Narmada River
-
ఎంత కష్టమొచ్చింది.. రబ్బర్ ట్యూబ్‌కు మృతదేహం కట్టి నదిలో..!
భోపాల్: భారీ వర్షాల కారణంగా నది ఉప్పొంగి గ్రామానికి దారి లేకుండా మారింది. ఊళ్లోకి వెళ్లాలంటే వరద దాటుకునే వెళ్లాలి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి మృతదేహాన్ని గ్రామానికి చేర్చేందుకు రబ్బర్ ట్యూబే వారికి ఆసరాగా మారింది. ట్యూబ్‌కు మృతదేహాన్ని కట్టి నది దాటించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అనుప్పుర్ జిల్లాలోని తాడ్‌పతారా గ్రామానికి చెందిన 55 ఏళ్ల విశ్మాట్ నందా అనే వ్యక్తి పక్క జిల్లా డిండోరాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని పతర్‌కుచాకు తీసుకొచ్చారు. నర్మదా నది వరదలతో ఉప్పొంగటం వల్ల పతర్‌కుచా నుంచి తాడ్‌పతరాకు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. అక్కడ ఎలాంటి వంతెన లేదు. దీంతో రబ్బర్ ట్యూబ్‌కు మృతదేహాన్ని కట్టి నదిని దాటించారు గ్రామస్థులు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అభిషేక్ చౌదరి తెలిపారు. डिंडोरी में मृतक के परिजनों से आज़ादी के #अमृतमहोत्सव की अहमियत समझिये गर हिम्मत हो तो! शव को ट्यूब पर रखकर गांव लाये तब अंतिम संस्कार हुआ क्योंकि सरकार या तो पुल बनाती नहीं,बनाती है तो नींव में भ्रष्टाचार डलता है सीमेंट नहीं! @ndtv @ndtvindia pic.twitter.com/ton0fVuLnr — Anurag Dwary (@Anurag_Dwary) August 16, 2022 ఇదీ చదవండి: భారత జాతీయ గీతం ‘జనగణమన’ వినిపించి పాక్ మ్యుజీషియన్ కానుక! -
MP Bus Accident: మృత్యు కేళి: నర్మదా నదిలో ఘోర బస్సు ప్రమాదం
భోపాల్: మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం వేకువ ఝామున ఖాలాఘాట్ దగ్గర అదుపు తప్పి ఓ ప్రయాణికుల బస్సు నర్మదా నదిలో పడిపోయింది. సుమారు వంద అడుగుల ఎత్తు నుంచి నదిలో పడింది బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్తున్నప్పటికీ.. సంఖ్యపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. ఇప్పటిదాకా 12 మంది మృతదేహాలు లభ్యం కాగా, కొందరిని రక్షించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన బస్సు.. ఇండోర్ నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 12 people dead, 15 rescued after a Maharashtra Roadways bus going from Indore to Pune falls off Khalghat Sanjay Setu in Dhar district, says Madhya Pradesh minister Narottam Mishra. pic.twitter.com/h4FuW2B3Ch — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 18, 2022 -
నర్మదా నదిలో పడవ మునక : ఆరుగురి మృతి
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని నందర్బార్ జిల్లా నర్మదా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ప్రమాదం నుంచి 36 మందిని కాపాడి స్ధానిక ఆస్పత్రిలో చేర్పించినట్టు అధికారులు తెలిపారు. మకర సంక్రాంతి సందర్భంగా నదీమతల్లికి పూజలు చేసేందుకు మంగళవారం 60 మందితో పడవ నదిలోకి వెళ్లిన క్రమంలో భూషణ్‌గావ్ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారంతా సమీప గ్రామాలకు చెందిన గిరిజనులని చెప్పారు. ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. సామర్థ్యం మించి పడవలో ప్రయాణీకులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా వెల్లడైందని అధికారులు తెలిపారు. -
ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
-
కలిసి ఉండాలనే సందేశమే ఈ విగ్రహం : మోదీ
అహ్మదాబాద్: ఉక్కు మనిషి, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. అనంతరం పటేల్ 143వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో ఉన్న సాధు బెట్లో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మించారు. 2013 అక్టోబర్ 31 న ప్రధాని మోదీ ఐక్యతా విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. మోదీ ప్రసంగం.. ‘ఈ ఏడాది సర్దార్ పటేల్ జయంతి మరింత ప్రత్యేకమైనది. 130 కోట్ల భారతీయుల ఆశీస్సులతో ఈ రోజు ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. నర్మదా నది తీరాన ఏర్పాటు చేసుకున్న ఈ మహా విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినది. భూమి పుత్రుడు సర్దార్ పటేల్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వైనం మనకు కనిపిస్తోంది. ఆయన ఎల్లప్పుడూ మనకు మార్గదర్శనం చేస్తూ, స్ఫూర్తిని అందిస్తూ వుంటారు. సర్దార్ పటేల్ కు ఘన నివాళి అర్పించేందుకు రూపొందిన ఈ మహా విగ్రహాన్ని వాస్తవ రూపంలోకి తేవడానికి రాత్రి పగలూ అనే తేడా లేకుండా పని చేసిన వారందరికీ నా అభినందనలు. ఈ విశిష్టమైన ప్రాజెక్టుకోసం పునాది రాయి వేసిన 2013 అక్టోబర్ నెల 31వ తేదీ నాకు గుర్తుకొస్తోంది. ఆ రోజున మొదలైన ఈ భారీ ప్రాజెక్టు రికార్డు టైములో పూర్తయింది. ఇది ప్రతి భారతీయునికి గర్వకారణమైన విషయం. రాబోయే రోజుల్లో ఈ మహా విగ్రహాన్ని సందర్శించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఐకమత్యానికి, మన మాతృ భూమి భౌగోళిక సమగ్రతకు, దేశ ప్రజల ఐకమత్యానికీ ఈ ఐక్యతా విగ్రహం సంకేతంగా నిలుస్తోంది. అనైక్యత కారణంగా విడిపోతే మనకు మనమే మొహం చూపించుకోలేమనీ, సమాధానం చెప్పుకోలేమనీ.. అదే కలిసి వుంటే ప్రపంచాన్ని ధీటుగా ఎదుర్కోవచ్చుననే సందేశాన్ని ఈ విగ్రహం అందిస్తోంది. ఐకమత్యంతో మాత్రమే అభివృద్ధిని, ప్రాభవాన్ని సాధించి ఉన్నత శిఖరాలను అధిగమించగలం’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఆధునిక భారతదేశ నిర్మాత, మహోన్నత ఐక్యతావాదికి ప్రత్యేక నివాళి. 1947 సంవత్సరాన్ని తీసుకుంటే.. ఈ ఏడాది మొదటి అర్ధభాగం భారతదేశ చరిత్రలోనే కీలక సమయం. వలస పాలన తప్పనిసరి పరిస్థితుల్లో ముగియనున్న సమయమది. అంతే కాదు భారతదేశ విభజన కూడా తప్పనిసరి అయింది. అయితే అంతుపట్టని విషయమేమిటంటే భారతదేశం నుంచి విడిపోయే ప్రాంతాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయేమోననేది. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆహార కొరత సర్వసాధారణమైంది. అయితే అన్నిటికన్నా ఎక్కువగా ఆందోళన కలిగించిన విషయం భారతదేశ ఐక్యత ప్రమాదంలో పడడం. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. నూతన ప్రస్థానం మొదలైంది. కానీ ఆ సమయానికి జాతి నిర్మాణమనేది సుదూరంగానే వుండిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి మొదటి హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు సర్దార్ పటేల్. ఆ వెంటనే ఆయన పరిపాలనాపరమైన నియమ నిబంధనల తయారీకి ఒక వేదికను రూపొందించారు. రాష్ట్రాల వ్యవహారాలను చూసే విభాగం (స్టేట్స్ డిపార్ట్ మెంట్) ఏర్పడింది. నాటికి దేశంలో గల 550 సంస్థానాలతో సంప్రదింపులు చేయడమే ఈ విభాగం ముఖ్యమైన పని. పరిమాణం, జనాభా, భౌగోళిక, ఆర్ధిక స్థితిగతులు మొదలైనవాటి పరంగా చూసినప్పుడు ఈ సంస్థానాలు వేటికవే ప్రత్యేకంగా ఉండేవి. సర్దార్ పటేల్ తనదైన శైలిలో వ్యవహరిస్తూ తన పనిని ఎంతో ఖచ్చితత్వంతో, దృఢంగా, పరిపాలనాపరమైన సామర్థ్యంతో నిర్వహించారు. సమయం చాలా తక్కువ. చేయాల్సిన పని బ్రహ్మాండమైనది. కానీ ఆ పనిని చేస్తున్న వ్యక్తి కూడా సామాన్యుడు కాదు. ఆయన సర్దార్ పటేల్. భారతదేశం సమున్నతంగా నిలబడాలన్న ఆకాంక్షతో పని చేశారు. ఒకదాని తర్వాత మరొకటి...అప్పటికి వున్న అన్నిసంస్థానాలతో సర్దార్, ఆయన బృంద సభ్యులు సంప్రదింపులు జరిపి...అన్నిటినీ భారతదేశంలో ఐక్యం చేశారు.సర్దార్ పటేల్ అవిశ్రాంతంగా పని చేయడంవల్లనే ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశ చిత్ర పటం ఆ ఆకారంలో మనకు కనిపిస్తోంది.’ అని ప్రధాని ప్రసంగించారు. ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కంటే పొడవు.. ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటుచేసిన ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్ డ్యామ్ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు. 30 పవిత్ర నదీ జలాలతో పటేల్ విగ్రహానికి అభిషేకం చేశారు. 37 మంది సర్దార్ పటేల్ కుటుంబ సభ్యులు ఈ విగ్రహ ఆవష్కరణ మహోత్సవంలో పాల్గొన్నారు. పటేల్ జయంతి, విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్ని జిల్లాల్లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం చేపట్టారు. కాగా, స్థానిక నర్మదా జిల్లాలోని గిరిజనులు సర్దార్ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టు పేరుతో సహజ వనరులను నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఐక్యతా విగ్రహం విశేషాలు.. విగ్రహ నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 2979 కోట్లు విగ్రహం ఎత్తు : 597 అడుగులు (82 మీటర్లు) మొత్తం మెటీరియల్ : 3550 టన్నుల ఇత్తడి, 18 వేల టన్నుల రీ ఇన్ఫోర్స్డ్ స్టీల్ ,6 వేల స్ట్రక్చరల్ స్టీల్, 2 లక్షల 12 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడారు. 250 మంది ఇంజనీర్లు.. 3400 మంది వర్కర్లు 3 సంవత్సరాల 9 నెలలపాటు పనిచేసి విగ్రహ నిర్మాణం చేశారు. 6.5 తీవ్రతతో భూకంపం సంభవించినా ఈ విగ్రహం తట్టుకుని నిలబడుతుంది. గంటకు 180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరదు. -
‘రాహుల్ రామనామ జపమే మా విజయం’
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంగా నర్మదా నదికి పూజలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు చేశారు. ‘నర్మదా హరతి’సందర్భంగా రాహుల్ రామనామ జపం చేయడం బీజేపీ విజయంగా ఆమె అభివర్ణించారు. ఈ మధ్యకాలంలో రాహుల్ పలు దేవాలయాలు సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. అతివాద హిందువులతోనే ఘర్షణలు తలెత్తుతున్నాయని హిందుత్వంపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు కోర్టుకు వెళ్లాలని అన్నారు. రాముడు లేడని అఫిడవిట్ దాఖలు చేయాలని స్మృతి ఎద్దేవా చేశారు. హారతులు, రామనామ జపం చేస్తూనే మళ్లీ హిందూమతంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా గుర్తుకు రాని దేవాలయాలు, దైవ భక్తి ఎన్నికల వేళనే రాహుల్‌కి గుర్తుకు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసమే రాహుల్ గుడిమెట్లు ఎక్కుతున్నారని స్మృతి చురకలంటించారు. కాగా, ఇటీవల తన నియోజక వర్గం అమేథీని సందర్శించినప్పుడు కూడా రాహుల్ ఇటువంటి విమర్శలే ఎదుర్కొన్నారు. శివాలయంలో పూజలు చేసిన రాహుల్‌పై.. ‘ఫ్యాన్సీ డ్రెస్ కాంపీటీషన్లో పాల్గొన్న రాహుల్’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి సబిత్ పాత్ర వ్యాఖ్యానించారు. హిందూ టెర్రరిజం లష్కరే తొయిబా కంటే ప్రమాదకరమైనదని అసంబద్ధ వ్యాఖ్యలు చేసే రాహుల్ గాంధీ దేవాలయాలకు వెళ్లడమెందుకని ప్రశ్నించారు. -
అక్టోబర్ 31న పటేల్ విగ్రహావిష్కరణ
న్యూఢిల్లీ: దేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్మారకంగా నర్మదా నది ఒడ్డున 182 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేస్తున్న ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ (ఐక్యతా విగ్రహం) ఆవిష్కరణకు సిద్ధమైంది. అక్టోబర్ 31న పటేల్ 143 జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. -
పవిత్ర నదిలోనే లీటర్ల కొద్ది మద్యం
-
నదిలో మద్యం; సర్వత్రా విమర్శలు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఎక్సైజ్ శాఖ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ పవిత్ర నర్మద నదికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించేందుకు చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎక్సైజ్ అధికారులు మాత్రం ఆ నదిలోనే వందల లీటర్ల మద్యాన్ని గుమ్మరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులు డ్రమ్ముల్లో ఉన్న మద్యాన్ని నదిలో కలిపారు. ఈ ఘటన దార్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మిశ్రా మాట్లాడుతూ.. పవిత్ర నదిలో మద్యం కలపడం ద్వారా నేరానికి పాల్పడ్డారని విమర్శించారు. ఈ చర్య హిందువుల మత నమ్మకాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. నదిని కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులు వింత వాదనకు దిగారు. తమ సిబ్బంది ఎలాంటి మద్యాన్ని నదిలో కలపలేదని తెలిపారు. మద్యం తయారీలో ప్రాథమికంగా ఉపయోగించే పదార్థాన్ని మాత్రమే నది తీరంలో గుంటల్లో పూడ్చినట్టు పేర్కొన్నారు. నది పవిత్రత గురించి తమకు పూర్తి అవగాహన ఉందని.. తాము దానిని దెబ్బతీసేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వెల్లడించారు. -
జ్యోతిర్లింగాల క్షేత్రం ఓంకారేశ్వర్!
నర్మదానది నీటి పరవళ్లలో అల్లనల్లన తేలియాడుతూ వచ్చే చల్లని గాలి ఓంకార నాదం చేస్తూ హృదయంలో భక్తిరసాన్ని తట్టిలేపుతుంది. వింధ్య పర్వత సోయగాల వీక్షణతోనే మనసు శివపంచాక్షరి స్తోత్రాన్ని జపించడంలో మునిగిపోతుంది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై న కారాయ నమఃశివాయ... అంటూ స్వామిని స్తుతిస్తూ ఓంకారేశ్వరుని ఆలయానికి చేరుకుందాం. నర్మద, కావేరీ సంగమ క్షేత్రం ఓంకారేశ్వర్. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహిమాన్వితమైన రెండు జ్యోతిర్లింగాలు ఓంకారేశ్వర్‌లోనే ఉండటం ఈ ప్రాంత విశిష్టత. మన దేశంలోని మధ్యప్రదేశ్‌లో ఇండోర్ పట్టణానికి 77 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓంకారేశ్వర్. కాషాయ దుస్తులు ధరించిన సాధువులు, గంభీరంగా సాగే నర్మదానది, అక్కడి ఘాట్లలో భక్తుల సందడి.. చూడగానే మనసుకు కాశీ క్షేత్రం తలపుకు రాకుండా ఉండదు. అందుకే ఈ పట్టణాన్ని చిన్న కాశీ అని కూడా అంటారు. నర్మదానది ఒడ్డునే ఓంకార రూపంలో వింధ్యపర్వతం ఉంది. ఈ పర్వతం ఓంకార రూపంలో ఉండటంతో స్వామికి ఓంకారేశ్వరుడు అని, స్వామి పేరుమీదుగానే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర్ అని పేరు వచ్చింది. గిరి పరిక్రమ ఫలితం ఎంతెంతో! ఇక్కడ నర్మదా నది స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు ఉండటం విశేషం. అందుకే భక్తులు కూడా నదికి, స్వామికి పరిక్రమను పూర్తి చేసి, స్వామి కృపకు పాత్రులవుతారు. ఓంకారగిరి ప్రదక్షిణ కైలాసపర్వతాన్ని చుట్టి వచ్చిన ఫలితం ఇస్తుందని, జన్మజన్మల సుకృతంగా భావిస్తారు భక్తులు. ఏడు కిలోమీటర్ల ఈ గిరి పరిక్రమకు మొత్తం నాల్గు గంటల సమయం పడుతుంది. ఈ పరిక్రమలో ముందుగా ‘పంచముఖ గణనా«థుడి’ని దర్శించుకుంటాం. ఈ గణనాథుడిని మాంధాత మహర్షి ప్రతిష్టించాడని ఐతిహ్యం. ఇక్కడ నుంచి మార్గమధ్యంలో అతిపురాతనమైన ‘ఖేరాపతి హనుమాన్’ ఆలయం చేరుకుంటాం. దీనికి సమీపంలోనే కేదారేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ స్వామి లింగరూపంలో కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఈ ప్రదేశంలోనే నర్మదా నదిలో రాళ్ల మీద రాళ్లు అంతస్తులుగా పేర్చి కనిపిస్తాయి. సొంతంటి ఇల్లు కల నెరవేరాలని భక్తులు ఈ రాళ్లు పేర్చి మొక్కుకుంటారు. అక్కడ నుంచి మరికొంత ముందుకు వెళితే ‘రుణముక్తేశ్వర స్వామి’ని ఆలయాన్ని చేరుకుంటాం. ఇక్కడ స్వామి వారికి శనగలు సమర్పిస్తే రుణ విముక్తులు అవుతారని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే సుందర రాధాకృష్ణుల మందిరం, గౌరీ సోమనాథుల ఆలయాలు ఉన్నాయి. ‘లాలాహనుమాన్ దేవాలయం’లో స్వామి శయనరూపంలో కనిపించడం విశేషం. అనంతరం భక్తులు ఆశాదేవి ఆలయం చేరుకుంటారు. ఈ మార్గంలోనే ఆఖరుగా గౌరీనా«ద్ ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి అత్యంత సమీపంలో ఓంకారేశ్వర్ మందిరం ఉంటుంది. గిరి ప్రదక్షిణ పూర్తిచేసిన భక్తులు స్వామి ఆలయానికి చేరుకుంటారు. దర్శనమాత్రం చేతనే భక్తులకు అషై్టర్యాలను ప్రసాదించే పరమేశ్వరుడు నాగాభరణ ధారిగా దర్శనమిస్తాడు. ఈ ప్రధాన ఆలయంలోనే త్రిశుద్ధనాథ్, వైద్యనాథ్, మహాకాలేశ్వర్, కేదారినాథ్, గుప్తనాథ్ అనే ఐదు ఉప ఆలయాలూ ఉన్నాయి. ఈ ఐదు ఆలయాలను పంచలింగ ధామాలుగా వ్యవహరిస్తారు. వింధ్య తపస్సు మెచ్చిన ఈశ్వరుడు దేశంలోని పర్వతాలలో మేరు పర్వతం, వింధ్య పర్వతం అత్యంత ఎల్తైనవిగా పేరుపొందాయి. కలహభోజనుడైన నారదుడు ఒక రోజు వింధ్య పర్వతం వద్దకు వచ్చి మేరు పర్వతాన్ని విశేషంగా ప్రశింసించాడట. దీంతో వింధ్యకు కోపం, అసూయ కలిగి తాను మేరు పర్వతం కంటే మించి పోవాలనే సంకల్పంతో శివుని ప్రార్థిస్తూ తపస్సు చేసిందట. శివుడు ప్రత్యక్షమై, నీ మనసులోని కోరిక సిద్ధిస్తుందని పలికాడట. శివుడు వింధ్యకు దర్శనం ఇచ్చినప్పుడు పలువురు మహర్షులు అక్కడికి వచ్చి శివుని దర్శించి, అతడు ఇదే స్థలంలో నిలిచిపోవాలని కోరారట. దీంతో శివుడు వింధ్య పర్వతం మీదనే కొలువుదీరాడట. శివుని వరంతో వింధ్య రెచ్చిపోయి విపరీతంగా పెరగసాగిందట. వింధ్య ఎత్తు సూర్యచంద్రులకు కూడా ఆటంకం కలిగించిందట. వింధ్య ఎత్తు వల్ల కలిగిన ఉపద్రవాన్ని అరికట్టాలని దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు దేవతల మొర విని వింధ్య సమస్య పరిష్కారానికి అగస్త్యమునిని ప్రార్థించమని సూచించాడట. కాశీలో ఉన్న అగస్త్యుని దేవతలు కలుసుకొని వింధ్య వల్ల ఎదురవుతున్న సమస్యను వివరించి కాపాడమని అర్థించడంతో అగస్త్యుడు వింధ్య పర్వతం సమీపించి తాను దక్షిణాదికి వెడుతున్నానని, నీ ఎత్తు ఎక్కువగా ఉన్నందున ఎక్కజాలనని, ఇదివరకటి ఎత్తుకు చేరుకోమని కోరడంతో మహర్షి మాట కాదనడానికి వీలులేదు కనుక వింధ్య సాధారణ ఎత్తుకు తగ్గిపోయిందట. అగస్త్యుడు పర్వతం దాటి వెడుతూ తాను తిరిగి వచ్చేవరకు ఇలాగే ఉండాలని కోరి ముందుకు వెళ్లాడట. అయితే అతడు తిరిగి ఉత్తరాదికి రాకుండా శ్రీశైలంలో నిలిచిపోయాడట. మహర్షులు దేవతల ప్రార్థనపై వెలసిన శివలింగాన్ని రెండు భాగాలుగా విభజించగా వాటిలో ఒక భాగం ఓంకారేశ్వరుడుగా మరో భాగం అమలేశ్వరుడిగా వెలిశారు. ఈ రెండు జ్యోతిర్లింగాలను దర్శించినంతనే తమ జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తారు. అలంకారంగా శయనహారతి ఓంకారేశ్వర్‌లో స్వామికి నిత్యం అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ప్రతిరోజూ శయన అలంకార హారతి కనులారా వీక్షించాల్సిందే. శ్రావణమాసంలో తిరునాళ్లు, కార్తికమాసంలో ప్రత్యేక ఉత్సవాలు, మాఘమాసంలో మహా శివరాత్రి వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగు తాయి. ఇక శ్రావణమాసంలో జరిగే శ్రావణ మేళా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకో దగింది. ఒక పడవలో ఓంకారేశ్వరుడు, మరో పడవలో మమలేశ్వరుడు నర్మదానదిలో మేళ తాళాల నడుమన జలవిహారం చేస్తారు. నది మధ్యలో ఒక చోట కలిసి, ఒకరి చుట్టూ ఒకరు ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తారు. శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం జరిగే ఈ వేడుకను వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఆధునికత అంటని వాతావరణం ఓంకారేశ్వర్‌లో పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ స్థానిక సంస్కృతికి ఏమాత్రం విఘాతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ఇక్కడి గిరిపుత్రుల అమాయకత్వం, ప్రశాంత వాతావరణం, ప్రజల సామాన్య జీవనస్థితిగతులను చూస్తే నాగరికత ఇక్కడి మనిషినీ, ప్రకృతిని ఇంకా స్పృశించలేదని స్పష్టం అవుతుంది. ఎంతో కళాత్మకంగా ఉండే ఈ పట్టణంలో మహిళలు కొండల మీద పూచే పువ్వులను కోసుకొచ్చి శివారాధనకు తెచ్చి అమ్ముతుంటారు. విభిన్నరకాలుగా ఉండే ఆ పువ్వుల పరిమళం మన మనసులో ఆధ్యాత్మిక పరమళాలను వెదజల్లుతుంది. హనుమాన్ మూర్తి రంగు వస్త్రధారణలో సాధువులు కనిపిస్తారు. నిలువ నీడలేని భిక్షకులు దేశం అంతటా కనిపిస్తారు. అయితే, ఇక్కడ మాత్రం దారికి అడ్డం పడకుండా ఒక సేవకు ఎదురుచూపులా కనిపిస్తారు భిక్షకులు. మౌనంగా అతిథులు ఇచ్చిన దానిని కళ్లకు అద్దుకుని భగవద్‌కృపగా తీసుకుంటారు. తీర్థయాత్రలు చేయడం అంటే ఆపన్నులకు సాయం చేయడమే అనేది ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. – నిర్మలారెడ్డి చిల్కమర్రి స్వామి దర్శనం ప్రతి రోజు ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామిని దర్శించుకోవచ్చు. ఈ పట్టణంలో బస చేయడానికి ధర్మశాలలు, సత్రాలు, వివిధ ట్రస్ట్‌ల గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి. ఓంకారేశ్వర్‌కు దారి ఇండోర్ నుంచి ఓంకారేశ్వర్ 77 కిలోమీటర్లు. ఇండోర్‌లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఉజ్జయిని నుంచి 133, హైదరాబాద్ నుంచి 772 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓంకారేశ్వర్. హైదరాబాద్ నుంచి ఓంకారేశ్వర్‌కు నేరుగా రైలు మార్గం లేదు. భోపాల్ లేదా ఇండోర్ వెళ్లి అక్కడ నుంచి ఓంకారేశ్వర్ చేరుకోవాలి. -
అదిగో...మహిష్మతి
యాత్ర మహిష్మతి రాజ్యాన్ని ‘బాహుబలి’ సినిమాలో చూసి ఉంటారు. ఆ పేరున్న పట్టణాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్కి వెళ్లాలి. నగిషీలు చెక్కిన ప్రాకారాలు, ఠీవీగా నిల్చున్న కోటగోడలు చుట్టూ ఉండగా మధ్యన నందీశ్వరుడితో సహా కొలువుదీరాడు మహేశ్వరుడు. నిత్యం శివార్చనతో ప్రశాంతమైన నర్మదానది ప్రణమిల్లగా మన అంతఃచేతనంలో పరవశాలను నింపుతూ దర్శనమిస్తాడు మహేశ్వరుడు. ఆయన పేరు మీదుగానే ‘మహేశ్వర్’ అని పట్టణ నామం స్థిరపడింది. అలా అక్కడ భక్తులకు అనంతమైన ఆశీస్సులను మహేశ్వరుడు అందిస్తున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖార్గోన్ జిల్లాలో ఉందీ మహేశ్వర్ పట్టణం. ఆగ్రా–ముంబై వెళ్లే 3వ నెంబర్ జాతీయ రహదారికి కేవలంS13 కిలోమీటర్లు, ఇండోర్ నుంచి 91 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణానికి లెక్కలకందని విశిష్టతలెన్నో ఉన్నాయి. శరీరానికి హృదయం దేవాలయం ఎలాగో సుసంపన్నమైన మహేశ్వర్ కోటకు హృదయం మహేశ్వరుడి మందిరం. ఈ కోట అహిల్యాబాయి హోల్కర్ కోటగా కూడా ప్రసిద్ధి. 18వ శతాబ్దిలో మరాఠా రాణి, రాజమాత అహిల్యా బాయి హోల్కర్ తన భర్త మరణా నంతరం మహేశ్వర్ ఆలయాన్ని నడిబొడ్డుగా చేసుకొని దుర్భేద్యమైన కోటను నిర్మించారు. ఇక్కడ నుంచే మాళవ (మాల్వా) దేశాన్ని ఆమె పరిపాలించారు. శివ భక్తురాలైన అహిల్యా దేవి ఎన్నో శివాలయాలను పునరుద్ధరించారు. వాటిలో గుజరాత్‌లోని ద్వారక, సోమనాథ్, కాశీ విశ్వనాథ్ మందిరం, ఉజ్జయిని, నాసిక్, విష్ణుపాద మందిర్, గయ.. ఆలయాల లాంటివి ఎన్నో ఉన్నాయి. వీటితో పాటు నర్మదానది ఒడ్డున ఎన్నో దేవాలయాలు, ఘాట్లను నిర్మింపజేశారు. నర్మదానది ఒడ్డున నిల్చుని అహిల్యాబాయి కోట ఘాట్లను వీక్షిస్తుంటే ప్రసిద్ధ చిత్రకారుడు కాన్వాస్ మీద అందమైన చిత్రాలను తీర్చిదిద్దినట్టుగా దర్శనమిస్తుంది ఈ ప్రాంతం. రామాయణ కాలం నాటి సామ్రాజ్యం మహేశ్వర్ ప్రాచీన నామం మహిష్మతి. రామాయణ, మహాభారతాలలో ఈ మహిష్మతి సామ్రాజ్య ప్రస్తావన ఉంది. అంటే, రామాయణ కాలం నాటి కన్నా ముందే ఈ రాజ్యం ఉందన్నమాట. నర్మదా నదికి సమీపంలో ఉన్న సహస్రార్జున మందిరాన్ని సందర్శిస్తే అలనాటి విశేషాలు కళ్లకు కడతాయి. గోపురాలు నాటి కథలు చెబుతాయి. ఈ ప్రాచీన పట్టణాన్ని సోమవంశ సహస్రార్జున క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు తన రాజ్యానికి రాజధానిగా చేసుకొని, పరిపాలించేవాడు. ఇతడినే శ్రీ సహస్రార్జున అనేవారు. ఇతని గురించి మన ఇతిహాసాలలో గొప్ప ప్రస్తావన ఉంది. ఒక రోజు సహస్రార్జునుడు తన 500 మంది భార్యలతో నదీ తీరానికి వాహ్యాళికి వెళ్లాడట. అయితే, 500 మంది భార్యలు ఉల్లాసంగా ఆడుకోవడానికి అనువైన ప్రాంతం కనిపించక, ప్రవహించే పవిత్ర నర్మదానదిని తన వెయ్యి బాహువులతో నిలువరించాడట. విశాలమైన ఆ నర్మదానదీ మైదానంలో అందరూ ఆనందంగా విహరిస్తున్న సమయంలో రావణాసురుడు ఆకాశమార్గాన పుష్పకవిమానంలో వెళుతూ, ఈ ప్రాంతంలో దిగాడట. నదీ మైదానం విశాలంగా కనిపించడంతో ఇసుకతో చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించి, పూజలు ప్రారంభించాడట. సహస్రార్జునుడి భార్యలు ఆటలు ముగించి, నది ఒడ్డుకు చేరుకోవడంతో అతను నెమ్మదిగా నీటిని విడుదల చేశాడట. ఇప్పటికీ అవే 11 అఖండ దీపాలు దీంతో రావణుడు ప్రతిష్ఠించిన ఇసుక శివలింగాన్ని నర్మదానది నీరు తుడిచిపెట్టేసుకుంటూ వెళ్ళింది. రావణుడు ఆగ్రహించాడు. సహస్రార్జునుడితో యుద్ధానికి దిగాడట. çసహస్రార్జునుడు తన వెయ్యి బాహువులతో రావణుడిని ఓడించి, అతడిని కట్టేసి, పది తలల మీద పది దీపాలు, కట్టేసిన రెండు చేతుల మధ్య మరో దీపం ఉంచి తన ఇంటికి బందీగా తీసుకెళ్లాడు. తన కొడుకు ఊయలను రావణాసురుడితో ఊపించి, ఆ తర్వాత వదిలేశాడట. ఇప్పటికీ మహేశ్వర్‌లోని సహస్రార్జున దేవాలయంలో 11 అఖండ దీపాలు నాటి నుంచి నేటి వరకు వెలుగుతూనే ఉండటం విశేషం. అలాగే, అగ్నిదేవుని కృప ఈ పట్టణానికి రక్షగా ఉందని ఎన్నో కథనాలున్నాయి. సహస్రార్జునుడి తదనంతరం నిషాద రాజ్యం రాజు నిల మహిష్మతి రాజ్యాన్ని చేజిక్కించుకుని పరిపాలించాడు. కురుక్షేత్రయుద్ధం ముగిశాక ధర్మరాజు రాజయ్యాడు. భూమినంతా జయించడానికి యాగాన్ని ప్రారంభించాడు. అంతా ఆక్రమించుకున్నా, మహిష్మతి మాత్రం వీరి హస్తగతం కాలేదు. ధర్మరాజు తమ్ముడు సహదేవుడు అగ్నిదేవుడి రక్షణ వల్లే మహిష్మతి తమ హస్తగతం కావడం లేదని గుర్తించాడు. అగ్నిని ప్రసన్నం చేసుకుని, మహిష్మతిని తమ రాజ్యంలో కలిపేసుకున్నారు పాండవులు. అలా ఆర్యావర్తంలో మహిష్మతి ఈశ్వరుడి నామంతో మహేశ్వర్‌గా రూపుమార్చుకుంది. దేవాలయాల రాజ్యం సహస్రార్జునుడి మందిరం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. కాగా ఈ ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వర మందిరం, కాశీ విశ్వనాథ, చతుర్భుజి నారాయణ, అహిల్యామాత, చింతామణి గణపతి, పండరినాథ్, భవానీ మాత, గోబర్ గణేశ్, అనంత్‌నారాయణ, ఖేడాపతి హనుమాన్, రామ– కృష్ణ, నర్సింగ్, కాళేశ్వర, జ్వాలేశ్వర మందిరాలున్నాయి. బాణేశ్వర్ శివ మందిరం నర్మదానది మధ్యలో ఉంటుంది. దీని వల్ల ఈ మందిరం ఓ ద్వీపంలో ఉన్నట్టు గోచరిస్తుంది. వింధ్యవాసినీ శక్తిపీఠం మహేశ్వర్‌లోని వింధ్యవాసినీ భవాని శక్తిపీఠాలలో ఒకటి అంటారు. ఏక్ ముఖి దత్త మందిరాన్ని ఇక్కడ కొత్తగా నిర్మించారు. దీన్ని శివదత్త ధామంగా పిలుస్తారు. 30 ఎకరాలలో సువిశాలంగా నిర్మించారు. జగద్గురు కృపాళూజీ మహారాజ్ వేవేల విధాలుగా మహేశ్వర్ దేవాలయాన్ని కీర్తిస్తూ అఖండ సంకీర్తనల్ని వెలువరించారు. జీవితమంతా మహేశ్వర్‌లోనే ఉన్నారు. ఉత్సవాల కోలాహలం అహిల్యాబాయి కోటలో కొంత భాగాన్ని ప్రాచీన హోటల్‌గా మార్చారు. మహేశ్వర్‌లో నాగపంచమి, గుడి పడవా, తీజ్, శ్రావణమాసంలో అన్ని సోమవారాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. చివరి సోమవారం మాత్రం కాశీవిశ్వనాథుని పూజ జరిపి భంగు (గంజాయి) ప్రసాదంగా పంచుతారు. మహాశివరాత్రి, సమోటి అమావాస్య, ఇతర అన్ని పండగలు విశేషంగా జరుపుతారు. ప్రతి ఏటా సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం మహేశ్వర్‌లోని స్వాధ్యాయ భవన్ ఆశ్రమం మహా మృత్యుంజయ రథయాత్రను ప్రారంభిస్తుంది. సినిమాలలో మహేశ్వర్! నర్మద నదీ తీరప్రాంతమంతటా ఎన్నో ప్రకృతి అందాలు కొలువుదీరాయి. వీటిలో మహేశ్వర్‌లోని కోట ఘాట్లు, ప్రాకారాలు ప్రత్యేకమైనవి. ఈ కోట లోనూ, చుట్టుపక్కల ప్రాంతాలలో తరచూ హిందీ, తమిళ, కన్నడ సినిమాల చిత్రీకరణ జరుగుతుంటుంది. వీటిలో ప్రముఖంగా ఎ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ వీడియో, ‘బాజీరావ్ మస్తానీ’, ‘నీర్జా’ సినిమాలు, చారిత్రక టీవీ సీరియల్స్ ఇక్కడే చిత్రీకరించారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడి వాతావరణం చలిగా, పొడిగా సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. దేశీయ చేనేత... మహేశ్వరి చీరలు మహేశ్వర్ 5వ శతాబ్ది నుంచి చేనేతకు ప్రసిద్ధి గాంచింది. దేశంలోని చేనేతలలో ఉత్తమమైన వస్త్రంగా పేరొందింది. మహేశ్వర్ దేవాలయాన్ని సందర్శించి, విశేషాలు తెలుసుకోవడం ఒక ఎల్తైతే, ఆ పట్టణానికి మరో ప్రత్యేకత – రంగురంగుల మహేశ్వరి చీరలు. ఇవి కాటన్, పట్టులో లభిస్తాయి. చారలు, పువ్వుల అంచులతో చూడగానే ఆకట్టుకుంటాయి ఈ చీరలు. మధ్యప్రదేశ్ టూరిజమ్ హనుమాంతియాలోని నర్మదానది డ్యామ్ బ్యాక్‌వాటర్‌లో ‘జల్ మహోత్సవ్’ పేరుతో రెండేళ్లుగా డిసెంబర్–జనవరి నెలల్లో ఉత్సవాలు జరుపుతోంది. ఈ సందర్భంగా హనుమాంతియాలోని టూరిస్ట్ కాంప్లెక్స్, మహేశ్వర్, ఓంకారేశ్వర్‌ల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. వివరాలకు: మధ్యప్రదేశ్ టూరిజమ్, టూరిస్ట్ ప్లాజా, బేగంపేట, హైదరాబాద్.9866069000 /9951080605లలో సంప్రతించవచ్చు. ఇలా వెళ్లచ్చు! ► హైదరాబాద్ నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి మ«ధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాకు రైలు సదుపాయం ఉంది. ఇక్కడ నుంచి మహేశ్వర్‌కు 120 కిలోమీటర్లు. రోడ్డుమార్గంలో వెళ్లడానికి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ►ఇండోర్‌లో దేవీ అహిల్యాబాయి హోల్కర్ పేరున అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి మహేశ్వర్కి 95 కిలోమీటర్లు. – నిర్మల చిల్కమర్రి -
యోధా పాట్కర్
బయోగ్రఫీ అశాంతి, అస్థిమితం, అభివృద్ధి నిరోధకం.. ఈ మూడూ కలిస్తే.. మేధా పాట్కర్! ఇది ప్రభుత్వాల మాట. పర్యావరణ సంరక్షణ, మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక ప్రక్షాళన... ఈ మూడింటి కోసం ప్రభుత్వాలను మూడు చెరువుల నీళ్లు తాగిస్తే.. మేధా పాట్కర్!! ఇది ‘నర్మద’ను నమ్ముకున్నవారి మాట. నర్మదా నది నీళ్లను నిజంగా దాహం లేనివాళ్లు తాగినా, నర్మదా నది నీళ్లను నిజంగా రైతులు కానివాళ్లు తాకినా మేధకు ఆగ్రహం వస్తుంది. ఆమె పోరాటం... జల జనిత జ్వాల! ఆమె ఆరాటం జన జీవన మహోజ్వల. ఈమధ్యే మేధ.. మోదీ, అమిత్‌షాల తలలపై నర్మద నీళ్లను కుమ్మరించారు. ఉజ్జయినీ కుంభమేళాకు 172 కోట్ల లీటర్ల నీటిని నర్మదా నది నుంచి తరలించడం ఆమెకు నచ్చలేదు. ఇక మేధ, తర్వాత ఏం చేయబోతున్నారన్నది ఈ దేశంలోని ప్రభుత్వాలు తెలివిమీరి, తెలివితక్కువగా తీసుకోబోయే విధ్వంసకర నిర్ణయాలను బట్టి మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం ‘డామ్’ ఇట్ అంది! మేధ 1989 లో నర్మదా బచావో ఆందోళన్ (ఎన్బీయే) మొదలు పెట్టినప్పుడు ఆమె వయసు 35 సం. నర్మదా నదిపై ఆనకట్టలు కట్టడానికి వీల్లేదని ఆమె ఆందోళన. అతి పెద్ద సర్దార్ సరోవర్ డ్యామ్‌ను అసలే కట్టనివ్వకూడదని ఆమె ప్రతిఘటన. ప్రభుత్వం వింటుందా? అభివృద్ధి అంటుంది. సర్దార్ సరోవర్ ఒకటేనా.. నర్మద మీద ఇంకా 30 పెద్ద డ్యాములు, 135 మీడియం డ్యాములు, 3000 చిన్న డ్యాములు కట్టుకోవచ్చుని ట్రిబ్యునలే చెప్పాక ప్రభుత్వానికి మాత్రం ఆగాల్సిన పనేముంది? 2006లో వర్క్ మొదలుపెట్టింది. రెండేళ్లలో ఒక కొలిక్కి తెచ్చింది. కేసుల కొర్రీలతో ఇప్పటికీ డ్యామ్ నిర్మాణం జరుగుతూనే ఉంది. మేధ అన్నం, నీళ్లు మానేశారు నర్మద మధ్యప్రదేశ్‌లో పుట్టింది. అమర్కంఠ్ కొండల్లో. మేధ మహారాష్ట్రలో పుట్టారు. ముంబైలో. నర్మద మూడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. మేధ.. నర్మదపై డ్యామ్‌ల నిర్మాణానికి వ్యతిరేకంగా రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారు. ఇప్పుడు ఆమె వయసు 61 ఏళ్లు. ఆమె ఉద్యమం వయసు 27 ఏళ్లు. ఇప్పటి వరకు మేధ చేపట్టిన అతి పెద్ద ఆందోళన 2006లో ఢిల్లీలో ఆమె చేసిన నిరాహార దీక్ష. మొన్న ఏప్రిల్‌కి ఆ దీక్షకు పదేళ్లు. (అదే ఏడాది జూన్‌లో మేధ వ్యతిరేకిస్తున్న సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం మొదలైంది). కూతురి దీక్ష.. తల్లికి బెంగ మేధ దీక్షకు కూర్చున్నప్పుడు ప్రభుత్వం కన్నా ముందు ఆందోళన చెందే వ్యక్తి ఇందు ఖనోల్కర్. మేధ తల్లి ఆమె. 2006లో మేధ ‘నిరశన’కు కూర్చున్నప్పుడు 77ఏళ్ల ఇందు.. ఎప్పుడూ లేనంతగా కలత చెందారు. అందుకు కారణం ఉంది. మేధకు తిండి మానేసి, పిడికిలి బిగించి కూర్చోవడం మామూలై పోయింది. ఆమె ఆరోగ్యం దెబ్బ తింటుందేమోనని తల్లి బెంగ. 1996లో ఓసారి మేధ 82 రోజుల నిరశనలో కూర్చున్నారు. అప్పట్నుంచి కూతురి నిరశనలను, ధర్నాలను లెక్కించడం మానుకున్నారావిడ! మొదట్లో అప్పుడప్పుడు వెళ్లి వేదిక మీద కూతుర్ని చూసుకుని వచ్చేవారు. ఏం చేస్తోందో, ఎలా ఉందోనని. మేధ పక్కన ఎవరెవరో ఉండేవారు. ఆదివాసీలు, పర్యావరణ పరిరక్షకులు, సామాజిక కార్యకర్తలు, ఇంకా... వచ్చిపోతూ, పూలగుచ్ఛాలు ఇచ్చిపోతుండే సెలబ్రిటీలు. వాళ్లను చూసి తన కూతురు కరెక్టే అనుకునేవారు ఇందు. 2006 నిరశనకు ఆమె వెళ్లలేదు. మేధ సోదరుడు మాత్రం ముంబై నుంచి ఢిల్లీ వెళ్లి ఆమెతో కొద్దిసేపు కూర్చుని వచ్చేశాడు. ఏప్రిల్ 17 సోమవారం 2006 ‘పునరావాసం కల్పించండి’ అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ వార్త అందగానే ఎవరో వచ్చి మేధకి నిమ్మరసం అందించారు. నిజానికైతే అక్కడి నుంచి ఆమె వెంటనే ముంబై బయల్దేరి వెళ్లాలి. ఆమె కుటుంబ సభ్యులు కూడా అదే ఆశించారు. కానీ ఆమె ఢిల్లీలోనే ఇంకో ఉద్యమ కార్యక్రమంలో నిమగ్నమైపోయారు. రెండు రోజుల తర్వాత గానీ తల్లికి కూతురు అందుబాటులోకి రాలేదు! ‘ఎక్కువ తినొద్దు. చాలా రోజులుగా ఖాళీ కడుపుతో ఉన్నావు కదా. తింటే వాంతి అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త’.. ఇంతకుమించి ఆమె చెప్పేదేమీ ఉండదు. మేధ తల్లికి బీపీ ఉంది. షుగర్ ఉంది. తన కూతురికీ అవి రావచ్చేమోనని ఆమె భయం. 300కు పైగా నిరాహార దీక్షలు మేధ కాలేజీ రోజుల్లో ఎంత చురుగ్గా ఉన్నారో, ఇప్పుడూ అంతే పోరాట పటిమతో ఉన్నారు. మేధ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌లో ఎం.ఎ. (సోషల్ వర్క్) చదివారు. పీహెచ్‌డీని, ఫ్యాకల్టీగా టాటాలో వచ్చిన అవకాశాన్నీ వదులుకుని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఐదేళ్ల పాటు ముంబై మురికివాడలలో పనిచేశారు. తర్వాత రెండేళ్లు ఈశాన్య గుజరాత్‌లోని ఆదివాసీ జిల్లాల్లో సేవలను అందించారు. మరో ఐదేళ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలోని నర్మదా నదీ పరివాహక ప్రాంతాలలో పర్యటించారు. డ్యామ్ నిర్మాణాలతో అక్కడి ఆదివాసీలకు జరగబోయే నష్టాన్ని పసిగట్టి ప్రభుత్వాన్ని డీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ‘నర్మదా బచావో ఆందోళన్’ ప్రారంభం అయింది అప్పుడే. ‘నిర్మాణం మనిషి బతుకును కూల్చేయకూడదు’ అన్నది మేధ సిద్దాంతం. ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఆమె ఈ మూడున్నర దశాబ్దాలలోనూ అనేక పోరాటాలు చేశారు. 300 కు పైగా నిరాహార దీక్షలు చేశారు! బాల్యంలో మేధ ఎలా ఉండేది? మేధ దయ గల అమ్మాయి! చిన్నప్పుడు తల్లితో కలిసి నడుస్తున్నపుడు.. చేయి చాచిన ప్రతి యాచకునికీ డబ్బు ఇమ్మని తల్లిని పోరేది. స్కూల్లో తెలివైన విద్యార్థిని. ఎప్పుడూ క్లాస్ ఫస్టే. వక్తృత్వపు పోటీల్లోనైతే ఇక చెప్పే పనిలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడేది. తన వాదనను స్పష్టంగా వినిపించేది. దాదర్‌లోని కింగ్ జార్జి స్కూల్లో ఆమె చదువుకుంది. (ఇప్పుడది రాజా శివాజీ స్కూలు). మేధ టీచర్లకు ఆమె అంటే ఎంతో ఇష్టం. మేధలో సేవాభావాలు మొలకెత్తడానికి పుష్పాభావే అనే టీచరే కారణం. ప్రధానంగా తల్లిదండ్రుల ప్రభావం మేధపై ఎక్కువగా ఉంది. తండ్రి వసంత్ ఖనోల్కర్ స్వాతంత్య్ర సమరయోధుడు. సామాజిక కార్యకర్త. కార్మిక సంఘం నాయకుడు. తల్లి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. పోస్టు మాస్టర్‌గా రిటైర్ అయ్యారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు, రిటైర్ అయ్యాక కూడా ఆమె ఎన్నో సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ‘ఉమెన్ ఇన్ డిస్ట్రెస్’ అని మృణాల్ గోర్ సంస్థ ఒకటి ఉండేది. దాంతో పాటు, ‘స్వాధార్’ అనే సంస్థలో ఆమె పని చేశారు. మేధ తండ్రి కూడా 1999లో... ఆయన చనిపోయే ముందు వరకు సంఘహితం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇదంతా మేధ బాల్యపై ప్రభావం చూపింది. క్రమంగా ఆమెను ఉద్యమాల వైపు నడిపింది. విజ్ఞానం.. పోరాటానికి ఆయుధం ఉద్యమ జీవితం మేధను రాటు తేల్చింది. పోలీసులు, కేసు లు, ఆరోగ్యం దెబ్బతినడం.. వేటినీ లెక్క చేయలేదు తను. అనుకున్నది సాధించాలి. అదే లక్ష్యం. అదే ధ్యేయం. విద్య, విజ్ఞానం ఆమె చేపట్టిన ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలబడ్డాయి. టాటా ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మేధ వందల పుస్తకాలు చదివారు! ఉద్యమాలకు ప్రధాన శత్రువు.. చెడు రాజకీయం. ఆ చెడును.. సమాజంలోని మేధావుల, ఆలోచనాపరుల మద్దతుతో ఎదుర్కోగలిగారు మేధ. కానీ అది అంత తేలికైన విషయం కాదని ఈ యోధురాలికి ప్రతి సందర్భంలోనూ అర్థమౌతూనే ఉంది. అయినా.. ఈ జ్వాల ఆరేది కాదు. ఆమె దీక్ష చల్లారేదీ కాదు. మేధ రాజకీయాలు మేధా పాట్కర్ 2014 జనవరిలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆమె నేతృత్వంలోని ‘నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్’ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతునిచ్చింది. మేధ కూడా ఆ ఎన్నికల్లో ఈశాన్య ముంబై నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. 2015లో ఆమ్ ఆద్మీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మేధ అవార్డులు ♦ రైట్ లైవ్లీ అవార్డు ♦ గోల్డ్‌మన్ ఎన్విరాన్మెంట్ అవార్డు ♦ గ్రీన్ రాబిన్ అవార్డు ♦ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అవార్డు ♦ థామస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డు ♦ దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ♦ మమతా ఫూలె అవార్డు ♦ మదర్ థెరిస్సా అవార్డు మేధ ఉద్యమాలు నర్మద బచావో ఆందోళన్ (డ్యామ్ నిర్మాణాలకు వ్యతిరేకం) నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ (సామాజిక న్యాయం కోసం మేధ నెలకొల్పిన కూటమి) వరల్డ్ కమిషన్ ఆన్ డ్యామ్స్ (మేధ నేతృత్వంలోని కమిషన్) టాటా నానో ప్లాంట్, సింగూర్ (ప్లాంటు స్థాపనకు వ్యతిరేకం) లావాసా (మహారాష్ట్రలోని లావాసా సిటీ నిర్మాణానికి వ్యతిరేకం) గోలిబర్ కూల్చివేత (ముంబైలోని గోలిబర్ ప్రాంతంలో కూల్చివేతలకు నిరసన) హీరానందిని భూ కుంభకోణం (అక్రమ కట్టడాలపై న్యాయపోరాటం) కొవ్వాడ న్యూక్లియర్ ప్రాజెక్టు (భూసేకరణలపై నిరసన) -
తపతి... కురు మాత!
ఓ వింధ్య కొండమ్మ... ఓ సాత్పూర కోనమ్మ... రెండు వేల అడుగుల ఎత్తులో అలవోకగా జాలువార్చిన కొన్ని నీటి చుక్కలే నా ప్రయాణానికి తొలి అడుగులు. భారతమాత హృదయం నుంచి ఉద్భవించాను. నేను పుట్టిన ప్రదేశాన్ని ముల్తాయ్, మూల్తాపి అనీ పిలుస్తారు. నన్ను మాత్రం తపతి, తపి, తప్తి, తాపి... రకరకాలుగా పిలుస్తారు. నేను ఎంతటి వేసవి తాపాన్నయినా ఇట్టే తీరుస్తాను. నా తండ్రి సూర్యభగవానుడు. నేను చంద్రవంశ రాజు శన్వరుణ్ణి వివాహమాడాను. నాకు, శన్వరుడికి పుట్టిన బిడ్డకు ‘కురు’ అని పేరు పెట్టుకున్నాను. కురువంశానికి ఆద్యుడు నా కొడుకు కురుడే. మహాభారతాన్ని ఒక తాటి మీదకు తెచ్చిన రాజవంశం అది. దాయాదుల పోరుతో నిర్వంశం అయిన వంశం కూడా. అయినా పాండురాజు కుమారులు తాము వేరంటూ తమ తండ్రి పేరుతో కొనసాగారు కానీ, కౌరవులు, పాండవులు అందరూ నా తనయుడు కురుని పౌత్రులే. ఇంత గొప్ప రాజవంశానికి మూల మాతను కావడంతోనే హిందువులు నన్ను అంతగా ఆరాధిస్తారు. థాయ్‌ల్యాండ్ వాసులు కూడా ఓ నదికి నా పేరు పెట్టుకున్నారు. గంగా స్నానం, నర్మద దర్శనం వలన కలిగే పుణ్యం నన్ను స్మరించుకుంటేనే వస్తుందని నాకు మహోన్నతమైన స్థానాన్నిచ్చాయి మన పురాణాలు. పశ్చిమంగా సాగే ప్రయాణం! భరతమాత గుండెను స్పృశిస్తూ మొదలైన నేను పశ్చిమ ముఖంగా సాగిపోతుంటాను. భారతమ్మ ఒడి నుంచి ఎన్నో నదులు తూర్పు ముఖంగా సాగిపోతుంటాయి. గవిల్ఘర్ కొండల్లో పుట్టిన నేను నర్మదక్కయ్యతోపాటుగా పడమటి తీరాన్నే నా గమ్యం అనుకున్నాను. మా ఇద్దర్నీ చూసిన ‘మాహి’ కూడా మా మార్గాన్నే పట్టింది. నర్మదతోపాటుగా సాగుతున్న నా ప్రస్థానాన్ని సాత్పూర పర్వతాలు వేరు చేస్తుంటాయి. మధ్యప్రదేశానికి దక్షిణ ఆగ్నేయంగా నేను పుట్టిన ప్రదేశం దక్కన్కు ముఖద్వారం వంటిది. నా ప్రయాణం ఏడు వందల కిలోమీటర్లే. అయితే నలభైకి పైగా ఉపనదులు నాతో జతకట్టి నన్ను పరిపుష్టం చేస్తూ ఉంటాయి. దాంతో భారతదేశం భూభాగంలో రెండు శాతం మేర నేలను నా ప్రవాహమే ఆక్రమించుకుంటోంది. అబ్బో! నాకెన్ని ఉపనదులో!! మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా ముల్తాయ్‌లో పుట్టిన నాకు అదే జిల్లాలో మచ్నా, సంపనా నదులు తోడవుతాయి. ఆ తర్వాత మిగిలినవన్నీ పలుకరిస్తూ గుజరాత్ రాష్ట్రంలో సూరత్‌కి చేరేటప్పటికి ‘నేసు’ కలిసి అరేబియా సముద్రం ఇక ఎంతో దూరం లేదని చెబుతుంది. ఇక్కడ నేల నన్ను సునాయాసంగా సాగరంలో కలవనివ్వదు. ఎత్తుపల్లాలుగా ఉండి నా ప్రయాణాన్ని వెక్కిరిస్తుంటుంది. సాగర ఘోష వినిపిస్తూనే ఉంటుంది. ఎప్పడెప్పుడు చేరుకుందామా అనే ఉబలాటంతో పాయలుగా చీలి పలుచబడుతూ పల్లానికి జారిపోతూంటాను. నా కోసం వెతికే వారి దాహార్తిని తీర్చడానికి అక్కడక్కడా చెలమలుగా నిలిచి పోతాను. ఏది ఏమైనా నీటిని వినియోగించుకోవడం పాశ్చాత్యులకు తెలిసినంతగా భారతీయులకు తెలియదు. నా పాయల మధ్యలో ఆంగ్లో - పోర్చుగీసు కాలనీలు వచ్చిన తర్వాతనే నాకూ ఆ సంగతి తెలిసింది. దక్షిణాదికి దారి... బుర్హాన్పూర్లో పురాతన కాలంలో పాళీ భాషలో రాసిన బౌద్ధ శాసనాలను చూశాను. బుర్హాన్పూర్ పట్టణానికి 20 కిమీల దూరంలో ఆసిర్గఢ్ కోట కోసం పునాదులు తీయడాన్ని చూశాను. హూణుల దాడులను, ఆశా ఆహిర్ పాలనను చూశాను. గుజరాత్‌ను ఆక్రమించుకున్న తర్వాత హుమాయూన్ ఆసిర్గఢ్ కోటను సందర్శించడం నా కళ్ల ముందే జరిగింది. దక్షిణాదికి ముఖద్వారం ఇదేనంటూ దక్కను మీద దృష్టి పెట్టడం వంటి ఎన్నో చారిత్రక ఘట్టాలకు, వ్యూహాలకు ప్రత్యక్ష సాక్షిని. మరికొంత ముందుకెళ్తే కేదారేశ్వర్లో పురాతన శివాలయం, జల్గావ్లో ఛంగ్దేవ్లో ఛంగ్దేవ్ మహారాజ్ ఆలయాలను చూస్తుంటే నాటి గిరిజన సంస్కృతి, అడవి తల్లిని ఆశ్రయించిన వారి జీవనశైలి కళ్ల ముందు మెదులుతుంటాయి. గోండులు, కోర్కులు, కుర్మీలు, బోయలు, మెహరులు, కుంబిలు, చామరులు, బాణుల వంటి అడవిపుత్రులతోపాటు రాజపుత్రులు కూడా నా తీరాన్నే సంతోషంగా జీవించేవారు. మధ్యప్రదేశ్ దాటి మహారాష్ట్రలోకి అడుగుపెడుతుంటే అమరావతి జిల్లాలో మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ పలకరిస్తుంది. మూడో నంబరు జాతీయ రహదారికి అడ్డుగా ప్రయాణిస్తున్నానని నా మీద ‘ధులే’ దగ్గర ‘సావాల్దే’ వంతెన కట్టారు. అలాగే భుస్వాల్ దగ్గర ‘భుస్వాల్ - ఖాండ్వా’ రైల్వే వంతెన కూడా కట్టేశారు. ‘హమ్మయ్య! ఇక నేనెవరి ప్రయాణానికీ అడ్డుగా లేను’ అనుకునే లోపు హత్నూర్ డ్యామ్, ఉకై డ్యామ్‌లు... నాకు దాహార్తిని తీర్చి, పంటలను సస్యశ్యామలం చేయడంతోపాటు జలవిద్యుత్తుతో వెలుగునిచ్చే శక్తి కూడా ఉందని చెప్పాయి. సూరత్‌లో అడుగుపెడితే పరిశ్రమలే పరిశ్రమలు. ఎస్సార్ స్టీల్, రిలయెన్స్, ఓఎన్జిసి, ఎల్ అండ్ టి, గెయిల్, క్రిభ్కో, షెల్, ఎన్టిపిసి, జిఎస్‌పిసి, టొరంట్ పవర్ యూనిట్లు... ప్రపంచం అంతా నా కళ్ల ముందే ఉందన్నంత భరోసానిస్తుంటాయి. వజ్రాలు, దుస్తుల దుకాణాలైతే 60 వేలు... ఇంతటి భాగ్యాన్ని చూసి నా కళ్లు మిరుమిట్లు గొలుపుతాయో ఏమో వర్షాకాలంలో ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగి ఆరు లక్షల క్యూసెక్కుల నీటితో నగరాన్ని ముంచెత్తుతుంటాను. నా అల్లరిని అదుపు చేయడానికి వరదల నుంచి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు మొదలవుతున్నాయి. నా పేరుతో ఓ రైలు నడుస్తోంది తెలుసా? ఆ రైలు ప్రయాణం నిడివి 1726 కి.మీ.లు. నాకంటే ఎక్కువ దూరమే ప్రయాణిస్తోంది. నేను మధ్యప్రదేశ్‌లో పుట్టి మహారాష్ట్రను పలకరించి గుజరాత్ వరకు ప్రయాణిస్తుంటే నా పేరుతో నడిచే రైలు బీహార్‌లోని సూరాన్ జిల్లాలో మొదలై ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మీదుగా గుజరాత్ వరకు ప్రయాణిస్తుంది. నాలాగే ఆ రైలు ప్రయాణం కూడా సూరత్ వరకే. అదిగో... మాటల్లోనే గల్ఫ్ ఆఫ్ కాంబాత్ వచ్చింది. సముద్రపు ఆటుపోట్లకు డాల్ఫిన్లు ఎదురొస్తున్నాయి. అలలు ఆత్మీయంగా వచ్చి పాదాలు తాకుతున్నాయి. అరబిక్ కడలి తీరం ఎంత అందంగా ఉంటుందో వర్ణించడానికి మాటలు చాలవు. నేను ఇంతగా పరుగులు తీసింది ఈ సౌందర్యాన్ని చూడడానికే. ప్రెజెంటేషన్: వాకా మంజులారెడ్డి జన్మస్థానం మధ్యప్రదేశ్ రాష్ట్రం, బేతుల్ జిల్లాలోని ముల్తాని. సాత్పూర పర్వత శ్రేణులు సంగమస్థానం గుజరాత్ రాష్ట్రం, సూరత్ జిల్లా, గల్ఫ్ ఆఫ్ కాంబాత్ (దుమాస్) ప్రవాహదూరం 724 కి.మీ.లు -
కేంద్రంలో బీజేపీదే అధికారం
సత్తుపల్లి, న్యూస్‌లైన్: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీదే అధికారమని, నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేయాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా పెరుగుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అన్నారు. సత్తుపల్లిలో ఆదివారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాలకు తోడు, గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడి అందించిన ఆదర్శవంతమైన పాలనతో ఆయనకు ప్రజాదరణ పెరిగిందన్నారు. మోడి ప్రధానమంత్రి అయితే దేశ స్థితిగతులు మార్చి ఉన్నత భారతాన్ని ఇస్తారని ప్రజలు భావిస్తున్నారన్నారు. పార్టీని బూత్‌స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి పోలింగ్ కేంద్రానికి కార్యకర్త నినాదంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో పోలింగ్ ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తి చేస్తామన్నారు. గుజరాత్‌లోని నర్మద నది ఒడ్డున ఏర్పాటు చేయనున్న సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహ పనుల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. వల్లభాయ్‌పటేల్ రాష్ట్రీయ ఏక్తాట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో రైతులు వాడిన వ్యవసాయ పనిముట్లు, మట్టిని సేకరించి, గ్రామస్తుల సంతకాలను సేకరించే బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గల్లా సత్యనారాయణ, కిసాన్ ముక్తి మోర్చా రాష్ట్ర కార్యదర్శి దుగ్గి అప్పిరెడ్డి, సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ బాలకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ వందనపు భాస్కర్‌రావు, నాగేంద్ర కుమార్, దీన్దయాళ్రెడ్డి, గొర్ల మంగతాయారు, గండ్ర సరోజిని పాల్గొన్నారు. -
కోటితీర్థాల పుణ్యఫలం...ఓంకారేశ్వర దర్శనం
ఓంకారక్షేత్రాన ఉన్న లింగం చాలా పెద్దది. నల్లరాతితో మలచినది. ఈ క్షేత్రాన్ని దేవలోకమని కూడా పిలుస్తారు. ఓంకారేశ్వర క్షేత్రంలో ప్రదక్షిణలు చేస్తే కైలాస ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రతీతి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో నాల్గవది ఓంకారేశ్వరం. ఇది అతిపురాతనమైనదే కాదు, శివలీలా విశేషాలతో పునీతమైన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ నర్మదానది నర్మద, కావేరి అనే రెండు పాయలుగా ప్రవహిస్తోంది. అంటే నర్మద, కావేరి నదుల సంగమస్థానమన్నమాట. ఈ రెండుపాయల నడుమ ఉన్న ప్రదేశాన్ని ‘మాంధాతృపురి’, ‘శివపురి’ అనే పేర్లతో పిలుస్తారు. మాంధాత కట్టించిన శివాలయం, ఇతరాలయాలను ఆకాశం నుంచి చూస్తే ‘ఓంకారాకారంలో కనిపిస్తాయి. అందువల్ల ఈ స్వామికి ఓంకారేశ్వరుడని పేరు వచ్చింది. భక్తుల మలినాలు తొలగించేవాడు కనుక అమలేశ్వరుడని కూడా అంటారు. కావేరి, నర్మద నదుల సంగమస్థానంలో ఉన్న దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న ఓంకారేశ్వరుని లీలావిశేషాలు అపూర్వమైనవి. నర్మద నదీమతల్లి ఇక్కడ మూడు క్షేత్రాలకు నిలయంగా భాసిల్లుతోంది. ఉత్తరం ఒడ్డున శివపురి ఉంది. దానిని శివనగరమంటారు. ఈ శివపురిలోనే ఓంకారేశ్వరుని జ్యోతిర్లింగ మందిరం, దక్షిణభాగాన బ్రహ్మదేవుని మందిరం ఉన్నాయి. ఈ భాగంలోనే మరోవైపున విష్ణుపురి ఉంది. ఇక్కడ శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నాడు. విష్ణుపురికి, బ్రహ్మపురికి మధ్యన గోముఖ్ ఘాట్ ఉంది. ఈ ఘాట్‌లోని జలాలు అత్యంత పవిత్రమైనవిగా చెబుతారు. గోముఖ్ఘాట్కి సంబంధించిన ఓ పవిత్రధార నర్మదానదిలో కలుస్తుంది. ఆ కారణంగా దీనిని కపిల సంగమం అని పిలుస్తారు. ఓంకారేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో కోటితీర్థం ఉంది. ఈ తీర్థంలో స్నానం చేసి, ఓంకారేశ్వరుడిని దర్శించుకుంటే కోటితీర్థాల దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. కావేరి, నర్మద నదుల సంగమస్థానాన్ని మాంధాత ద్వీపమని కూడా పిలుస్తారు. రాజు మాంధాత శివభక్తుడు. ఓ రోజున శివనామస్మరణ చేస్తూ ప్రస్తుతం ఉన్న ఓంకారేశ్వరక్షేత్రానికి వచ్చాడు. ఆ పర్వతం ఓం ఆకారంలో దర్శనమివ్వడంతో మాంధాత ఆ పర్వతాన్ని వేదికగా చేసుకుని శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ఆ తపస్సుకు సంతోషించి మాంధాతకు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. మాంధాత శివుని ఆ క్షేత్రంలో శాశ్వతంగా కొలువుండమని కోరాడు. శివుడు అందుకు అంగీకరించి ఆనాటినుంచి ఈ పర్వతంమీద కొలువై ఉన్నాడని పురాణ కథనం. సుమారు రెండువేల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్న ఈ క్షేత్రం అలనాటి రాజుల శిల్పకళాభిరుచికి నిదర్శనంగా నిలుస్తోంది. మౌర్యులు, గుప్తులు, పరమార రాజుల పాలనలో ఈ క్షేత్రం ఎంతో వైభవంగా వెలుగొందింది. ఓంకారేశ్వరదర్శనం బహుజన్మల పాపాలను ప్రక్షాళనం చేస్తుందని, ఇక్కడి స్వామిని బిల్వదళాలతో పూజిస్తే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. అమ్మవారు ఓంకారేశ్వరిగా వెలుగొందుతోంది. ఇక్కడ నర్మదామందిరం చూడదగ్గది. స్వామిపాదాల చెంతనే తానెప్పుడూ ఉండాలని కోరుకున్న నర్మదానది, శివసాక్షాత్కారంతో ఆ వరం పొంది ఓంకారేశ్వర క్షేత్రంలో ప్రవహిస్తోందని స్థలపురాణం చెబుతోంది. నర్మదామాత మందిరానికి సమీపంలో రాజామాంధాత మందిరం కూడా ఉంది. ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని మూడు విభాగాలుగా విభజించవచ్చు. మొదటిమందిరంలో ఓంకారేశ్వర స్వామి, రెండోవిభాగంలో జుంకేశ్వరస్వామి కొలువుదీరారు. మూడవది మహాకాల్ మందిరం. అతిపురాతనమైన ఈ ఆలయాలలో పిండిరూపంలో, లింగరూపంలో ఉన్న రెండు ఆలయాలు దర్శనమిస్తాయి. ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి ఎదురుగా భగవాన్ శంకరుడు కొలువైన ఓ పాతాళగృహం దర్శనమిస్తుంది. ఇక్కడ శంకరుడు, నాగేంద్రుడు, పార్వతి అమ్మవార్లను దర్శించుకోవచ్చు. ఇక్కడే మరోచోట సిద్ధేశ్వర స్వామి మందిరం ఉంది. ఈ సిద్ధేశ్వర స్వామికి సమీపంలో కొలువుదీరిన కేదారేశ్వరస్వామిని దర్శించుకుంటే కేదారనాథ్ వెళ్లినంత పుణ్యం లభిస్తుందట. ఓంకారక్షేత్రాన ఉన్న లింగం చాలా పెద్దది. అమలేశ్వర లింగం చిన్నది. అమ్మవారు అన్నపూర్ణాంబ. ఈ రెండు లింగాలను ఒకేస్వామిగా భావిస్తారు. ఈ క్షేత్రాన్ని దేవలోకమని కూడా పిలుస్తారు. ఓంకారేశ్వర క్షేత్రంలో ప్రదక్షిణలు చేస్తే కైలాస ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రతీతి. ఈ యాత్రాసందర్శనం వల్ల మానస సరోవర యాత్రాసందర్శనం చేసినంత ఫలం లభిస్తుందని, ఇక్కడ గల నర్మదానదిలో స్నానం చేసి, నర్మదామాతను పూజించిన వారికి శివసాక్షాత్కారం కలుగుతుందని పురాణోక్తి. కార్తీక, మాఘమాసాలలో ఇక్కడ చేసే జపతపాలు అఖండ పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని స్థలమాహాత్మ్యం చెబుతోంది. ఈశ్వరునికి ప్రీతిపాత్రమైన ఈ క్షేత్రంలో చేసే ఎలాంటి దానమైనా ఆయన కటాక్షానికి నోచుకుంటుందని ప్రతీతి. ఇండోర్నుంచి 77 కిలోమీటర్లు, మాంధాత రైల్వే స్టేషన్ నుంచి 12 కిలోమీటర్లు, ఉజ్జయిని నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో భక్తులకు అవసరమైన భోజన, వసతి సదుపాయాలు లభిస్తాయి. - దాసరి దుర్గాప్రసాద్ -
'సర్ధార్ పటేల్ విగ్రహనికి గురువారం భూమి పూజ'
భారత మొట్టమొదటి హోం శాఖ మంత్రి, ఉక్కుమనిషి సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహా ఏర్పాటుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ గురువారం నర్మదా నదీ తీరంలో భూమి పూజ నిర్వహిస్తారని ఆ విగ్రహ కమిటీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. సర్థార్ పటేల్ 138వ జయంతి సందర్బంగా ఆ విగ్రహ ఏర్పాటుకు గుజరాత్ ప్రభుత్వం నడుంబిగించిందని తెలిపారు. ఆ విగ్రహనికి స్టాట్యు ఆఫ్ యూనిటీగా నామకరణం చేసినట్లు వివరించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టిస్తుందన్నారు. దేశంలోని దాదాపు 7 లక్షల గ్రామాలకు చెందిన రైతులు ఆ విగ్రహం కోసం ఉక్కును విరాళంగా అందజేశారన్నారు. ఆ విగ్రహ ఏర్పాటులో అయా గ్రామల ప్రజల పాత్ర మరువలేనిదని డా. లక్ష్మణ్ ఈ సందర్బంగా పేర్కొన్నారు.