Health centres
-
ప్రజారోగ్య సంచాలకుల విభాగం రద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత కీలకమైన ప్రజారోగ్య సంచాలకుల (డీపీహెచ్) విభాగాన్ని రద్దు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఆ విభాగాన్ని వైద్య విధాన పరిషత్‌లో కలిపి కొత్తగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. డీపీహెచ్ రద్దయితే డైరెక్టర్ పోస్టు కూడా రద్దవుతుంది. కొత్తగా ఏర్పాటు చేసే డైరెక్టరేట్‌కు ఒక కమిషనర్‌ను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ప్రస్తుతం డీహెచ్గా ఉన్న డాక్టర్ రవీందర్‌నాయక్ పోస్టు పోతుందని అంటున్నారు. పీహెచ్‌సీలు మొదలు జిల్లా ఆసుపత్రుల దాకా ఒకే విభాగం పర్యవేక్షణలోకి... ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖలో ప్రజారోగ్య సంచాలకుల విభాగం, వైద్య విధాన పరిషత్, వైద్యవిద్య సంచాలకుల (డీఎంఈ) విభాగం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ఉన్నాయి. డీపీహెచ్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ)లు ఉన్నాయి. అంటే ప్రాథమిక ఆరోగ్య వైద్య సేవలన్నీ ఆ విభాగం పరిధిలోనే జరుగుతాయి. అలాగే వైద్యవిధాన పరిషత్ పరిధిలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు ఉండగా మెడికల్ కాలేజీలు డీఎంఈ పరిధిలో ఉన్నాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో సబ్ సెంటర్లు, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్హెచ్ఎం కింద చేపట్టే ప్రత్యేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేస్తే పీహెచ్సీ నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు దాని పరిధిలోకి వస్తాయి. ఇలా అవన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. మిగిలిన విభాగాలు యథావిధిగా కార్యకలాపాలు సాగిస్తాయని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇక వైద్య విధాన పరిషత్‌లోని ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వడం ద్వారా వారికి అన్ని వసతులను ప్రభుత్వం కల్పించనుంది. వైద్య వ్యవస్థలకు జిల్లా బాస్ ఎవరు? ఈ నాలుగు విభాగాలకు కలిపి జిల్లా స్థాయిలో ఒక బాస్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఉదాహరణకు మెడికల్ కాలేజీల్లో ఏదైనా సమస్య తలెత్తితే ప్రిన్సిపాల్ చూస్తారు. మరి అన్ని మెడికల్ కాలేజీల్లో సమస్య తలెత్తితే జిల్లా స్థాయిలో దాన్ని పరిష్కరించే నాథుడే లేడు. రాష్ట్ర స్థాయిలో ఉండే డీఎంఈనే సమస్యను పరిష్కరించాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి మిగిలిన విభాగాల్లోనూ నెలకొంది. పేరుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారే (డీఎంహెచ్‌వో) అయినా కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే పరిమితమయ్యారు. ఇతర విభాగాల ఉద్యోగుల సమస్యలు వినే పరిస్థితి లేదు. ఇలా జిల్లాస్థాయి వైద్య విభాగాలను పర్యవేక్షించే వ్యవస్థ లేదు. అన్ని వైద్య విభాగాలకు కలిపి ఒక అధిపతి లేరు. ఈ పరిస్థితిని కూడా మార్చాలని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. రాష్ట్రస్థాయిలో ఆ శాఖ కార్యదర్శి బాస్‌గా ఉన్నా కింది స్థాయిలో మాత్రం ప్రత్యేక వ్యవస్థ లేదన్న చర్చ జరుగుతోంది. -
24x7 మీ సేవలో..
సాక్షి, హైదరాబాద్ : రైల్వే స్టేషన్లో మీరు వేచి ఉన్న విశ్రాంతి గదిలో తాగునీరు లేదా.. ఏసీలు పని చేయడం లేదా... టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయా.. వీల్‌చైర్స్ కావాలా... ఇకపై ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయాణికుల సహాయ కేంద్రం సిద్ధంగా ఉంది. 24/7 ఈ కేంద్రం పని చేసేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కొత్తగా హెల్ప్ డెస్క్‌లను అందుబాటులోకి తెచ్చారు. వైద్యం, అంబులెన్స్‌లు వంటి అత్యవసర సేవలతో పాటు అన్ని రకాల ప్రయాణ సదుపాయాల కోసం నేరుగా ఈ సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చు. హెల్ప్ డెస్క్ సేవలు ఇలా... రైల్వేస్టేషన్ల అభివృద్ధి, సదుపాయాల విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా ఐదు రైల్వేస్టేషన్లు బెంగళూర్, పుణే, సికింద్రాబాద్, ఢిల్లీలోని ఆనంద్‌బాగ్, చండీఘర్లను ఎంపిక చేసి ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ)కి అప్పగించారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్, పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు నేరుగా కానీ, ఫోన్ నంబర్ల ద్వారా కానీ సేవలను పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, గర్భిణులు, నడవలేని స్థితిలో ఉన్న రోగుల కోసం వీల్చైర్లను ఏర్పాటు చేస్తారు. కొత్తగా వచ్చే ప్రయాణికులు ఏ ప్లాట్‌ఫామ్‌కు ఎలా వెళ్లాలి, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఎక్కడ ఉన్నాయో చెబుతారు. ఏసీ వెయిటింగ్ హాళ్లు, ప్రీపెయిడ్ రెస్ట్‌రూమ్‌ల వివరాలను తెలియజేస్తారు. స్టేషన్ పరిశుభ్రత, మంచినీటి సదుపాయం, టాయిలెట్ల నిర్వహణ, విద్యుత్ సదుపాయం వంటి వివిధ రకాల సేవల్లో లోపాలకు తావు లేకుండా చూస్తారు. దేశవ్యాప్తంగా రైళ్ల నిర్వహణ, టికెట్ బుకింగ్, రిజర్వేషన్ల వంటి అంశాలకు మాత్రమే రైల్వేలు పరిమితమవుతాయి. స్టేషన్ల నిర్వహణ, రైల్వేస్థలాల్లో వాణిజ్య కార్యకలాపాల విస్తరణ ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం వంటివి ఐఆర్ఎస్డీసీ పరిధిలోకొస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్లో పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లు, సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. తొలిదశలో ప్రయాణికుల సదుపాయాల నిర్వహణ, రెండో దశలో స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టును చేపట్టనున్నారు. సికింద్రాబాద్‌లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య : 1.95 లక్షలు రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య (సుమారు) : 150 మొత్తం ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య : 10 వీల్‌చైర్, హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్ : 040–27788889 వాటర్, టాయిలెట్లు, విద్యుత్, రెస్ట్‌రూమ్స్ వంటి వాటి కోసం : 040–27786607 ఐఆర్ఎస్డీసీ సిబ్బంది సహాయం కోసం : 8008400051, 9849759977 -
నిధులున్నా నిర్లక్ష్యమేల?
సాక్షి, గుంటూరు : రాష్ట్ర రాజధాని జిల్లా గుంటూరులో జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యంతో గ్రామీణ ప్రాంత రోగులు మందులు అందక అవస్థలు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. అయితే ప్రభుత్వం మందులు కొనుగోలుకు నిధులు మంజూరు చేసినా, వైద్యాధికారులు మందులు కొనుగోలు చేయకుండా మిన్నుకుండిపోవటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మందుల కొనుగోలుకు ప్రత్యేక బడ్జెట్ : గ్రామీణ పేద రోగులు ఏదైనా రోగం వచ్చి గ్రామంలో ఉండే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తే, వారికి కావాల్సిన మందులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ బడ్జెట్‌ను వినియోగించి రోగులకు కావాల్సిన మందులను కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. సుమారు మూడేళ్లుగా మందుల కొనుగోలుకు ఇచ్చిన రూ.1.60 కోట్ల బడ్జెట్ బ్యాంకు ఖాతాలోనే మగ్గిపోతుంది. 3 నెలలకు రూ.15 లక్షలు చొప్పున.. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మందుల కొనుగోలు కోసం ఇచ్చే బడ్జెట్లో నూటికి 80శాతం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్ఐడీసీ)కు నిధులు ఇస్తుంది. సదరు సంస్థ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాలకు మందులు కొనుగోలు చేసి పంపిస్తుంది. సంస్థ అన్ని రకాల మందులు కొనుగోలు చేయదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన అన్ని రకాల మందులు, సర్జికల్ వస్తువులు కొనుగోలు చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పదిశాతం బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయిస్తుంది. అత్యవసర మందులు, ఏపీఎంస్ఐడీసీ కొనుగోలు చేయని మందులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు టెండర్ల ద్వారా కొనుగోలు చేసుకుంటారు. ఇలా గుంటూరు డీఎంహెచ్ఓకు ప్రతి మూడు నెలలకు ఒకసారి 15 లక్షలకు పైగా బడ్జెట్‌ను ప్రభుత్వం ఇస్తుంది. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ ఖాతాలో రూ.1.60 కోట్ల మందుల బడ్జెట్ ఉంది. మూడేళ్లకు పైగా మందులు కొనుగోలు చేయకుండా వైద్యాధికారులు తాత్సారం చేస్తూ ఉండటంతో నిధులు బ్యాంక్ ఖాతాలోనే మూలుగుతున్నాయి. పట్టించుకోని జిల్లా వైద్యాధికారులు 2017, జనవరి 3 నుంచి అదే ఏడాది నవంబర్ 15 వరకు జిల్లాలో రెగ్యులర్ డీఎంహెచ్ఓలు లేకపోవటంతో ఇన్చార్జి డీఎంహెచ్ఓలు మందుల కొనుగోలు గురించి పట్టించుకోలేదు. అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ రెడ్డి శ్యామల ఏడు నెలలు, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ తాళ్లూరి రమేష్ మూడు నెలలకుపైగా, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని వారం రోజులపాటు ఇన్చార్జి డీఎంహెచ్‌ఓలుగా పనిచేశారు. ప్రైవేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు, స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ల లాంటి లాభసాటి పనులను చూసుకున్న ఇన్చార్జి డీఎంహెచ్ఓలు గ్రామీణ పేద రోగులకు అవసరమైన మందులు కొనుగోలు చేయకుండా మిన్నకుండి పోవటంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. రెగ్యులర్ డీఎంహెచ్‌ఓగా డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ 2017 నవంబర్‌లో విధుల్లో చేరారు. ఈమె రెగ్యులర్ డీఎంహెచ్‌ఓగా విధుల్లో చేరి ఏడాదిన్నర దాటినా రోగులకు అవసరమైన మందుల కొనుగోలుపై దృష్టి సారించటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా ఆరోగ్య కేంద్రాలకు వచ్చే గ్రామీణ పేద రోగులు ఆరోగ్య కేంద్రాల్లో మందులు ఇవ్వకపోవటంతో బయట కొనుగోలు చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. మరో పక్క మందులు ఇవ్వటం లేదని ఆయా కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై సైతం మండి పడుతున్నారు. నిధులు ఉండి కూడా మందులు కొనుగోలు చేయకుండా తాత్సారం చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిధులు ఇచ్చినా వినియోగం చేయకపోవటంతో గత ఏడాది, ఈ సంవత్సరం ని«ధులను రాష్ట్ర వైద్యాధికారులు మంజూరు చేయలేదు. జిల్లా కలెక్టర్ మందుల నిధులను సకాలంలో వినియోగం అయ్యేలా, ఆరోగ్య కేంద్రాల్లో అన్ని మందులు రోగులకు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
అందరికీ ఆధునిక వైద్యం!
న్యూఢిల్లీ: దేశంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు సరైన వైద్యం అందించేందుకు ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నేషనల్ సెంటర్ ఫర్ ఏజింగ్‌కు శంకుస్థాపనతోపాటు, సఫ్దార్‌జంగ్‌లోని 555 పడకల సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దేశవ్యాప్తంగా ఆధునిక వైద్య మౌలికవసతులను అభివృద్ధి చేస్తున్నాం. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం అనవసరంగా హెచ్చించాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాం’ అని అన్నారు. ఎయిమ్స్‌లోని 300 పడకల పవర్‌గ్రిడ్ విశ్రామ్ సదన్‌ను, ఎయిమ్స్–అన్సారీనగర్–ట్రామా సెంటర్లను కలిపేలా వాహనాలు తిరిగే టన్నెల్‌ను మోదీ ప్రారంభించారు. 9 నెలల్లో 42 లక్షల మంది! గత 9 నెలల్లో దేశవ్యాప్తంగా 42 లక్షల మంది సీనియర్ సిటిజన్లు తమ రైల్వే రాయితీలను స్వచ్ఛందంగా వదులుకున్నారని మోదీ చెప్పారు. దేశంలో నిజాయితీగా ప్రజలు వ్యవహరించే వాతావరణం పెరుగుతోందని ప్రశంసించారు. ‘రైల్వే రాయితీ విషయంలో నేను ఎలాంటి పిలుపునివ్వలేదు. కానీ, రైల్వే శాఖ ఎవరైనా స్వచ్ఛందంగా వదులుకోవచ్చని లబ్ధిదారులకు సూచించింది. గత 8–9 నెలల్లో 42 లక్షల మంది వయోవృద్ధులైన ప్రయాణికులు స్వచ్ఛందంగా తమ రాయితీలను వదులుకున్నారు’ అని అన్నారు. నెలకోరోజు గర్భిణులకు ఉచితంగా చికిత్సనందించాలని వైద్యులను కోరానని.. ఇప్పటివరకు 1.25 కోట్ల మంది గర్భిణులు ఈ పద్ధతిలో ఉచిత చికిత్స పొందారన్నారు. 2016లో మన్‌కీ బాత్ ద్వారా ఇచ్చిన పిలుపుమేరకు.. ప్రతినెలా 9వ తేదీన ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు గర్భిణులకు వైద్యం అందిస్తున్నారన్నారు. మంత్రిత్వ శాఖల సమన్వయంతో.. ప్రతి భారతీయుడికీ తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్యం అందించడం, రోగాలకు కారణమవుతున్న సమస్యలను అంతం చేయడం కోసం పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. వైద్య శాఖతోపాటుగా గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆయుష్ శాఖలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’లోని రెండు ప్రధాన పిల్లర్ల గురించి మోదీ వివరించారు. మొదటిది.. 1.5లక్షల సబ్–సెంటర్లను హెల్త్, వెల్నెస్ సెంటర్లుగా మార్చడం ద్వారా క్షయ, కుష్టు, మధుమేహం, రక్తపోటు, కొన్ని (రొమ్ము, నోటి, గర్భాశయ) కేన్సర్లను గుర్తించడం. రెండోది.. 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల బీమా సదుపాయం (ఒక్కో కుటుంబానికి). మరోవైపు, ఎయిమ్స్‌లో అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా అక్కడ చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం గురించి మోదీ వాకబు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ శౌర్య’(ఆదీవాసీ వికాస్ విభాగ్)లో భాగంగా ఎవరెస్టును అధిరోహించిన 10 మంది గిరిజన విద్యార్థులు కలుసుకున్నారు. వచ్చేవారం మద్దతు ధర పెంపు వరి సహా ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్లు పెంచనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వచ్చేవారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెరకుకు తగిన మద్దతుధరను వచ్చే రెండు వారాల్లో ప్రకటిస్తామని.. 2017–18 ధర కంటే ఇది మెరుగ్గానే ఉంటుందని మోదీ వెల్లడించారు. యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, పంజాబ్‌ల నుంచి వచ్చిన 140 మంది చెరకు రైతులతో సమావేశం సందర్భంగా ప్రధాని ఈ హామీ ఇచ్చారు. చెరకు రైతుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా చక్కెర మిల్లులకు రూ.8,500 కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, పదిరోజుల్లో వివిధ రాష్ట్రాల రైతులతో మోదీ సమావేశం కావడం ఇది రెండోసారి. -
కాసులిస్తే..వేటుండదు!
సాక్షి, కరీంనగర్: తప్పు చేశారు.. అనుకోకుండా దొరికిపోయారు. ఆ తప్పు నుంచి తప్పించుకునేందుకు నానాతిప్పలు పడుతున్నారు. సిబ్బం ది చేసిన తప్పిదాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్న ఓ అధికారి.. వారిని వేటు పేరిట భయపెడుతున్నాడు. వేలాది రూపాయలు చెల్లించాలని, లేకుంటే శాఖాపరంగా శిక్ష తప్పదని బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఏం చేయాలో తోచక కొందరు తమ ను మన్నించాలని సదరు అధికారిని వేడుకుంటుంటే.. ఇంకొందరు శాఖాపరమైన చర్యలకు జడిసి అడిగినంత ఇచ్చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న ఈ అవినీతి హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌హెల్త్ సెంటర్లలో 524 మంది రెగ్యులర్, 576 కాంట్రాక్టు ఏఎన్ఎంలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు తాము పని చేసే కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో తిరిగి పారిశుధ్యం, ప్రజారోగ్యంపై రోగులు, గర్భిణులు, బాలింతలకు సల హాలు, సూచనలందిస్తారు. క్షేత్రస్థాయిలో తిరిగే సమస్య, జీతభత్యాలు తక్కువగా ఉండటంతో కాంట్రాక్టు పద్ధతి లో పనిచేసే పన్నెండుమంది ఏఎన్ఎంలు ఒకేచోట ఉండి పనిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పై చదువులు చదివి.. పీహెచ్సీ, ఆస్పత్రుల్లో స్టాఫ్‌నర్స్‌గా పర్మినెంట్ ఉద్యోగం సాధించాలనుకున్నారు. కరీంనగర్లో ఓ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. రోజు విడిచి రోజు విధులు ఎగ్గొట్టి కాలేజీకి రాకపోకలు సాగించారు. కొన్ని నెలలు వారి చదువు సాఫీగానే సాగింది. తర్వాత ఈ వ్యవహారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి దృష్టిలో పడింది. విధులకు బదులు కాలేజీలో శిక్షణకు వెళ్తున్నట్లు నిర్ధారించుకున్న ఆ అధికారి ఏఎన్ఎంలు చేరిన కాలేజీ నుంచి నేరుగా వారి సర్టిఫికెట్లు.. హాజరుపట్టిక తెప్పించుకున్నారు. కాలేజీలో చదివేందుకు అనుమతి ఎవరిచ్చారని హెచ్చరించారు. కోర్సులో చేరిన తప్పునకు జరిమానాగా రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించాలని ఏఎన్ఎంలతో చెప్పారు. దీంతో తమను మన్నించి సర్టిఫికెట్లు ఇవ్వాలని ఏఎన్ఎంలు ఆ అధికారిని వేడుకున్నారు. అయినా తీరు మారని సదరు అధికారి డబ్బులివ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక కొందరు ఏఎన్ఎంలు డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై డీఎంహెచ్‌వో బాలు వివరణ ఇస్తూ.. జిల్లాలో చాలామంది కాంట్రాక్టు ఏఎన్ఎంలు నిబంధనలకు విరుద్ధంగా నర్సింగ్ కళాశాలల్లో చేరి, స్టాఫ్‌నర్సు శిక్షణ తీసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వారిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. -
సదుపాయాలు అరకొరే..
సాక్షి, రాజమండ్రి : పల్లెల్లో ప్రజారోగ్య పరిరక్షణకు ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉప కేంద్రాలు (సబ్ సెంటర్లు) సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నా యి. అనేక చోట్ల అద్దె ఇళ్లల్లో, శిథిల భవనాల్లో నిర్వహించాల్సిన దుస్థితి. వీటికి కొత్త భవనాలు నిర్మించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. జిల్లాలో 103 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), 20 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు), ఏడు ఏరియా ఆస్పత్రుల పరిధిలో 809 ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిని ఏఎన్ఎంలు నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం ఏఎన్ఎం సబ్ సెంటర్లో ఉంటూ.. 24 గంటలూ పేదలకు అందుబాటులో ఉంటారు. రోగులకు ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైతే సమీప పీహెచ్‌సీలకు తరలించేందుకు ఇక్కడ సదుపాయాలు అందుబాటులో ఉండాలి. కేవలం 130 మాత్రమే ఏఎన్ఎం క్వార్టర్లతో కలిసి ఉన్నాయి. మిగిలిన 639 అద్దె ఇళ్లల్లోనే ఉండ గా సుమారు 400 కేంద్రాలు మందులు నిల్వ చేసుకునే వీలు కూడా లేని స్థితిలోఏఎన్ఎంల ఇళ్లలోనే కొనసాగుతున్నాయి. పక్కా భవనాలు కావాల్సిన సబ్ సెంటర్లు వందల సంఖ్యలో ఉండగా, ఈ ఏడాది 23 కేంద్రాలకు మాత్రమే భవనాలు మంజూరయ్యాయి. కనీసం మరో వంద మంజూరవుతాయని భావించిన అధికారులకు నిరాశే మిగిలింది. కనీస సదుపాయాలకూ కరువే.. జిల్లాలో ప్రతి 5 వేల మందికి ఒక సబ్ సెంటర్ ఉంది. గ్రామీణ ప్రజలు చిన్నచిన్న వ్యాధులకు వీటిపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలోని సమస్యాత్మకమైన 55 పీహెచ్‌సీల పరిధిలోని సుమారు 300 సబ్ సెంటర్లలో రోగులను పరీక్షించేందుకు కూడా సదుపాయాలు లేవు. 2012-13లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ చేసిన సర్వే ప్రకారం 21 సబ్సెంటర్లలో తాగునీరు, కరెంటు, టాయ్లెట్లు కూడా లేవని వెల్లడైంది. ప్రతిపాదనలు పంపాం : డీఎంహెచ్ఓ పీహెచ్‌సీలకు భవనాల కొరత తీరినా జిల్లాలో సబ్ సెంటర్లకు పక్కా భవనాల అవసరం ఉందని డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి చెప్పారు. మరిన్ని భ వనాలు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. వీటికి అనుబంధంగా అంగన్వాడీ కేం ద్రాలను నిర్మించాలని కోరామన్నారు. -
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు సౌకర్యాల లేమి
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారికి ప్రభుత్వం నగదు ప్రోత్సాహమిస్తోంది. దీనిపై క్షేత్రస్థాయి నుంచి ప్రచారం నిర్వహిస్తోంది. కానీ ఎక్కువ మంది ప్రభుత్వ వైద్యశాలల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీనికి అధికారుల ఉదాసీన వైఖరే కారణమని మంగళవారం ఒంగోలులోని మాతా శిశు వైద్యశాల వద్ద పీపీ యూనిట్లో నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల వైద్య శిబిరం నిర్వహణే నిదర్శనం. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల కోసం ముందుగా 88 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు మాత్రం 40 మడత మంచాలను తెప్పించారు. రెగ్యులర్ యూనిట్లో మరో 20 మంచాలున్నాయి. అయితే బాలింతలతోపాటు బంధువులు వచ్చారు. వీరి కోసం కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు. తల్లులు శస్త్ర చికిత్సలకు వెళ్లినప్పుడు చంటి పిల్లలతో బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడే చెట్లకు ఊయలలు ఏర్పాటు చేసుకుని పిల్లలను ఆడించారు. మొత్తం 68 మంది బాలింతలకు శస్త్రచికిత్సలను నిర్వహించినట్లు పీపీ యూనిట్ క్యాంప్ అధికారి డాక్టర్ జే నాగేశ్వరరావు తెలిపారు. వీరికి 8,880 నగదు ప్రోత్సాహం, ధ్రువీకరణ పత్రాలు అందించామన్నారు. రిమ్స్ శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ వెంకయ్య శస్త్ర చికిత్సలను పర్యవేక్షించారన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు తిరుమలరావు, సాయికృష్ణ, వసుధ పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల శిబిరాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ రామతులశమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలపై బాలింతలతో మాట్లాడారు. -
ఇక అర్బన్ పీహెచ్‌సీలు
సాక్షి, కరీంనగర్ : పట్టణ పేదలకు ప్రభుత్వం మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్కారు ఆస్పత్రులకు తోడు పట్టణాలు, నగరాల్లోని పేదల కోసం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండు లక్షల జనాభా ఉన్న నగరాల్లో కమ్యూనిటీ హెల్త్సెంటర్లను ప్రారంభిస్తారు. ప్రస్తుతం పట్టణాల్లో ఉన్న అర్బన్ హెల్త్సెంటర్లు నామమాత్రంగా మారాయి. సెంటర్ల నిర్వహణపై స్వచ్ఛంద సంస్థలు నిర్లక్ష్యం వహిస్తుండడంతో వీటి పనితీరు నీరసించిపోయింది. దీంతో జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలోని జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ అర్బన్ పీహెచ్‌సీల నిర్వహణకు శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు జిల్లాలోని మున్సిపాలిటీల అధికారులు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్యూహెచ్ఎం) ప్రతినిధులు ఇటీవల సమావేశమయ్యారు. కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలు, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల జనాభా, అక్కడ ఉన్న మురికివాడల పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై జిల్లా అధికారులు సమగ్ర నివేదికను అందజేశారు. కరీంనగర్లో ప్రస్తుతం ఐదు అర్బన్ హెల్త్సెంటర్లు ఉన్నాయి. ఇవి పని చేస్తున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వీటి స్థానంలో అర్బన్ పీహెచ్‌సీలు వస్తే పేదల ఆరోగ్యానికి కొంతమేరకైనా భరోసా లభిస్తుందని భావిస్తున్నారు. కాగా.. యాభై వేలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ), రెండు లక్షల జనాభా ఉన్న చోట్ల పట్టణ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం (యుసీహెచ్‌సీ)లను ప్రారంభిస్తారు. లక్ష జనాభా ఉన్న పట్టణాల్లో ఒకటికన్నా ఎక్కువ యూపీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తారా.. ఒకే కేంద్రాన్ని నెలకొల్పుతారా.. అన్న విషయంలో స్పష్టత లేదు. ఈ లెక్క ప్రకారం కరీంనగర్, రామగుండంలలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పాటయ్యే అవకాశముంది. గామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పీహెచ్‌సీల తరహాలోనే ఇక్కడ పూర్తికాలం వైద్యులను, ఇతర సిబ్బందిని నియమిస్తారు. మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా అన్ని సదుపాయాలు కల్పిస్తారు. అర్బన్ పీహెచ్‌సీల నిర్వహణ బాధ్యతలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకే అప్పగించే అవకాశం ఉంది. ఈ కేంద్రాలు పని చేయడం ప్రారంభిస్తే ప్రభుత్వ ఆస్పత్రుపై ఒత్తిడి తగ్గడంతోపాటు పట్టణ పేదలకు వైద్య సదుపాయాలు మెరుగవుతాయని భావిస్తున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో కొమురం బాలు మాట్లాడుతూ.. జాతీయ ఆరోగ్య మిషన్ సూచనల మేరకు జిల్లాలోని పట్టణాలు, నగరాల సమగ్ర నివేదికను అందజేశామన్నారు. జిల్లాలో ఎన్ని పీహెచ్‌సీలు ఏర్పాటవుతాయన్న విషయం కొద్ది రోజుల్లో తెలుస్తుందని చెప్పారు. ఈ కేంద్రాల వల్ల వైద్యసేవలు మెరుగవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.