సర్దార్‌ స్వప్నాన్ని నిజం చేశాం! | PM Modi inaugurates Sardar Sarovar Dam, | Sakshi
Sakshi News home page

సర్దార్‌ స్వప్నాన్ని నిజం చేశాం!

Published Mon, Sep 18 2017 2:17 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

సర్దార్‌ స్వప్నాన్ని నిజం చేశాం! - Sakshi

సర్దార్‌ స్వప్నాన్ని నిజం చేశాం!

సర్దార్‌ సరోవర్‌ ఆనకట్ట నిర్మాణంతో ఆయన ఆత్మ సంతోషిస్తుంది
డ్యాం నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు, కుట్రల్ని ఎదుర్కొన్నాం
డ్యాంను జాతికి అంకితం చేసిన మోదీ


దభోయ్‌ (గుజరాత్‌): నర్మదా నదిపై సర్దార్‌ సరోవర్‌ ఆనకట్ట నిర్మాణంతో పటేల్‌ స్వప్నాన్ని నిజం చేశామని, ఇప్పుడు ఆయన ఆత్మ సంతోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  ఈ డ్యాం ఒక ఇంజనీరింగ్‌ అద్భుతమని.. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనేక మంది కుట్ర చేసినా, చివరకు పూర్తి చేసి చూపించామని చెప్పారు. గుజరాత్‌లోని దభోయ్‌ సమీపంలో కెవాదియా వద్ద సర్దార్‌ సరోవర్‌ ఆనకట్టను ఆదివారం ప్రధాని ఆవిష్కరించి అనంతరం జాతికి అంకితం చేశారు. రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు తిరస్కరించినా.. సొంతంగానే ప్రాజెక్టును నిర్మించి మన సత్తా చూపించామని, బహుశా ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కూడా ఇన్ని అడ్డంకుల్ని ఎదుర్కోలేదన్నారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రాంతంలో మోదీ పూజలు నిర్వహించారు. తన 67వ జన్మదినం రోజైన ఆదివారం ఈ జలాశయాన్ని మోదీ జాతికి అంకితం చేయడం విశేషం. ఈ ఆనకట్ట దేశ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుందని, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల అభివృద్ధికి ఊతమిస్తుందని మోదీ పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం 1980లోనే ప్రారంభించినా.. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డ్యాం ఎత్తు పెంచుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ ఏడాది జూన్‌ 17న డ్యామ్‌ గేట్లు మూసివేసి.. ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.68 మీటర్లకు పెంచారు. ఎత్తు పెంచిన ఆనకట్టనే ఆదివారం మోదీ ప్రారంభించారు.  

ఏ ప్రాజెక్టూ ఇన్ని అడ్డంకులు ఎదుర్కోలేదు
సర్దార్‌ సరోవర్‌ ఆనకట్ట ప్రారంభోత్సవం అనంతరం దభోయ్‌ పట్టణంలో ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.‘ఈ నిర్మాణం ఒక ఇంజనీరింగ్‌ అద్భుతం. మాపై అనేక తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు అనేకమంది కుట్ర చేశారు. అయితే దీనిని రాజకీయ యుద్ధంగా మార్చకుండా దృఢనిశ్చయంతో ముందుకు సాగాం’ అని చెప్పారు.   ‘ఈ డ్యాం నిర్మాణం ఎదుర్కొన్న అడ్డంకులు ప్రపంచంలో ఏ ఇతర ప్రాజెక్టు నిర్మాణం ఎదుర్కోలేదు. అయితే ప్రాజెక్టు పూర్తి చేయాలని మనం సంకల్పించాం..పూర్తి చేశాం. నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అందరి చిట్టా నా వద్ద ఉంది.

అయితే నేను వారి దారిలో వెళ్లకూడదని అనుకుంటున్నా.. అందుకని వారి పేర్లు చెప్పను. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేశారు. ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు ముందుగా ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. అయితే పర్యావరణ ఆందోళనల్ని కారణంగా చూపుతూ రుణానికి తిరస్కరించింది. ప్రపంచ బ్యాంకు సాయం చేసినా, చేయకపోయినా.. ఈ భారీ ప్రాజెక్టును సొంతంగానే పూర్తి చేశాం’ అని ప్రధాని చెప్పారు. సర్దార్‌ సరోవర్‌ డ్యాంకు ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు తిరస్కరించినప్పుడు గుజరాత్‌లోని ఆలయాలు ముందుకొచ్చి సాయం చేశాయని ఆయన గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులైన గిరిజన కుటుంబాలు చేసిన త్యాగానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. దేశాభివృద్ధి కోసం వారు చేసిన త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు.

75 ఏళ్ల క్రితమే పటేల్‌ కలలు కన్నారు: మోదీ
సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, బీఆర్‌ అంబేడ్కర్‌ల్ని గుర్తుచేస్తూ.. ‘ఆ ఇద్దరు గొప్పనేతలు మరికొంతకాలం జీవించి ఉంటే.. డ్యాం నిర్మాణం 60, 70 దశకాల్లోనే పూర్తయ్యేది. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు, కరువు, వరదల సమస్యకు పరిష్కారం దొరికేది. ఈ రోజు నర్మదా డ్యాం ప్రారంభోత్సవంతో సర్దార్‌ పటేల్‌ ఆత్మ తప్పకుండా సంతోషిస్తుంది. 75 ఏళ్ల క్రితమే ఈ డ్యాం కోసం ఆయన కలలు కన్నారు’ అని మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌ జీవనాడిగా పిలుస్తున్న ఈ డ్యాంను ఈ ఏడాది చివర్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభించడం గమనార్హం.

సర్దార్‌ సరోవర్‌తో ప్రయోజనాలు
► సర్దార్‌ సరోవర్‌ ఆనకట్టతో గుజరాత్‌లో 131 పట్టణ ప్రాంతాలు, 9,633 గ్రామాల (గుజరాత్‌లోని మొత్తం గ్రామాల్లో ఇది 53 శాతం)కు తాగునీరు లభిస్తుంది.

►గుజరాత్‌లో మొత్తం 15 జిల్లాల్లోని 3,112 గ్రామాల్లోని 18.54 లక్షల హెక్టార్ల ఎకరాలకు సాగునీరు.  

► గుజరాత్‌తోపాటు రాజస్తాన్‌లోని ఎడారి జిల్లాలైన బార్మర్, జలోర్‌లో 2.46 లక్షల హెక్టార్లకు సాగునీరు.

ఇక్కడ 1200, 250 మెగావాట్ల సామర్థ్యంతో రెండు జల విద్యుత్‌ కేంద్రాల్ని నిర్మించారు. ఈ విద్యుత్తును మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లు 57: 27: 16 నిష్పత్తిలో పంచుకుంటాయి.


నావన్నీ పెద్ద పెద్ద స్వప్నాలే..!
‘అభివృద్ధి మందగమనానికి నీటి కొరత ప్రధాన కారణం. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో దాదాపు 700 కి.మీ. దూరంలోని భారత్‌–పాక్‌ సరిహద్దులకు నీటిని తీసుకెళ్లగలం. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రల తాగు, సాగునీటి అవసరాల్ని తీర్చడంతో పాటు సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్ల తాగునీటి కొరతను తీర్చగలం.. మీకు తెలుసు.. నేను చిన్న చిన్న పనులు చేయలేను. సంకుచితంగా ఆలోచించను. 125 కోట్ల మంది ప్రజలు నా వెంట ఉండగా.. నేను చిన్న స్వప్నాల్ని కనలేను. ఒకవైపు దేశ తూర్పు ప్రాంతం నీటి కొరతను ఎదుర్కొంటోంది. అదే సమయంలో పశ్చిమ ప్రాంతంలో విద్యుత్, గ్యాస్‌ కొరత ఉంది. ఈ కొరతను అధిగమిస్తే.. రెండు ప్రాంతాలు వృద్ధి చెంది.. అభివృద్ధిలో భారతదేశం నూతన శిఖరాలకు చేరుకుంటుంది’ అని మోదీ వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన వారికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నో అడ్డంకులు.. వివాదాలు
56 ఏళ్ల క్రితం ఏప్రిల్‌ 5, 1961న నర్మదా నదిపై సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టుకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ.. శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు, అనేక వివాదాలు. చివరకు 2000 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.
నీరు, విద్యుత్‌ పంపకాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్‌ మధ్య విభేదాలతో ప్రాజెక్టు నిర్మాణం చాన్నాళ్లు ఆగిపోయింది.
ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు డాక్టర్‌ ఏఎన్‌ ఖోస్లా నేతృత్వంలో కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.  

అనంతరం 1969లో నర్మదా ట్రిబ్యునల్‌ ఏర్పాటుచేయగా.. 1979లో ట్రిబ్యునల్‌ తుది తీర్పునిచ్చింది. చివరకు 1980లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది.  

సామాజిక కార్యకర్త మేథా పాట్కర్‌ నేతృత్వంలో నర్మదా బచావో ఆందోళన(ఎన్‌బీఏ) సమితి డ్యాం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  దీంతో పర్యావరణానికి ముప్పుతో పాటు, వేలాది మంది గిరిజనులు నిర్వాసితులవుతారని ఎన్‌బీఏ పేర్కొంది. నిర్వాసితులకు మంచి పరిహారం ఇస్తామని గుజరాత్‌ ప్రభుత్వం చెప్పినా ఎన్‌బీఏ అంగీకరించలేదు.  

1996లో సుప్రీంకోర్టు ప్రాజెక్టు నిర్మాణంపై స్టే ఇచ్చింది. చివరకు అక్టోబర్‌ 18, 2000న ప్రాజెక్టు ఎత్తును 138 మీటర్లకు పెంచుకునేందుకు సుప్రీం అనుమతించింది. పునరావాస చర్యలు పూర్తయిన తర్వాతే నిర్మాణం చేపట్టాలని కోర్టు ఆదేశించింది. అనంతరం కూడా ఆందోళనలు, వివాదాలు కొనసాగాయి.  

డ్యాం ఎత్తు పెంపునకు యూపీఏ ప్రభుత్వం నిరాకరించడంతో 2006లో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ 51 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు.

స్వీట్, బ్లూ రివల్యూషన్‌కు శ్రీకారం

అమ్రేలీ (గుజరాత్‌): రైతులు స్వీట్‌ రివల్యూషన్‌ (తేనెటీగల పెంపకం), బ్లూ రివల్యూషన్‌ (జల రవాణా)కు శ్రీకారం చుట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సౌరాష్ట్రలోని అమ్రేలీ వ్యవసాయ మార్కెట్‌ ప్రారంభోత్సవంలో ఆదివారం మోదీ మాట్లాడుతూ.. ఆదాయం పెంచుకునేందుకు రైతులు ఇతర ప్రయత్నాల్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ‘గ్రీన్‌(హరిత విప్లవం), వైట్‌ (పాల విప్లవం) రివల్యూషన్‌ అనంతరం.. ఇప్పుడు బ్లూ, స్వీట్‌ రివల్యూషన్‌ సమయం వచ్చింది’ అని ప్రధాని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని, అలాగే గుజరాత్‌లో విస్తారమైన తీర ప్రాంతముందని, జల రవాణాతో సౌరాష్ట్ర ప్రాంతం లాభపడుతుందని మోదీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement