ఖర్మాసుపత్రులు
కాకినాడ క్రైం :ఏ చిన్న జ్వరమొచ్చినా, ఇతర అనారోగ్యం వచ్చినా అందుబాటులో ధర్మాసుపత్రికి వెళ్లారో.. అంతే సంగతులు. అరకొర వసతులు, అందుబాటులో లేని మందులు, చాలీచాలని సిబ్బందితో అవి స్వాగతం పలుకుతున్నాయి. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో విఫలమై అవి కాస్తా ఖర్మాసుపత్రులుగా మారిపోతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ), అర్బన్ హెల్త్ సెంటర్ల(యూహెచ్‌సీ)పై సోమవారం చేసిన ‘సాక్షి విజిట్’లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
చాలా పీహెచ్‌సీల్లో గర్భిణులకు వైద్య పరీక్షలు చేసేందుకు కనీసం ల్యాబ్ కూడా లేదు. దీంతో స్థానికంగా ఉండే ప్రైవేటు ల్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. రెక్కాడితేనే కానీ డొక్కాడని చాలా కుటుంబాలవారు తమ ఇంట్లోని గర్భిణులకు ప్రైవేటుగా వైద్య పరీక్షలు చేయించే స్తోమత లేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రాణాల మీదకు వస్తే అప్పటికప్పుడు సుదూర ప్రాంతాల్లోని కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రులకు తరలిస్తున్నారు.పట్టణాలు, నగరాల్లోని యూహెచ్‌సీల్లో సైతం గర్భిణులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. ఈ కేంర్రాల్లో గర్భిణులను పరీక్షించి రిఫరల్ యూనిట్లకు పంపిస్తారు. అక్కడ కూడా సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో సుమారు 53 లక్షల జనాభా ఉంది. ప్రతి 15 వేల నుంచి 20 వేల జనాభాకు ఒక పీహెచ్‌సీ లేదా యూహెచ్‌సీ ఏర్పాటు చేశారు. కాకినాడ బోధనాస్పత్రి, రాజమండ్రి జిల్లా ఆస్పత్రితోపాటు ఏడు ఏరియా ఆస్పత్రులు, 23 కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెంటర్లు (సీహెచ్‌ఎన్‌సీ), 109 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 20 యూహెచ్‌సీలు, 809 సబ్ సెంటర్లు ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో నాలుగు విలీన మండలాల్లోని 8 పీహెచ్‌సీలు, 2 సీహెచ్‌సీలు, 2 క్లస్టర్లు జిల్లా పరిధిలోకి వచ్చాయి. పీహెచ్‌సీల్లో సుమారు 170 వైద్యాధికారుల పోస్టులుండగా వీటిలో 19 పోస్టులు ఖాళీగాా ఉన్నాయి. ప్రధానంగా గైనిక్, పీడియాట్రిక్ వైద్యులు అందుబాటులో లేరు. ఫలితంగా మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులే పేర్కొంటున్నారు.
పీహెచ్‌సీలకు సొంత భవనాలున్నా వాటిలో కొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడం విచిత్రం.ఇక 809 సబ్ సెంటర్లకుగాను 667 అద్దె కొంపల్లోనే కొనసాగుతున్నాయి. కొన్ని పీహెచ్‌సీ, యూహెచ్‌సీల్లో మందులు, వ్యాక్సిన్లు, బీపీ మెషీన్లు, కంప్యూటర్లు అందుబాటులో లేవు. యూహెచ్‌సీల్లోని వైద్యాధికారులకు, సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు సక్రమంగా అందడంలేదు. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి అప్రమత్తం చేయడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఇక్కట్లు పడుతున్నారు.జిల్లా కేంద్రం కాకినాడలో కూడా పరిస్థితి పెద్ద గొప్పగా లేదు. కాకినాడ రేచర్లపేట యూహెచ్‌సీలో గతంలో ప్రసూతి కేంద్రం ఉండేది. నాలుగేళ్ల కిందట దీనిని తీసివేశారు. వేల మంది నివసించే ఈ ప్రాంతంలో ప్రసూతి కేంద్రం లేకపోవడంతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం
పీహెచ్‌సీలు, యూహెచ్‌సీల్లో సమస్యలపై అధ్యయనం చేసి, క్షేత్రస్థాయిలోనే వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాం. మౌలిక వసతుల కల్పనపై కూడా దృష్టి సారిస్తాం. అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతాం. సబ్ సెంటర్లకు భవనాలు సమకూర్చాల్సిందిగా ప్రభుత్వానికి నివేదించాం. 2014-15లో 98, 2015-16లో 108, 2016-17లో 128 సబ్ సెంటర్లకు భవనాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం. మిగిలిన సమస్యలపై కూడా ప్రత్యేక చర్యలు చేపడతాం.
- డాక్టర్ ఎం.సావిత్రమ్మ,
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి