అహ్మదాబాద్: ఉక్కు మనిషి, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. అనంతరం పటేల్ 143వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో ఉన్న సాధు బెట్‌లో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మించారు. 2013 అక్టోబర్ 31 న ప్రధాని మోదీ ఐక్యతా విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.
మోదీ ప్రసంగం..
‘ఈ ఏడాది సర్దార్ పటేల్ జయంతి మరింత ప్రత్యేకమైనది. 130 కోట్ల భారతీయుల ఆశీస్సులతో ఈ రోజు ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. నర్మదా నది తీరాన ఏర్పాటు చేసుకున్న ఈ మహా విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినది. భూమి పుత్రుడు సర్దార్ పటేల్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వైనం మనకు కనిపిస్తోంది. ఆయన ఎల్లప్పుడూ మనకు మార్గదర్శనం చేస్తూ, స్ఫూర్తిని అందిస్తూ వుంటారు. సర్దార్ పటేల్ కు ఘన నివాళి అర్పించేందుకు రూపొందిన ఈ మహా విగ్రహాన్ని వాస్తవ రూపంలోకి తేవడానికి రాత్రి పగలూ అనే తేడా లేకుండా పని చేసిన వారందరికీ నా అభినందనలు. ఈ విశిష్టమైన ప్రాజెక్టుకోసం పునాది రాయి వేసిన 2013 అక్టోబర్ నెల 31వ తేదీ నాకు గుర్తుకొస్తోంది. ఆ రోజున మొదలైన ఈ భారీ ప్రాజెక్టు రికార్డు టైములో పూర్తయింది. ఇది ప్రతి భారతీయునికి గర్వకారణమైన విషయం. రాబోయే రోజుల్లో ఈ మహా విగ్రహాన్ని సందర్శించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఐకమత్యానికి, మన మాతృ భూమి భౌగోళిక సమగ్రతకు, దేశ ప్రజల ఐకమత్యానికీ ఈ ఐక్యతా విగ్రహం సంకేతంగా నిలుస్తోంది. అనైక్యత కారణంగా విడిపోతే మనకు మనమే మొహం చూపించుకోలేమనీ, సమాధానం చెప్పుకోలేమనీ.. అదే కలిసి వుంటే ప్రపంచాన్ని ధీటుగా ఎదుర్కోవచ్చుననే సందేశాన్ని ఈ విగ్రహం అందిస్తోంది. ఐకమత్యంతో మాత్రమే అభివృద్ధిని, ప్రాభవాన్ని సాధించి ఉన్నత శిఖరాలను అధిగమించగలం’ అని మోదీ పేర్కొన్నారు.
‘ఆధునిక భారతదేశ నిర్మాత, మహోన్నత ఐక్యతావాదికి ప్రత్యేక నివాళి. 1947 సంవత్సరాన్ని తీసుకుంటే.. ఈ ఏడాది మొదటి అర్ధభాగం భారతదేశ చరిత్రలోనే కీలక సమయం. వలస పాలన తప్పనిసరి పరిస్థితుల్లో ముగియనున్న సమయమది. అంతే కాదు భారతదేశ విభజన కూడా తప్పనిసరి అయింది. అయితే అంతుపట్టని విషయమేమిటంటే భారతదేశం నుంచి విడిపోయే ప్రాంతాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయేమోననేది. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆహార కొరత సర్వసాధారణమైంది. అయితే అన్నిటికన్నా ఎక్కువగా ఆందోళన కలిగించిన విషయం భారతదేశ ఐక్యత ప్రమాదంలో పడడం. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. నూతన ప్రస్థానం మొదలైంది. కానీ ఆ సమయానికి జాతి నిర్మాణమనేది సుదూరంగానే వుండిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి మొదటి హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు సర్దార్ పటేల్. ఆ వెంటనే ఆయన పరిపాలనాపరమైన నియమ నిబంధనల తయారీకి ఒక వేదికను రూపొందించారు. రాష్ట్రాల వ్యవహారాలను చూసే విభాగం (స్టేట్స్ డిపార్ట్ మెంట్) ఏర్పడింది. నాటికి దేశంలో గల 550 సంస్థానాలతో సంప్రదింపులు చేయడమే ఈ విభాగం ముఖ్యమైన పని. పరిమాణం, జనాభా, భౌగోళిక, ఆర్ధిక స్థితిగతులు మొదలైనవాటి పరంగా చూసినప్పుడు ఈ సంస్థానాలు వేటికవే ప్రత్యేకంగా ఉండేవి. సర్దార్ పటేల్ తనదైన శైలిలో వ్యవహరిస్తూ తన పనిని ఎంతో ఖచ్చితత్వంతో, దృఢంగా, పరిపాలనాపరమైన సామర్థ్యంతో నిర్వహించారు. సమయం చాలా తక్కువ. చేయాల్సిన పని బ్రహ్మాండమైనది. కానీ ఆ పనిని చేస్తున్న వ్యక్తి కూడా సామాన్యుడు కాదు. ఆయన సర్దార్ పటేల్. భారతదేశం సమున్నతంగా నిలబడాలన్న ఆకాంక్షతో పని చేశారు. ఒకదాని తర్వాత మరొకటి...అప్పటికి వున్న అన్నిసంస్థానాలతో సర్దార్, ఆయన బృంద సభ్యులు సంప్రదింపులు జరిపి...అన్నిటినీ భారతదేశంలో ఐక్యం చేశారు.సర్దార్ పటేల్ అవిశ్రాంతంగా పని చేయడంవల్లనే ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశ చిత్ర పటం ఆ ఆకారంలో మనకు కనిపిస్తోంది.’ అని ప్రధాని ప్రసంగించారు.
‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కంటే పొడవు..
ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటుచేసిన ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్ డ్యామ్ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు.
30 పవిత్ర నదీ జలాలతో పటేల్ విగ్రహానికి అభిషేకం చేశారు. 37 మంది సర్దార్ పటేల్ కుటుంబ సభ్యులు ఈ విగ్రహ ఆవష్కరణ మహోత్సవంలో పాల్గొన్నారు. పటేల్ జయంతి, విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్ని జిల్లాల్లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం చేపట్టారు. కాగా, స్థానిక నర్మదా జిల్లాలోని గిరిజనులు సర్దార్ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టు పేరుతో సహజ వనరులను నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు.
ఐక్యతా విగ్రహం విశేషాలు..
- విగ్రహ నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 2979 కోట్లు
- విగ్రహం ఎత్తు : 597 అడుగులు (82 మీటర్లు)
- మొత్తం మెటీరియల్ : 3550 టన్నుల ఇత్తడి, 18 వేల టన్నుల రీ ఇన్‌ఫోర్స్‌డ్ స్టీల్ ,6 వేల స్ట్రక్చరల్ స్టీల్, 2 లక్షల 12 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడారు.
- 250 మంది ఇంజనీర్లు.. 3400 మంది వర్కర్లు 3 సంవత్సరాల 9 నెలలపాటు పనిచేసి విగ్రహ నిర్మాణం చేశారు.
- 6.5 తీవ్రతతో భూకంపం సంభవించినా ఈ విగ్రహం తట్టుకుని నిలబడుతుంది.
- గంటకు 180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరదు.
Comments
Please login to add a commentAdd a comment