అంపశయ్యపై ‘ఆరోగ్యం’ | Problems in Primary Health Centres | Sakshi
Sakshi News home page

అంపశయ్యపై ‘ఆరోగ్యం’

Published Sat, Dec 14 2013 5:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

Problems in Primary Health Centres

సాక్షి, కొత్తగూడెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యలతో కునారిల్లుతున్నాయి.  వైద్యులు, సిబ్బంది లేకపోవడం ఒకటైతే.. పాము కాటు, ఇతర జబ్బులకు అవసరమైన మందులు  రోగులకు దొరకడం గగనమే అవుతోంది. ఉన్న సిబ్బంది పట్టణ కేంద్రాల నుంచి రాకపోకలు చేస్తుంటే..కొన్నిచోట్ల కేంద్రాలకు రాకుండా విధులకు ఎగనామం పెడుతున్నారు. ఏటా కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నా నిరుపేద రోగులకు మాత్రం వైద్యం అందకపోవడం శోచనీయం.
 
 జిల్లా వ్యాప్తంగా మొత్తం 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో   ఏజెన్సీలో 50, మైదాన ప్రాంతంలో 19 పీహెచ్‌సీలున్నాయి. ఇవికాక అర్బన్ హెల్త్ సెంటర్లు 8, అర్బన్ ఫ్యామిలీ వెల్పేర్ సెంటర్లు 4, పిపి (పోస్ట్‌పోర్టం) యూనిట్‌లు రెండు,  కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 12  వరకు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో మొత్తం 2,991 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా 2,267 పోస్టులనే భర్తీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. డాక్టర్లు, ఇతర సిబ్బందితో కలిపి జిల్లాలో ఇంకా 713 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేసిన పోస్టుల్లో వైద్యాధికారుల పోస్టులను చూపిస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విధులలో కనబడడంలేదు. అంతేకాకుండా ప్రధానంగా ఖమ్మం నగరం, కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల నుంచి కొందరు డాక్టర్లు, సిబ్బంది జిల్లాలోని ఇతరప్రాంతాల పీహెచ్‌సీలకు రాకపోకలు చేస్తున్నారు. వారు సకాలంలో విధులకు హాజరుకాకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక కొన్ని సబ్ సెంటర్లకు నర్సులే దిక్కయ్యారు.
 
 వీరు విధులకు రాకపోతే ఆరోగ్య కేంద్రం తీసేవారే లేరు. ప్రభుత్వం జిల్లాకు 29రకాల యాంటీ బయాటిక్స్, 143 రకాల జనరల్ మందులు, 91 రకాల సర్జికల్ మెటీరియల్ సరఫరా చేయాలి. కానీ ఇవేమీ పీహెచ్‌సీల్లో ఉండవు. చాలా పీహెచ్‌సీల్లో ఏజబ్బుకైనా బీకాంప్లెక్స్, ఐరన్ మాత్రలే ఇచ్చి పంపుతున్నారు. భద్రాచలం ఏజెన్సీలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కొన్ని ఆస్పత్రుల్లో రోగులకు  మందు బిళ్లలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇక పాము కాటు వేస్తే ప్రాణాలు పోవలసిందే. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో అసలు పాముకాటుకు సంబంధించి యాంటీ స్నేక్ వీనమ్ (ఏఎస్‌వీ) మందులు అందుబాటులోనే లేవు. కుక్కకాటు మందుది కూడా ఇదే పరిస్థితి.


  ఖమ్మంనగరంలోని ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధినిరోధక టీకాలను భద్రపరిచేందుకు ఉపయోగించే రిఫ్రిజిరేటర్లు పని చేయడం లేదు. కొంతమంది ఎన్‌జీవోలు డాక్టర్లకు కేటాయించిన గదులను స్టోర్ రూమ్‌గా ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా ఖమ్మంఅర్బన్ హెల్త్ సెంటర్‌లోకి వస్తున్న రోగులను ప్రతి దానికి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు.
 
  మధిర మండల పరిధిలోని మాటూరుపేట పీహెచ్‌సీకి సొంత భవనం లేకపోవడంతో తాత్కాలికంగా సబ్‌సెంటర్‌లో నడుపుతున్నారు. పీహెచ్‌సీ భవన నిర్మాణం ఏడాదిగా సాగుతోంది. తాత్కాలిక భవనంలో మరుగుదొడ్లు లేవు. కనీసం తాగునీటి సౌకర్యంలేదు. అంతేకాకుండా రోగులకు బెడ్లు కూడా లేవు. ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల, ఎర్రుపాలెం గ్రామాల్లోని సబ్‌సెంటర్ల భవనాలు శిథిలావస్థకు చేరడంతో అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. ముదిగొండ కేంద్రానికి డాక్టర్ సకాలంలో రాకపోవడంతో అక్కడి స్టాఫ్‌నర్స్, అటెండరే రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు.
 
  కొణిజర్ల, ఏన్కూరు పీహెచ్‌సీలకు రెగ్యులర్ వైద్యుల నియామక ం జరగలేదు. ఇన్‌చార్జి  వైద్యులే ఉండటంతో వారు కేవలం 12 గంటల వరకే విధుల్లో ఉంటున్నారు.
 
     ఏన్కూరులో వైద్యసిబ్బంది విధులకు గైర్హాజరవుతుండడంతోపాటు సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. అలాగే గత ఐదు నెలలుగా ఒక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా ఇక్కడ చేయలేదు. కారేపల్లి పీహెచ్‌సీలో ఏ జబ్బుకైనా బీకాంప్లెక్స్, ఐరన్ మాత్రలు ఇచ్చి పంపుతున్నారు.
 
  ఖమ్మంరూరల్ మండలం ఎం. వెంకటాయపాలెంలోని పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఆవైద్యుడు కూడా నెలలో వారం రోజులే ఆస్పత్రికి వస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. కూసుమంచిలోని కేంద్రంలో ఉన్న ఒక్క డాక్టర్ బయటి ప్రాంతాలకు విధులకు వెళ్లడంతో హాస్పిటల్ బాధ్యతలు కేవలం స్టాఫ్‌నర్స్ చూసుకోవాల్సి వస్తోంది.
  భద్రాచలం మండలం గౌరిదేవిపేట పీహెచ్‌సిలో వ్యాక్సిన్లు భద్రపరిచేందుకు అవసరమైన ఐస్‌ప్యాక్‌ల తయారీకి వాడే డీప్‌ఫ్రిజ్ గత ఏడాది కాలంగా పనిచేయటంలేదు. దీంతో వచ్చే పల్స్‌పోలియో కార్యక్రమానికి వ్యాక్సిన్లను భద్రపరిచే వీలు లేదు. ఆస్పత్రి భవనాలు శిథిలావస్థలో ఉండడంతో వర్షానికి గదుల్లో నీరు నిలిచి రోగులకు ఇబ్బందిగా మారుతోంది. లక్ష్మీపురం ఆస్పత్రి ప్రహరీ కూలిపోవటంతో పశువులు ప్రాంగణంలోనే ఉంటున్నాయి. చర్ల మండలంలోని సత్యనారాయణపురం, చర్ల పీహెచ్‌సీల్లో సిబ్బంది, అంబులెన్స్ కొరత ఉంది. చర్లలో భవనాలు శిథిలావస్థలో ఉండటంతో సీమాంక్ సెంటర్‌లోనే రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల, ములకపాడు, వాజేడు, వెంకటాపురం, కూనవరం, కూటూరు పీహెచ్‌సీల్లో  తగిన సిబ్బంది లేకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు తిరిగి వెళ్తున్నారు.
 
  కుక్కునూరు, అమరవరం పీహెచ్‌సీల్లో చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్‌ల స్టాక్‌లేదు. ఇక్కడ బీసీజీ వ్యాక్సిన్, దగ్గు, యాంటీబయోటిక్ మందులు లేవు.  దమ్మపేట మండలం మందలపల్లి, పట్వారీగూడెం పీహెచ్‌సీల్లో ఏఎన్‌ఎంల కొరత వేధిస్తోంది. మందలపల్లి పీహెచ్‌సీలో 9మంది ఏఎన్‌ఎంలకు గాను కేవలం ఒక ఏఎన్‌ఎం మాత్రమే ఉన్నారు.
 
  మణుగూరు మండలంలోని పీహెచ్‌సీకి వైద్యులు సకాలంలో రావడం లేదు. పినపాక మండలంలో జానంపేట, పినపాక, కరకగూడెం గ్రామాల్లోని పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ అందుబాటులో లేదు. ఇచ్చిన ఫ్రిజ్‌లు పనిచేయడంలేదు. అలాగే గుండాల మండలం ఆల్లపల్లి పీహెచ్‌సీలో మందుల కొరత వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
 
  తల్లాడ పీహెచ్‌సీలో ఒక ఏఎన్‌ఎం, ఒక హెచ్‌వీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రేకుల షెడ్డులో ఉన్న రోగుల వార్డు పైకప్పు ఇటీవల తుపానుకు లేచిపోయి అధ్వానంగా తయారైంది. కల్లూరు పీహెచ్‌సీలో పదేళ్లుగా ఎక్స్‌రే ప్లాంట్ పనిచేయకపోవటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పెనుబల్లి మండలం లంకాసాగర్ పీహెచ్‌సీలో సిబ్బంది సమయపాలన పాటించడం లేదు.
 
  గార్ల మండలం ముల్కనూరు పీహెచ్‌సీ సిబ్బంది ఖమ్మం నుంచి రాకపోకలు చేస్తుండడంతో ఆస్పత్రిని సకాలంలో తెరవడం లేదు. బయ్యారం మండలం గంధంపల్లి పీహెచ్‌సీలో స్టాఫ్ నర్స్ వైద్యం అందిస్తున్నారు. టేకులపల్లి మండలం సులానగర్ పీహెచ్‌సీలో ఆయుర్వేద డాక్టర్, స్టాఫ్‌నర్స్ లేరు. ఇక్కడి భవనం శిథిలావస్థకు చేరడంతో వర్షం వస్తే కురుస్తుంది.
 
  పాల్వంచలో జగన్నాథపురం పీహెచ్‌సీలో వైద్యానికి కనీస సౌకర్యాలు లేవు. హెల్త్‌అసిస్టెంట్  పోస్టులు మూడు ఖాళీగా ఉన్నాయి. కొత్తగూడెం మండలంలోని రేగళ్ల పీహెచ్‌సీ 24 గంటల ఆస్పత్రి. కానీ ఇక్కడ ఒక్కరే డాక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. టైఫాయిడ్‌కు సంబంధించిన మందులు ఈ ఆస్పత్రిలో అందుబాటులో లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement