వైద్య విధాన పరిషత్‌లో కలపాలని ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం
ఒకే గొడుగు కిందకు పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు
కొత్తగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఏర్పాటుకు యోచన
జిల్లాస్థాయిలో వేర్వేరుగా ఉన్న వైద్య వ్యవస్థలకు ఇక ఒకరే బాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత కీలకమైన ప్రజారోగ్య సంచాలకుల (డీపీహెచ్) విభాగాన్ని రద్దు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఆ విభాగాన్ని వైద్య విధాన పరిషత్‌లో కలిపి కొత్తగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. డీపీహెచ్ రద్దయితే డైరెక్టర్ పోస్టు కూడా రద్దవుతుంది. కొత్తగా ఏర్పాటు చేసే డైరెక్టరేట్‌కు ఒక కమిషనర్‌ను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ప్రస్తుతం డీహెచ్‌గా ఉన్న డాక్టర్ రవీందర్‌నాయక్ పోస్టు పోతుందని అంటున్నారు.
పీహెచ్‌సీలు మొదలు జిల్లా ఆసుపత్రుల దాకా ఒకే విభాగం పర్యవేక్షణలోకి...
ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖలో ప్రజారోగ్య సంచాలకుల విభాగం, వైద్య విధాన పరిషత్, వైద్యవిద్య సంచాలకుల (డీఎంఈ) విభాగం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ఉన్నాయి. డీపీహెచ్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీ)లు ఉన్నాయి. అంటే ప్రాథమిక ఆరోగ్య వైద్య సేవలన్నీ ఆ విభాగం పరిధిలోనే జరుగుతాయి. అలాగే వైద్యవిధాన పరిషత్ పరిధిలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు ఉండగా మెడికల్ కాలేజీలు డీఎంఈ పరిధిలో ఉన్నాయి.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో సబ్ సెంటర్లు, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్‌హెచ్‌ఎం కింద చేపట్టే ప్రత్యేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేస్తే పీహెచ్‌సీ నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు దాని పరిధిలోకి వస్తాయి. ఇలా అవన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. మిగిలిన విభాగాలు యథావిధిగా కార్యకలాపాలు సాగిస్తాయని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇక వైద్య విధాన పరిషత్‌లోని ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వడం ద్వారా వారికి అన్ని వసతులను ప్రభుత్వం కల్పించనుంది.
వైద్య వ్యవస్థలకు జిల్లా బాస్ ఎవరు?
ఈ నాలుగు విభాగాలకు కలిపి జిల్లా స్థాయిలో ఒక బాస్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఉదాహరణకు మెడికల్ కాలేజీల్లో ఏదైనా సమస్య తలెత్తితే ప్రిన్సిపాల్ చూస్తారు. మరి అన్ని మెడికల్ కాలేజీల్లో సమస్య తలెత్తితే జిల్లా స్థాయిలో దాన్ని పరిష్కరించే నాథుడే లేడు. రాష్ట్ర స్థాయిలో ఉండే డీఎంఈనే సమస్యను పరిష్కరించాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి మిగిలిన విభాగాల్లోనూ నెలకొంది.
పేరుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారే (డీఎంహెచ్‌వో) అయినా కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే పరిమితమయ్యారు. ఇతర విభాగాల ఉద్యోగుల సమస్యలు వినే పరిస్థితి లేదు. ఇలా జిల్లాస్థాయి వైద్య విభాగాలను పర్యవేక్షించే వ్యవస్థ లేదు. అన్ని వైద్య విభాగాలకు కలిపి ఒక అధిపతి లేరు. ఈ పరిస్థితిని కూడా మార్చాలని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. రాష్ట్రస్థాయిలో ఆ శాఖ కార్యదర్శి బాస్‌గా ఉన్నా కింది స్థాయిలో మాత్రం ప్రత్యేక వ్యవస్థ లేదన్న చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment