అందరికీ ఆధునిక వైద్యం! | We want best healthcare at the lowest cost | Sakshi
Sakshi News home page

అందరికీ ఆధునిక వైద్యం!

Published Sat, Jun 30 2018 2:15 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

We want best healthcare at the lowest cost - Sakshi

ఢిల్లీలోని ప్రధాని నివాసంలో మోదీకి నమూనా నాగలిని అందిస్తున్న చెరకు రైతు

న్యూఢిల్లీ: దేశంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు సరైన వైద్యం అందించేందుకు ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఏజింగ్‌కు శంకుస్థాపనతోపాటు, సఫ్దార్‌జంగ్‌లోని 555 పడకల సూపర్‌ స్పెషాలిటీ విభాగాన్ని జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దేశవ్యాప్తంగా ఆధునిక వైద్య మౌలికవసతులను అభివృద్ధి చేస్తున్నాం. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం అనవసరంగా హెచ్చించాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాం’ అని అన్నారు. ఎయిమ్స్‌లోని 300 పడకల పవర్‌గ్రిడ్‌ విశ్రామ్‌ సదన్‌ను, ఎయిమ్స్‌–అన్సారీనగర్‌–ట్రామా సెంటర్‌లను కలిపేలా వాహనాలు తిరిగే టన్నెల్‌ను మోదీ ప్రారంభించారు.  

9 నెలల్లో 42 లక్షల మంది!
గత 9 నెలల్లో దేశవ్యాప్తంగా 42 లక్షల మంది సీనియర్‌ సిటిజన్లు తమ రైల్వే రాయితీలను స్వచ్ఛందంగా వదులుకున్నారని మోదీ చెప్పారు. దేశంలో నిజాయితీగా ప్రజలు వ్యవహరించే వాతావరణం పెరుగుతోందని ప్రశంసించారు. ‘రైల్వే రాయితీ విషయంలో నేను ఎలాంటి పిలుపునివ్వలేదు. కానీ, రైల్వే శాఖ ఎవరైనా స్వచ్ఛందంగా వదులుకోవచ్చని లబ్ధిదారులకు సూచించింది. గత 8–9 నెలల్లో 42 లక్షల మంది వయోవృద్ధులైన ప్రయాణికులు స్వచ్ఛందంగా తమ రాయితీలను వదులుకున్నారు’ అని అన్నారు. నెలకోరోజు గర్భిణులకు ఉచితంగా చికిత్సనందించాలని వైద్యులను కోరానని.. ఇప్పటివరకు 1.25 కోట్ల మంది గర్భిణులు ఈ పద్ధతిలో ఉచిత చికిత్స పొందారన్నారు. 2016లో మన్‌కీ బాత్‌ ద్వారా ఇచ్చిన పిలుపుమేరకు.. ప్రతినెలా 9వ తేదీన ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు గర్భిణులకు వైద్యం అందిస్తున్నారన్నారు.  

మంత్రిత్వ శాఖల సమన్వయంతో..
ప్రతి భారతీయుడికీ తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్యం అందించడం, రోగాలకు కారణమవుతున్న సమస్యలను అంతం చేయడం కోసం పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. వైద్య శాఖతోపాటుగా గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆయుష్‌ శాఖలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఆయుష్మాన్‌ భారత్‌’లోని రెండు ప్రధాన పిల్లర్ల గురించి మోదీ వివరించారు.

మొదటిది.. 1.5లక్షల సబ్‌–సెంటర్లను హెల్త్, వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చడం ద్వారా క్షయ, కుష్టు, మధుమేహం, రక్తపోటు, కొన్ని (రొమ్ము, నోటి, గర్భాశయ) కేన్సర్లను గుర్తించడం. రెండోది.. 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల బీమా సదుపాయం (ఒక్కో కుటుంబానికి). మరోవైపు, ఎయిమ్స్‌లో అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా అక్కడ చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం గురించి మోదీ వాకబు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్‌ శౌర్య’(ఆదీవాసీ వికాస్‌ విభాగ్‌)లో భాగంగా ఎవరెస్టును అధిరోహించిన 10 మంది గిరిజన విద్యార్థులు కలుసుకున్నారు.

వచ్చేవారం మద్దతు ధర పెంపు
వరి సహా ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్లు పెంచనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వచ్చేవారం జరిగే కేబినెట్‌ సమావేశంలో దీనికి ఆమోదం తెలపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెరకుకు తగిన మద్దతుధరను వచ్చే రెండు వారాల్లో ప్రకటిస్తామని.. 2017–18 ధర కంటే ఇది మెరుగ్గానే ఉంటుందని మోదీ వెల్లడించారు. యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, పంజాబ్‌ల నుంచి వచ్చిన 140 మంది చెరకు రైతులతో సమావేశం సందర్భంగా ప్రధాని ఈ హామీ ఇచ్చారు. చెరకు రైతుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా చక్కెర మిల్లులకు రూ.8,500 కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, పదిరోజుల్లో వివిధ రాష్ట్రాల రైతులతో మోదీ సమావేశం కావడం ఇది రెండోసారి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement