Sardar Sarovar Dam
-
‘సర్దార్ సరోవర్‌ను అడ్డుకున్న..అర్బన్ నక్సల్స్’
అహ్మదాబాద్: నర్మదా నదిపై తలపెట్టిన సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని రాజకీయ అండ ఉన్న అర్బన్ నక్సల్స్ (అభివృద్ధి నిరోధక శక్తులు) ఏళ్ల తరబడి అడ్డుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వారు ఇప్పటికీ ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సును గుజరాత్‌లోని నర్మదా జిల్లా ఏక్తా నగర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు. వివిధ సంస్థల అండతో అర్బన్ నక్సల్స్ సాగిస్తున్న ప్రచారం కారణంగా అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయన్నారు. వీరు న్యాయవ్యవస్థ, ప్రపంచబ్యాంకులను సైతం ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. జాప్యం వల్ల సమయం, పెద్ద మొత్తంలో డబ్బు వృథా అవుతోందన్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యావరణ అనుమతుల కోసం 6 వేల దరఖాస్తులు, మరో 6,500 దరఖాస్తులు అటవీ శాఖ అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇదీ చదవండి: సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్ -
ఒక్కడి కోసం వేల మందిని ముంచుతారా?
భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలను బాగానే జరిపారు.. కానీ ఆయన ఒక్కడి కోసం దాదాపు 32 వేల మందిని నీట ముంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నర్మద బచావో ఆందోళన్ కార్యకర్తలు. నిన్న ఓ వైపు నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా.. మరోవైపు నర్మదా బాచావో ఆందోళనకారులు ఖంద్వా-బరోడా రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేధా పాట్కర్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆయన ఒక విషయం గుర్తిస్తే మంచిది. జనజీవనానికిక ఆటంకం కలగకుండా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రధానిగా ఆయన మీద ఉంది. మోదీ పుట్టిన రోజు వేడుకల కోసం గుజరాత్ ప్రభుత్వం సర్దార్ సరోవర్ ఆనకట్టలో నీటి మట్టాన్ని 139 మీటర్లకు పెంచింది. ఆయన ఒక్కడి కోసం ఎందరో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదు. అందుకే మేం ఆయన పుట్టిన రోజు వేడుకలను బహిష్కరిస్తున్నాం. బ్యాక్ వాటర్ వల్ల బర్వానీ, ధార్, అలీరాజ్‌పూర్ జిల్లాలోని 192 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా మునిగిపోయాయి. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాతే.. స్లూయిస్ గేట్లను మూసివేయాలి’ అని మేధా పాట్కర్ డిమాండ్ చేశారు. -
ఆశీర్వాదం.. అమ్మతో కలిసి భోజనం
గాంధీనగర్: దేశానికి రాజైనా.. తల్లికి మాత్రం బిడ్డే. ఈ సామెత ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో అక్షర సత్యం అనిపిస్తుంది. మిగతా రోజుల్లో ఊపిరి సలపని బాధ్యతలతో బిజీగా ఉండే మోదీ.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం తప్పకుండా తల్లి హీరాబెన్‌ను కలుస్తారు. అలానే నేడు తన పుట్టిన రోజు సందర్భంగా తల్లి సమక్షంలో కాసేపు గడిపారు మోదీ. ప్రస్తుతం మోదీ తల్లి హీరాబెన్.. గాంధీనగర్‌కు సమీపంలోని రైసిన్ గ్రామంలో చిన్నకుమారుడైన పంకజ్ మోదీ దగ్గర ఉంటున్నారు. ఈ క్రమంలో పుట్టిన రోజు సందర్భంగా మోదీ మంగళవారం తల్లి దగ్గరకు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకుని.. ఆమెతో కలిసి కూర్చుని భోజనం చేశారు. అనంతరం తల్లితో, చుట్టుక్కల వారితో కాసేపు ముచ్చటించారు మోదీ. కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా హీరాబెన్ మోదీకి 501 రూపాయలను బహుమతిగా ఇచ్చారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన తర్వాత మోదీ తొలుత తల్లి హీరాబెన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పుట్టిన రోజు సందర్భంగా నిన్న రాత్రే గుజరాత్ చేరుకున్న మోదీ నేడు పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. నర్మదా నదిపై ఉన్న సర్దార్ సరోవర్ డ్యామ్‌ను, వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో కలిసి నమామి నర్మద మహోత్సవాన్ని ప్రారంభించారు. అలానే సర్దార్ సరోవర్ డ్యామ్‌కు సమీపంలోని బటర్‌ఫ్లై పార్క్‌ను కూడా సందర్శించారు మోదీ. ఈ క్రమంలో ఓ బ్యాగులో తీసుకువచ్చిన సీతాకోక చిలుకలను బయటకు వదిలి పెట్టారు మోదీ. -
ఉక్కుమనిషికి నిలువెత్తు నివాళి
కెవాడియా (గుజరాత్): సమైక్య భారత నిర్మాత, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు సమున్నత గౌరవం... విచ్ఛిన్నంగా ఉన్న భారత భూభాగాల్ని ఏకం చేసిన ధీశాలికి నిలువెత్తు నివాళి. పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 182 మీటర్ల(597 అడుగులు) సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. గుజరాత్ నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యాంకు సమీపంలో సాధు బెట్ అనే దీవిలో కొలువుదీరిన ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అని నామకరణం చేశారు. వైమానిక దళ విమానాలు, హెలికాప్టర్లు జాతీయ పతాక రంగులు వెదజల్లుకుంటూ విగ్రహానికి సమీపంగా దూసుకెళ్లిన దృశ్యాలు కనువిందు చేశాయి. ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ప్రకృతి సోయగాల నడుమ, సంప్రదాయ దుస్తుల్లో పటేల్ ఠీవిగా నడుస్తున్నట్లున్న ఈ విగ్రహాన్ని.. సాధు కొండల్లో నక్షత్ర ఆకారం లోని పునాదిపై నిర్మించారు. సమైక్య భారత కలను నిజం చేయడానికి తమ రాజ్యాల్ని వదులుకున్న రాజ వంశాల జ్ఞాపకార్థం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో ఒక మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలని మోదీ గుజరాత్ ప్రభుత్వానికి సూచించారు. పటేల్ విగ్రహం మన దేశ ఇంజినీరింగ్, సాంకేతిక నైపుణ్యాలకు నిలువుటద్దం అని కొనియాడారు. నర్మదా డ్యాంకు సమీపంలో నివసిస్తున్న గిరిజనులకు ఈ విగ్రహం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ఆ ప్రాంతంలో పర్యాటక రంగం ఊపందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విగ్రహ నిర్మాణం కోసం భూములు వదులుకున్న రైతులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లి, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజ నిర్వహించిన మోదీ..విగ్రహం పాదాల వరకు వెళ్లి పటేల్‌కు పుష్పాంజలి ఘటించారు. విగ్రహం కింది భాగంలో నిర్మించిన మ్యూజియంతో పాటు, 135 మీటర్ల ఎత్తులో ఏర్పాటుచేసిన పర్యాటకుల గ్యాలరీని సందర్శించారు. భారత మనుగడకు భరోసా భారత్‌ను ముక్కలు చేయాలనుకున్న కుట్రలకు ఎదురునిలిచిన పటేల్ ధైర్యానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఆనాడు దేశ అస్థిత్వంపై సందేహాలు వ్యక్తం చేసినవారికి భారత మనుగడపై అచంచల భరోసాను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై కూడా ప్రధాని ధ్వజమెత్తారు. పటేల్ లాంటి జాతీయ హీరోలకు స్మారకాలు నిర్మించడం ద్వారా తాము ఏమైనా నేరాలకు పాల్పడ్డామా? అని ప్రశ్నించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన తరువాత మోదీ 55 నిమిషాలు ప్రసంగించారు. 550 సంస్థానాలను విలీనంచేసిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ సేవల్ని కొనియాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ఆయనకు తగిన గుర్తింపు లభించలేదని అన్నారు. పటేల్ భౌగోళిక సమైక్యతకు పాటుపడితే తమ ప్రభుత్వం జీఎస్టీ లాంటి సంస్కరణల ద్వారా ఆర్థిక సమైక్యతకు కృషిచేస్తోందని వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లలో జాతి హీరోల గౌరవార్థం నిర్మించిన పలు స్మారకాల్ని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’కు స్ఫూర్తి ‘భారత జాతిని విచ్ఛిన్నం చేయాలనుకున్న కుట్రలను అడ్డుకున్న పటేల్ ధైర్యం, శక్తిసామర్థ్యాలు, అంకితభావాన్ని ఈ విగ్రహం ప్రపంచానికి, భావి తరాలకు చాటిచెబుతుంది. ఇదే స్ఫూర్తితో ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ సాధన దిశగా ముందడుగు వేయాలి. జాతి హీరోలకు స్మారకాలు నిర్మించాలన్న మా ఆశయాల్ని కొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారు. పటేల్ లాంటి యోధుల సేవల్ని కీర్తించినందుకు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇవన్నీ వింటుంటే మేము ఏమైనా నేరం చేశామా అని అనిపిస్తుంది. జాతిని ఏకం చేసిన గొప్ప వ్యక్తికి తగిన గౌరవం దక్కాలని దేశం మొత్తం కోరుకుంటోంది. దేశ విభజనకు జరుగుతున్న దుష్ట ప్రయత్నాలకు ప్రజలంతా గట్టి జవాబు ఇవ్వాలి. ఒకవేళ ఆనాడు పటేల్ వల్ల దేశం ఏకం కానట్లయితే హైదరాబాద్‌లో చార్మినార్ సందర్శనకు, గుజరాత్‌లోని జునాగఢ్‌లో సింహాల్ని చూసేందుకు, సోమనాథ్ ఆలయంలో పూజలు చేసేందుకు ప్రజలకు వీసాల అవసరం వచ్చి ఉండేది’ అని మోదీ అన్నారు. డీజీపీల సదస్సు ఇక్కడే! ఈ సంవత్సరం జరగనున్న అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీల వార్షిక సమావేశానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమ షెడ్యూల్ ఇంకా ఖరారు కాకున్నా, పటేల్ విగ్రహం వద్దే ఈ సమావేశాలు నిర్వహించడానికి కేంద్ర హోం శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత డిసెంబర్ ద్వితీయార్థంలో ఈ కాన్ఫరెన్స్ జరిగే అవకాశాలున్నాయి. విగ్రహం సమీపంలోని కెవాడియా గ్రామంలో గుడారాల్లో డీజీపీలు, ఐజీలకు బస కల్పించాలని యోచిస్తున్నట్లు హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సివిల్ సర్వీసుల పితగా పేరొందిన సర్దార్ పటేల్ పేరిట హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారులకు శిక్షణనిచ్చే అకాడమీ(ఎన్పీఏ)ని నెలకొల్పారు. ఐక్యతా విగ్రహం విశేషాలివీ.. ► విగ్రహ నిర్మాణానికి వాడిన సామగ్రి: 70 వేల టన్నుల సిమెంట్, 24,500 టన్నుల ఉక్కు, 1,700 మెట్రిక్ టన్నుల కంచు ► నిర్మాణ వ్యయం: రూ. 2,989 కోట్లు ► విగ్రహం ప్రాజెక్టు విస్తీర్ణం: 20,000 చదరపు మీటర్లు ► పర్యాటకులు సమీపంలోని ప్రకృతి అందాల్ని చూసేందుకు విగ్రహం లోపల 135 మీటర్ల ఎత్తులో గ్యాలరీ ఏర్పాటు ► ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తయిన చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం ఎత్తు 153 మీటర్లు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం కన్నా పటేల్ విగ్రహం రెట్టింపు ఎత్తయినది. ► పెద్ద రాయిని తొలిచి విగ్రహాన్ని చెక్కాలని భావించినా, అంతటి కఠినమైన రాయి లభించకపోవడంతో సిమెంట్, స్టీల్, కంచుతో నిర్మించారు. ► గుజరాత్ సీఎంగా ఉండగా పటేల్‌కు భారీ విగ్రహం నిర్మించాలని మోదీ సంకల్పించారు. 2013లో దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ► లార్సెన్ అండ్ టుబ్రో సంస్థ రికార్డుస్థాయిలో 33 నెలల్లో కట్టింది. ► 2 వేలరకాల పటేల్ ఫొటోల్లో ఒకదాని ఓకే చేసి దానిలా విగ్రహాన్ని మలిచారు. ► విగ్రహాన్ని మొత్తం 5 జోన్లుగా విభజించారు. ఒకటో జోన్లో మోకాళ్ల కింది భాగం, రెండో జోన్లో తొడలు(149 మీటర్లు), మూడో జోన్లో పర్యాటకుల గ్యాలరీ(153 మీటర్లు), నాలుగో జోన్లో మెయింటెనెన్స్, ఐదో జోన్లో తల, భుజాలు ఉన్నాయి. 4, 5 జోన్లలోకి ప్రవేశం నిషేధం. ► విగ్రహంలో ఏర్పాటుచేసిన లిఫ్ట్ సెకనుకు 4 మీటర్ల వేగంతో సందర్శకులను 135 మీటర్ల ఎత్తులోని గ్యాలరీకి తీసుకెళ్తుంది. ► పర్యాటకుల గ్యాలరీలోకి ఒకేసారి 200 మంది వెళ్లొచ్చు. ► సందర్శకుల గ్యాలరీ నుంచి సర్దార్ సరోవర్ డ్యాంతో పాటు 12 కి.మీ పొడవైన గరుడేశ్వర రిజర్వాయర్‌ను వీక్షించవచ్చు. ► విగ్రహం దగ్గరికి వెళ్లాలంటే రూ.120, విగ్రహం లోపల 135 మీటర్ల ఎత్తులోని గ్యాలరీలోకి వెళ్లాలంటే టికెట్ రూ.350 చెల్లించాలి. ► విగ్రహ ప్రవేశంలోని మ్యూజియంలో పటేల్ జీవిత విశేషాలు, స్థానిక గిరిజన ప్రజల జీవన విధానాలపై ప్రదర్శనను ఏర్పాటుచేశారు. గాంధీకి భారీ విగ్రహం ఏదీ?: విపక్షాలు న్యూఢిల్లీ: ఉక్కుమనిషి సర్దార్ పటేల్ మాదిరిగా జాతిపిత మహాత్మా గాంధీకి భారీ విగ్రహం ఎందుకు ఏర్పాటుచేయలేదని విపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. పటేల్ లాంటి స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వాన్ని బీజేపీ హైజాక్ చేసిందన్నాయి. పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూనే, ఆయన చలవతో ఏర్పడిన వ్యవస్థలను కేంద్రం ధ్వంసం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల్ని నాశనంచేయడం ద్రోహానికి ఏమాత్రం తక్కువ కాదని అన్నారు. దళిత నాయకుల విగ్రహాలు ఏర్పాటుచేసినప్పుడు తనపై విమర్శలు గుప్పించిన బీజేపీ, ఆరెస్సెస్‌లు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీకి ఎక్కడా సర్దార్ పటేల్ అంతటి భారీ విగ్రహం లేదని, బీజేపీ అలాంటి నిర్మాణాన్ని ఎందుకు చేపట్టలేదో చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ కోరారు. పటేల్ కాంగ్రెస్ నాయకుడని, ఆయన్ని తమవాడిగా చెప్పుకునే హక్కు బీజేపీకి లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే బీజేపీ పటేల్ విగ్రహంతో రాజకీయాలు చేస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పటేల్, గాంధీ, అంబేడ్కర్.. ఇలా ఒక్కోసారి ఓ మహానాయకుడిని బీజేపీ గుర్తుచేసుకుంటుందని, అవన్నీ ఎన్నికల జిమ్మిక్కులేనని అన్నారు. పటేల్ భారీ విగ్రహం పాదాల చెంత నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ సర్దార్ పటేల్ విగ్రహం కింది భాగంలో ఏర్పాటుచేసిన మ్యూజియంలో మోదీ విగ్రహం లోపల పర్యాటకుల గ్యాలరీ నుంచి సర్దార్ సరోవర్ డ్యాం విహంగ వీక్షణం -
