dedicated to the nation
-
శుభోదయం.. నవోదయం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం దేశ అభివృద్ధి ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. స్వావలంబన, అభివృద్ధి భారత్‌కు ఇదొక శుభోదయమని చెప్పారు. మన పార్లమెంట్ కొత్త భవనం ఇతర దేశాల ప్రగతికి సైతం స్ఫూర్తిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. ఆదివారం పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం సందర్భంగా లోక్‌సభ సభామందిరంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘నవ భారత్’ ఆశలు ఆకాంక్షలను, నూతన లక్ష్యాలను కొత్త భవనం ప్రతిబింబిస్తోందని అన్నారు. ఇక్కడ తీసుకొనే ప్రతి నిర్ణయం దేశ మహోన్నత భవిష్యత్తుకు పునాది వేస్తుందని చెప్పారు. పేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దివ్యాంగులు, ఇతర అణగారిన వర్గాల సాధికారతకు ఇక్కడే ముందడుగు పడుతుందని వివరించారు. పార్లమెంట్ కొత్త భవనంలోని ప్రతి ఇటుక, ప్రతి గోడ పేదల సంక్షేమానికే అంకితమని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... బానిస మనస్తత్వాన్ని వదిలించుకుంటున్నాం ‘‘75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని దేశ ప్రజలు అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పార్లమెంట్ కొత్త భవనాన్ని తమ ప్రజాస్వామ్యానికి కానుకగా ఇచ్చుకున్నారు. దేశ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నా. మన దేశ వైవిధ్యాన్ని, ఘనమైన సంప్రదాయాన్ని పార్లమెంట్ కొత్త భవన నిర్మాణశైలి చక్కగా ప్రతిబింబిస్తుండడం హర్షణీయం. వందల సంవత్సరాల వలస పాలన వల్ల అణువణువునా పాకిపోయిన బానిస మనస్తత్వాన్ని నవ భారతదేశం వదిలించుకుంటోంది. మహాత్మాగాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం దేశ ప్రజలను మేల్కొల్పింది. నూతన చైతన్యాన్ని నింపింది. స్వాతంత్య్ర కాంక్షను రగిలించింది. స్వాతంత్య్ర పోరాటానికి అంకితమయ్యేలా ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగించింది. రాబోయే 25 ఏళ్లలో దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు అదే తరహాలో పనిచేయాలి. సహాయ నిరాకరణ ఉద్యమం 1922లో ముగిసింది. మరో 25 ఏళ్లకు.. 1947లో స్వాతంత్య్రం వచ్చింది. 2047లో మనం వందో స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోబోతున్నాం. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవడానికి మనమంతా కంకణబద్ధులమై పనిచేయాలి. కొత్త భవనం.. ప్రజాస్వామ్య దేవాలయం ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, 140 కోట్ల మంది ఆకాంక్షలకు, కలలకు ప్రతిరూపం. మన స్వాతంత్య్ర సమర యోధుల కలలను సాకారం చేయడానికి ఇదొక వేదిక. ఇది మన ప్రజాస్వామ్య దేవాలయం. భారతదేశ దృఢసంకల్పం ప్రపంచానికి ఇస్తున్న సందేశమిది. ప్రతి దేశ చరిత్రలో అమరత్వం పొందిన క్షణాలు కొన్ని ఉంటాయి. కాలం ముఖచిత్రంపై కొన్ని తేదీలు చెరిగిపోని సంతకంగా మారుతాయి. 2023 మే 28 కూడా అలాంటి అరుదైన సందర్భమే. పేదల ప్రజల సాధికారత, అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం గత తొమ్మిదేళ్లుగా కృషి చేస్తున్నాం. ఇది నాకు సంతృప్తినిస్తున్న క్షణం. పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. గ్రామాలను అనుసంధానించడానికి 4 లక్షల కిలోమీటర్లకుపైగా రహదారులు నిర్మించాం. 50,000కుపైగా అమృత సరోవరాలు(చెరువులు), 30,000కుపైగా కొత్త పంచాయతీ భవనాలు నిర్మించాం. పంచాయతీ భననాల నుంచి పార్లమెంట్ కొత్త భవనం దాకా కేవలం ఒకేఒక్క స్ఫూర్తి మమ్మల్ని ముందుకు నడిపించింది. అదే.. దేశ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి. కొత్త దారుల్లో నడిస్తేనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. భారత్ ఇప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. నూతనోత్సాహం కనిపిస్తోంది. కొత్త ఆలోచన, కొత్త ప్రయాణం. దిశ కొత్తదే, విజన్ కొత్తదే. మన విశ్వాసం, తీర్మానం కూడా కొత్తవే. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. భారత్ ముందుకు నడిస్తే ప్రపంచం కూడా ముందుకు నడుస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ ఆవిర్భావానికి సాక్షి ఇప్పటి అవసరాలకు పాత భవనం సరిపోవడం లేదు. అందుకే కొత్తది నిర్మించాం. కొత్తగా మరికొంత మంది ఎంపీలు చేరనున్నారు. 2026 తర్వాత పునర్వ్యస్థీకరణతో పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. సెంగోల్‌కు తగిన గౌరవం దక్కుతుండడం సంతోషకరం. చోళ సామ్రాజ్యంలో సెంగోల్‌ను కర్తవ్య మార్గం, సేవా మార్గం, జాతీయ మార్గానికి గుర్తుగా పరిగణించేవారు. కొత్త భవన నిర్మాణంలో 60,000 మంది కార్మికులు పాల్గొన్నారు. ఇక్కడి డిజిటల్ గ్యాలరీని వారికే అంకితమిస్తున్నాం. ఈ కొత్త భవనం ఆత్మనిర్భర్ భారత్ ఆవిర్భావానికి, వికసిత భారత్ దిశగా మన ప్రయాణానికి ఒక సాక్షిగా నిలుస్తుంది. భారత్ విజయం ప్రపంచ విజయం భారత్‌లాంటి పూర్తి వైవిధ్యం, అధిక జనాభా ఉన్న దేశం పరిష్కరించే సవాళ్లు, సాధించే విజయాలు చాలా దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. రాబోయే రోజుల్లో భారత్ సాధించే ప్రతి విజయం ప్రపంచం సాధించే విజయంగా మారుతుంది. భారత్ కేవలం ఒక ప్రజాస్వామ్య దేశం కాదు, ప్రజాస్వామ్యానికి తల్లి కూడా. మన ప్రజాస్వామ్యమే మనకు స్ఫూర్తి. మన రాజ్యాంగమే మన బలం. ఈ స్ఫూర్తికి, బలానికి ఉత్తమమైన ప్రతీక పార్లమెంట్. పాత కొత్తల కలయికకు పరిపూర్ణ ఉదాహరణ పార్లమెంట్ నూతన భవనం. శతాబ్దాల బానిసత్వం కారణంగా మన ఉజ్వలమైన భవన నిర్మాణ శైలికి, పట్టణ ప్రణాళికకు దూరమయ్యాం. ఇప్పుడు ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించుకుంటున్నాం. పార్లమెంట్ కొత్త భవనాన్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారు. మన వారసత్వం వైభవం, నైపుణ్యాలు, సంస్కృతితోపాటు రాజ్యాంగ వాణికి సైతం ఈ భవనం ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన సామగ్రితో కొత్త భవనం నిర్మించాం. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్‌కు ఇదొక గుర్తు. ప్రారంభోత్సవం సాగింది ఇలా..! అత్యాధునిక హంగులు, సకల సదుపాయాలతో నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటు కొత్త భవనాన్ని ఆదివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అట్టహాసంగా ఒక ఉత్సవంలా సాగిన ఈ వేడుకలో ప్రధాని చారిత్రక ప్రాధాన్యమున్న అధికార మార్పిడికి గుర్తయిన రాజదండం (సెంగోల్)ను లోక్‌సభ ఛాంబర్లో ప్రతిష్టించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితమిచ్చారు. ► సంప్రదాయ దుస్తులు ధరించిన ప్రధాని మోదీ ఉదయం 7.30 గంటలకి పార్లమెంటుకు వచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధానికి ఎదురేగి స్వాగతం పలికారు. ► పార్లమెంటు ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్రధాని మోదీ నివాళులర్పించారు ► అక్కడ నుంచి నేరుగా కొత్త భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన పూజామండపానికి చేరుకున్నారు. అక్కడ ప్రధానికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కర్ణాటక శృంగేరి మఠాధిపతులు వేద మంత్రాలు పఠిస్తూ ఉంటే ప్రధాని మోదీ గణపతి హోమం నిర్వహించారు. దీంతో పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ► అనంతరం వేద పండితులు ప్రధానికి శాలువా కప్పి ఆశీర్వాదాలు అందజేశారు. ► అక్కడ నుంచి తమిళనాడు నుంచి వచ్చిన 21 మంది పీఠాధిపతులు వద్దకి వెళ్లారు. వారికి నమస్కరించారు. అప్పటికే పూజలు చేసి సిద్ధంగా అక్కడ ఉంచిన చారిత్రక సెంగోల్ ఎదుట ప్రధాని సాష్టాంగ నమస్కారం చేశారు. వారు అందించిన సెంగోల్‌ను చేత పుచ్చుకున్న ప్రధాని మోదీ వీనుల విందుగా నాదస్వరం వాయిస్తూ ఉంటే, వేద పండితులు మంత్రాలు పఠిస్తూ ఉంటే స్పీకర్ ఓం బిర్లా వెంటరాగా ఒక ఊరేగింపుగా వెళ్లి సెంగోల్‌ను లోక్‌సభ ఛాంబర్లోకి తీసుకువెళ్లి స్పీకర్ కుర్చీకి కుడివైపు ప్రతిష్టించారు. ► అనంతరం స్పీకర్ ఆసీనులయ్యే సీటు దగ్గర ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేశారు. ► లోక్‌సభ నుంచి తిరిగి ప్రధాని మోదీ పూజాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ఆవిష్కరించి నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేశారు. ► అనంతరం కొత్త భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కొంతమంది కార్మికులకు శాలువాలు కప్పి సత్కరించారు. వారి ప్రతిభకి గుర్తింపుగా జ్ఞాపికలను బహూకరించారు. ► అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ► దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.75 స్మారక నాణేన్ని ప్రధాని ఆవిష్కరించారు. త్రిభుజాకారంలో ఉన్న కొత్త భవనం ముద్రించి ఉన్న స్టాంపు, కవర్ని కూడా ఆవిష్కరించారు. ► రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పంపించిన సందేశాలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చదివి వినిపించారు. ► కార్యక్రమంలో భాగంగా లోక్‌సభలో నేతల సమక్షంలో జాతీయ గీతం అయిన జనగణమన వినిపించారు. ► ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్. జైశంకర్, అశ్వినీ వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ► నూతన భవనం ప్రారంభోత్సవానికి కనీసం 20 విపక్ష పార్టీలు హాజరు కాలేదు. -
వృద్ధి గతిని మార్చిన డిజిటల్ బ్యాంకింగ్
న్యూఢిల్లీ: భారత్ స్థిరమైన వృద్ధి సాధించడం వెనుక బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రధాన కారణాలుగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. 2014కు ముందున్న ఫోన్ బ్యాంకింగ్ స్థానంలో గత ఎనిమిది సంవత్సరాల్లో డిజిటల్ బ్యాంకింగ్ ప్రవేశపెట్టడం స్థిరమైన వృద్ధికి దోహదపడినట్టు చెప్పారు. యూపీఏ సర్కారు హయాంలో ఫోన్ బ్యాంకింగ్ ద్వారా ఎవరికి రుణాలు ఇవ్వాలి, నియమ నిబంధనలపై ఆదేశాలు ఫోన్ ద్వారా వెళ్లేవన్నారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా.. దాని బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే అంత పురోగమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (డీబీయూలు) ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫోన్ బ్యాంకింగ్ విధానంలో ఫోన్ ద్వారానే బ్యాంకుల నిర్వహణను నేతలు నిర్ధేశించేవారని వ్యాఖ్యానించారు. ఫోన్ బ్యాంకింగ్ రాజకీయాలు బ్యాంకులను సంక్షోభం పాలు చేశాయని, వేలాది కోట్ల రూపాయిల స్కామ్‌లకు దారితీశాయని విమర్శించారు. తమ ప్రభుత్వం పారదర్శకతపై దృష్టి పెట్టి బ్యాంకింగ్ రంగాన్ని మార్చేసినట్టు చెప్పారు. ‘‘నిరర్థక ఆస్తులను (ఎన్పీఏలు) గుర్తించడంతో పారదర్శకత వల్ల వేలాది కోట్ల రూపాయిలను తిరిగి బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొచ్చాం. బ్యాంకులకు నిధుల సాయం అందించాం. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్యలు తీసుకున్నాం. అవినీతి నిరోధక చట్టాన్ని సంస్కరించాం’’ అని ప్రధాని వివరించారు. దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) చట్టాన్ని తేవడం ఎన్పీఏల సమస్యకు పరిష్కారం లభించినట్టు చెప్పారు. కస్టమర్లు బ్యాంకుల దగ్గరకు వెళ్లడం కాకుండా, వారి దగ్గరకే బ్యాంకులు వచ్చేలా డిజిటల్ బ్యాంకింగ్‌తో మార్పులను తీసుకొచ్చినట్టు వివరించారు. మారుమూల ప్రాంతాలకూ బ్యాంకు సేవలను చేరువ చేయడానికి అధిక ప్రాధాన్యం చూపించినట్టు చెప్పారు. చిన్న వర్తకులూ డిజిటల్‌కు మారాలి.. గ్రామాల్లోని చిన్న వర్తకులు సైతం పూర్తిగా డిజిటల్ లావాదేవీలకు మళ్లాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రతీ బ్యాంకు శాఖ 100 మంది వర్తకులను తమతో అనుసంధానించాలని కోరారు. ఈ చర్య మన ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తు సన్నద్ధంగా మార్చేస్తుందన్నారు. ‘‘డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలు అన్నవి నేడు మన ఆర్థిక వ్యవస్థకు, స్టార్టప్ ప్రపంచానికి, భారత్‌లో తయారీకి, స్వావలంబన భారత్‌కు గొప్ప బలం’’అని ప్రధాని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ కలయిక అవినీతి నిర్మూలనకు సాయపడుతున్నట్టు తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా లబ్ధిదారులకు రూ.25 లక్షల కోట్లను బదిలీ చేసినట్టు ప్రకటించారు. పీఎం–కిసాన్ పథకం కింద మరో వాయిదా ప్రయోజనాన్ని సోమవారం బదిలీ చేయనున్నట్టు చెప్పారు. ఈ పథకం కింద ఒక్కో రైతుకు ఒక ఎకరానికి రూ.6,000 (మూడు వాయిదాలుగా) ప్రయోజనం లభించనుంది. బ్లాక్‌చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీని తీసుకురావాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘డిజిటల్ కరెన్సీ అయినా, డిజిటల్ లావాదేవీలు అయినా ఇందులో ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ చర్య పొదుపులను పెంచుతుంది. భౌతిక కరెన్సీని తగ్గిస్తుంది. తద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’’అని వివరించారు. -
శత్రువుల పాలిట సింహస్వప్నం.. ‘విశాఖ’
Rajnath Singh Dedicates Ins Visakhapatnam Warship : సుందర నగరం.. సిటీ ఆఫ్ డెస్టినీగా ప్రపంచం చూపు తన వైపు తిప్పుకుంటున్న విశాఖకు విశిష్ట గుర్తింపు లభించింది. ప్రాజెక్టు 15–బీలో భాగంగా ఐఎన్ఎస్ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌక సిద్ధమైంది. దీన్ని ఈ నెల 21న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్నారు. ఈ యుద్ధ నౌక తూర్పు నౌకాదళ బలాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. సాక్షి, విశాఖపట్నం: సహజ సిద్ధమైన భౌగోళిక రక్షణతో పాటు శత్రుదేశాలకు సుదూర కేంద్రంగా.. తూర్పు తీరంలో వ్యూహాత్మక రక్షణ ప్రాంతంగా.. విశాఖపట్నం కీలకంగా మారింది. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ని ఓడించి.. జాతి గర్వించదగ్గ గెలుపునందించిన విశాఖ పేరు వింటే.. తెలుగు ప్రజల గుండె ఉప్పొంగుతుంది. మరి సముద్ర రక్షణలో శత్రువులను సమర్థంగా ఎదుర్కొనే యుద్ధ నౌకని విశాఖపట్నం పేరుతో పిలిచే రోజు సమీపించింది. భారత నౌకాదళం ఐఎన్ఎస్ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌకని సిద్ధం చేసింది. ఈ నెల 21న రక్షణ శాఖ మంత్రి రాజ్నా«థ్ సింగ్ చేతుల మీదుగా ముంబైలో జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం తూర్పు నౌకాదళం కేంద్రంగా ఐఎన్ఎస్ విశాఖపట్నం సేవలందించనుంది. ప్రాజెక్టు–15బీలో మొదటి యుద్ధ నౌక ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలు విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లు పెట్టాలని నిర్ణయించింది. తొలి షిప్‌ని విశాఖపట్నంపేరుతో తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. 2013 అక్టోబర్‌లో షిప్ తయారీ పనులను వై–12704 పేరుతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్(ఎండీఎల్) ప్రారంభించింది. ఇది సముద్ర ఉపరితలంపైనే ఉంటుంది.. కానీ ఎక్కడి శత్రువుకి సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖపట్నం శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. సముద్ర జలాల్లోకి సంధాయక్ సాగర గర్భాన్ని శోధిస్తూ భారత భూభాగాన్ని పరిరక్షిస్తూ.. తిరుగులేని శక్తిగా సేవలందించేందుకు మరో నౌక సన్నద్ధమవుతోంది. 1981 నుంచి దేశ రక్షణలో ముఖ్య భూమిక పోషిస్తూ అనేక కీలక ఆపరేషన్లలో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని.. ఈ ఏడాది జూన్‌లో సేవల నుంచి ఐఎన్ఎస్ సంధాయక్ నిష్క్రమించింది. దాని స్థానంలో హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్(లార్జ్) సంధాయక్‌ని నిర్మిస్తున్నారు. ఈ నౌక నిర్మాణానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖకు, కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) మధ్య ఒప్పందం జరిగింది. హల్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో డిసెంబర్లో తొలిసారిగా సముద్ర జలాల్లోకి రానుంది. అనంతరం.. బేస్ ట్రయల్స్, సీ ట్రయల్స్ పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సంధాయక్ షిప్‌ల కంటే.. ఇది అతి పెద్ద సర్వే నౌకగా అవతరించబోతోంది. సముద్రలోతుల్ని, కాలుష్యాన్ని సర్వే చేయడంలో సంధాయక్ ప్రపంచంలోనే మేటి షిప్‌గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది. ఇందులో కొత్త సాంకేతికతతో కూడిన హైడ్రోగ్రాఫిక్ పరికరాలు అమర్చారు. హిందూ మహా సముద్రంలోని భౌగోళిక డేటాని సేకరించేందుకు తొలిసారిగా దీన్ని వినియోగించనున్నారు. నౌకాదళానికి కొత్తబలం హిందూ మహా సముద్ర ప్రాంతంలో మారుతున్న పవర్ డైనమిక్స్‌కి అనుగుణంగా విధులు నిర్వర్తించేలా ఐఎన్ఎస్ విశాఖపట్నం సత్తా చాటనుంది. ఈ యుద్ధ నౌక తూర్పు నౌకాదళ బలాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా డిజిటల్ సర్వే కచ్చితత్వ ప్రమాణాల్ని పసిగట్టేవిధంగా సంధాయక్ కూడా త్వరలోనే కమిషనింగ్‌కు సిద్ధమవుతోంది. డిజిటల్ సర్వే అండ్ ప్రాసెసింగ్ సిస్టమ్, ఆటోమేటెడ్ డేటా లాగిన్ సిస్టమ్, ఓషినోగ్రాఫిక్ సెన్సార్లు, సీ గ్రావి మీటర్, సైడ్ స్కాన్ సోనార్లు, మల్టీబీమ్ స్వాత్ ఎకో సౌండింగ్ సిస్టమ్‌లతో గతంలో ఉన్న సర్వే నౌకలకు భిన్నంగా ఇది రూపుదిద్దుకుంటోంది. – వైస్ అడ్మిరల్ అజేంద్ర బహద్దూర్ సింగ్, తూర్పు నౌకాదళాధిపతి -
దిశ మార్చి వస్తోంది..దశ మార్చబోతోంది..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ దశాబ్దాల కల సాకారమైంది. రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. తొలుత ఉదయం 11:23 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఆవిష్కరించారు. అనంతరం విశిష్ట అతిథి గవర్నర్ నరసింహన్, మరో ముఖ్యఅతిథి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తోపాటు వై.ఎస్. జగన్, సీఎం కేసీఆర్ కొబ్బరికాయలు కొట్టారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ గుమ్మడికాయను కొట్టి సరిగ్గా ఉదయం 11:26 గంటలకు రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. అలాగే మధ్యాహ్నం 1:07 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముఖ్యమంత్రి స్విచాన్ చేశారు. మధ్యాహ్నం 1.15 గంటలకు పంప్‌హౌస్ నుంచి నీటి పంపింగ్ ప్రారంభం కావడంతో పవిత్ర గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించే భగీరథ ప్రయత్నమైన బృహత్తర కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని బటన్ నొక్కి ఆవిష్కరిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్. చిత్రంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ తదితరులు కన్నెపల్లి వద్ద ఉవ్వెత్తున ఎగసిపడుతున్న గోదావరి.. ఘనంగా జల సంకల్ప యాగం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు మేడిగడ్డ బ్యారేజీ వద్ద, కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద శృంగేరీ పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలాశయ ప్రతిష్టాంగ యాగం, జలసంకల్ప మహోత్సవ యాగం జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్టించి వేద పండితులు పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన యాగం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా వేద పండితులు ముగ్గురు సీఎంలను, గవర్నర్‌ను ఆశీర్వదించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరిగిన యాగంలో కేసీఆర్ దంపతులు, కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర జరిగిన యాగంలో మంత్రి ఎర్రబెల్లి దంపతులు పాల్గొన్నారు. ఇదే సమయంలో అన్నారం బ్యారేజీని మంత్రి నిరంజన్‌రెడ్డి, అన్నారం పంప్‌హౌస్‌ను మంత్రి మహమూద్ అలీ, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌లను మంత్రి కొప్పుల ఈశ్వర్, మేడారం పంప్‌హౌస్‌ను మంత్రి మల్లారెడ్డి, లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. యాగశాలలో కేసీఆర్ దంపతుల పూజలు. చిత్రంలో గవర్నర్ నరసింహన్, సీఎంలు ఫడ్నవిస్, జగన్, మంత్రులు ఇంద్రకరణ్, ఈటల తదితరులు ముగ్గురు సీఎంలు కలిసిన సందర్భం.. నదీజలాల వాటాలు, పంపకాల విషయంలో రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో గోదావరి నది పరీవాహక ప్రాంతానికి చెందిన ముగ్గురు ముఖ్య మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనడం చరిత్రలో నిలిచిపోనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడలేదు. నిన్న మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వంతోనూ నీటి వివాదాలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మహారాష్ట్ర ప్రభుత్వంతో, ఏపీలో కొలువుదీరిన వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్నేహపూర్వక దౌత్య సంబంధాలు నడిపారు. అతిథులు, బ్యాంకర్లకు సన్మానం: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యఅతిథులు గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికిన కేసీఆర్... అతిథులు వెళ్లేటప్పుడు హెలికాప్టర్ దాకా వెళ్లి మరీ ఒక్కొక్కరికీ ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించిన వివిధ బ్యాంకుల ప్రతినిధులను సీఎం సన్మానించి జ్ఞాపికలు అందించారు. లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కన్నెపల్లిలో నిర్మించిన పంపుహౌస్ లిఫ్ట్‌లో విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఇరుక్కుపోయారు. ప్రాజెక్టు ప్రారంభానికి హాజరైన ఆయన... కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటార్లను చూసేందుకు లిప్టులో కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గంటన్నర తర్వాత లిఫ్ట్ అద్దాలు పగలగొట్టి అధికారులు వారిని నిచ్చెన ద్వారా మరో ఫ్లోర్‌లోకి ఎక్కించారు. సువర్ణాక్షరాలతో లిఖించే రోజు: సీఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన జూన్ 21వ తేదీని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి అభివర్ణించారు. అతిథులు, బ్యాంకర్లను సన్మానించే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ జోషి కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆంధ్రప్రదేశ్ మంత్రులు పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, మహారాష్ట్ర డీజీపీ జైస్వాల్, ఎంపీలు జోగినిపల్లి సంతోశ్ కుమార్, బి.వెంకటేష్ నేత, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర వెంకట రమణారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, నీటిపారుదలశాఖ ఈఎన్సీలు మురళీధర్‌రావు, హరే రామ్, వెంకటేశ్వర్లు, ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ. గోపాలరావు, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఒకే కారులో ముగ్గురు సీఎంలు, గవర్నర్... మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభోత్సవం సందర్భంగా బ్యారేజీకి అనుబంధంగా గోదావరి నదిపై తెలంగాణ–మహారాష్ట్ర మధ్య నిర్మించిన బ్రిడ్జిని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, గవర్నర్ ఒకే కారులో తెలంగాణ సరిహద్దు నుంచి బ్యారేజీ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు ప్రయాణించారు. అనంతరం బ్యారేజీ లోపలికి నీరు నిల్వ ఉంచే చోటును పరిశీలించారు. మేడిగడ్డ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అతిథులతో కలిసి సీఎం కేసీఆర్ తిలకించారు. గోదావరి నీటి వినియోగానికి ప్రాజెక్టుల ఆవశ్యకతను గుర్తించిన విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అతిథులకు వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నీరు అందిస్తున్నది విడమరిచి చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ గురించి మ్యాప్ ద్వారా సీఎంలు ఫడ్నవిస్, జగన్‌లకు వివరిస్తున్న కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్రతో చేసుకున్న చరిత్రాత్మక ఒప్పందమే కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్ని రకాలుగా సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రారంభం సందర్భంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్... ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, గవర్నర్ నరసింహన్‌లను పంప్‌హౌస్ అడుగు భాగంలో ఏర్పాటు చేసిన పంపుల వద్దకు తీసుకువెళ్లి చూపించారు. పంపుల సామర్థ్యం, ఉపయోగంపై విపులంగా చెప్పారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధి కృష్ణారెడ్డి అతిథులకు నిర్మాణాల విశిష్టతను వివరించారు. అయితే షెడ్యూల్డ్ కార్యక్రమాలు ఉండటంతో ఫడ్నవిస్ కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రారంభోత్సవంకన్నా ముందే వెళ్లిపోయారు. ముక్తీశ్వరుడ్ని దర్శించుకున్న ఫడ్నవిస్ కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ మేడిగడ్డ బ్యారేజీ నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరాలయానికి ఉదయం 11.45 గంటలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కమిషనర్ అనిల్ కుమార్, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ మధుర ఘట్టాలు.. ఉదయం 7:15 గంటలకు : హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో మేడిగడ్డకు బయలు దేరారు. అప్పటికే మేడిగడ్డ వద్ద శృంగేరీ పీఠానికి చెందిన ఫణి శశాంక్ శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో 40 మంది వేద పండితులతో వరుణ దేవుడిని ఆహ్వానిస్తూ మహాక్రతువు నిర్వహించారు. 8:30: సీఎం కేసీఆర్ మేడిగడ్డ వద్ద 10 నిమిషాలపాటు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. 9:10: హోమంలో కూర్చన్న కేసీఆర్ దంపతులు 9:30: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. వారికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. 9:50: యాగశాలలో కూర్చున్న ఏపీ సీఎం వై.ఎస్. జగన్, మంత్రులు 10:45: మహారాష్ట్ర సీఎం పఢ్నవిస్, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌లు మేడిగడ్డ వద్ద నిర్వహిస్తున్న హోమం వద్దకు చేరిక.. వారికి సంప్రదాయ రీతిలో స్వాగతం. 11:00: జలసంకల్ప హోమం పూర్తి 11:15: ప్రాజెక్టుపై ఫొటో ప్రదర్శ నను తిలకించిన సీఎంలు, గవర్నర్, అతి«థులు. 11:20: ప్రాజెక్టు డాక్యుమెంటరీ వీక్షణ 11:23: వైఎస్.జగన్ మేడిగడ్డ వద్ద పైలాన్ బటన్‌నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 11:26: గేట్ల వద్ద రిబ్బన్ కత్తిరించిన సీఎం కేసీఆర్, అంతకు ముందు గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో గవర్నర్, కేసీఆర్, జగన్ మహారాష్ట్ర సరిహద్దుకు వెళ్లారు. మధ్యాహ్నం 12:50: కన్నెపల్లికి చేరుకున్నారు. 12:50 నుంచి 12:53 వరకు ‘మేఘా’ ప్రతినిధులు పంపుల పనీతీరును గవర్నర్, సీఎంలకు వివరించారు. గుమ్మడి కాయలతో దిష్టి తీసిన సీఎం కేసీఆర్ అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్‌కు రిబ్బన్ కట్ చేశారు. 12:55: శిలాఫలకం ఆవిష్కరణ. అక్కడి దిగువన ఉన్న మోటార్ల పరిశీలన. 1:07: ఆరో నంబర్ మోటార్‌ను స్విచ్ ఆన్ చేసి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను స్విచ్ ఆన్ చేస్తున్న సీఎం కేసీఆర్. నీటి పంపింగ్ అనంతరం ఉరకలెత్తుతున్న గోదావరి జలాలు 1:30: మధ్యాహ్న భోజన విరామం, ఆ తర్వాత అతిథులు, ఇంజనీర్లు, బ్యాంకర్లతో ముఖ్యమంత్రులు, గవర్నర్ మాట్లాడారు. అనంతరం అతిథులను సన్మానించారు. 2:00 గంటల తర్వాత నుంచి ఒకరి తర్వాత ఒకరు తిరుగు ప్రయాణమయ్యారు. ముందుగా గవర్నర్ నరసింహన్, తర్వాత ఏపీ సీఎం జగన్‌కు సీఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు. 2:25 గంటలకు బ్యాంకర్లు, కొందరు అతిథులను సన్మానించి జ్ఞాపికలను అందజేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరారు. -
నెరవేరిన జలసంకల్పం
గోదావరి జలాలను సమర్ధవంతంగా వినియోగించుకుని తెలంగాణలోని బీడు భూముల్ని సస్య శ్యామలం చేయాలన్న సంకల్పంతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ముగ్గురు ముఖ్య మంత్రుల సాక్షిగా శుక్రవారం ప్రారంభమైంది. మూడేళ్లనాడు మొదలైన ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు అనేకానేక అవాంతరాలకు, అవరోధాలకు ఎదురీదుతూ చకచకా ముందుకు సాగిన తీరు అపూర్వ మని చెప్పాలి. ఎన్నో ప్రాజెక్టులు, వందల కిలోమీటర్ల పొడవైన సొరంగాలు, రిజర్వాయర్లు, కాల్వలు, భారీ మోటార్లు... ఇవన్నీ మూడేళ్ల వ్యవధిలోనే పరిపూర్తి చేయడం అద్భుతం, అసాధా రణం. దాదాపు 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తూనే, జనం దాహార్తిని తీరుస్తూనే, పరి శ్రమల అవసరాలకు సైతం ఉపయోగపడేవిధంగా ఈ బృహత్తర ప్రాజెక్టును తీర్చిదిద్దారు. గోదా వరి నదీగర్భం నుంచి దాదాపు అరకిలోమీటరు ఎత్తులో నీళ్లను ఎత్తిపోసి అక్కడి నుంచి వివిధచోట్ల నిర్మించిన బరాజ్‌లకు వాటిని తరలించి బీడు భూములను చివురింపజేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే విధంగా వ్యవహరిస్తే, పొరుగు అవసరాలను పెద్ద మనసుతో అర్ధం చేసుకోగలిగితే రాష్ట్రాల మధ్య అవగాహన సాధ్యమేనని, జటిలమైన జల వివాదాలు సైతం సునాయాసంగా పరిష్కారమవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూ పించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించాలనుకున్న సమయంలో పొరుగునున్న మహారాష్ట్ర అందుకు అభ్యంతరం చెప్పినప్పుడు ఆయన చేసింది ఇదే. అనేక ప్రత్యామ్నాయాలను ఆలోచించి చివరకు తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ వద్ద ఎత్తిపోతల చేపడతామని ప్రతిపాదించి, ఆ రాష్ట్రాన్ని ఒప్పించారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రం వ్యక్తం చేసిన ఎన్నో సందేహాలను ఆయన పటాపంచలు చేయగలిగారు. మన దేశంలో జలవివాదాలు ఎన్ని సమస్యలను సృష్టిస్తున్నాయో, ఆ వివాదాల కారణంగా జనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలుసు. అయినా నేతలు కాస్తయినా వెనక్కి తగ్గరు. తమ వాదనే సరైందంటూ కాలం గడుపుతారు తప్ప ప్రజలకు మేలు కలుగుతుందన్న వివేచనను ప్రదర్శించరు. రాజ్యాంగంలోని 262వ అధికరణ నదీజలాల వివాదాలు తలెత్తినప్పుడు ఏం చేయాలో వివరిస్తుంది. నదీజలాల వినియోగం, పంపిణీ, నియంత్రణ వగైరాలపై రాష్ట్రాల మధ్య జగడం వచ్చినప్పుడు దాని పరిష్కారం కోసం తగిన యంత్రాంగాన్ని పార్లమెంటు ఏర్పాటు చేయొచ్చునని ఆ అధికరణ వివరిస్తుంది. దాన్ని అనుసరించే 1956లో నదీ జలాల బోర్డు చట్టం, అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం వంటివి వచ్చాయి. బోర్డు ఏర్పాటు ఇంతవరకూ సాకారం కాకపోయినా నదీజలాల చట్టం కింద ట్రిబ్యునళ్లు ఏర్పడ్డాయి. కానీ వీటిల్లో చాలా ట్రిబ్యునళ్లు వివా దాలు బాగా ముదిరాక ఉనికిలోకొచ్చినవే. కానీ ఆశ్చర్యమేమంటే ఇవి అంతులేని జాప్యం తర్వాత ప్రకటించిన నిర్ణయాలు వివాదాలను ఏమాత్రం పరిష్కరించకపోగా వాటిని మరింత జటిలంగా మార్చాయి. జలవివాదాలు సుప్రీంకోర్టు పరిధిలోకి రాబోవని నిబంధనలు చెబుతున్నా చివరకు అవి అక్కడికే చేరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తీర్పుల్ని అమలు చేయడానికి ససేమిరా అంటున్నాయి. ‘ప్రజల మనోభావాల’ను సాకుగా చూపు తున్నాయి. ఏతావాతా రాజ్యాంగ అధికరణలు, చట్ట నిబంధనల ప్రకారం వెళ్లాలనుకుంటే ఏళ్లకేళ్ల సమయం పడుతుంది తప్ప చివరకు ఏ ఫలితమూ లభించడం లేదు. వివాదాలు తలెత్తిన రాష్ట్రా ల్లోని ప్రజానీకానికి అగచాట్లు తప్పడం లేదు. వేర్వేరు దేశాల మధ్య కూడా జలవివాదాలు పరిష్కా రమవుతుండగా మన దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య అటువంటి సమన్వయం కొరవడుతోంది. పర్యవసానంగా ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. విలువైన జలాలు సముద్రంపాలవుతున్నాయి. గోదావరి నదిలోనే ఏటా 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోందని ఒక అంచనా. రెండు రాష్ట్రాల్లోని కోట్లాదిమందికి ప్రాణాధారమైన గోదావరి నదిలో ఏటా మూడు నెలల పాటు...అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో నీటి లభ్యత అత్యధికంగా ఉంటుంది. కానీ దురదృష్టమేమంటే ఇలా వచ్చే నీరంతటినీ సంపూర్ణంగా వినియోగించుకునే సామర్థ్యం తెలుగు రాష్ట్రాలు రెండిటికీ లేదు. మరోపక్క ఈ రెండు రాష్ట్రాలూ తరచుగా కరువు వాతబడి ఎన్నో సమ స్యలను ఎదుర్కొంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఉపాధి అవకాశాలు ఆవిరై జనం పొట్టచేతబట్టుకుని వలసపోతున్నారు. ఊళ్లు బావురుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు సాకారం కావడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ఆదర్శనీయమైనది. గోదావరి జలాలను ఎగువనున్న మహారాష్ట్రతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలూ వినియోగించు కోవాల్సి ఉండగా ఇందులో కేవలం మహారాష్ట్ర మాత్రమే తన వంతు వాటాను మెరుగ్గా వాడుకో గలుగుతోంది. గోదావరి జల వివాద ట్రిబ్యునల్ ప్రకటించిన అవార్డు ప్రకారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ వాటాకు 1486 టీఎంసీల నీళ్లు వస్తాయి. ఇందులో తెలంగాణకు 912.250 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 509.546 టీఎంసీలున్నాయి. నదుల్లో సమృద్ధిగా నీళ్లున్నప్పుడు సమస్యలు తలెత్తే ప్రశ్నే ఉండదు. అలా లేనప్పుడే వివాదాలు ముసురుకుంటాయి. కృష్ణానదిలో ఎప్పుడూ నీళ్లు సరిగా పారే పరిస్థితి లేనందువల్ల పంపకాల్లో పేచీ వస్తోంది. అది తరచుగా వివాదాల్లో చిక్కుకుం టోంది. గోదావరికి నీటి లభ్యత విషయంలో ఎప్పుడూ ఇబ్బంది లేదు. అలాగని ఇకముందూ ఇలాగే ఉంటుందనుకోవడానికి లేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణకు మహారాష్ట్రతో అవగాహన కుదిరినట్టే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య కూడా నదీజలాల విషయంలో సమ న్వయం, సదవగాహన ఏర్పడితే ఈ రెండు రాష్ట్రాల భవిష్యత్తూ దివ్యంగా ఉంటుంది. శుక్రవారం నాటి చారిత్రక ఘట్టం అది నూటికి నూరుపాళ్లూ సాధ్యమేనని బాస చేస్తోంది. -
అందరికీ ఆధునిక వైద్యం!
న్యూఢిల్లీ: దేశంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు సరైన వైద్యం అందించేందుకు ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నేషనల్ సెంటర్ ఫర్ ఏజింగ్‌కు శంకుస్థాపనతోపాటు, సఫ్దార్‌జంగ్‌లోని 555 పడకల సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దేశవ్యాప్తంగా ఆధునిక వైద్య మౌలికవసతులను అభివృద్ధి చేస్తున్నాం. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం అనవసరంగా హెచ్చించాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాం’ అని అన్నారు. ఎయిమ్స్‌లోని 300 పడకల పవర్‌గ్రిడ్ విశ్రామ్ సదన్‌ను, ఎయిమ్స్–అన్సారీనగర్–ట్రామా సెంటర్లను కలిపేలా వాహనాలు తిరిగే టన్నెల్‌ను మోదీ ప్రారంభించారు. 9 నెలల్లో 42 లక్షల మంది! గత 9 నెలల్లో దేశవ్యాప్తంగా 42 లక్షల మంది సీనియర్ సిటిజన్లు తమ రైల్వే రాయితీలను స్వచ్ఛందంగా వదులుకున్నారని మోదీ చెప్పారు. దేశంలో నిజాయితీగా ప్రజలు వ్యవహరించే వాతావరణం పెరుగుతోందని ప్రశంసించారు. ‘రైల్వే రాయితీ విషయంలో నేను ఎలాంటి పిలుపునివ్వలేదు. కానీ, రైల్వే శాఖ ఎవరైనా స్వచ్ఛందంగా వదులుకోవచ్చని లబ్ధిదారులకు సూచించింది. గత 8–9 నెలల్లో 42 లక్షల మంది వయోవృద్ధులైన ప్రయాణికులు స్వచ్ఛందంగా తమ రాయితీలను వదులుకున్నారు’ అని అన్నారు. నెలకోరోజు గర్భిణులకు ఉచితంగా చికిత్సనందించాలని వైద్యులను కోరానని.. ఇప్పటివరకు 1.25 కోట్ల మంది గర్భిణులు ఈ పద్ధతిలో ఉచిత చికిత్స పొందారన్నారు. 2016లో మన్‌కీ బాత్ ద్వారా ఇచ్చిన పిలుపుమేరకు.. ప్రతినెలా 9వ తేదీన ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు గర్భిణులకు వైద్యం అందిస్తున్నారన్నారు. మంత్రిత్వ శాఖల సమన్వయంతో.. ప్రతి భారతీయుడికీ తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్యం అందించడం, రోగాలకు కారణమవుతున్న సమస్యలను అంతం చేయడం కోసం పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. వైద్య శాఖతోపాటుగా గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆయుష్ శాఖలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’లోని రెండు ప్రధాన పిల్లర్ల గురించి మోదీ వివరించారు. మొదటిది.. 1.5లక్షల సబ్–సెంటర్లను హెల్త్, వెల్నెస్ సెంటర్లుగా మార్చడం ద్వారా క్షయ, కుష్టు, మధుమేహం, రక్తపోటు, కొన్ని (రొమ్ము, నోటి, గర్భాశయ) కేన్సర్లను గుర్తించడం. రెండోది.. 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల బీమా సదుపాయం (ఒక్కో కుటుంబానికి). మరోవైపు, ఎయిమ్స్‌లో అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా అక్కడ చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం గురించి మోదీ వాకబు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ శౌర్య’(ఆదీవాసీ వికాస్ విభాగ్)లో భాగంగా ఎవరెస్టును అధిరోహించిన 10 మంది గిరిజన విద్యార్థులు కలుసుకున్నారు. వచ్చేవారం మద్దతు ధర పెంపు వరి సహా ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్లు పెంచనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వచ్చేవారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెరకుకు తగిన మద్దతుధరను వచ్చే రెండు వారాల్లో ప్రకటిస్తామని.. 2017–18 ధర కంటే ఇది మెరుగ్గానే ఉంటుందని మోదీ వెల్లడించారు. యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, పంజాబ్‌ల నుంచి వచ్చిన 140 మంది చెరకు రైతులతో సమావేశం సందర్భంగా ప్రధాని ఈ హామీ ఇచ్చారు. చెరకు రైతుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా చక్కెర మిల్లులకు రూ.8,500 కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, పదిరోజుల్లో వివిధ రాష్ట్రాల రైతులతో మోదీ సమావేశం కావడం ఇది రెండోసారి. -
ఐఎన్ఎస్ కిల్టాన్ జలప్రవేశం
విశాఖ సిటీ: అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు పాటిస్తూ యుద్ధ నౌకల నిర్మాణంలో భారత్ ముందంజలో ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఇందుకు అవసరమైన నిధుల్ని సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు. రక్షణ మంత్రి హోదాలో తూర్పు నౌకాదళాన్ని తొలిసారిగా సందర్శించిన ఆమె ప్రాజెక్టు–28లో భాగంగా రూపొందించిన యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కిల్టాన్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఐఎన్ఎస్ కిల్టాన్‌ను జాతికి అంకితం చేయడం ద్వారా హిందూ మహా సముద్రంలో శాంతి పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నౌకాదళానికి మరింత బలం చేకూరిందని అభిప్రాయపడ్డారు. 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ కిల్టాన్ నౌకాదళ రంగంలో నూతన ప్రమాణాలకు నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వయం సమృద్ధి దిశగా దేశ ఆయుధ సాంకేతికత వృద్ధి చెందడం గర్వకారణమని, అత్యున్నత ప్రమాణాలతో యుద్ధ నౌకల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక చేయూతను ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. యుద్ధ సమయంలోనే కాకుండా.. ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొంటూ ఇండియన్ నేవీ చేస్తున్న సేవలు నిరుపమానమైనవని కొనియాడారు. ప్రొపెల్షన్, ఆయుధ సాంకేతికతల్ని దేశీయంగా అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సీతారామన్ పేర్కొన్నారు. కార్బన్ ఫైబర్ టెక్నాలజీతో కిల్టాన్ నిర్మాణం భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా మాట్లాడుతూ.. యుద్ధ నౌకల తయారీలో ఐఎన్ఎస్ కిల్టాన్‌ను ముందడుగుగా అభివర్ణించారు. భారీ యుద్ధ నౌకల్ని దేశీయంగా నిర్మించడం వల్ల దేశ రక్షణ రంగ అవసరాలు తీరతాయన్నారు. సూపర్ స్ట్రోమ్ ఇంటిగ్రేటెడ్ వెపన్ వంటి ఆయుధ సంపత్తితో భారత నౌకాదళానికి అదనపు హంగులు సమకూరుతున్నాయని లాంబా వివరించారు. కార్బన్ ఫైబర్ టెక్నాలజీతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ణీత సమయంలో ఈ భారీ యుద్ధ నౌకను సిద్ధం చేశామని కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ) సీఎండీ రియర్ అడ్మిరల్ వీఎస్ సక్సేనా అన్నారు. అంతకుముందు తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌కు నేవీ సిబ్బంది ఘన స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. ఈఎన్సీ ప్రధాన స్థావరంతో పాటు నౌకాదళంలోని వివిధ విభాగాల్ని ఆమె పరిశీలించారు. అనంతరం.. భారత నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్లాంబాతో పాటు ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. -
సర్దార్ స్వప్నాన్ని నిజం చేశాం!
► సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణంతో ఆయన ఆత్మ సంతోషిస్తుంది ► డ్యాం నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు, కుట్రల్ని ఎదుర్కొన్నాం ► డ్యాంను జాతికి అంకితం చేసిన మోదీ దభోయ్ (గుజరాత్): నర్మదా నదిపై సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణంతో పటేల్ స్వప్నాన్ని నిజం చేశామని, ఇప్పుడు ఆయన ఆత్మ సంతోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ డ్యాం ఒక ఇంజనీరింగ్ అద్భుతమని.. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనేక మంది కుట్ర చేసినా, చివరకు పూర్తి చేసి చూపించామని చెప్పారు. గుజరాత్‌లోని దభోయ్ సమీపంలో కెవాదియా వద్ద సర్దార్ సరోవర్ ఆనకట్టను ఆదివారం ప్రధాని ఆవిష్కరించి అనంతరం జాతికి అంకితం చేశారు. రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు తిరస్కరించినా.. సొంతంగానే ప్రాజెక్టును నిర్మించి మన సత్తా చూపించామని, బహుశా ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కూడా ఇన్ని అడ్డంకుల్ని ఎదుర్కోలేదన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రాంతంలో మోదీ పూజలు నిర్వహించారు. తన 67వ జన్మదినం రోజైన ఆదివారం ఈ జలాశయాన్ని మోదీ జాతికి అంకితం చేయడం విశేషం. ఈ ఆనకట్ట దేశ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుందని, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల అభివృద్ధికి ఊతమిస్తుందని మోదీ పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం 1980లోనే ప్రారంభించినా.. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డ్యాం ఎత్తు పెంచుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ ఏడాది జూన్ 17న డ్యామ్ గేట్లు మూసివేసి.. ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.68 మీటర్లకు పెంచారు. ఎత్తు పెంచిన ఆనకట్టనే ఆదివారం మోదీ ప్రారంభించారు. ఏ ప్రాజెక్టూ ఇన్ని అడ్డంకులు ఎదుర్కోలేదు సర్దార్ సరోవర్ ఆనకట్ట ప్రారంభోత్సవం అనంతరం దభోయ్ పట్టణంలో ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.‘ఈ నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. మాపై అనేక తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు అనేకమంది కుట్ర చేశారు. అయితే దీనిని రాజకీయ యుద్ధంగా మార్చకుండా దృఢనిశ్చయంతో ముందుకు సాగాం’ అని చెప్పారు. ‘ఈ డ్యాం నిర్మాణం ఎదుర్కొన్న అడ్డంకులు ప్రపంచంలో ఏ ఇతర ప్రాజెక్టు నిర్మాణం ఎదుర్కోలేదు. అయితే ప్రాజెక్టు పూర్తి చేయాలని మనం సంకల్పించాం..పూర్తి చేశాం. నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అందరి చిట్టా నా వద్ద ఉంది. అయితే నేను వారి దారిలో వెళ్లకూడదని అనుకుంటున్నా.. అందుకని వారి పేర్లు చెప్పను. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేశారు. ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు ముందుగా ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. అయితే పర్యావరణ ఆందోళనల్ని కారణంగా చూపుతూ రుణానికి తిరస్కరించింది. ప్రపంచ బ్యాంకు సాయం చేసినా, చేయకపోయినా.. ఈ భారీ ప్రాజెక్టును సొంతంగానే పూర్తి చేశాం’ అని ప్రధాని చెప్పారు. సర్దార్ సరోవర్ డ్యాంకు ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు తిరస్కరించినప్పుడు గుజరాత్‌లోని ఆలయాలు ముందుకొచ్చి సాయం చేశాయని ఆయన గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులైన గిరిజన కుటుంబాలు చేసిన త్యాగానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. దేశాభివృద్ధి కోసం వారు చేసిన త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు. 75 ఏళ్ల క్రితమే పటేల్ కలలు కన్నారు: మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్ల్ని గుర్తుచేస్తూ.. ‘ఆ ఇద్దరు గొప్పనేతలు మరికొంతకాలం జీవించి ఉంటే.. డ్యాం నిర్మాణం 60, 70 దశకాల్లోనే పూర్తయ్యేది. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు, కరువు, వరదల సమస్యకు పరిష్కారం దొరికేది. ఈ రోజు నర్మదా డ్యాం ప్రారంభోత్సవంతో సర్దార్ పటేల్ ఆత్మ తప్పకుండా సంతోషిస్తుంది. 75 ఏళ్ల క్రితమే ఈ డ్యాం కోసం ఆయన కలలు కన్నారు’ అని మోదీ పేర్కొన్నారు. గుజరాత్ జీవనాడిగా పిలుస్తున్న ఈ డ్యాంను ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభించడం గమనార్హం. సర్దార్ సరోవర్తో ప్రయోజనాలు ► సర్దార్ సరోవర్ ఆనకట్టతో గుజరాత్లో 131 పట్టణ ప్రాంతాలు, 9,633 గ్రామాల (గుజరాత్‌లోని మొత్తం గ్రామాల్లో ఇది 53 శాతం)కు తాగునీరు లభిస్తుంది. ►గుజరాత్లో మొత్తం 15 జిల్లాల్లోని 3,112 గ్రామాల్లోని 18.54 లక్షల హెక్టార్ల ఎకరాలకు సాగునీరు. ► గుజరాత్‌తోపాటు రాజస్తాన్‌లోని ఎడారి జిల్లాలైన బార్మర్, జలోర్‌లో 2.46 లక్షల హెక్టార్లకు సాగునీరు. ► ఇక్కడ 1200, 250 మెగావాట్ల సామర్థ్యంతో రెండు జల విద్యుత్ కేంద్రాల్ని నిర్మించారు. ఈ విద్యుత్తును మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లు 57: 27: 16 నిష్పత్తిలో పంచుకుంటాయి. నావన్నీ పెద్ద పెద్ద స్వప్నాలే..! ‘అభివృద్ధి మందగమనానికి నీటి కొరత ప్రధాన కారణం. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో దాదాపు 700 కి.మీ. దూరంలోని భారత్–పాక్ సరిహద్దులకు నీటిని తీసుకెళ్లగలం. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రల తాగు, సాగునీటి అవసరాల్ని తీర్చడంతో పాటు సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ల తాగునీటి కొరతను తీర్చగలం.. మీకు తెలుసు.. నేను చిన్న చిన్న పనులు చేయలేను. సంకుచితంగా ఆలోచించను. 125 కోట్ల మంది ప్రజలు నా వెంట ఉండగా.. నేను చిన్న స్వప్నాల్ని కనలేను. ఒకవైపు దేశ తూర్పు ప్రాంతం నీటి కొరతను ఎదుర్కొంటోంది. అదే సమయంలో పశ్చిమ ప్రాంతంలో విద్యుత్, గ్యాస్ కొరత ఉంది. ఈ కొరతను అధిగమిస్తే.. రెండు ప్రాంతాలు వృద్ధి చెంది.. అభివృద్ధిలో భారతదేశం నూతన శిఖరాలకు చేరుకుంటుంది’ అని మోదీ వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన వారికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో అడ్డంకులు.. వివాదాలు 56 ఏళ్ల క్రితం ఏప్రిల్ 5, 1961న నర్మదా నదిపై సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు, అనేక వివాదాలు. చివరకు 2000 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ► నీరు, విద్యుత్ పంపకాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్ మధ్య విభేదాలతో ప్రాజెక్టు నిర్మాణం చాన్నాళ్లు ఆగిపోయింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు డాక్టర్ ఏఎన్ ఖోస్లా నేతృత్వంలో కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ► అనంతరం 1969లో నర్మదా ట్రిబ్యునల్ ఏర్పాటుచేయగా.. 1979లో ట్రిబ్యునల్ తుది తీర్పునిచ్చింది. చివరకు 1980లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ► సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ నేతృత్వంలో నర్మదా బచావో ఆందోళన(ఎన్బీఏ) సమితి డ్యాం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో పర్యావరణానికి ముప్పుతో పాటు, వేలాది మంది గిరిజనులు నిర్వాసితులవుతారని ఎన్బీఏ పేర్కొంది. నిర్వాసితులకు మంచి పరిహారం ఇస్తామని గుజరాత్ ప్రభుత్వం చెప్పినా ఎన్బీఏ అంగీకరించలేదు. ► 1996లో సుప్రీంకోర్టు ప్రాజెక్టు నిర్మాణంపై స్టే ఇచ్చింది. చివరకు అక్టోబర్ 18, 2000న ప్రాజెక్టు ఎత్తును 138 మీటర్లకు పెంచుకునేందుకు సుప్రీం అనుమతించింది. పునరావాస చర్యలు పూర్తయిన తర్వాతే నిర్మాణం చేపట్టాలని కోర్టు ఆదేశించింది. అనంతరం కూడా ఆందోళనలు, వివాదాలు కొనసాగాయి. ► డ్యాం ఎత్తు పెంపునకు యూపీఏ ప్రభుత్వం నిరాకరించడంతో 2006లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ 51 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు. స్వీట్, బ్లూ రివల్యూషన్‌కు శ్రీకారం అమ్రేలీ (గుజరాత్): రైతులు స్వీట్ రివల్యూషన్ (తేనెటీగల పెంపకం), బ్లూ రివల్యూషన్ (జల రవాణా)కు శ్రీకారం చుట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సౌరాష్ట్రలోని అమ్రేలీ వ్యవసాయ మార్కెట్ ప్రారంభోత్సవంలో ఆదివారం మోదీ మాట్లాడుతూ.. ఆదాయం పెంచుకునేందుకు రైతులు ఇతర ప్రయత్నాల్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ‘గ్రీన్(హరిత విప్లవం), వైట్ (పాల విప్లవం) రివల్యూషన్ అనంతరం.. ఇప్పుడు బ్లూ, స్వీట్ రివల్యూషన్ సమయం వచ్చింది’ అని ప్రధాని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని, అలాగే గుజరాత్లో విస్తారమైన తీర ప్రాంతముందని, జల రవాణాతో సౌరాష్ట్ర ప్రాంతం లాభపడుతుందని మోదీ చెప్పారు.