
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్) పోస్టులకు డిమాండ్ నెలకొంది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 250 సీఏఎస్ వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో 3,906 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రాథమిక మెరిట్ జాబితాను ఇప్పటికే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రకటించింది. బుధవారంతో ప్రాథమిక మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియనుంది.
అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను ప్రకటించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇన్–సర్వీస్ కోటాలో 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ చదివేందుకు వెళ్లే వైద్యుల స్థానాలను భర్తీ చేయడం కోసం ప్రభుత్వం పోస్టుల భర్తీ చేపడుతోంది. ఖాళీ అయ్యే పోస్టులను అంచనా వేసి వైద్యులు రిలీవ్ అయి వెళ్లే సమయానికి కొత్తవారిని అందుబాటులోకి తెచ్చి ఫ్యామిలీ డాక్టర్, ఇతర పీహెచ్‌సీ సేవలకు అంతరాయం కలగకుండా ముందు చూపుతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment