Primary Health Centres
-
ప్రజారోగ్య సంచాలకుల విభాగం రద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత కీలకమైన ప్రజారోగ్య సంచాలకుల (డీపీహెచ్) విభాగాన్ని రద్దు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఆ విభాగాన్ని వైద్య విధాన పరిషత్‌లో కలిపి కొత్తగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. డీపీహెచ్ రద్దయితే డైరెక్టర్ పోస్టు కూడా రద్దవుతుంది. కొత్తగా ఏర్పాటు చేసే డైరెక్టరేట్‌కు ఒక కమిషనర్‌ను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ప్రస్తుతం డీహెచ్గా ఉన్న డాక్టర్ రవీందర్‌నాయక్ పోస్టు పోతుందని అంటున్నారు. పీహెచ్‌సీలు మొదలు జిల్లా ఆసుపత్రుల దాకా ఒకే విభాగం పర్యవేక్షణలోకి... ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖలో ప్రజారోగ్య సంచాలకుల విభాగం, వైద్య విధాన పరిషత్, వైద్యవిద్య సంచాలకుల (డీఎంఈ) విభాగం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ఉన్నాయి. డీపీహెచ్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ)లు ఉన్నాయి. అంటే ప్రాథమిక ఆరోగ్య వైద్య సేవలన్నీ ఆ విభాగం పరిధిలోనే జరుగుతాయి. అలాగే వైద్యవిధాన పరిషత్ పరిధిలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు ఉండగా మెడికల్ కాలేజీలు డీఎంఈ పరిధిలో ఉన్నాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో సబ్ సెంటర్లు, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్హెచ్ఎం కింద చేపట్టే ప్రత్యేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేస్తే పీహెచ్సీ నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు దాని పరిధిలోకి వస్తాయి. ఇలా అవన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. మిగిలిన విభాగాలు యథావిధిగా కార్యకలాపాలు సాగిస్తాయని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇక వైద్య విధాన పరిషత్‌లోని ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వడం ద్వారా వారికి అన్ని వసతులను ప్రభుత్వం కల్పించనుంది. వైద్య వ్యవస్థలకు జిల్లా బాస్ ఎవరు? ఈ నాలుగు విభాగాలకు కలిపి జిల్లా స్థాయిలో ఒక బాస్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఉదాహరణకు మెడికల్ కాలేజీల్లో ఏదైనా సమస్య తలెత్తితే ప్రిన్సిపాల్ చూస్తారు. మరి అన్ని మెడికల్ కాలేజీల్లో సమస్య తలెత్తితే జిల్లా స్థాయిలో దాన్ని పరిష్కరించే నాథుడే లేడు. రాష్ట్ర స్థాయిలో ఉండే డీఎంఈనే సమస్యను పరిష్కరించాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి మిగిలిన విభాగాల్లోనూ నెలకొంది. పేరుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారే (డీఎంహెచ్‌వో) అయినా కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే పరిమితమయ్యారు. ఇతర విభాగాల ఉద్యోగుల సమస్యలు వినే పరిస్థితి లేదు. ఇలా జిల్లాస్థాయి వైద్య విభాగాలను పర్యవేక్షించే వ్యవస్థ లేదు. అన్ని వైద్య విభాగాలకు కలిపి ఒక అధిపతి లేరు. ఈ పరిస్థితిని కూడా మార్చాలని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. రాష్ట్రస్థాయిలో ఆ శాఖ కార్యదర్శి బాస్‌గా ఉన్నా కింది స్థాయిలో మాత్రం ప్రత్యేక వ్యవస్థ లేదన్న చర్చ జరుగుతోంది. -
ఒక్కో పోస్టుకు 15 మంది పోటీ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్) పోస్టులకు డిమాండ్ నెలకొంది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 250 సీఏఎస్ వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో 3,906 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రాథమిక మెరిట్ జాబితాను ఇప్పటికే రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. బుధవారంతో ప్రాథమిక మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియనుంది. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను ప్రకటించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇన్–సర్వీస్ కోటాలో 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ చదివేందుకు వెళ్లే వైద్యుల స్థానాలను భర్తీ చేయడం కోసం ప్రభుత్వం పోస్టుల భర్తీ చేపడుతోంది. ఖాళీ అయ్యే పోస్టులను అంచనా వేసి వైద్యులు రిలీవ్ అయి వెళ్లే సమయానికి కొత్తవారిని అందుబాటులోకి తెచ్చి ఫ్యామిలీ డాక్టర్, ఇతర పీహెచ్సీ సేవలకు అంతరాయం కలగకుండా ముందు చూపుతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టింది. -
వైద్యం.. కొత్త ముఖచిత్రం... నాలుగేళ్లలో విప్లవాత్మక సంస్కరణలు
మన బంధువులు, మిత్రులు, తెలిసిన వారెవరైనా మనకు తారసపడినప్పుడో లేక ఫోన్ చేసినప్పుడో వినిపించే తొలి పదం ‘బాగున్నారా..’ అని. ఆ తర్వాతే మిగతా విషయాలు. అంటే ఆరోగ్యంగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష. అప్పుడే అన్ని పనులను సవ్యంగా చేసుకోగలమని.. దేన్నయినా సాధించుకోగలమనే నమ్మకం ఉంటుంది. దైనందిన జీవితంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేని విధంగా, దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే గొప్పగా వైద్య, ఆరోగ్య రంగంపై శ్రద్ధ చూపుతోంది. అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బంది, కొత్త వైద్య.. నర్సింగ్ కళాశాలల ఏర్పాటు, నాడు–నేడు కింద మౌలిక వసతుల కల్పన, కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యాలు కల్పిస్తోంది. మన ఇంట్లో వారికే బాగోలేకపోతే ఎలాంటి వైద్యం కోరుకుంటామో అచ్చంగా అలాంటి వైద్యాన్నే ప్రజల ముంగిటకు తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలన్నీ శభాష్.. అనేలా విప్లవాత్మక సంస్కరణలతో ఈ రంగం ముఖ చిత్రాన్నే మార్చివేసింది. అనంతపురం జిల్లా మండల కేంద్రమైన కంబదూరుకు చెందిన నాగమణెమ్మ ఎనిమిదేళ్ల క్రితం నరాల బలహీనత వ్యాధికి గురై మంచానికే పరిమితమైంది. భర్త గంగన్న, కొడుకు, కూతురు ఆమె బాగోగులు చూస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా ప్రస్తుతం నాగమణెమ్మ ఇంటి వద్దకు నెలలో రెండు సార్లు పీహెచ్సీ వైద్యుడు వస్తున్నాడు. ఆమెకు బీపీ చూసి, ఆరోగ్యంపై వాకబు చేస్తున్నాడు. ఒకప్పుడు ఆసుపత్రికి పోవాలంటే ఆటో బాడుగకు తీసుకుని, ఇంట్లో వాళ్లు కష్టపడి తీసుకెళ్లేవాళ్లు. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు వ్యయ ప్రయాసలు తగ్గాయి. గతంలో వీలును బట్టి ఏదో ఒక ఆస్పత్రికి తీసుకెళ్లేవాళ్లు. ఒక్కోసారి ఒక్కో వైద్యుడి వద్దకు వెళ్లడంతో ఆమె ఆరోగ్య చరిత్రపై వారికి అవగాహన లేక మందులు, వైద్యం విషయంలో కొంత గందరగోళం ఉండేది. ఇప్పుడు ఒకే వైద్యుడు క్రమం తప్పకుండా నాగమణెమ్మకు వైద్యం అందిస్తుండటంతో ఆ ఇబ్బందులేవీ లేవు. ప్రస్తుతం ఇలా ఊరూరా వైద్య సేవలందించేలా ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కల్పించడానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. సాక్షి, అమరావతి : ప్రస్తుతం చిన్న చిన్న జబ్బులకు పీహెచ్సీ, సీహెచ్‌సీ, పెద్దాస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా.. గ్రామాల్లోనే వైద్య సేవలు అందుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇద్దరు వైద్యులు రోజు మార్చి రోజు తమకు కేటాయించిన విలేజ్ క్లినిక్స్‌కు 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు చూశాక, మధ్యాహ్నం నుంచి మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ రోగుల గృహాలను సందర్శించి వారికి ఇంటి వద్దే వైద్యం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఈ విధానంలో రాష్ట్రంలోని 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను నెలలో రెండు సార్లు పీహెచ్సీ వైద్యులు సందర్శిస్తున్నారు. ప్రతి విలేజ్ క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. టెలిమెడిసన్ కన్సల్టేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటోంది. ఏ రోగికైనా మెరుగైన వైద్యం అవసరం అని భావిస్తే.. ఇక్కడి నుంచే పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తారు. ఆ రోగిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి తరలించడం, అక్కడ అతనికి వైద్యం అందేలా చూడటం వంటి కార్యకలాపాలను సీహెచ్‌వో, ఏఎన్ఎం చూస్తారు. వీరు విలేజ్ ఆరోగ్య మిత్రగా వ్యవహరిస్తారు. 1.17 కోట్ల వైద్య సేవలు ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్‌ను గత ఏడాదిలో ప్రారంభించి.. ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీన పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చారు. 10,032 విలేజ్ క్లినిక్‌లను వైద్యులు 1.14 లక్షల సార్లు సందర్శించారు. ఈ క్రమంలో 1,17,08,895 వైద్య సేవలు అందించారు. నాడు–నేడుతో మహర్దశ ఇది 2019కు ముందు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్సీ. నెర్రెలు చీలిన ప్రహరీ.. పిచ్చి మొక్కలు, గడ్డితో కూడిన ఆవరణ.. అపరిశుభ్ర వాతావరణం, కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్లు లేని దుస్థితి. ఇక్కడికి రావాలంటేనే రోగులు వణికిపోయేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఆస్పత్రిలో నాడు–నేడు కింద పనులు చేపట్టింది. కుర్చీలు, ఓపీ గదులు, 10 పడకలతో ఇన్ పేషెంట్ వార్డు, కాన్పుల గది ఇలా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. చూపించుకోవడానికి జనం క్యూ కడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి, వాటికి శాశ్వత భవనాలు సమకూర్చే దిశగా అడుగులు వేశారు. 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే సొంత భవనాలు ఉన్న వాటికి మరమ్మతులు చేయడంతో పాటు, పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తుండగా 882 చోట్ల పనులు పూర్తయి అధునాతనంగా ఆస్పత్రులు తయారయ్యాయి. 121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. రూ.50 కోట్లతో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ వైద్యులు, సిబ్బందిని నియమించారు. ప్రభుత్వ కృషి ఫలితంగా 443 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్‌క్వాష్) గుర్తింపుతో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. గుజరాత్, కేరళ, హరియాణా, తెలంగాణలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నాణ్యమైన ప్రసూతి సేవలకు గాను ఇచ్చే ‘లక్ష్య’ గుర్తింపులో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ ఉంది. వైద్య విద్యలో నవశకం రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటికే నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలకు అనుమతులు వచ్చాయి. రాజమండ్రి వైద్య కళాశాలకు త్వరలో అనుమతి రానుంది. ఫలితంగా ఒక్కో చోట 150 సీట్లు చొప్పున 750 సీట్లు పెరగనున్నాయి. 2024–25లో పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు.. ఆ తర్వాతి ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా భవిష్యత్‌లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతకు తావుండదు. ప్రజలకు ఆరోగ్యశ్రీ రక్ష సీఎం జగన్.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేశారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తేవడం ద్వారా 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో కేవలం 1059 ప్రొసీజర్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 3,255కు పెంచారు. పేద, మధ్యతరగతి ప్రజలు శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంత సమయంలో ఇబ్బందులు లేకుండా ఆరోగ్య ఆసరా పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. దీని కింద 1519 రకాల ప్రొసీజర్లలో చికిత్స అనంతరం వైద్యుడు సూచించిన విశ్రాంతి సమయానికి రోజు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.ఐదు వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా 36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి పొందారు. ఇంకా ఎన్నెన్నో సేవలు ► 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ), 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వం బలోపేతం చేసింది. ప్రతి మండలానికి ఒక్కొక్కటి చొప్పున 104, 108 వాహనాలను సమకూర్చారు. 768 అంబులెన్స్‌లతో 2020లో సేవలను విస్తరించారు. తాజాగా మరో 146 అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. రోజుకు సగటున 3300 మంది అంబులెన్స్ సేవలను ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు. 104 ఎంఎంయూలను ప్రారంభంలో మండలానికి ఒకటి చొప్పున 676 వాహనాలను సమకూర్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి సచివాలయాన్ని రెండు సార్లు నెలలో 104 ఎంఎంయూలు సందర్శించేలా మరో 256 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ► గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించారు. రోజుకు సగటున 631 మంది బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. ► డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా విలేజ్ క్లినిక్స్‌లో 105, పీహెచ్‌సీల్లో 172, సీహెచ్‌సీ ఏరియా ఆస్పత్రుల్లో 330 రకాల మందులను సమకూరుస్తున్నారు. బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను సరఫరా చేస్తున్నారు. మరోవైపు రోగులకు పెట్టే ఆహారం విషయంలోను నాణ్యత ఉండేలా చర్యలు తీసుకున్నారు. ► వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంది. నీతి ఆయోగ్ వంటి సంస్థలు ప్రశంసించాయి. దేశంలో మధ్య తరగతి వర్గాలకు ఆరోగ్యబీమా కల్పిస్తున్న రాష్ట్రం ఏపీ అని ‘హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఇండియాస్ మిస్సింగ్ మిడిల్ క్లాస్’ పేరుతో రూపొందించిన నివేదికలో నీతి ఆయోగ్ తెలిపింది. ► క్షయ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న టాప్–3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ► దేశంలో వంద శాతం పీహెచ్‌సీలను 24/7 నడుపుతున్న రాష్ట్రం ఏపీ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు నివేదికల్లో స్పష్టం చేసింది. ► హెపటైటిస్ నియంత్రణలో ఏపీ చర్యలు భేష్‌గా ఉంటున్నాయని కేంద్ర వైద్య శాఖ ప్రశంసిచింది. హైరిస్క్ వర్గాలకు ముందస్తుగా టీకా పంపిణీ చేపడుతున్న రాష్ట్రంగా కూడా రికార్డు సాధించింది. కొరతకు తావు లేకుండా.. రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా 2019 నుంచి ఇప్పటికి ఏకంగా 48,639 పోస్టులు భర్తీ చేశారు. ఇక్కడితో ఆగకుండా ఖాళీ అయ్యే పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకునేలా ప్రభుత్వం అత్యవసర అనుమతులు ఇచ్చింది. దేశంలో స్పెషాలిటీ వైద్యులు కొరత ప్రభుత్వ ఆస్పత్రుల్లో 61 శాతం మేర ఉండగా, ఏపీలో కేవలం 5 శాతం మేర ఉంటోంది. గైనకాలజిస్టుల సంఖ్య జాతీయ స్థాయిలో కొరత 50 శాతం ఉంటే, ఏపీలో 1.4 శాతం మాత్రమే ఉంది. స్టాప్నర్స్ల కొరత 27 శాతం ఉంటే.. రాష్ట్రంలో కొరతకే ఆస్కారం లేదు. ఫలితంగా డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు మించి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 4,469 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. సగటున రోజుకు 1,360 సర్జరీలు బోధనాస్పత్రుల్లో 2018–19లో సగటున రోజుకు 817 మైనర్, మేజర్ ఆపరేషన్లు నిర్వహించే వారు. 2022–23లో రోజుకు 1360 ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అప్పట్లో రోజుకు 19 వేల చొప్పున ఓపీలు, 1900 మేర ఐపీలు ఉండగా, గత ఏడాది 22 వేలకు పైగా ఓపీల చొప్పున 83.16 లక్షలు, ఐపీలు రోజుకు 2,253 చొప్పున 8.22 లక్షలు నమోదు అయ్యాయి. నాటికి, నేటికి ఎంత తేడా! కర్నూలు జీజీహెచ్‌లోని కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో 2019కి ముందు ఒక డాక్టర్, ఆరుగురు నర్సులు, ముగ్గురు టెక్నికల్ సిబ్బంది మాత్రమే ఉండేవారు. ఉన్న ఒక్క వైద్యుడు సెలవు పెడితే అంతే సంగతులు. సీటీ సర్జన్ ఆపరేషన్ చేసే సమయంలో గుండె నుంచి రక్త ప్రసరణ నిలిపివేసి, మెషిన్ ద్వారా ఇతర శరీర భాగాలకు రక్తం సహా ఆక్సిజన్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కీలకమైన మిషన్‌ను పర్ఫ్యూజనిస్ట్లు ఆపరేట్ చేస్తుంటారు. ఇంతటి కీలకమైన పోస్టు అప్పట్లో ఖాళీగా ఉండేది. దీంతో హైదరాబాద్ నుంచి కేసుల ప్రాతిపదికన పర్ఫ్యూజనిస్ట్ను పిలిపించుకుని సర్జరీలు చేసేవారు. అత్యవసర సమయాల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోయేవారు. దీంతో 2017–18లో ఈ విభాగంలో 120 సర్జరీలు మాత్రమే చేశారు. ఓపీలు నెలకు 80లోపే చూసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ విభాగంలో అదనంగా ముగ్గురు వైద్యులు, నలుగురు నర్సులు, ముగ్గురు టెక్నీషియన్లు రావడంతో పాటు పర్ఫ్యూజనిస్ట్ పోస్టు భర్తీ అయింది. దీంతో 2022–23లో ఏకంగా 1600 ఓపీలు నమోదు అయ్యాయి. మేజర్, మైనర్ కలిపి 566 సర్జరీలు చేశారు. మొత్తంగా 1500 పడకలున్న ఈ ఆస్పత్రిలో 2018–19లో 9.46 లక్షల ఓపీలు, 80 వేల ఐపీ, 29 వేల మైనర్, మేజర్ సర్జరీలు నమోదయ్యాయి. 2022–23లో 12 లక్షల మేర ఓపీ, లక్షకుపైగా ఐపీ సేవలు అందించడంతో పాటు, 41 వేల సర్జరీలు నిర్వహించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దాస్పత్రుల్లో పరిస్థితి మెరుగైంది. అనుబంధం ఏర్పడుతుంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ చర్యలపై సరైన అవగాహన లేదు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ వైద్యుడే నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం అవ్వడం మంచి పరిణామం. గర్భిణి, బాలింత.. బీపీ, మధుమేహం వ్యాధిగ్రస్తులను రెండు, మూడు సార్లు చూస్తే వైద్యుడు వారిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో ఆ వైద్యుడికి ప్రజలకు మధ్య అనుబంధం ఏర్పడుతుంది. ఇది రోగికి మానసికంగా బలాన్ని ఇస్తుంది. ఈ మానసిక బలం రోగి త్వరగా కోలుకోవడానికి ఎంతో ఉపయోగకరం. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూల్ జీజీహెచ్ ప్రజారోగ్య రక్షణలో మంచి ఫలితాలు బీపీని నియంత్రణలో ఉంచుకోకపోవడంతో ప్రస్తుతం 20 శాతం పెరాలసిస్ కేసులు వస్తున్నాయి. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారు. మన దగ్గర 60 శాతం గ్రామీణ జనాభా ఉంది. గ్రామాల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల కోసం 10–20 కి.మీ ప్రయాణించి చూపించుకోవడం వారికి అయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో వైద్యుడే ఆయా గ్రామాలకు వెళ్లడం ప్రజారోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. భవిష్యత్‌లో గుండెపోటు, కిడ్నీ, మెదడు జబ్బుల బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. – డాక్టర్ బాబ్జీ, వైస్ చాన్స్‌లర్, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం -
సమానత్వంలో ఆరోగ్యమూ కీలకమే!
2047 నాటికి అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దేశంగా భారత్ ఎదగాలంటే ముందుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంత సమర్థంగా పనిచేయించగలమో చూసుకోవాలి. వ్యక్తులు, వారి అవసరాలే కేంద్రంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఆరోగ్య రంగాన్ని విస్మరిస్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలపై పెట్టాల్సిన ఖర్చులు అలవి కానంతగా పెరుగుతాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడోది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదే. అలాగే తొలి రెండు లక్ష్యాలైన అందరికీ ఆహారం, పేదరిక నిర్మూలనకూ ఆరోగ్యంతో సంబంధం ఉన్నది. ఇంకోలా చెప్పాలంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను తీర్చకుండా ఈ రెండు లక్ష్యాలను సాధించడం కష్టం. స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లయ్యే సువర్ణ ఘడియలపైనే ఉంది. భారతదేశం అప్పటికి ఎలా తయారవ్వాలి? నా దృష్టిలో అందరికీ సమాన అవకాశాలున్న దేశంగా; విద్య, ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉన్న దేశంగా ఉండాలి! కులమతాలకు అతీతంగా... వ్యవ సాయం, పాడి పరిశ్రమలు పుష్టిగా సాగుతుండాలి. నాణ్యతే ప్రధానంగా పరిశ్రమలు వస్తువులను అందించాలి. ఇవన్నీ కూడా అందరికీ సమాన అవకాశాలు అన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉపయోగపడేవే. ప్రతి సమాజానికి విద్య, ఆరోగ్యం పునాదుల్లాంటివి. ఈ రెండు విషయాల్లోనూ దేశం సాధించిన ప్రగతికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. భారతీయ విద్యావిధానం అంతర్జాతీయ స్థాయి సీఈవోలను సిద్ధం చేస్తూంటే... భారతీయ ప్రైవేట్ రంగ ఆరోగ్య వ్యవస్థలు ప్రపంచం నలుమూలల్లోని వారికి మెడికల్ టూరిజంతో వైద్యసేవలు అందిస్తున్నాయి. అయితే ఈ రెండు ఉదాహరణలను మినహాయిం పులుగానే చూడాలి. పైగా ఈ రెండింటిలో అవకాశాలు కొందరికే. పిల్లలు తమ మేధోశక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు మొట్ట మొదటి పునాది ఇంట్లోనే పడుతుంది. పసివాళ్లతో తగురీతిలో మాటలు కలపడం, ఇంద్రియజ్ఞానానికి సంబంధించిన పనులు చేయించడం వంటి పనుల ప్రాధాన్యతను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే విద్యభ్యాసానికి గట్టి పునాది పడినట్లే. తల్లిదండ్రులిచ్చిన ఈ ప్రాథమిక విద్యకు సుశిక్షితులైన ఉపాధ్యాయులతో నడిచే పాఠశాల కూడా తోడైతే బాలల వికాసం పెద్ద కష్టమేమీ కాదు. ఉమ్మడి కుటుం బమైనా... చిన్న కుటుంబమైనా సరే... సాంఘిక, ఆర్థిక పరిస్థితులే పిల్లలకు దక్కే విద్య నాణ్యతను నిర్ణయిస్తాయి. పాఠశాల వాతా వరణం సాంఘిక, ఆర్థిక లేమి ప్రభావాన్ని కొంతవరకూ తగ్గించ గలదు కానీ... ఇది జరగాలంటే పాఠశాలలు సక్రమంగా పనిచేస్తూం డాలి. దీనర్థం భవనాలు, పరిపాలన వ్యవస్థలు సరిగా ఉండాలని కాదు. నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయులు కావాలి. అణగారిన వర్గాల పిల్లల జీవితాలను మార్చడం మూకుమ్మడిగా జరగాల్సిన వ్యవహారం. ఈ మార్పు తీసుకు రావడం సాధ్యమనీ, అందుకోసం ఏమైనా చేయగలమనీ ఉపాధ్యాయులు సంకల్పించు కోవడం అవసరం. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రి వచ్చేదేమీ కాదు. ప్రభుత్వాల ఆదేశాలతో సాధ్యమయ్యేదీ కాదు. విద్యాబోధనలో గిరిజన సంస్కృతుల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదా తర్క బద్ధమైన అభ్యాసాలను ప్రవేశపెట్టడమైనా సరే... పాఠశాలల్లో విద్యా ర్థుల మదింపు అనేది అందరికీ ఒకేలా ఉండటం సరికాదు. ఈ వాదనలకు ప్రతివాదనలూ లేకపోలేదు. భారత దేశం విశాలమైనదనీ, అన్ని రాష్ట్రాల్లోనూ ఏకరీతి విద్యాబోధన అవసరమనీ అనేవాళ్లూ ఉన్నారు. ప్రభుత్వం వనరుల కొరతను ఎదుర్కొంటోందని ఇంకొందరు అంటారు. విద్యార్థుల జీవితాల్లో మార్పులు తీసుకురావడం దశాబ్దాల దీర్ఘకాలిక ప్రక్రియ అని అంటారు. ఈ ప్రతివాదనలను విస్మరించాల్సిన అవసరమేమీ లేదు. కానీ విద్య ప్రాథమికమైన బాధ్యత సామాజిక వృద్ధి మాత్రమే కాదనీ, సమానతను సృష్టించేం దుకూ ఉపయోగపడాలనీ వీరు గుర్తించాలి. విద్య ద్వారా లింగవివక్షను తగ్గించడం వంటి అనేక లాభాలూ ఉన్నాయని తెలుసుకోవాలి. పాఠశాల విద్యను అభివృద్ధి చేస్తూనే... దీనికి సమాంతరంగా వృత్తి విద్య, పారిశ్రామిక శిక్షణ కేంద్రాలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... ఈ రెండు రకాల సంస్థలు ఉద్యోగాలు సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయి. అదే సమయంలో తక్కువ విద్యార్హతలతోనే అర్థవంతమైన ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఆయా రంగాల్లో నిష్ణాతులు ఈ దేశానికి గతంలోనూ ఉన్నారు... భవిష్యత్తులోనూ పుట్టుకొస్తారు. ఇది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియగానే చూడాలి. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే విద్యా వ్యవస్థలో కొత్త కొత్త అవకాశాలను సృష్టించడం... అవి అందరికీ నిత్యం అందుబాటులో ఉండేలా చూడటం అత్యవసరం. ఈ క్రమంలోనే విద్యనభ్య సించేందుకు డబ్బు ఒక ప్రతిబంధకం కాకుండా జాగ్రత్త పడాలి. సుమారు ఇరవై ఏళ్ల క్రితం నాటి మాట. ఆరోగ్యకరమైన సమాజానికి ఆడపిల్లలు విద్యావంతులై ఉండటం ఎంతో అవసరమని ప్రపంచబ్యాంకు నివేదిక ఒకటి విస్పష్టంగా పేర్కొంది. తక్కువమంది పిల్లల్ని కనడం, సురక్షిత కాన్పులు, పిల్లల ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగుదల, సమాజంలో స్థాయి పెరగడం వంటి సానుకూల అంశాలకూ ఆడపిల్లలు, మహిళల చదువుకు దగ్గర సంబంధం ఉందని అలవోకగా అనేస్తారు కానీ... ఆరోగ్యం విషయానికి వస్తే అది కాన్పులు, పిల్లల సంరక్షణ పరిధిని దాటి బహుముఖంగా విస్తరించాల్సి ఉంది. రెండు మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే చాలా వ్యాధులను మనం సమర్థంగా నియంత్రించగలుగుతున్నాం. కాబట్టి ప్రజల ఆరోగ్య సంరక్షణ, ప్రాణాంతక వ్యాధుల నివారణ, రోగులకు మెరుగైన చికిత్స వంటివాటికి ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వాలి. ఐక్యరాజ్య సమితి 2030 నాటికి సాధించాలని ప్రపంచదేశాలకు నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరడం 2047 నాటికి కానీ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఆరోగ్య రంగాన్ని విస్మరిస్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలపై పెట్టాల్సిన ఖర్చులు అలవికానంతగా పెరుగుతాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడోది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదే. అలాగే తొలి రెండు లక్ష్యాలైన అందరికీ ఆహారం, పేదరిక నిర్మూలనకూ ఆరోగ్యంతో సంబంధం ఉన్నది. ఇంకోలా చెప్పాలంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను తీర్చకుండా ఈ రెండు లక్ష్యాలను సాధించడం కష్టం. 2047 నాటికి అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దేశంగా భారత్ ఎదగాలంటే ముందుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంత సమర్థంగా పనిచేయించగలమో చూసుకోవాలి. ఆరోగ్యంపై పెట్టే ఖర్చులు తగ్గించడం, వ్యాధుల నివారణలపై శ్రద్ధ పెట్టడం జరగాలి. చాలా వ్యాధుల చికిత్సకు ఆసుపత్రుల అవసర ముండదు. ఆరోగ్య కార్యకర్తలను రోగులకు అందుబాటులో ఉంచి, భౌతిక, డిజిటల్ సౌకర్యాలు తగినన్ని ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అలాగే అత్యవసర పరిస్థితులకు వేగంగా స్పందించగల, అందరికీ అందుబాటులో ఉండేలా రెఫరెల్ ఆసుపత్రుల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. చికిత్స ఆలస్యం అవడం వల్ల రోగులకు అనవసరమైన ఇబ్బందులు ఎదురు కారాదు. ఇది సాధ్యం కావాలంటే తగిన వనరులు, సిబ్బంది మాత్రమే కాదు... ఇవన్నీ అవసరమైన చోట ఉండేలా చూడాలి. తగిన పద్ధతులను అమల్లోకి తేవడమూ అవ సరమే. ఇంకోలా చెప్పాలంటే వ్యక్తులు, వారి అవసరాలే కేంద్రంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం జరగాలి. భారీ మొత్తాలు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ వ్యవస్థ రోగుల అవసరాలను తీర్చగలగాలి. అయితే ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే.. ప్రైవేట్ రంగాన్ని నియంత్రించక తప్పదు. సుశిక్షితులైన, చిత్తశుద్ధితో పనిచేసే సిబ్బందితో కేవలం చౌక మందులు, టీకాలతోనే మన వ్యవస్థను రోగి ప్రధానంగా పనిచేయించవచ్చు. ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణలో అక్కడక్కడ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న వారు ఉన్నారు. క్లిని కల్ సర్వీసుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. వీటిని సుస్థిర అమలు దిశగా మళ్లించాలి. 2047 అంటే ఇంకో పాతికేళ్లు కావచ్చు కానీ... స్వతంత్ర భారత చరిత్రలో ఇంకో శతాబ్దానికి బలమైన పునాది వేసేందుకు ఈ 25 ఏళ్లలో విద్య, ఆరోగ్యంపై మనం పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడులు కూడా సమాజంలోని ఉన్నత వర్గాల కోసం కాదు. అందరికీ. అయితే ఈ పెట్టుబడుల రాబడులు మాత్రం కొన్ని తరాలవారు అందుకుంటారు. గగన్‌దీప్ కాంగ్, వ్యాసకర్త సీనియర్ వైరాలజిస్ట్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
ప్రాథమిక వైద్యంలో పెనుమార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చాక ప్రాథమిక వైద్యం విభాగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాడు–నేడు పనులపై ఆమె సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 10,032 విలేజ్ క్లినిక్‌ల నిర్మాణానికి రూ.1,500 కోట్లు, 184 పట్టణ ఆరోగ్య కేంద్రం భవనాల ఆధునీకరణ, 344 కొత్త భవనాల నిర్మాణానికి రూ.665 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా 976 పీహెచ్‌సీల ఆధునీకరణ, 150 కొత్త పీహెచ్‌సీల నిర్మాణానికి రూ.367 కోట్లు.. ఇలా మొత్తంగా ప్రాథమిక వైద్యం బలోపేతానికి రూ.2,532 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. భవనాల ఆధునీకరణ, కొత్త భవనాల నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తిచేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. పనుల పురోగతికి సంబంధించి ఇకపై ప్రతీనెలా తానే స్వయంగా సమీక్షిస్తానని రజని చెప్పారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
బాబ్బాబు..ఏ సెంటర్లో ఏ వ్యాక్సిన్ వేస్తున్నారో చెప్పండయ్యా
‘బడంగ్‌పేటకు చెందిన రాజేశ్వరి ఏప్రిల్ రెండో తేదీన బాలాపూర్ ఆరోగ్య కేంద్రంలో కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు. రెండో డోసు కోసం శనివారం అదే పీహెచ్‌సీకి ఆమె వెళ్లారు. తీరా అక్కడ కోవాగ్జిన్ లేదని, ఎప్పుడు వస్తుందో కూడా స్పష్టత లేదని ఆస్పత్రి వైద్యుడు స్పష్టం చేశారు. సరూర్‌నగర్‌లో అడిగి చూడండి అని వైద్యుడు సలహా ఇవ్వడంతో పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారామె. తీరా అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది. రెండో డోసు దొరుకుతుందో? లేదో? వైద్యులు కూడా స్పష్టత ఇవ్వలేక పోవడంతో ఆమె ఆందోళనలో ఉన్నారు’ ఇలా ఒక్క రాజేశ్వరి మాత్రమే కాదు ఇప్పటికే తొలి డోసుగా కోవాగ్జిన్ టీకా తీసుకున్న వేలాది మంది నగరవాసులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ టీకాల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఏ సెంటర్లో ఏ వ్యాక్సిన్ వేస్తున్నారో తెలియక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. లబ్ధిదారుల నిష్పత్తికి తగినంత వ్యాక్సిన్ సరఫరా చేయకపోవడంతో ప్రభుత్వం ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌ను ఈ నెల 14 వరకు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం శనివారం నుంచి కేవలం రెండో డోసు వారికే టీకాల వేస్తున్నట్లు ప్రకటించింది. ఫస్ట్ డోసులో కోవిషీల్డ్ వేసుకున్న వారికి సులభంగానే టీకాలు దొరుకుతున్నా.. కోవాగ్జిన్ తీసుకున్న వారికి కష్టాలు తప్పడం లేదు. రెండో డోసుకు గడువు సమీపించడంతో ఇప్పటికే ఫస్ట్‌డోసు టీకా వేయించుకున్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఆరా తీస్తే.. వారు కనీస సమాచారం ఇవ్వడం లేదు. టీకా ఏ రోజు లభిస్తుందో కూడా స్పష్టత ఇవ్వకపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. 13.62 లక్షల మందికి ఫస్ట్‌డోసు పూర్తి హైదరాబాద్ జిల్లాలో 155 కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. వీటిలో 106 ప్రభుత్వ, 49 ప్రైవేటు టీకా సెంటర్లు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 73 కేంద్రాల్లో టీకాలు వేస్తుండగా, వీటిలో 48 ప్రభు త్వ, 25 ప్రైవేటు సెంటర్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 67 కేంద్రాల్లో టీకాలు వేస్తుండగా, వీటిలో 44 ప్రభుత్వ, 23 ప్రైవేటు కేంద్రాలు ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో ఇప్పటి వరకు 17,25,546 మంది టీకాలు వేయించుకున్నారు. వీరిలో 13.62,742 మంది ఫస్ట్ డోసు వేసుకోగా, 3,62,804 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. తాజాగా శనివారం మూడు జిల్లాల పరిధిలో 17,895 మందికి టీకాలు వేశారు. వీరంతా కోవిషీల్ట్ టీకా వేయించుకున్నవారే. కొత్తవాళ్లకు టీకాలు వేయకపోగా.. ఇప్పటికే ఫస్ట్‌డోసు పూర్తి చేసుకుని సెకండ్ డోసు కోసం ఎదురు చూస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కో ఆస్పత్రిలో ఒక్కోలా చార్జీలు కోవిషీల్డ్‌తో పోలిస్తే కోవాగ్జిన్‌కు డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం సరఫరా చేసిన అరకొర వ్యాక్సిన్లను కూడా ఆరోగ్య కేంద్రాలకు పంపకుండా బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ప్రైవేటు ఆస్ప్రతులు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా టీకా వేయించుకోవాలని భావిస్తున్న సిటీజనుల బలహీనతను ఆసరాగా తీసుకుని ధరలను అమాంతం పెంచేశాయి. టీకాకు డాక్టర్ కన్సల్టేషన్ చార్జీలు కలిపి రూ.850 నుంచి రూ.1250 వరకు వసూలు చేస్తున్నాయి. ఒక్కో కార్పొరేట్ ఆస్పత్రి ఒక్కో విధంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. -
నేటి నుంచి టీకాలు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గతకొన్ని రోజులుగా గర్భిణులకు, చిన్నారులకు ఇచ్చే వ్యాధినిరోధక టీకాలు ఆగిపోయాయి. శనివారం నుంచి ఆ టీకాలు యథావిధిగా వేయాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశించారు. ప్రతి బుధవారం, శనివారం రోటావైరస్, డీపీటీ, తట్టు, పోలియో తదితర వ్యాక్సిన్లు ఇస్తారు. నేటి నుంచి జాగ్రత్తలు పాటిస్తూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయాలన్నారు. టీకాలు ఇలా వేయాలి.. ► టీకాలు వేయాల్సిన వాళ్లందరినీ గుర్తించాలి ► వారిలో అరగంటకు నలుగురుకి చొప్పున స్లాట్లు ఇవ్వాలి ► ఆశా కార్యకర్తల ద్వారా ముందురోజే ఈ స్లాట్ సమయం స్లిప్పులు ఇవ్వాలి ► గ్రామ, వార్డు పరిధిలోని లబ్ధిదారులందరికీ టీకాలు వేసే వరకూ స్లాట్లను కొనసాగించాలి ► ఏఎన్ఎంలు గానీ, ఆశాలు గానీ, అంగన్వాడీ వర్కర్‌గానీ కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే టీకాల్లో పాల్గొనకూడదు ► రెడ్‌జోన్ (కంటైన్మెంట్ జోన్) ప్రాంతాల్లో టీకాల కార్యక్రమం నిర్వహించకూడదు ► టీకాలకు వచ్చే వారి మధ్య కనీసం 7 అడుగుల భౌతిక దూరం ఉండేలా చూడాలి ► టీకాలు వేసే ఏఎన్ఎం సర్జికల్ మాస్కు ధరించడంతో పాటు టీకా వేసేముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలి -
మందుల మాయ !
జిల్లాలో సీజనల్ మెడిసిన్ కరువు కమీషన్ల కోసం కాలయాపన ఇబ్బందులు పడుతున్న రోగులు సాక్షి, హన్మకొండ : జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో రెండిళ్లలో ఒకరు వంతున మంచం పట్టారు. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీజనల్ మందులు అందుబాటులో ఉండడం లేదు. ఈ మందుల కొనుగోలుకు సంబంధించి కమీషన్ల వ్యవహారం కొలిక్కిరాకపోవడం వల్లే కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. జ్వరం గోలీలూ కరువే.. జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 3 ఏరియా ఆస్పత్రులు, 12 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఈ ఆస్పత్రులకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి క్రమం తప్పకుండా అన్ని రకాల ఔషధాలు సరఫరా కావాలి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత సాధారణంగా జ్వరాలు పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని రకాల మందులను కొనుగోలు చేసి ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతారు. జిల్లాలో రెండు నెలలుగా జ్వరాల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర ఔషధాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా జ్వరం, నొప్పులు, వాంతులు, విరేచనాలకు ఉపయోగించే ఫ్యురాజోలిడిన్, మెట్రోజిల్, డైక్లోఫెనాక్, పారాసిటమాల్ మాత్రలు కరువయ్యాయి. చివరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అరకొరగానే ఉంటున్నాయని సమాచారం. కమీషన్ల కక్కుర్తే కారణం.. ప్రభుత్వ ఆస్పత్రులలో మందుల కొరతకు కమిషన్ల వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో కీలకపాత్ర పోషిస్తున్న ఓ ఫార్మసిస్టు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో అవసరమైన మందులు తెప్పించకుండా కేవలం కమీషన్ అధికంగా వచ్చే మందులు కొనుగోలు చేస్తున్నట్లు ఆ శాఖ వారే చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడంతో సదరు ఉద్యోగి లీలలు శృతి మించుతున్నాయి. ఆఖరికి నెల రెండు నెలల్లో కాలం చెల్లిపోయే ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి మందులనే పీహెచ్‌సీలకు సరఫరా చేస్తున్నారు. అధికారులకు చెప్పలేక.. ఆన్ సీజన్ ఔషధాలను రోగులకు పంపిణీ చేయలేక క్షేత్రస్థాయిలో పని చేసే వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలపరిమితి ముగిసిన ఔషధాలను గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఆçస్పత్రుల ప్రాంగణం సమీపంలో గుంత తీసి పాతిపెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ వ్యవహారం కొంతకాలంగా నిరాటంకంగా సాగుతోంది. ఇదీ పరిస్థితి... పది నెలలుగా డైక్లోఫెనాక్ ట్యాబ్లెట్ల సరఫరా లేదు. పారాసిటమాల్ టాబ్లెట్లు డిమాండ్‌కు సరిపడా లేవు. రెండు నెలలుగా ప్యురాజోలిడిన్, మెట్రోజిల్ మందుల సరఫరా లేదు. ఇరవై రోజుల క్రితం నల్లబెల్లి మండలంలో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో ఇటీవల మందులు పాతిపెట్టినట్లు తెలుస్తోంది. మలేరియా రోగులకు అందించే క్లోరోక్విన్, ఫిట్స్ రోగులకు అందించే క్లోబోజామ్ వంటి ఔషధాలు సైతం ఆస్పత్రులలో అందుబాటులో లేవు. నొప్పుల ఉపశమనానికి అందించే డ్రేమడాల్ ఔషధాలతో పాటు థైరాయిడ్ మాత్రలు సైతం లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రోజిల్ స్టాక్ లేదు సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో మూడు రోజులుగా మెట్రోజిల్, డైక్లోఫెనాక్ మందుల నిల్వ లేదు. ఆరు నెలలుగా ఫ్యురాజొలిడిన్ ట్యాబ్లెట్ల సరఫరా లేదు. పారాసిటమాల్ టాబ్లెట్ స్టాకు ఉన్నాయి, కానీ అవి తీసుకెళ్లడంలో పీహెచ్సీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. – వెంకటస్వామి, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఫార్మసిస్టు -
విశాఖ, నెల్లూరు, కర్నూలుల్లో కేన్సర్ ఆసుపత్రులు
గుంటూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఆదివారం గుంటూరులో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 84 పీహెచ్‌సీలకు రూ. 101 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు 800 వైద్యుల పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో మరో 500 వైద్యుల పోస్టులు భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. అలాగే రాష్ట్రంలో తల్లీబిడ్డల మరణాలను గణనీయంగా తగ్గించామని కామినేని పేర్కొన్నారు. రూ. 225 కోట్లతో వైద్య పరికరాల తయారీ కోసం విశాఖలో మెడ్‌టెక్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాట్కో సాయంతో రూ. 10 కోట్లతో గుంటూరులో కేన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తామని... ఈ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ, నెల్లూరు, కర్నూలు నగరాల్లో కేన్సర్ ఆసుపత్రులు నిర్మించనున్నట్లు కామినేని తెలిపారు. ఈ నెల 11వ తేదీన విశాఖలో విమ్స్ ప్రారంభిస్తామన్నారు. -
కొండెక్కిన వైద్యం
వారు అడవి బిడ్డలు..తమకు ఇది కావాలని నోరు తెరిచి అడగలేని అమాయకులు వాళ్లు.. విశాఖ నగరానికి ఆమడ దూరంలో ఉన్నా కనీస సౌకర్యాలకు నోచుకోని అభాగ్యులు. అలాంటి వారికి కనీస అవసరమైన వైద్యం ఏ విధంగా అందుతుందో తెలుసుకోవడానికి ‘సాక్షి’ మంగళవారం క్షేత్ర స్థాయికి వెళ్లింది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలు, అక్కడి సమస్యలపై ఆరా తీసింది. ఈ పరిశీలనలో గిరిజనుల దుర్భర పరిస్థితులు వెలుగుచూశాయి. ఆస్పత్రుల్లో లోటుపాట్లు బయటపడ్డాయి. సాక్షి, విశాఖపట్నం : ఏజెన్సీలోని 11 మండలాల్లో 36 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 53 మంది వైద్యులుండాల్సి ఉండగా ఏడుగురు లేరు. ఉన్నవారిలో 18 మంది కాంట్రాక్టు వైద్యులే. ఏరియా ఆస్పత్రులు రెండు ఉన్నాయి. 194ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. పాడేరు, అరకు, హుకుంపేటలో ప్రసూతి కేంద్రాలున్నాయి. అడిషన్ డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఐదుగురు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు ఉండాల్సి ఉండగా నలుగురే ఉన్నారు. దంతవైద్యులు ఇద్దరు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. కమ్యూనిటీ హెల్త్ అధికారులు ఎనిమిది మంది ఉండాల్సి ఉండగా ఐదుగురే ఉన్నారు. మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 29 పోస్టులకు గానూ 20 మంది ఉన్నారు. పబ్లిక్ హెల్త్ నర్స్ పోస్టులు 18 ఉండగా 6 ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్ నర్స్ పోస్టులు 58 కాగా 11 ఖాళీగా ఉన్నాయి.ఫార్మాసిస్టు 40 పోస్టులకు 15 మందే ఉన్నారు. ల్యాబ్ టెక్సీషియన్ 34 మంది ఉండాల్సి ఉండగా 30 మంది ఉన్నారు. హెల్త్ సూపర్వైజర్ మేల్ 56 పోస్టులకు 43 మంది ఉన్నారు.హెల్త్ సూపర్వైజర్ ఫిమేల్ 50 పోస్టులకు 11 పోస్టులు ఖాళీ. హెల్త్ అసిస్టెంట్ మేల్ 194 పోస్టులకు 143 మంది ఉన్నారు. హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ 195 పోస్టులకు 59 ఖాళీగా ఉన్నాయి.సెకండ్ ఏఎన్ఎం 194 మందికి 178 మంది ఉండగా 16 ఖాళీ. ఆశా కార్యకర్తలు 3227 పోస్టులకు 3186 మంది ఉన్నారు. పీహెచ్‌సీల్లో ప్రధానంగా వైద్యుల కొరత వేధిస్తోంది. అరకులోయ మండలంలోని 24 గంటల గన్నెల పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకరిని డుంబ్రిగుడ పీహెచ్‌సీకి డెప్యూటేషన్‌పై పంపించారు. హుకుంపేట పీహెచ్సీలో నలుగురు వైద్యులకు గాను ముగ్గురే పనిచేస్తేన్నారు. పెదబయలులో పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. ఉన్నవారు కూడా సమయానికి రాకపోవడంతో వారికోసం నిరీక్షించడం రోగులకు సాధారమైపోయింది. నర్సులే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. వారు చేయలేని చికిత్సలకు విశాఖ పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తున్నారు.పాడేరు ఆస్పత్రిలో చాలా పరికరాలు వినియోగించక పోవడం వల్ల తుప్పు పట్టి నిరుపయోగంగా ఉన్నాయి. రోగుల కోసం కేటాయించిన గది, వార్డులోని మంచాలు దుమ్ము పట్టాయి. పాడేరులో పేరుకే పది పడకల ఆసుపత్రి కానీ 4పడకలే ఉన్నాయి. ఫార్మాసిస్టులు, ఆరోగ్యమిత్రలు, ఓపీ చీటీ రాసే సిబ్బంది కూడా లేరు. పేరుకే 24 గంటల ఆసుపత్రులు కానీ తురిచి ఉంచేది సాయంత్రం వరకే. వైద్య సిబ్బంది నివాస గృహాలు లేక ప్రయివేటు ఇళ్లులో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కాంట్రాక్టు డాక్టర్లకు నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదు. -
ఖర్మాసుపత్రులు
కాకినాడ క్రైం :ఏ చిన్న జ్వరమొచ్చినా, ఇతర అనారోగ్యం వచ్చినా అందుబాటులో ధర్మాసుపత్రికి వెళ్లారో.. అంతే సంగతులు. అరకొర వసతులు, అందుబాటులో లేని మందులు, చాలీచాలని సిబ్బందితో అవి స్వాగతం పలుకుతున్నాయి. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో విఫలమై అవి కాస్తా ఖర్మాసుపత్రులుగా మారిపోతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), అర్బన్ హెల్త్ సెంటర్ల(యూహెచ్‌సీ)పై సోమవారం చేసిన ‘సాక్షి విజిట్’లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. చాలా పీహెచ్‌సీల్లో గర్భిణులకు వైద్య పరీక్షలు చేసేందుకు కనీసం ల్యాబ్ కూడా లేదు. దీంతో స్థానికంగా ఉండే ప్రైవేటు ల్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. రెక్కాడితేనే కానీ డొక్కాడని చాలా కుటుంబాలవారు తమ ఇంట్లోని గర్భిణులకు ప్రైవేటుగా వైద్య పరీక్షలు చేయించే స్తోమత లేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రాణాల మీదకు వస్తే అప్పటికప్పుడు సుదూర ప్రాంతాల్లోని కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రులకు తరలిస్తున్నారు.పట్టణాలు, నగరాల్లోని యూహెచ్‌సీల్లో సైతం గర్భిణులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. ఈ కేంర్రాల్లో గర్భిణులను పరీక్షించి రిఫరల్ యూనిట్లకు పంపిస్తారు. అక్కడ కూడా సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో సుమారు 53 లక్షల జనాభా ఉంది. ప్రతి 15 వేల నుంచి 20 వేల జనాభాకు ఒక పీహెచ్సీ లేదా యూహెచ్‌సీ ఏర్పాటు చేశారు. కాకినాడ బోధనాస్పత్రి, రాజమండ్రి జిల్లా ఆస్పత్రితోపాటు ఏడు ఏరియా ఆస్పత్రులు, 23 కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెంటర్లు (సీహెచ్ఎన్సీ), 109 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 20 యూహెచ్‌సీలు, 809 సబ్ సెంటర్లు ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో నాలుగు విలీన మండలాల్లోని 8 పీహెచ్‌సీలు, 2 సీహెచ్‌సీలు, 2 క్లస్టర్లు జిల్లా పరిధిలోకి వచ్చాయి. పీహెచ్‌సీల్లో సుమారు 170 వైద్యాధికారుల పోస్టులుండగా వీటిలో 19 పోస్టులు ఖాళీగాా ఉన్నాయి. ప్రధానంగా గైనిక్, పీడియాట్రిక్ వైద్యులు అందుబాటులో లేరు. ఫలితంగా మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులే పేర్కొంటున్నారు. పీహెచ్‌సీలకు సొంత భవనాలున్నా వాటిలో కొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడం విచిత్రం.ఇక 809 సబ్ సెంటర్లకుగాను 667 అద్దె కొంపల్లోనే కొనసాగుతున్నాయి. కొన్ని పీహెచ్సీ, యూహెచ్‌సీల్లో మందులు, వ్యాక్సిన్లు, బీపీ మెషీన్లు, కంప్యూటర్లు అందుబాటులో లేవు. యూహెచ్సీల్లోని వైద్యాధికారులకు, సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు సక్రమంగా అందడంలేదు. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి అప్రమత్తం చేయడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇక్కట్లు పడుతున్నారు.జిల్లా కేంద్రం కాకినాడలో కూడా పరిస్థితి పెద్ద గొప్పగా లేదు. కాకినాడ రేచర్లపేట యూహెచ్‌సీలో గతంలో ప్రసూతి కేంద్రం ఉండేది. నాలుగేళ్ల కిందట దీనిని తీసివేశారు. వేల మంది నివసించే ఈ ప్రాంతంలో ప్రసూతి కేంద్రం లేకపోవడంతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం పీహెచ్‌సీలు, యూహెచ్‌సీల్లో సమస్యలపై అధ్యయనం చేసి, క్షేత్రస్థాయిలోనే వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాం. మౌలిక వసతుల కల్పనపై కూడా దృష్టి సారిస్తాం. అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతాం. సబ్ సెంటర్లకు భవనాలు సమకూర్చాల్సిందిగా ప్రభుత్వానికి నివేదించాం. 2014-15లో 98, 2015-16లో 108, 2016-17లో 128 సబ్ సెంటర్లకు భవనాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం. మిగిలిన సమస్యలపై కూడా ప్రత్యేక చర్యలు చేపడతాం. - డాక్టర్ ఎం.సావిత్రమ్మ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి -
వైద్యానికి సుస్తీ
ఏలూరు : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లల్లో సౌకర్యాలేమి రోగులకు ప్రాణసంకటంగా మారింది. ఏళ్ల తరబడి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం జరగకపోవడంతో ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం పూజ్యంగా మారింది. 48 మండలాల్లో 79 పీహెచ్సీలుండగా, 158 మంది వైద్యులున్నారు. తొమ్మిది సీహెచ్‌సీల్లో తొమ్మిది మంది డాక్టర్లు ఉన్నారు. అదనపు పోస్టుల మంజూరు లేక డిప్యూటేషన్‌పైనే స్థానికంగా ఉన్న పీహెచ్సీ వైద్యులు సేవలందిస్తున్నారు. టె క్నీషియన్, నర్సుల పోస్టులు 60కు పైగా ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత వల్ల రోగుల పడుతున్న బాధలు అన్నీ ఇన్నీకావు. మందుల కొరత, వివిధ రోగాల నిర్ధారణకు ల్యాబ్‌లు లేకపోవడంతో వైద్యం అందడం లేదు. డాక్టర్లు, కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతుండడంతో రోగులు ఆర్ఎంపీ, ఇతర వైద్యులను ఆశ్రయిస్తున్నారు. పీహెచ్‌సీల్లోను ప్రసవాలు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకావడం లేదు. జిల్లావ్యాప్తంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను ‘సాక్షి’ బృందం సోమవారం పరిశీలించగా అనేక సమస్యలు వెలుగుచూశాయి. సకాలంలో రాని డాక్టర్లు చింతలపూడి పీహెచ్సీలో డాక్టర్ రాకపోవడంతో స్టాఫ్ నర్సు, ఆరోగ్యమిత్ర కార్యకర్తలు రోగులను పరీక్షించి మందులు ఇచ్చారు. ఇరగవరం పీెహ చ్‌సీ వైద్యుడు సెలవులో ఉండగా ఇన్చార్జి డాక్టరు సౌజన్య 11 గంటలకు వచ్చారు. ఉండ్రాజవరం పీహెచ్సీలో వైద్యుడు సెలవులో ఉన్నారు. స్టాఫ్ నర్సే ఓపీ నిర్వహించారు. టి నర్సాపురం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఎం.నాగేశ్వరరావు 10.30 గంటలకు విధులకు హాజరయ్యారు. లింగపాలెం పీహెచ్సీ డాక్టర్ డిప్యుటేషన్‌పై ఏలూరు వెళ్లడంతో నర్సులు రోగులను పరీక్షించారు. బుట్టాయగూడెం ఆసుపత్రిలో ఉదయం సమయంలో వైద్యాధికారి ఒక్కరే ఉండడంతో రోగులు బారులు తీరుతున్నారు. దెందులూరు పీహెచ్సీలో ఆరుగురు వైద్యులుసాయంత్రం విధులకు డుమ్మా కొడుతున్నారు. ఆచంట సీహెచ్‌సీలో సోమవారం ఆరుగురు వైద్యాధికారులకు ఒక్కరే సేవలు అందించారు. ఇక్కడ గైనకాలజిస్టు, ఎనస్తీషియన్ లేకపోవడంతో ప్రసవాలు జరగడం లేదు. సిబ్బంది, పరికరాల కొరతే అవరోధం ఏలూరు మండలం గుడివాకలంక పీహెచ్‌సీకి ప్రహరీ లేక పశువుల విశ్రాంతి నిలయంగా మారింది. కొయ్యలగూడెంలో సిబ్బంది పోస్టులు ఏళ్లతరబడి భర్తీ కావాల్సి ఉంది. భీమవరం మండలం గొల్లవానితిప్ప పీహెచ్సీలో ప్రసవాల కోసం వచ్చే మహిళలకు సౌకర్యాలు లేవు. కొయ్యలగూడెంలో యుజీపీహెచ్‌సీలో జనరేటర్ లేక విద్యుత్ కోతల వేళల్లో తల్లులు చంటిపిల్లలను చెట్లరే ఊయలలు కట్టి ఆడిస్తున్నారు. చింతలపూడి ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ పని చేయడం లేదు. వసతుల్లేని భవనాలు అత్తిలి పీహెచ్సీ భవనం ఇరుకుగా ఉండడంతో రోగులు ఆరుబయటే కూర్చుంటున్నారు. గోపాలపురం 30 పడకల ఆసుపత్రిలో డాక్టర్టు, సిబ్బంది కొరత వేధిస్తోంది. లంకలకోడేరు పీహెచ్సీలో ఆపరేషన్ థియేటర్ శ్లాబు పాడై వర్షం నీరు లోపలికి వస్తోంది. -
రాజయ్యా.. ఇటు చూడయ్యా..
అస్తవ్యస్తంగా వైద్యసేవలు గాడితప్పిన జిల్లా ఆస్పత్రి నిజామాబాద్ అర్బన్ : ఏడంతస్తుల అద్దాల మేడ సైతం అసౌకర్యాల నిలయంగా మారింది. జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులకు నామమాత్రపు వైద్య సేవలే అందుతున్నాయి. ఆస్పత్రి పాలన పడకేసింది. చక్కబెట్టేందుకు చొరవ తీసుకునే మంత్రులు కాని, ప్రజాప్రతినిధులు కాని లేరు. దీంతో వైద్యం అందక పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య సైతం జిల్లాలో వైద్య సేవలను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి జిల్లావైపు కన్నెత్తి చూడలేదు. మంత్రి జిల్లాలో వైద్య సేవలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. పోస్టులు ఖాళీ.. జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 375 ఉప కేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రి, 10 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఈ ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలో 118 స్టాఫ్‌నర్సులు, 78 మంది ల్యాబ్టెక్నిషియన్లు, 36 మంది ఫార్మసిస్టులు, 22 మంది వైద్యులు, 84 ఏఎన్ఎంల అవసరం ఉంది. ఈ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల క్షేత్రస్థాయి వైద్యసేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పోస్టుల భర్తీపై ప్రభుత్వంనుంచి ఎలాంటి స్పష్టత లేదు. అలాగే ఆస్పత్రుల్లో పరిపాలన సైతం బాగా లేదు. వైద్యలు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. సూపర్వైజర్లు, వైద్యులు రెండు మూడు గంటలు మాత్రమే అందుబాటులో ఉండి వెళ్లిపోతున్నారన్న విమర్శలున్నాయి. మరికొందరు వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీసులో మునిగి తేలుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అస్తవ్యస్తంగా తయ్యారయ్యాయి. మెడికల్ కళాశాలలో నియమితులైన ప్రొఫెసర్ల లో 36 మంది హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. వారు ఆస్పత్రికి రాకుండానే, వైద్యసేవలు అందించకుండానే వేతనాలు పొందుతున్నారు. మరోవైపు దీని అనుబంధ ఆస్పత్రిలో 280 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించి 150 జీవో విడుదలయ్యింది కానీ నియామకాలు లేకపోవడంతో ఆస్పత్రిలో ఖాళీల కొరత వల్ల వైద్యసేవలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. నేటికీ జిల్లా ఆస్పత్రిని ఎక్కడికి తరలించాలి అన్న నిర్ణయమే తీసుకోలేదు. ఆ కళాశాల, జిల్లా ఆస్పత్రి కలిసి ఉండడంతో వైద్యుల మధ్య విభేదాలు ఏర్పడి సేవలపై ప్రభావం పడుతోంది. విజృంభిస్తున్న వ్యాధులు జిల్లాలో పారిశుధ్యం అస్తవ్యస్తగా తయారయ్యింది. దీంతో వైద్యులు విజృంభిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా డెంగీ ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికే 50 వరకు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ముగ్గురు మరణించారు. డయేరియా-22, మలేరియా-78, వైరల్‌ఫీవర్-150 కేసులు నమోదయ్యాయి. వ్యాధుల అదుపునకు వైద్యాధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే అన్న విమర్శలున్నాయి. జిల్లాలో వ్యాధులు ప్రబలుతున్నా అధికారులతోపాటు ప్రజాప్రతినిధులూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య శాఖ మంత్రి జిల్లాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
తీరు మారని వైద్యులు
సాక్షి, గుంటూరు రవాణా సౌకర్యం సక్రమంగా లేని మారుమూల గ్రామాల్లో సైతం నిరుపేదలకు ప్రాథమిక వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వెలవెలబోతున్నాయి. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న వైద్యాధికారులు ఆసుపత్రులకు సక్రమంగా రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ప్రైవేటు వైద్యశాలలు పెట్టుకుని వారికి తీరినప్పుడు పీహెచ్‌సీలకు వస్తూ మమ అనిపిస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి పీహెచ్‌సీలకు వస్తున్న రోగులకు తమ ప్రైవేట్ ఆసుపత్రుల అడ్రస్ ఇచ్చి అక్కడకు రమ్మంటూ తమ ప్రాక్టీస్ పెంచుకుంటున్నారు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైతే మధ్యాహ్నానికి మూతపడుతున్నాయి. ఆదివారం వచ్చిందంటే అసలు తలుపులు కూడా తెరవని పరిస్థితి. ఆదివారం ఆరోగ్య కేంద్రాలకు సెలవు దినమనే భావన గ్రామీణ ప్రజల్లో ఉందంటే పీహెచ్‌సీల పనితీరు ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలు జరిగినా, కుక్కకాటు, పాముకాటుకు గురైనా కనీసం ప్రాథమిక వైద్యం అందని దుస్థితి నెలకొంది. వైద్యులు అందుబాటులో లేక నర్సులు, దోబీలు, వాచ్మెన్లు డాక్టర్ అవతారమెత్తి క్షతగాత్రులకు చికిత్స, ఇంజక్షన్ చేస్తున్నారు. తీవ్రగాయాలైన వారిని ప్రాథమిక వైద్య సేవలకోసం ఆరోగ్య కేంద్రాలకు తీసుకువస్తే డాక్టర్లు అందుబాటులో లేక మరింత రక్తస్రావమే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. జీవో జారీ చేసి 15 రోజులైనా... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం జీవో జారీ చేసి 15 రోజులు దాటినా జిల్లాలో ఎక్కడా ఇది అమలు కావడంలేదు. ఇది కాగితాలకే పరిమితమైంది. ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యాధికారులు 11 గంటలు దాటితేగాని ఆసుపత్రి మొఖం చూడటంలేదు. వచ్చి రెండు గంటలు కూడా రోగులకు అందుబాటులో లేకుండా మధ్యాహ్నం ఒంటిగంట కల్లా భోజన విరామమంటూ వెళ్ళిపోతున్నారు. అలా వెళ్లినవారు ఇక ఆ రోజుకి మళ్ళీ కనిపించడంలేదని రోగులు వాపోతున్నారు. జ్వరాలు అధికంగా వచ్చే సీజన్ అయినప్పటికీ నర్సుల ద్వారానే తమ కార్యకలాపాలను నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, అందులో సుమారు 80 శాతం మంది వైద్యులు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండకుండా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్నారు. దీంతో వారు ఆసుపత్రికి ఏ సమయానికి చేరతారో, ఎప్పుడు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మాత్రం స్థానికంగా నివాసం ఉండని వారిపై, సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఊదరగొట్టడం మినహా పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటివారిపై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. -
ఆన్లైన్లో ఆరోగ్యం!
రాజస్థాన్ తరహా సాంకేతిక వ్యవస్థ హైదరాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆన్లైన్లో వైద్యసేవలు ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చిన రోగి వివరాలు, ఔషధాల పేర్లను కంప్యూటర్లో నమోదు చేసేలా రాజస్థాన్ తరహా విధానాన్ని అనుసరించనున్నాయి. త్వరలో ‘సి-డాక్’ అనే సంస్థతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని సుమారు 1,709 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆన్లైన్ సేవల కోసం సాంకేతిక వ్యవస్థను సమకూర్చుకునేందుకు సుమారు రూ.34 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. నాలుగు నెలల క్రితమే ఆరుగురు ఐఏఎస్ అధికారుల బృందం నేతృత్వంలో రాజస్థాన్‌లో పర్యటించి కసరత్తు చేశారు. దీనివల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సేవలు మరింత చేరువవుతాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నిధులతో పీహెచ్‌సీల కోసం రూ.10 కోట్లు వెచ్చించి ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశారు. -
పీహెచ్‌సీలకు మహర్దశ
నలుగురు వైద్యులు, 30 పడకలు మీడియా ఇష్టాగోష్టిలో డిప్యూటీ సీఎం హైదరాబాద్: గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)ను బలోపేతం చేసే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య వెల్లడించారు. నలుగురు వైద్యులు, 30 పడకలతో పీహెచ్‌సీలను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. హైడ్రోసిల్, కుటుంబ నియంత్రణ వంటి ఆపరేషన్లను పీహెచ్‌సీల్లోనే నిర్వహించేలా భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో తనను కలిసి మీడియాతో రాజయ్య ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆరోగ్య శ్రీ లబ్ధిదారులు ఎక్కువగా కార్పొరేట్ ఆస్పత్రులనే ఆశ్రయిస్తుండడంతో ప్రభుత్వ డబ్బంతా కార్పొరేట్ జేబుల్లోకే వెళ్తుందన్నారు. ఈ నేపథ్యంలో మేజర్ పంచాయతీల్లోని పీహెచ్‌సీలు, మండల కేంద్రాల్లోని ఆస్పత్రులను బలోపేతం చేసి, ఆరోగ్య శ్రీ కిందకు వచ్చే చిన్నచిన్న రోగాలకు ఈ ఆస్పత్రుల్లోనే వైద్యం అందించేలా భవిష్యత్ ప్రణాళిక ఉంటుందన్నారు. జర్నలిస్టులకూ ఆరోగ్య బీమా అమలు చేయండి: ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకూ ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యుజే) నేతలు ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్యకు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం ఐజేయూ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీతో పాటు మరికొందరు సచివాలయంలో మంత్రిని కలసి వినతిపత్రం అందించారు. తమ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ మీడియాకు తెలిపారు. సేవలకు దూరంగా ఉన్నోళ్లు రాక్షసులే ‘వైద్యం మానవత్వంతో ముడిపడి ఉంది. అందుకే వైద్యులను దేవుళ్లతో పోలుస్తారు. వైద్యులే కాదు ఆశా వర్కర్ కూడా దేవుడితో సమానం. మానవత్వంతో రోగులకు సేవలందిస్తే దేవుళ్లు.. లేకుంటే రాక్షసులే’ అని ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య అన్నారు. శుక్రవారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవం వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. -
ఆస్పత్రి నిధులు హాంఫట్
నిజామాబాద్ అర్బన్,న్యూస్‌లైన్ : జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రులు, ఒక జిల్లా ఆస్పత్రి ఉంది. వీటిలో ప్రతి ఏడాది పీహెచ్‌సీలకు రూ. 1.75 లక్షలు, ఏరియా ఆస్పత్రులకు రూ. 2 లక్షలు, జిల్లా ఆస్పత్రికి రూ. 5 లక్షల చొప్పున అభివృద్ధి నిధులు మంజూరవుతాయి. ఈ నిధులతో ఆస్పత్రులలో కనీస సౌకర్యాలు కల్పించడంతోపాటు వైద్య పరికరాలను కొనుగోలు చేస్తారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిధులను వినియోగిస్తారు. కమిటీకి చైర్మన్‌గా సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్(ఎస్పీహెచ్ఓ), మెడికల్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ సర్పంచ్ సభ్యులుగా ఉంటారు. మిగిలిపోయిన నిధులను కమిటీ నిర్ణయం మేరకు జిల్లా కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఏం జరుగుతోంది కొన్ని సంవత్సరాలుగా ఆస్పత్రి అభివృద్ధి నిధులను అధికారులు సక్రమంగా వినియోగించడం లేదు. పీహెచ్సీలలో ఎస్పీహెచ్ఓలు, మెడికల్ వైద్యులు కలిసి నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రులలో అవసరం లేకున్నా నిధులు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో కేవలం 20 ఆస్పత్రులలో మాత్రమే ఆప రేషన్లు చేసేందుకు సౌకర్యాలు ఉన్నాయి. మిగితా 22 ఆస్పత్రులలో ఆ అవకాశం లేదు. ఆపరేషన్ థియేటర్లు కూడా లేవు. కానీ, ఈ దవాఖానాలకు కూడా ఆపరేషన్‌కు సం బంధించిన పరికరాలు, ఇతరత్రా విలువైన పరికరాలు కొనుగోలు చేసినట్లు తప్పుడు బిల్లులు సమర్పించినట్లు సమాచారం. ఎక్కడెక్కడ ఈ క్రమంలో లక్షలాది రూపాయలు అధికారుల జేబులలోకి వెళ్తున్నాయి. జిల్లాలోని లింగంపేట, గాంధారి, జుక్కల్, జిల్లా ఆస్పత్రిలో ఈ తరహాలో నే నిధులును మిం గేసినట్లు తెలుస్తోంది. డిచ్పల్లిలోని ఆస్పత్రిలో మొక్క లు నాటడానికి రూ. 5 వేలు ఖర్చు అయితే రూ. 36 వేలు వెచ్చించినట్లు చూపించారు. జిల్లా ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా శానిటేషన్‌కు నిధులను కేటాయించారు. వాస్తవానికి జిల్లా ఆస్పత్రిలో శానిటేషన్‌కు వైద్యవిధాన పరిషత్ నిధులను విడుదల చేస్తుంది. ఇలా ప్రతి ఆస్పత్రిలో నిధుల వినియోగంలో అవినీతి జరుగుతోంది. అభివృద్ధి కమిటీ సభ్యుల మొదలు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలోని సెక్షన్ ఉద్యోగి వరకు పంపకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆడిట్ తీరూ అదే ఆస్పత్రులలో నిధుల వినియోగంపై ఏటా ఆడిట్ నిర్వహిస్తారు. లొసుగు లు బయట పడకుండా ప్రతి పీహెచ్సీ నుంచి రూ. 5 వేలు వసూలు చేసి ఆడిటర్లకు ఇస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి జిల్లా కార్యాల యంలోని ఒక సూపరిండెంట్ ప్రధానసూత్రధారిగా చెప్పుకుంటున్నారు. -
లెక్కల్లేవ్..!
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఎన్ఆర్ఎం కింద మంజూరైన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ(హెచ్‌డీఎస్) నిధులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), కమ్యూనిటీ, ఏరియా ఆస్పత్రుల అభివృద్ధికి వినియోగిస్తారు. ఈ నిధులు వైద్యాధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. నాలుగేళ్లలో సుమారు రూ.5 కోట్లు మంజూరు కాగా, ఇందులో రూ.3.25 కోట్లకు యూటిలైజేషన్ రశీదులు అందజేశారు. మిగతా రూ.1.74 కోట్ల యూసీలు అందజేయలేదు. ఖర్చయిన నిధుల్లో కూడా అవకతవకలు జరిగాయి. వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి బిల్లులు మాత్రం అధిక ధర చూసి స్వాహా చేశారు. ఇక ఖర్చుకాని నిధులకు లెక్కలు కూడా లేవు. మొత్తానికి వచ్చిన డబ్బులు ఖర్చయినట్లు వైద్యాధికారులు చూపిస్తున్నారు. గతేడాది ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.75 లక్షలు వచ్చాయి. ఇందులో నుంచి పలుచోట్ల ఒక ఇన్వర్టర్, వాటర్ ప్యూరీఫైడ్, భవనానికి పెయింటింగ్ చేయించి మిగతా సగానికి పైగా నిధులను హాంఫట్ చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే నిధులు దుర్వినియోగానికి గురయ్యాయి. అధికారులు దృష్టిసారిస్తే అవినీతి బాగోతం బయటపడే అవకాశం ఉంది. చేయాల్సిందిలా... త్వరలో జిల్లాలోని ఒక్కొక్క పీహెచ్‌సీకి రూ.1.75 లక్షలు వచ్చే అవకా శం ఉంది. ఈ నిధుల వినియోగంపై ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో చ ర్చించి.. తీసుకున్న తీర్మాణాలకు అనుగుణంగా ఖర్చుచేయాలి. జిల్లా లో 72 పీహెచ్‌సీలు ఉండగా 17 క్లస్టర్లుగా వీటిని విభజించారు. క్లస్టర్‌కు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్(ఎస్పీహెచ్వో) ఉంటారు. మండల పరి షత్ అధ్యక్షుడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి చైర్మన్‌గా ఉంటాడు. ఎన్నిక లు జరగక పోవడంతో ఎస్పీహెచ్వో చైర్మన్‌గా, మెడికల్ ఆఫీసర్ మెం బర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వీరిద్దరు జాయింట్ చెక్‌పవర్ కలిగి ఉంటారు. సభ్యులుగా పీహెచ్సీ పరిధిలోని గ్రామాల మహిళ సర్పం చ్‌లు, ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లు, స్థానిక సర్పంచ్, మహిళ సమైక్య అధ్యక్షురాలు, ఇద్దరు ఎంపీటీసీలు, తహశీల్దార్, ఎంపీడీవో, ఓ సీనియర్ మెడికల్ ఆఫీసర్లు ఉంటారు. వీరందరి సమక్షంలో ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఆస్పత్రుల్లో రోగుల సౌకర్యార్థం కుర్చీలు, పడకలు, శానిటేషన్, టాయిలెట్స్, కిటికీల మరమ్మతు, కర్టెన్లు, అత్యవసర మందులు, భవన మరమ్మతులు, తాత్కాలిక షెల్టర్లు నిర్మించవచ్చు. అయితే సమావేశాలు నిర్వహించకుండానే, తీర్మానాలు చేయకుండానే వైద్యాధికారులు నిదులు దుర్వినియోగం చేశారు. సగం నిధులు అభివృద్ధికి వినియోగిస్తూ.. మిగతా నిధులు స్వాహా చేశారు. ఈ విషయమై.. న్యూస్‌లైన్ డీఎంహెచ్‌వో స్వామిని వివరణ కోరగా యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలని హెచ్‌డీఎస్ చైర్మన్‌కు, వైద్యాధికారులకు పలుమార్లు సర్క్యూలర్లు జారీ చేశాం. ఒకవేళ దుర్వినియోగం చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. -
పేదల మాత్రలకు కత్తెర
