విశాఖ సిటీ: అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు పాటిస్తూ యుద్ధ నౌకల నిర్మాణంలో భారత్ ముందంజలో ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఇందుకు అవసరమైన నిధుల్ని సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు. రక్షణ మంత్రి హోదాలో తూర్పు నౌకాదళాన్ని తొలిసారిగా సందర్శించిన ఆమె ప్రాజెక్టు–28లో భాగంగా రూపొందించిన యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కిల్టాన్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఐఎన్‌ఎస్ కిల్టాన్‌ను జాతికి అంకితం చేయడం ద్వారా హిందూ మహా సముద్రంలో శాంతి పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నౌకాదళానికి మరింత బలం చేకూరిందని అభిప్రాయపడ్డారు.
90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ కిల్టాన్ నౌకాదళ రంగంలో నూతన ప్రమాణాలకు నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వయం సమృద్ధి దిశగా దేశ ఆయుధ సాంకేతికత వృద్ధి చెందడం గర్వకారణమని, అత్యున్నత ప్రమాణాలతో యుద్ధ నౌకల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక చేయూతను ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. యుద్ధ సమయంలోనే కాకుండా.. ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొంటూ ఇండియన్ నేవీ చేస్తున్న సేవలు నిరుపమానమైనవని కొనియాడారు. ప్రొపెల్షన్, ఆయుధ సాంకేతికతల్ని దేశీయంగా అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సీతారామన్ పేర్కొన్నారు.
కార్బన్ ఫైబర్ టెక్నాలజీతో కిల్టాన్ నిర్మాణం
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా మాట్లాడుతూ.. యుద్ధ నౌకల తయారీలో ఐఎన్‌ఎస్ కిల్టాన్‌ను ముందడుగుగా అభివర్ణించారు. భారీ యుద్ధ నౌకల్ని దేశీయంగా నిర్మించడం వల్ల దేశ రక్షణ రంగ అవసరాలు తీరతాయన్నారు. సూపర్ స్ట్రోమ్ ఇంటిగ్రేటెడ్ వెపన్ వంటి ఆయుధ సంపత్తితో భారత నౌకాదళానికి అదనపు హంగులు సమకూరుతున్నాయని లాంబా వివరించారు. కార్బన్ ఫైబర్ టెక్నాలజీతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ణీత సమయంలో ఈ భారీ యుద్ధ నౌకను సిద్ధం చేశామని కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్‌ఎస్‌ఈ) సీఎండీ రియర్ అడ్మిరల్ వీఎస్ సక్సేనా అన్నారు. అంతకుముందు తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌కు నేవీ సిబ్బంది ఘన స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. ఈఎన్‌సీ ప్రధాన స్థావరంతో పాటు నౌకాదళంలోని వివిధ విభాగాల్ని ఆమె పరిశీలించారు. అనంతరం.. భారత నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్‌లాంబాతో పాటు ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment