నిధులున్నా నిర్లక్ష్యమేల?  | Medical Officers Negligence In Krishna | Sakshi
Sakshi News home page

నిధులున్నా నిర్లక్ష్యమేల? 

Published Sun, Aug 4 2019 11:16 AM | Last Updated on Sun, Aug 4 2019 11:16 AM

Medical Officers Negligence In Krishna  - Sakshi

డీఎంహెచ్‌ఓ కార్యాలయం  

సాక్షి, గుంటూరు : రాష్ట్ర రాజధాని జిల్లా గుంటూరులో జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యంతో గ్రామీణ ప్రాంత రోగులు మందులు అందక అవస్థలు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. అయితే ప్రభుత్వం మందులు కొనుగోలుకు నిధులు మంజూరు చేసినా, వైద్యాధికారులు మందులు కొనుగోలు చేయకుండా మిన్నుకుండిపోవటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మందుల కొనుగోలుకు ప్రత్యేక బడ్జెట్‌ :
గ్రామీణ పేద రోగులు ఏదైనా రోగం వచ్చి గ్రామంలో ఉండే సమీప  ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి  వెళ్తే, వారికి కావాల్సిన మందులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించింది. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ బడ్జెట్‌ను వినియోగించి రోగులకు కావాల్సిన మందులను కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. సుమారు మూడేళ్లుగా మందుల కొనుగోలుకు ఇచ్చిన రూ.1.60 కోట్ల బడ్జెట్‌ బ్యాంకు ఖాతాలోనే  మగ్గిపోతుంది. 

3 నెలలకు రూ.15 లక్షలు చొప్పున..
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మందుల కొనుగోలు కోసం ఇచ్చే బడ్జెట్‌లో నూటికి 80శాతం ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎంఎస్‌ఐడీసీ)కు నిధులు ఇస్తుంది. సదరు సంస్థ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాలకు మందులు కొనుగోలు చేసి పంపిస్తుంది. సంస్థ అన్ని రకాల మందులు కొనుగోలు చేయదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన అన్ని రకాల మందులు, సర్జికల్‌ వస్తువులు కొనుగోలు చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పదిశాతం బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయిస్తుంది.

అత్యవసర మందులు, ఏపీఎంస్‌ఐడీసీ కొనుగోలు చేయని మందులను  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు టెండర్ల ద్వారా కొనుగోలు చేసుకుంటారు. ఇలా గుంటూరు డీఎంహెచ్‌ఓకు ప్రతి మూడు నెలలకు ఒకసారి 15 లక్షలకు పైగా బడ్జెట్‌ను ప్రభుత్వం ఇస్తుంది. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ ఖాతాలో రూ.1.60 కోట్ల మందుల బడ్జెట్‌ ఉంది. మూడేళ్లకు పైగా మందులు కొనుగోలు చేయకుండా వైద్యాధికారులు తాత్సారం చేస్తూ ఉండటంతో నిధులు బ్యాంక్‌ ఖాతాలోనే మూలుగుతున్నాయి. 

పట్టించుకోని జిల్లా వైద్యాధికారులు
2017, జనవరి 3 నుంచి అదే ఏడాది నవంబర్‌ 15 వరకు జిల్లాలో రెగ్యులర్‌ డీఎంహెచ్‌ఓలు లేకపోవటంతో ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓలు మందుల కొనుగోలు గురించి పట్టించుకోలేదు. అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రెడ్డి శ్యామల ఏడు నెలలు, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్‌ తాళ్లూరి రమేష్‌ మూడు నెలలకుపైగా, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ మాచర్ల సుహాసిని వారం రోజులపాటు ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓలుగా పనిచేశారు. ప్రైవేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు, స్కానింగ్‌ సెంటర్ల రిజిస్ట్రేషన్ల లాంటి లాభసాటి పనులను చూసుకున్న ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓలు  గ్రామీణ పేద రోగులకు అవసరమైన మందులు కొనుగోలు చేయకుండా మిన్నకుండి పోవటంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.

రెగ్యులర్‌ డీఎంహెచ్‌ఓగా డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ 2017 నవంబర్‌లో విధుల్లో చేరారు. ఈమె రెగ్యులర్‌ డీఎంహెచ్‌ఓగా విధుల్లో చేరి ఏడాదిన్నర దాటినా రోగులకు అవసరమైన మందుల కొనుగోలుపై దృష్టి సారించటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా ఆరోగ్య కేంద్రాలకు వచ్చే గ్రామీణ పేద రోగులు ఆరోగ్య కేంద్రాల్లో మందులు ఇవ్వకపోవటంతో బయట కొనుగోలు చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. మరో పక్క మందులు ఇవ్వటం లేదని ఆయా కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై సైతం మండి పడుతున్నారు. నిధులు ఉండి కూడా మందులు కొనుగోలు చేయకుండా తాత్సారం చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిధులు ఇచ్చినా వినియోగం చేయకపోవటంతో గత ఏడాది, ఈ సంవత్సరం ని«ధులను రాష్ట్ర వైద్యాధికారులు మంజూరు చేయలేదు.  జిల్లా కలెక్టర్‌ మందుల నిధులను సకాలంలో వినియోగం అయ్యేలా, ఆరోగ్య కేంద్రాల్లో అన్ని మందులు రోగులకు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement