సాక్షి, కరీంనగర్ : పట్టణ పేదలకు ప్రభుత్వం మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్కారు ఆస్పత్రులకు తోడు పట్టణాలు, నగరాల్లోని పేదల కోసం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రెండు లక్షల జనాభా ఉన్న నగరాల్లో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లను ప్రారంభిస్తారు. ప్రస్తుతం పట్టణాల్లో ఉన్న అర్బన్ హెల్త్‌సెంటర్లు నామమాత్రంగా మారాయి. సెంటర్ల నిర్వహణపై స్వచ్ఛంద సంస్థలు నిర్లక్ష్యం వహిస్తుండడంతో వీటి పనితీరు నీరసించిపోయింది. దీంతో జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలోని జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ అర్బన్ పీహెచ్‌సీల నిర్వహణకు శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు జిల్లాలోని మున్సిపాలిటీల అధికారులు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్‌యూహెచ్‌ఎం) ప్రతినిధులు ఇటీవల సమావేశమయ్యారు. కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలు, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల జనాభా, అక్కడ ఉన్న మురికివాడల పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై జిల్లా అధికారులు సమగ్ర నివేదికను అందజేశారు.
కరీంనగర్‌లో ప్రస్తుతం ఐదు అర్బన్ హెల్త్‌సెంటర్లు ఉన్నాయి. ఇవి పని చేస్తున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వీటి స్థానంలో అర్బన్ పీహెచ్‌సీలు వస్తే పేదల ఆరోగ్యానికి కొంతమేరకైనా భరోసా లభిస్తుందని భావిస్తున్నారు. కాగా.. యాభై వేలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ), రెండు లక్షల జనాభా ఉన్న చోట్ల పట్టణ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం (యుసీహెచ్‌సీ)లను ప్రారంభిస్తారు. లక్ష జనాభా ఉన్న పట్టణాల్లో ఒకటికన్నా ఎక్కువ యూపీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తారా.. ఒకే కేంద్రాన్ని నెలకొల్పుతారా.. అన్న విషయంలో స్పష్టత లేదు. ఈ లెక్క ప్రకారం కరీంనగర్, రామగుండంలలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పాటయ్యే అవకాశముంది.
గామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పీహెచ్‌సీల తరహాలోనే ఇక్కడ పూర్తికాలం వైద్యులను, ఇతర సిబ్బందిని నియమిస్తారు. మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా అన్ని సదుపాయాలు కల్పిస్తారు. అర్బన్ పీహెచ్‌సీల నిర్వహణ బాధ్యతలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకే అప్పగించే అవకాశం ఉంది. ఈ కేంద్రాలు పని చేయడం ప్రారంభిస్తే ప్రభుత్వ ఆస్పత్రుపై ఒత్తిడి తగ్గడంతోపాటు పట్టణ పేదలకు వైద్య సదుపాయాలు మెరుగవుతాయని భావిస్తున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో కొమురం బాలు మాట్లాడుతూ.. జాతీయ ఆరోగ్య మిషన్ సూచనల మేరకు జిల్లాలోని పట్టణాలు, నగరాల సమగ్ర నివేదికను అందజేశామన్నారు. జిల్లాలో ఎన్ని పీహెచ్‌సీలు ఏర్పాటవుతాయన్న విషయం కొద్ది రోజుల్లో తెలుస్తుందని చెప్పారు. ఈ కేంద్రాల వల్ల వైద్యసేవలు మెరుగవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇక అర్బన్ పీహెచ్‌సీలు
Published Fri, Oct 25 2013 3:00 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement