ఐదు దశాబ్దాల కల సాకారం | PM Narendra Modi inaugurates Sardar Sarovar Dam | Sakshi
Sakshi News home page

ఐదు దశాబ్దాల కల సాకారం

Published Sun, Sep 17 2017 11:21 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ఐదు దశాబ్దాల కల సాకారం - Sakshi

ఐదు దశాబ్దాల కల సాకారం

సర్దార్‌ సరోవర్ డ్యామ్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌: ఐదు దశాబద్దాల కల సాకారమయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు గుజరాత్‌లో ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక సర్దార్‌ సరోవర్ డ్యామ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పూజ చేశారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ నర్మదా నదికి హారతి పట్టారు. డ్యామ్‌ను పరిశీలిస్తూ కలియదిరిగారు. అక్కడి నుంచే ప్రజలకు అభివాదం చేశారు. డ్యామ్‌ను రంగుల రంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, మాజీ సీఎం ఆనందిబెన్‌ పటేల్‌ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

సర్దార్‌ సరోవర్ డ్యామ్‌ విశేషాలు
వాస్తవానికి సర్దార్‌ సరోవర్ డ్యామ్‌ అనే అద్భుత ప్రాజెక్టును నిర్మించాలన్నది భారత తొలి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కల. 1946లోనే ఆయన ఎంతో దూరదృష్టితో దీనిపై ఆలోచన చేశారు. నర్మద నదిపై 30 భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు రచించగా వాటిలో సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ అతిపెద్దది. సరోవర్‌ డ్యామ్‌ పొడవు 1.2 కిలో మీటర్లు. జలాశయం లోతు 163 మీటర్లు. దాదాపు 30 గేట్లున్న డ్యామ్‌లో ఒక్కో గేటు బరువు 450 టన్నులకు పైగా ఉంటుంది. ఒక గేటు మూయాలంటే గంట పడుతుంది. వినియోగించిన కాంక్రీట్‌ పరిమాణం పరంగా చూస్తే సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ ప్రపంచంలోనే రెండో పెద్ద ప్రాజెక్టు. అమెరికాలోని గ్రాండ్‌ కౌలీ డ్యామ్‌ తర్వాత అత్యంత ఎక్కువ కాంక్రీట్‌ వినియోగించింది దీనికే. ఎత్తు పెంచడంతో సరోవర్‌ డ్యామ్‌లో నీటినిల్వ సామర్ధ్యం 4.73 మిలియన్‌ చదరపు అడుగులకు పెరిగింది.




దీని కారణంగా గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలు ప్రయోజనం పొందనున్నాయి. పది లక్షల మంది రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందనుంది. 4 కోట్లమంది ప్రజలకు తాగునీటి ప్రయోజనం చేకూరనుంది. సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు ద్వారా నర్మద నదీ జలాలను గుజరాత్‌లో తీవ్ర నీటిఎద్దడి ఉన్న ప్రాంతాలకు కాలువలు, పైపులైన్లతో పంపిస్తారు. 18వేల 144 గ్రామాలకు తాగునీరందిస్తారు. దాదాపు 18 లక్షల హెక్టార్లు సాగులోకి వస్తాయి. రాజస్థాన్‌లోని ఎడారి జిల్లాలైన బార్మెర్‌, జలోర్‌లు సహా మొత్తం 2.46 లక్షల హెక్టార్లకు సాగునీరందనుంది. మహారాష్ట్రలో 37వేల 500 హెక్టార్లకు నీరందుతుంది. ఇక్కడ 9వేల 633 గ్రామాలు, 131 పట్టణ ప్రాంతాలకు తాగునీటిని ప్రత్యేకంగా కేటాయించారు.


సర్దార్ డ్యామ్‌లో ఇప్పటికే విద్యుదుత్పత్తి కొనసాగుతుండగా.. తాజా అంచనాల ప్రకారం ఏటా 100 కోట్ల యూనిట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం రోజుకు 1450 మెగావాట్ల విద్యుత్తు తయారయ్యే సామర్ధ్యానికి నిర్మాణం పూర్తయింది. డ్యామ్‌ పరిధిలో రెండు విద్యుదుత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. నదీ గర్భానికి అనుసంధానంగా ఒకటి, కాలువ ప్రారంభంలో మరొకటి ఉన్న వీటిద్వారా ఇంతవరకు 4,141 కోట్ల యూనిట్ల విద్యుదుత్పత్తి అయింది. వీటి సామర్ధ్యం వరుసగా 1200, 250 మెగావాట్లు. వీటిద్వారా ఇప్పటికే 16 వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఇక్కడ తయారయ్యే విద్యుత్తును మధ్యప్రదేశ్‌ 57 శాతం, మహారాష్ట్ర 27 శాతం గుజరాత్‌ 16 శాతం  నిష్పత్తిలో పంచుకుంటాయి.


1961లో ఏప్రిల్‌ 5న శంకుస్థాపన జరిగిన సరోవర్‌ ప్రాజెక్టు అనేక కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. డ్యామ్‌ను వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ నడిపిన నర్మదా బచావో ఆందోళన్‌ ఇందులో అత్యంత కీలకమైనది. పర్యావరణ, పునరావాస సంబంధిత అంశాలపై ఎన్‌బీఏ అభ్యంతరాలు లేవనెత్తింది. కార్యకర్తలు సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్‌ పొందడంతో 1996లో నిర్మాణ పనులు ఆగిపోయాయి. అనంతరం 2000 అక్టోబర్‌లో మిగిలిన పనులు చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. అప్పటి నుంచి పనులు వేగంగా జరిగాయి. ఐదు దశాబ్దాల కల సాకారం అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement