
సాక్షి, అమరావతి: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనల నుంచి ఈ కార్యక్రమం పుట్టిందని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన కార్యాలయంలో ఆమె గురువారం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
మంత్రి మాట్లాడుతూ మార్చి నెలలో పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అధికారికంగా ప్రారంభించాలని సీఎం జగన్ నిర్దేశించారని చెప్పారు. ఇందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో అమలుకు అన్ని వనరులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. క్లినిక్‌లలో సిబ్బంది పోస్టులు ఎక్కడైనా ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయాలని చెప్పారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గిరిజన ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. సికిల్ సెల్‌తో బాధపడే వారిని గుర్తించి.. వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment