండా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సేవలు మరింత విస్తృతమయ్యాయి. అయితే ప్రభుత్వం సేవలు పెంచినా.. రోగుల తాకిడి ఎక్కువవుతున్న సందర్భంలో ఆధార్, సెల్ నంబర్ వంటి నిబంధనలు పెట్టడంతో సేవలకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా ఆధార్, సెల్ నంబర్ నమోదు చేయాలని కొర్రీ పెడుతుండడంతో చాలా మంది రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా పెద్దాస్పత్రికి వచ్చే రోగులు చాలా మంది నిరుపేదలు, వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండడంతో వారికి ఏం చేయాలో పాలుపోక వెనుదిరగాల్సి వస్తోంది. పీహెచ్‌సీల స్థాయి నుంచి ముందస్తుగా ప్రజల్లో అవగాహన కల్పించి.. ఆ తర్వాత ఇటువంటి నిబంధనలు తెస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని పలువురు ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు.
ఉద్యోగులకు ‘కొత్త’ ఇక్కట్లు
రాష్ట్ర ప్రభుత్వం రోగులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు ఆధార్, సెల్ నంబర్ నమోదు చేయాలనే నిబంధనలు విధించింది. ఓపీ, ఐపీ సేవలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా సేవలపై రోగులను నేరుగా సంప్రదించే అవకాశం ఉంటుంది. దీంతో సేవలు మరింత మెరుగుపడి ప్రజలకు మేలు జరుగుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎలాంటి ప్రచారం లేకుండా నిబంధనలు తేవడం మంచిది కాదని పలువురు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి నెల 40వేల మందికి పైగా రోగులు వైద్య సేవలు పొందుతున్నారు.
అయితే ఇప్పటివరకు రోగి పేరు, వయసు నమోదు చేసి ఓపీ చిట్టీ రాసే వారు. అలా చేయడం వల్ల ఉద్యోగులకు, రోగులకు ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు. కానీ.. కొత్త నిబంధనలతో ఓపీ రాసే ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో రోగి వివరాలు నమోదు చేసేందుకు సమయం పడుతుండడంతో వారిపై పని ఒత్తిడి ఎక్కువైంది. దీనికి తోడు ఒక్కో రోగి నమోదుకు సమయం తీసుకుంటుండడంతో క్యూలో రోగులు గంటలతరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
మధ్యాహ్నం వరకు రోగులు లైన్లో అవస్థలు పడ్డారు. ఓపీ రాయించుకున్నా.. చాలా మంది రోగులు వైద్యులు లేక వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటికే సమయం అయిపోవడంతో డాక్టర్లు డ్యూటీలు పూర్తి చేసుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో రోగులు మరింత ఇబ్బందిపడ్డారు. ఈ పరిస్థితి ప్రతి రోజు ఉండే అవకాశం ఉండడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉండే పరిస్థితి ఉంది. ముందుగా సిబ్బందిని పెంచి ఇటువంటి నిబంధన తీసుకొస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తేవి కావని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment