మందుల మాయ !
-
జిల్లాలో సీజనల్ మెడిసిన్ కరువు
-
కమీషన్ల కోసం కాలయాపన
-
ఇబ్బందులు పడుతున్న రోగులు
సాక్షి, హన్మకొండ :
జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో రెండిళ్లలో ఒకరు వంతున మంచం పట్టారు. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీజనల్ మందులు అందుబాటులో ఉండడం లేదు. ఈ మందుల కొనుగోలుకు సంబంధించి కమీషన్ల వ్యవహారం కొలిక్కిరాకపోవడం వల్లే కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.
జ్వరం గోలీలూ కరువే..
జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 3 ఏరియా ఆస్పత్రులు, 12 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఈ ఆస్పత్రులకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి క్రమం తప్పకుండా అన్ని రకాల ఔషధాలు సరఫరా కావాలి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత సాధారణంగా జ్వరాలు పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని రకాల మందులను కొనుగోలు చేసి ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతారు. జిల్లాలో రెండు నెలలుగా జ్వరాల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర ఔషధాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా జ్వరం, నొప్పులు, వాంతులు, విరేచనాలకు ఉపయోగించే ఫ్యురాజోలిడిన్, మెట్రోజిల్, డైక్లోఫెనాక్, పారాసిటమాల్ మాత్రలు కరువయ్యాయి. చివరకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కూడా అరకొరగానే ఉంటున్నాయని సమాచారం.
కమీషన్ల కక్కుర్తే కారణం..
ప్రభుత్వ ఆస్పత్రులలో మందుల కొరతకు కమిషన్ల వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో కీలకపాత్ర పోషిస్తున్న ఓ ఫార్మసిస్టు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో అవసరమైన మందులు తెప్పించకుండా కేవలం కమీషన్ అధికంగా వచ్చే మందులు కొనుగోలు చేస్తున్నట్లు ఆ శాఖ వారే చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడంతో సదరు ఉద్యోగి లీలలు శృతి మించుతున్నాయి. ఆఖరికి నెల రెండు నెలల్లో కాలం చెల్లిపోయే ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి మందులనే పీహెచ్‌సీలకు సరఫరా చేస్తున్నారు. అధికారులకు చెప్పలేక.. ఆన్ సీజన్ ఔషధాలను రోగులకు పంపిణీ చేయలేక క్షేత్రస్థాయిలో పని చేసే వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలపరిమితి ముగిసిన ఔషధాలను గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఆçస్పత్రుల ప్రాంగణం సమీపంలో గుంత తీసి పాతిపెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ వ్యవహారం కొంతకాలంగా నిరాటంకంగా సాగుతోంది.
ఇదీ పరిస్థితి...
-
పది నెలలుగా డైక్లోఫెనాక్ ట్యాబ్లెట్ల సరఫరా లేదు.
-
పారాసిటమాల్ టాబ్లెట్లు డిమాండ్‌కు సరిపడా లేవు.
-
రెండు నెలలుగా ప్యురాజోలిడిన్, మెట్రోజిల్ మందుల సరఫరా లేదు.
-
ఇరవై రోజుల క్రితం నల్లబెల్లి మండలంలో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో ఇటీవల మందులు పాతిపెట్టినట్లు తెలుస్తోంది.
-
మలేరియా రోగులకు అందించే క్లోరోక్విన్, ఫిట్స్ రోగులకు అందించే క్లోబోజామ్ వంటి ఔషధాలు సైతం ఆస్పత్రులలో అందుబాటులో లేవు.
-
నొప్పుల ఉపశమనానికి అందించే డ్రేమడాల్ ఔషధాలతో పాటు థైరాయిడ్ మాత్రలు సైతం లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మెట్రోజిల్ స్టాక్ లేదు
సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో మూడు రోజులుగా మెట్రోజిల్, డైక్లోఫెనాక్ మందుల నిల్వ లేదు. ఆరు నెలలుగా ఫ్యురాజొలిడిన్ ట్యాబ్లెట్ల సరఫరా లేదు. పారాసిటమాల్ టాబ్లెట్ స్టాకు ఉన్నాయి, కానీ అవి తీసుకెళ్లడంలో పీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు.
– వెంకటస్వామి, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఫార్మసిస్టు