కలిసి ఉండాలనే సందేశమే ఈ విగ్రహం : మోదీ
అహ్మదాబాద్: ఉక్కు మనిషి, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. అనంతరం పటేల్ 143వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో ఉన్న సాధు బెట్లో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మించారు. 2013 అక్టోబర్ 31 న ప్రధాని మోదీ ఐక్యతా విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. మోదీ ప్రసంగం.. ‘ఈ ఏడాది సర్దార్ పటేల్ జయంతి మరింత ప్రత్యేకమైనది. 130 కోట్ల భారతీయుల ఆశీస్సులతో ఈ రోజు ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. నర్మదా నది తీరాన ఏర్పాటు చేసుకున్న ఈ మహా విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినది. భూమి పుత్రుడు సర్దార్ పటేల్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వైనం మనకు కనిపిస్తోంది. ఆయన ఎల్లప్పుడూ మనకు మార్గదర్శనం చేస్తూ, స్ఫూర్తిని అందిస్తూ వుంటారు. సర్దార్ పటేల్ కు ఘన నివాళి అర్పించేందుకు రూపొందిన ఈ మహా విగ్రహాన్ని వాస్తవ రూపంలోకి తేవడానికి రాత్రి పగలూ అనే తేడా లేకుండా పని చేసిన వారందరికీ నా అభినందనలు. ఈ విశిష్టమైన ప్రాజెక్టుకోసం పునాది రాయి వేసిన 2013 అక్టోబర్ నెల 31వ తేదీ నాకు గుర్తుకొస్తోంది. ఆ రోజున మొదలైన ఈ భారీ ప్రాజెక్టు రికార్డు టైములో పూర్తయింది. ఇది ప్రతి భారతీయునికి గర్వకారణమైన విషయం. రాబోయే రోజుల్లో ఈ మహా విగ్రహాన్ని సందర్శించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఐకమత్యానికి, మన మాతృ భూమి భౌగోళిక సమగ్రతకు, దేశ ప్రజల ఐకమత్యానికీ ఈ ఐక్యతా విగ్రహం సంకేతంగా నిలుస్తోంది. అనైక్యత కారణంగా విడిపోతే మనకు మనమే మొహం చూపించుకోలేమనీ, సమాధానం చెప్పుకోలేమనీ.. అదే కలిసి వుంటే ప్రపంచాన్ని ధీటుగా ఎదుర్కోవచ్చుననే సందేశాన్ని ఈ విగ్రహం అందిస్తోంది. ఐకమత్యంతో మాత్రమే అభివృద్ధిని, ప్రాభవాన్ని సాధించి ఉన్నత శిఖరాలను అధిగమించగలం’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఆధునిక భారతదేశ నిర్మాత, మహోన్నత ఐక్యతావాదికి ప్రత్యేక నివాళి. 1947 సంవత్సరాన్ని తీసుకుంటే.. ఈ ఏడాది మొదటి అర్ధభాగం భారతదేశ చరిత్రలోనే కీలక సమయం. వలస పాలన తప్పనిసరి పరిస్థితుల్లో ముగియనున్న సమయమది. అంతే కాదు భారతదేశ విభజన కూడా తప్పనిసరి అయింది. అయితే అంతుపట్టని విషయమేమిటంటే భారతదేశం నుంచి విడిపోయే ప్రాంతాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయేమోననేది. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆహార కొరత సర్వసాధారణమైంది. అయితే అన్నిటికన్నా ఎక్కువగా ఆందోళన కలిగించిన విషయం భారతదేశ ఐక్యత ప్రమాదంలో పడడం. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. నూతన ప్రస్థానం మొదలైంది. కానీ ఆ సమయానికి జాతి నిర్మాణమనేది సుదూరంగానే వుండిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి మొదటి హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు సర్దార్ పటేల్. ఆ వెంటనే ఆయన పరిపాలనాపరమైన నియమ నిబంధనల తయారీకి ఒక వేదికను రూపొందించారు. రాష్ట్రాల వ్యవహారాలను చూసే విభాగం (స్టేట్స్ డిపార్ట్ మెంట్) ఏర్పడింది. నాటికి దేశంలో గల 550 సంస్థానాలతో సంప్రదింపులు చేయడమే ఈ విభాగం ముఖ్యమైన పని. పరిమాణం, జనాభా, భౌగోళిక, ఆర్ధిక స్థితిగతులు మొదలైనవాటి పరంగా చూసినప్పుడు ఈ సంస్థానాలు వేటికవే ప్రత్యేకంగా ఉండేవి. సర్దార్ పటేల్ తనదైన శైలిలో వ్యవహరిస్తూ తన పనిని ఎంతో ఖచ్చితత్వంతో, దృఢంగా, పరిపాలనాపరమైన సామర్థ్యంతో నిర్వహించారు. సమయం చాలా తక్కువ. చేయాల్సిన పని బ్రహ్మాండమైనది. కానీ ఆ పనిని చేస్తున్న వ్యక్తి కూడా సామాన్యుడు కాదు. ఆయన సర్దార్ పటేల్. భారతదేశం సమున్నతంగా నిలబడాలన్న ఆకాంక్షతో పని చేశారు. ఒకదాని తర్వాత మరొకటి...అప్పటికి వున్న అన్నిసంస్థానాలతో సర్దార్, ఆయన బృంద సభ్యులు సంప్రదింపులు జరిపి...అన్నిటినీ భారతదేశంలో ఐక్యం చేశారు.సర్దార్ పటేల్ అవిశ్రాంతంగా పని చేయడంవల్లనే ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశ చిత్ర పటం ఆ ఆకారంలో మనకు కనిపిస్తోంది.’ అని ప్రధాని ప్రసంగించారు. ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కంటే పొడవు.. ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటుచేసిన ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్ డ్యామ్ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు. 30 పవిత్ర నదీ జలాలతో పటేల్ విగ్రహానికి అభిషేకం చేశారు. 37 మంది సర్దార్ పటేల్ కుటుంబ సభ్యులు ఈ విగ్రహ ఆవష్కరణ మహోత్సవంలో పాల్గొన్నారు. పటేల్ జయంతి, విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్ని జిల్లాల్లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం చేపట్టారు. కాగా, స్థానిక నర్మదా జిల్లాలోని గిరిజనులు సర్దార్ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టు పేరుతో సహజ వనరులను నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఐక్యతా విగ్రహం విశేషాలు.. విగ్రహ నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 2979 కోట్లు విగ్రహం ఎత్తు : 597 అడుగులు (82 మీటర్లు) మొత్తం మెటీరియల్ : 3550 టన్నుల ఇత్తడి, 18 వేల టన్నుల రీ ఇన్ఫోర్స్డ్ స్టీల్ ,6 వేల స్ట్రక్చరల్ స్టీల్, 2 లక్షల 12 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడారు. 250 మంది ఇంజనీర్లు.. 3400 మంది వర్కర్లు 3 సంవత్సరాల 9 నెలలపాటు పనిచేసి విగ్రహ నిర్మాణం చేశారు. 6.5 తీవ్రతతో భూకంపం సంభవించినా ఈ విగ్రహం తట్టుకుని నిలబడుతుంది. గంటకు 180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరదు. -
సర్దార్ డ్యాం’పై ఆందోళనలు
భోపాల్: నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యాం వల్ల నిర్వాసితులయ్యేవారికి పరిహారం డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన వెంటనే భోపాల్‌లో సీపీఎం నాయకురాలు సుభాషిణి అలీ నేతృత్వంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ డ్యాం నిర్మాణంతో ప్రభావితమవుతున్న 40 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాలని పార్టీ జిల్లా కార్యదర్శి పుషాన్ భట్టాచార్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ సీపీఎం ఆందోళనలు కొనసాగించింది. మరోవైపు, బార్వాని జిల్లాలో నర్మదా నదిలో నడుము లోతు వరకు నిల్చొని మూడు రోజులుగా జల సత్యాగ్రహాం చేస్తున్న నర్మదా బచావో ఆందోళన్(ఎన్బీఏ) నాయకురాలు మేధా పాట్కర్ తన ఆందోళనను విరమించారు. అయినా నిర్వాసితుల కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిరుపేద రైతుల అభివృద్ధికి కాకుండా వారి వినాశనానికి దారితీస్తుందని ప్రముఖ పర్యావరణ సంస్థ గ్రీన్‌పీస్ ఆందోళన వ్యక్తం చేసింది. -
సర్దార్ స్వప్నాన్ని నిజం చేశాం!
► సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణంతో ఆయన ఆత్మ సంతోషిస్తుంది ► డ్యాం నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు, కుట్రల్ని ఎదుర్కొన్నాం ► డ్యాంను జాతికి అంకితం చేసిన మోదీ దభోయ్ (గుజరాత్): నర్మదా నదిపై సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణంతో పటేల్ స్వప్నాన్ని నిజం చేశామని, ఇప్పుడు ఆయన ఆత్మ సంతోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ డ్యాం ఒక ఇంజనీరింగ్ అద్భుతమని.. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనేక మంది కుట్ర చేసినా, చివరకు పూర్తి చేసి చూపించామని చెప్పారు. గుజరాత్‌లోని దభోయ్ సమీపంలో కెవాదియా వద్ద సర్దార్ సరోవర్ ఆనకట్టను ఆదివారం ప్రధాని ఆవిష్కరించి అనంతరం జాతికి అంకితం చేశారు. రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు తిరస్కరించినా.. సొంతంగానే ప్రాజెక్టును నిర్మించి మన సత్తా చూపించామని, బహుశా ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కూడా ఇన్ని అడ్డంకుల్ని ఎదుర్కోలేదన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రాంతంలో మోదీ పూజలు నిర్వహించారు. తన 67వ జన్మదినం రోజైన ఆదివారం ఈ జలాశయాన్ని మోదీ జాతికి అంకితం చేయడం విశేషం. ఈ ఆనకట్ట దేశ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుందని, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల అభివృద్ధికి ఊతమిస్తుందని మోదీ పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం 1980లోనే ప్రారంభించినా.. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డ్యాం ఎత్తు పెంచుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ ఏడాది జూన్ 17న డ్యామ్ గేట్లు మూసివేసి.. ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.68 మీటర్లకు పెంచారు. ఎత్తు పెంచిన ఆనకట్టనే ఆదివారం మోదీ ప్రారంభించారు. ఏ ప్రాజెక్టూ ఇన్ని అడ్డంకులు ఎదుర్కోలేదు సర్దార్ సరోవర్ ఆనకట్ట ప్రారంభోత్సవం అనంతరం దభోయ్ పట్టణంలో ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.‘ఈ నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. మాపై అనేక తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు అనేకమంది కుట్ర చేశారు. అయితే దీనిని రాజకీయ యుద్ధంగా మార్చకుండా దృఢనిశ్చయంతో ముందుకు సాగాం’ అని చెప్పారు. ‘ఈ డ్యాం నిర్మాణం ఎదుర్కొన్న అడ్డంకులు ప్రపంచంలో ఏ ఇతర ప్రాజెక్టు నిర్మాణం ఎదుర్కోలేదు. అయితే ప్రాజెక్టు పూర్తి చేయాలని మనం సంకల్పించాం..పూర్తి చేశాం. నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అందరి చిట్టా నా వద్ద ఉంది. అయితే నేను వారి దారిలో వెళ్లకూడదని అనుకుంటున్నా.. అందుకని వారి పేర్లు చెప్పను. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేశారు. ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు ముందుగా ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. అయితే పర్యావరణ ఆందోళనల్ని కారణంగా చూపుతూ రుణానికి తిరస్కరించింది. ప్రపంచ బ్యాంకు సాయం చేసినా, చేయకపోయినా.. ఈ భారీ ప్రాజెక్టును సొంతంగానే పూర్తి చేశాం’ అని ప్రధాని చెప్పారు. సర్దార్ సరోవర్ డ్యాంకు ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు తిరస్కరించినప్పుడు గుజరాత్‌లోని ఆలయాలు ముందుకొచ్చి సాయం చేశాయని ఆయన గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులైన గిరిజన కుటుంబాలు చేసిన త్యాగానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. దేశాభివృద్ధి కోసం వారు చేసిన త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు. 75 ఏళ్ల క్రితమే పటేల్ కలలు కన్నారు: మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్ల్ని గుర్తుచేస్తూ.. ‘ఆ ఇద్దరు గొప్పనేతలు మరికొంతకాలం జీవించి ఉంటే.. డ్యాం నిర్మాణం 60, 70 దశకాల్లోనే పూర్తయ్యేది. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు, కరువు, వరదల సమస్యకు పరిష్కారం దొరికేది. ఈ రోజు నర్మదా డ్యాం ప్రారంభోత్సవంతో సర్దార్ పటేల్ ఆత్మ తప్పకుండా సంతోషిస్తుంది. 75 ఏళ్ల క్రితమే ఈ డ్యాం కోసం ఆయన కలలు కన్నారు’ అని మోదీ పేర్కొన్నారు. గుజరాత్ జీవనాడిగా పిలుస్తున్న ఈ డ్యాంను ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభించడం గమనార్హం. సర్దార్ సరోవర్తో ప్రయోజనాలు ► సర్దార్ సరోవర్ ఆనకట్టతో గుజరాత్లో 131 పట్టణ ప్రాంతాలు, 9,633 గ్రామాల (గుజరాత్‌లోని మొత్తం గ్రామాల్లో ఇది 53 శాతం)కు తాగునీరు లభిస్తుంది. ►గుజరాత్లో మొత్తం 15 జిల్లాల్లోని 3,112 గ్రామాల్లోని 18.54 లక్షల హెక్టార్ల ఎకరాలకు సాగునీరు. ► గుజరాత్‌తోపాటు రాజస్తాన్‌లోని ఎడారి జిల్లాలైన బార్మర్, జలోర్‌లో 2.46 లక్షల హెక్టార్లకు సాగునీరు. ► ఇక్కడ 1200, 250 మెగావాట్ల సామర్థ్యంతో రెండు జల విద్యుత్ కేంద్రాల్ని నిర్మించారు. ఈ విద్యుత్తును మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లు 57: 27: 16 నిష్పత్తిలో పంచుకుంటాయి. నావన్నీ పెద్ద పెద్ద స్వప్నాలే..! ‘అభివృద్ధి మందగమనానికి నీటి కొరత ప్రధాన కారణం. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో దాదాపు 700 కి.మీ. దూరంలోని భారత్–పాక్ సరిహద్దులకు నీటిని తీసుకెళ్లగలం. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రల తాగు, సాగునీటి అవసరాల్ని తీర్చడంతో పాటు సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ల తాగునీటి కొరతను తీర్చగలం.. మీకు తెలుసు.. నేను చిన్న చిన్న పనులు చేయలేను. సంకుచితంగా ఆలోచించను. 125 కోట్ల మంది ప్రజలు నా వెంట ఉండగా.. నేను చిన్న స్వప్నాల్ని కనలేను. ఒకవైపు దేశ తూర్పు ప్రాంతం నీటి కొరతను ఎదుర్కొంటోంది. అదే సమయంలో పశ్చిమ ప్రాంతంలో విద్యుత్, గ్యాస్ కొరత ఉంది. ఈ కొరతను అధిగమిస్తే.. రెండు ప్రాంతాలు వృద్ధి చెంది.. అభివృద్ధిలో భారతదేశం నూతన శిఖరాలకు చేరుకుంటుంది’ అని మోదీ వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన వారికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో అడ్డంకులు.. వివాదాలు 56 ఏళ్ల క్రితం ఏప్రిల్ 5, 1961న నర్మదా నదిపై సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు, అనేక వివాదాలు. చివరకు 2000 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ► నీరు, విద్యుత్ పంపకాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్ మధ్య విభేదాలతో ప్రాజెక్టు నిర్మాణం చాన్నాళ్లు ఆగిపోయింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు డాక్టర్ ఏఎన్ ఖోస్లా నేతృత్వంలో కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ► అనంతరం 1969లో నర్మదా ట్రిబ్యునల్ ఏర్పాటుచేయగా.. 1979లో ట్రిబ్యునల్ తుది తీర్పునిచ్చింది. చివరకు 1980లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ► సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ నేతృత్వంలో నర్మదా బచావో ఆందోళన(ఎన్బీఏ) సమితి డ్యాం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో పర్యావరణానికి ముప్పుతో పాటు, వేలాది మంది గిరిజనులు నిర్వాసితులవుతారని ఎన్బీఏ పేర్కొంది. నిర్వాసితులకు మంచి పరిహారం ఇస్తామని గుజరాత్ ప్రభుత్వం చెప్పినా ఎన్బీఏ అంగీకరించలేదు. ► 1996లో సుప్రీంకోర్టు ప్రాజెక్టు నిర్మాణంపై స్టే ఇచ్చింది. చివరకు అక్టోబర్ 18, 2000న ప్రాజెక్టు ఎత్తును 138 మీటర్లకు పెంచుకునేందుకు సుప్రీం అనుమతించింది. పునరావాస చర్యలు పూర్తయిన తర్వాతే నిర్మాణం చేపట్టాలని కోర్టు ఆదేశించింది. అనంతరం కూడా ఆందోళనలు, వివాదాలు కొనసాగాయి. ► డ్యాం ఎత్తు పెంపునకు యూపీఏ ప్రభుత్వం నిరాకరించడంతో 2006లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ 51 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు. స్వీట్, బ్లూ రివల్యూషన్‌కు శ్రీకారం అమ్రేలీ (గుజరాత్): రైతులు స్వీట్ రివల్యూషన్ (తేనెటీగల పెంపకం), బ్లూ రివల్యూషన్ (జల రవాణా)కు శ్రీకారం చుట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సౌరాష్ట్రలోని అమ్రేలీ వ్యవసాయ మార్కెట్ ప్రారంభోత్సవంలో ఆదివారం మోదీ మాట్లాడుతూ.. ఆదాయం పెంచుకునేందుకు రైతులు ఇతర ప్రయత్నాల్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ‘గ్రీన్(హరిత విప్లవం), వైట్ (పాల విప్లవం) రివల్యూషన్ అనంతరం.. ఇప్పుడు బ్లూ, స్వీట్ రివల్యూషన్ సమయం వచ్చింది’ అని ప్రధాని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని, అలాగే గుజరాత్లో విస్తారమైన తీర ప్రాంతముందని, జల రవాణాతో సౌరాష్ట్ర ప్రాంతం లాభపడుతుందని మోదీ చెప్పారు. -
నవభారత్‌కు బాటలుః మోదీ
సాక్షి, అహ్మదాబాద్: దేశానికి స్వాతంత్ర్యం సమకూరి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి దేశాన్ని నవభారత్‌గా మలిచేందుకు ఏ అవకాశాన్నీ జారవిడుచుకోరాదని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. ప్రతిష్టాత్మక సర్ధార్ సరోవర్ డ్యామ్‌ను ఆదివారం జాతికి అంకింత చేసిన అనంతరం గుజరాత్‌లోని దభోయ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 125 కోట్ల ప్రజలు తనతో ఉన్నంతవరకూ తాను చిన్న వాటి గురించి ఆలోచించనని భారీ ప్రాజెక్టులతో ప్రజలకు మేలు తలపెడతానన్నారు. నీటిపారుదల, జలవనరుల గురించి నిత్యం తపించిన సర్ధార్ పటేల్, అంబేడ్కర్లను మనం స్మరించుకోవాలన్నారు. సర్ధార్ సరోవర్ డ్యామ్‌కు నిధులిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ నిరాకరిస్తే గుజరాత్లో సాధువులు, భక్తులు సహకరించారని, విరాళాలతో ముందుకొచ్చారని చెప్పారు. దేశంలోని కరువు పీడిత ప్రాంతాలకు నర్మదా జలాలను పంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసిన ప్రజలను ప్రశంసించారు. సర్ధార్ పటేల్‌కు సరోవర్ డ్యామ్ ద్వారా దేశం ఘనమైన నివాళి ఇచ్చిందని అన్నారు.దేశంలోని తూర్పు ప్రాంతం నీటి కొరతతో ఇబ్బందులు పడుతుంటే..పశ్చిమ భారతం విద్యుత్, గ్యాస్ కొరత ఎదుర్కొంటున్నదనీ, ఈ ఇబ్బందులనూ త్వరలోనే అధిగమిస్తామన్నారు. దేశాన్ని అభివృద్ధిలో నూతన శిఖరాలకు చేర్చుతామని చెప్పారు.సర్ధార్ సరోవర్ డ్యామ్ జలక్రీడలు, సాహస క్రీడలు, పర్యాటానికి హబ్‌గా మారుతుందని అన్నారు. -
ఐదు దశాబ్దాల కల సాకారం
-
ఐదు దశాబ్దాల కల సాకారం
సర్దార్ సరోవర్ డ్యామ్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ అహ్మదాబాద్: ఐదు దశాబద్దాల కల సాకారమయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు గుజరాత్లో ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక సర్దార్ సరోవర్ డ్యామ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పూజ చేశారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ నర్మదా నదికి హారతి పట్టారు. డ్యామ్‌ను పరిశీలిస్తూ కలియదిరిగారు. అక్కడి నుంచే ప్రజలకు అభివాదం చేశారు. డ్యామ్‌ను రంగుల రంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్దార్ సరోవర్ డ్యామ్ విశేషాలు వాస్తవానికి సర్దార్ సరోవర్ డ్యామ్ అనే అద్భుత ప్రాజెక్టును నిర్మించాలన్నది భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కల. 1946లోనే ఆయన ఎంతో దూరదృష్టితో దీనిపై ఆలోచన చేశారు. నర్మద నదిపై 30 భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు రచించగా వాటిలో సర్దార్ సరోవర్ డ్యామ్ అతిపెద్దది. సరోవర్ డ్యామ్ పొడవు 1.2 కిలో మీటర్లు. జలాశయం లోతు 163 మీటర్లు. దాదాపు 30 గేట్లున్న డ్యామ్‌లో ఒక్కో గేటు బరువు 450 టన్నులకు పైగా ఉంటుంది. ఒక గేటు మూయాలంటే గంట పడుతుంది. వినియోగించిన కాంక్రీట్ పరిమాణం పరంగా చూస్తే సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రపంచంలోనే రెండో పెద్ద ప్రాజెక్టు. అమెరికాలోని గ్రాండ్ కౌలీ డ్యామ్ తర్వాత అత్యంత ఎక్కువ కాంక్రీట్ వినియోగించింది దీనికే. ఎత్తు పెంచడంతో సరోవర్ డ్యామ్‌లో నీటినిల్వ సామర్ధ్యం 4.73 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. దీని కారణంగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు ప్రయోజనం పొందనున్నాయి. పది లక్షల మంది రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందనుంది. 4 కోట్లమంది ప్రజలకు తాగునీటి ప్రయోజనం చేకూరనుంది. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ద్వారా నర్మద నదీ జలాలను గుజరాత్లో తీవ్ర నీటిఎద్దడి ఉన్న ప్రాంతాలకు కాలువలు, పైపులైన్లతో పంపిస్తారు. 18వేల 144 గ్రామాలకు తాగునీరందిస్తారు. దాదాపు 18 లక్షల హెక్టార్లు సాగులోకి వస్తాయి. రాజస్థాన్‌లోని ఎడారి జిల్లాలైన బార్మెర్, జలోర్‌లు సహా మొత్తం 2.46 లక్షల హెక్టార్లకు సాగునీరందనుంది. మహారాష్ట్రలో 37వేల 500 హెక్టార్లకు నీరందుతుంది. ఇక్కడ 9వేల 633 గ్రామాలు, 131 పట్టణ ప్రాంతాలకు తాగునీటిని ప్రత్యేకంగా కేటాయించారు. సర్దార్ డ్యామ్‌లో ఇప్పటికే విద్యుదుత్పత్తి కొనసాగుతుండగా.. తాజా అంచనాల ప్రకారం ఏటా 100 కోట్ల యూనిట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం రోజుకు 1450 మెగావాట్ల విద్యుత్తు తయారయ్యే సామర్ధ్యానికి నిర్మాణం పూర్తయింది. డ్యామ్ పరిధిలో రెండు విద్యుదుత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. నదీ గర్భానికి అనుసంధానంగా ఒకటి, కాలువ ప్రారంభంలో మరొకటి ఉన్న వీటిద్వారా ఇంతవరకు 4,141 కోట్ల యూనిట్ల విద్యుదుత్పత్తి అయింది. వీటి సామర్ధ్యం వరుసగా 1200, 250 మెగావాట్లు. వీటిద్వారా ఇప్పటికే 16 వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఇక్కడ తయారయ్యే విద్యుత్తును మధ్యప్రదేశ్ 57 శాతం, మహారాష్ట్ర 27 శాతం గుజరాత్ 16 శాతం నిష్పత్తిలో పంచుకుంటాయి. 1961లో ఏప్రిల్ 5న శంకుస్థాపన జరిగిన సరోవర్ ప్రాజెక్టు అనేక కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. డ్యామ్‌ను వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ నడిపిన నర్మదా బచావో ఆందోళన్ ఇందులో అత్యంత కీలకమైనది. పర్యావరణ, పునరావాస సంబంధిత అంశాలపై ఎన్బీఏ అభ్యంతరాలు లేవనెత్తింది. కార్యకర్తలు సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్ పొందడంతో 1996లో నిర్మాణ పనులు ఆగిపోయాయి. అనంతరం 2000 అక్టోబర్‌లో మిగిలిన పనులు చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. అప్పటి నుంచి పనులు వేగంగా జరిగాయి. ఐదు దశాబ్దాల కల సాకారం అయ్యింది. -
సర్దార్ సరోవర్ డ్యాంను ప్రారంభించనున్న మోదీ