ప్రభుత్వాస్పత్రులకు ఇచ్చే 262 రకాల అత్యవసర ఔషధాలను జాబితా నుంచి తొలగిస్తూ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: తీవ్ర జ్వరమో, నొప్పో వచ్చి ప్రభుత్వాసుపత్రి దారి పట్టారా..? అయితే యూంటీ బయూటిక్స్తో పాటు అత్యవసర మందులు మీరే కొనుక్కోవాల్సిందిగా డాక్టరు చిట్టీ రాసి ఇవ్వొచ్చు. ఇంతేకాదు దగ్గు, జలుబు మందులు కూడా ఇక నుంచి సర్కారు దవాఖానాల్లో కరువుకానున్నాయి. దీనంతటికీ కారణం ప్రభుత్వాస్పత్రులకు అందజేసే అత్యవసర మందుల్లో కోత విధించడమే. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 262 రకాల అత్యవసర వుందులను ప్రభుత్వం కొనుగోలు జాబితా నుంచి తొలగించింది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉండే మందుల సంఖ్య తగ్గిపోనుంది. ఇది పేద రోగులకు తీవ్ర నష్టం కలిగించనుంది. గత ఆరు మాసాలుగా కసరత్తు చేసిన ఉన్నతాధికారులు మందుల జాబితాను కుదిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అత్యవసర మందుల జాబితాను కుదిస్తూనే... మరోవైపు అదనపు మందుల జాబితా (అడిషనల్ మెడిసిన్స్ లిస్ట్)ను పెంచారు. కానీ, ఈ అదనపు మందులను ఎప్పుడో ఒకసారి గానీ కొనుగోలు చేయరు. దీంతో ప్రభుత్వ చర్యపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర మందులు అందరికీ అందుబాటులో ఉండాలని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో ఆ మందులన్నీ ఉండాలని.. అవసరాన్ని బట్టి కొనడమో, కొనకపోవడమో చేయవచ్చునని పేర్కొంటున్నారు. అంతేగానీ ఏకంగా జాబితా నుంచే తీసేయడం పేదలకు అన్యాయం చేసినట్లేనని మండిపడుతున్నారు. ఇప్పటికే కొరత: మందుల జాబితాలో ప్రభుత్వమే కోత విధించింది గనుక.. సర్కారు ఆసుపత్రుల్లో అవసరమైన మందులు లేకపోతే ఎవరినీ ప్రశ్నించేందుకు అవకాశం ఉండదు. అడిగినా స్పందించే పరిస్థితి ఉండదు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర జాబితా నుంచి 262 రకాల మందులను ప్రభుత్వం తొలగించింది. గతంలో 601 రకాల మందులు అత్యవసర జాబితాలో ఉండేవి. ఇప్పుడు వాటిని 339కి తగ్గించారు. పీహెచ్‌సీలకు భారీగా కత్తెర: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందే మందుల్లో ఇకపై భారీగా కోత పడనుంది. రోగికి అవసరమున్నా, వైద్యుడు చీటీలో రాసినా అవి లభించవు. దాదాపుగా పీహెచ్‌సీల్లో 30 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వాటికి మించి ఏ మాత్రలు, ఔషధాలు అవసరమైనా.. పెద్దాసుపత్రికి వెళ్లాల్సిందే. తీవ్ర జ్వరాలకు వాడే తక్కువ మోతాదులోని యాంటీ బయోటిక్స్ మందులకు కూడా కత్తెర వేశారు. మరోవైపు ఇప్పటికే కొన్ని పీహెచ్‌సీల్లో ప్రసూతి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ప్రసూతి సమయంలో అవసరమైన మందులు ఇకపై వాటిల్లో ఉండవు. అసలు చిన్న జబ్బులు వచ్చినవారే పీహెచ్‌సీలకు వస్తారని.. అంతకు మించిన మందులు అవసరమైతే ఏరియా లేదా, జిల్లా ఆస్పత్రులకు వెళ్లి తెచ్చుకోవాలని రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) అధికారులకు సూచించడం గమనార్హం. -
అంపశయ్యపై ‘ఆరోగ్యం’
సాక్షి, కొత్తగూడెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యలతో కునారిల్లుతున్నాయి. వైద్యులు, సిబ్బంది లేకపోవడం ఒకటైతే.. పాము కాటు, ఇతర జబ్బులకు అవసరమైన మందులు రోగులకు దొరకడం గగనమే అవుతోంది. ఉన్న సిబ్బంది పట్టణ కేంద్రాల నుంచి రాకపోకలు చేస్తుంటే..కొన్నిచోట్ల కేంద్రాలకు రాకుండా విధులకు ఎగనామం పెడుతున్నారు. ఏటా కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నా నిరుపేద రోగులకు మాత్రం వైద్యం అందకపోవడం శోచనీయం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో ఏజెన్సీలో 50, మైదాన ప్రాంతంలో 19 పీహెచ్‌సీలున్నాయి. ఇవికాక అర్బన్ హెల్త్ సెంటర్లు 8, అర్బన్ ఫ్యామిలీ వెల్పేర్ సెంటర్లు 4, పిపి (పోస్ట్‌పోర్టం) యూనిట్లు రెండు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 12 వరకు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో మొత్తం 2,991 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా 2,267 పోస్టులనే భర్తీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. డాక్టర్లు, ఇతర సిబ్బందితో కలిపి జిల్లాలో ఇంకా 713 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేసిన పోస్టుల్లో వైద్యాధికారుల పోస్టులను చూపిస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విధులలో కనబడడంలేదు. అంతేకాకుండా ప్రధానంగా ఖమ్మం నగరం, కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల నుంచి కొందరు డాక్టర్లు, సిబ్బంది జిల్లాలోని ఇతరప్రాంతాల పీహెచ్‌సీలకు రాకపోకలు చేస్తున్నారు. వారు సకాలంలో విధులకు హాజరుకాకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక కొన్ని సబ్ సెంటర్లకు నర్సులే దిక్కయ్యారు. వీరు విధులకు రాకపోతే ఆరోగ్య కేంద్రం తీసేవారే లేరు. ప్రభుత్వం జిల్లాకు 29రకాల యాంటీ బయాటిక్స్, 143 రకాల జనరల్ మందులు, 91 రకాల సర్జికల్ మెటీరియల్ సరఫరా చేయాలి. కానీ ఇవేమీ పీహెచ్‌సీల్లో ఉండవు. చాలా పీహెచ్‌సీల్లో ఏజబ్బుకైనా బీకాంప్లెక్స్, ఐరన్ మాత్రలే ఇచ్చి పంపుతున్నారు. భద్రాచలం ఏజెన్సీలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కొన్ని ఆస్పత్రుల్లో రోగులకు మందు బిళ్లలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇక పాము కాటు వేస్తే ప్రాణాలు పోవలసిందే. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో అసలు పాముకాటుకు సంబంధించి యాంటీ స్నేక్ వీనమ్ (ఏఎస్వీ) మందులు అందుబాటులోనే లేవు. కుక్కకాటు మందుది కూడా ఇదే పరిస్థితి. ఖమ్మంనగరంలోని ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధినిరోధక టీకాలను భద్రపరిచేందుకు ఉపయోగించే రిఫ్రిజిరేటర్లు పని చేయడం లేదు. కొంతమంది ఎన్జీవోలు డాక్టర్లకు కేటాయించిన గదులను స్టోర్ రూమ్‌గా ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా ఖమ్మంఅర్బన్ హెల్త్ సెంటర్లోకి వస్తున్న రోగులను ప్రతి దానికి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. మధిర మండల పరిధిలోని మాటూరుపేట పీహెచ్‌సీకి సొంత భవనం లేకపోవడంతో తాత్కాలికంగా సబ్సెంటర్లో నడుపుతున్నారు. పీహెచ్సీ భవన నిర్మాణం ఏడాదిగా సాగుతోంది. తాత్కాలిక భవనంలో మరుగుదొడ్లు లేవు. కనీసం తాగునీటి సౌకర్యంలేదు. అంతేకాకుండా రోగులకు బెడ్లు కూడా లేవు. ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల, ఎర్రుపాలెం గ్రామాల్లోని సబ్‌సెంటర్ల భవనాలు శిథిలావస్థకు చేరడంతో అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. ముదిగొండ కేంద్రానికి డాక్టర్ సకాలంలో రాకపోవడంతో అక్కడి స్టాఫ్‌నర్స్, అటెండరే రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. కొణిజర్ల, ఏన్కూరు పీహెచ్‌సీలకు రెగ్యులర్ వైద్యుల నియామక ం జరగలేదు. ఇన్చార్జి వైద్యులే ఉండటంతో వారు కేవలం 12 గంటల వరకే విధుల్లో ఉంటున్నారు. ఏన్కూరులో వైద్యసిబ్బంది విధులకు గైర్హాజరవుతుండడంతోపాటు సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. అలాగే గత ఐదు నెలలుగా ఒక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా ఇక్కడ చేయలేదు. కారేపల్లి పీహెచ్సీలో ఏ జబ్బుకైనా బీకాంప్లెక్స్, ఐరన్ మాత్రలు ఇచ్చి పంపుతున్నారు. ఖమ్మంరూరల్ మండలం ఎం. వెంకటాయపాలెంలోని పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఆవైద్యుడు కూడా నెలలో వారం రోజులే ఆస్పత్రికి వస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. కూసుమంచిలోని కేంద్రంలో ఉన్న ఒక్క డాక్టర్ బయటి ప్రాంతాలకు విధులకు వెళ్లడంతో హాస్పిటల్ బాధ్యతలు కేవలం స్టాఫ్‌నర్స్ చూసుకోవాల్సి వస్తోంది. భద్రాచలం మండలం గౌరిదేవిపేట పీహెచ్సిలో వ్యాక్సిన్లు భద్రపరిచేందుకు అవసరమైన ఐస్‌ప్యాక్‌ల తయారీకి వాడే డీప్ఫ్రిజ్ గత ఏడాది కాలంగా పనిచేయటంలేదు. దీంతో వచ్చే పల్స్‌పోలియో కార్యక్రమానికి వ్యాక్సిన్లను భద్రపరిచే వీలు లేదు. ఆస్పత్రి భవనాలు శిథిలావస్థలో ఉండడంతో వర్షానికి గదుల్లో నీరు నిలిచి రోగులకు ఇబ్బందిగా మారుతోంది. లక్ష్మీపురం ఆస్పత్రి ప్రహరీ కూలిపోవటంతో పశువులు ప్రాంగణంలోనే ఉంటున్నాయి. చర్ల మండలంలోని సత్యనారాయణపురం, చర్ల పీహెచ్‌సీల్లో సిబ్బంది, అంబులెన్స్ కొరత ఉంది. చర్లలో భవనాలు శిథిలావస్థలో ఉండటంతో సీమాంక్ సెంటర్లోనే రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల, ములకపాడు, వాజేడు, వెంకటాపురం, కూనవరం, కూటూరు పీహెచ్‌సీల్లో తగిన సిబ్బంది లేకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు తిరిగి వెళ్తున్నారు. కుక్కునూరు, అమరవరం పీహెచ్‌సీల్లో చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్ల స్టాక్లేదు. ఇక్కడ బీసీజీ వ్యాక్సిన్, దగ్గు, యాంటీబయోటిక్ మందులు లేవు. దమ్మపేట మండలం మందలపల్లి, పట్వారీగూడెం పీహెచ్‌సీల్లో ఏఎన్ఎంల కొరత వేధిస్తోంది. మందలపల్లి పీహెచ్సీలో 9మంది ఏఎన్ఎంలకు గాను కేవలం ఒక ఏఎన్ఎం మాత్రమే ఉన్నారు. మణుగూరు మండలంలోని పీహెచ్‌సీకి వైద్యులు సకాలంలో రావడం లేదు. పినపాక మండలంలో జానంపేట, పినపాక, కరకగూడెం గ్రామాల్లోని పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ అందుబాటులో లేదు. ఇచ్చిన ఫ్రిజ్‌లు పనిచేయడంలేదు. అలాగే గుండాల మండలం ఆల్లపల్లి పీహెచ్సీలో మందుల కొరత వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తల్లాడ పీహెచ్సీలో ఒక ఏఎన్ఎం, ఒక హెచ్వీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రేకుల షెడ్డులో ఉన్న రోగుల వార్డు పైకప్పు ఇటీవల తుపానుకు లేచిపోయి అధ్వానంగా తయారైంది. కల్లూరు పీహెచ్సీలో పదేళ్లుగా ఎక్స్‌రే ప్లాంట్ పనిచేయకపోవటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పెనుబల్లి మండలం లంకాసాగర్ పీహెచ్సీలో సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. గార్ల మండలం ముల్కనూరు పీహెచ్సీ సిబ్బంది ఖమ్మం నుంచి రాకపోకలు చేస్తుండడంతో ఆస్పత్రిని సకాలంలో తెరవడం లేదు. బయ్యారం మండలం గంధంపల్లి పీహెచ్సీలో స్టాఫ్ నర్స్ వైద్యం అందిస్తున్నారు. టేకులపల్లి మండలం సులానగర్ పీహెచ్సీలో ఆయుర్వేద డాక్టర్, స్టాఫ్‌నర్స్ లేరు. ఇక్కడి భవనం శిథిలావస్థకు చేరడంతో వర్షం వస్తే కురుస్తుంది. పాల్వంచలో జగన్నాథపురం పీహెచ్సీలో వైద్యానికి కనీస సౌకర్యాలు లేవు. హెల్త్‌అసిస్టెంట్ పోస్టులు మూడు ఖాళీగా ఉన్నాయి. కొత్తగూడెం మండలంలోని రేగళ్ల పీహెచ్సీ 24 గంటల ఆస్పత్రి. కానీ ఇక్కడ ఒక్కరే డాక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. టైఫాయిడ్‌కు సంబంధించిన మందులు ఈ ఆస్పత్రిలో అందుబాటులో లేవు.