కోటితీర్థాల పుణ్యఫలం...ఓంకారేశ్వర దర్శనం | Omkareshwar kotitirthala personal ... view | Sakshi
Sakshi News home page

కోటితీర్థాల పుణ్యఫలం...ఓంకారేశ్వర దర్శనం

Published Sun, Dec 1 2013 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM

కోటితీర్థాల పుణ్యఫలం...ఓంకారేశ్వర దర్శనం

కోటితీర్థాల పుణ్యఫలం...ఓంకారేశ్వర దర్శనం

ఓంకారక్షేత్రాన ఉన్న లింగం చాలా పెద్దది. నల్లరాతితో మలచినది. ఈ క్షేత్రాన్ని దేవలోకమని కూడా పిలుస్తారు. ఓంకారేశ్వర క్షేత్రంలో ప్రదక్షిణలు చేస్తే కైలాస ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రతీతి.
 
 ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో నాల్గవది ఓంకారేశ్వరం. ఇది అతిపురాతనమైనదే కాదు, శివలీలా విశేషాలతో పునీతమైన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ నర్మదానది నర్మద, కావేరి అనే రెండు పాయలుగా ప్రవహిస్తోంది. అంటే నర్మద, కావేరి నదుల సంగమస్థానమన్నమాట. ఈ రెండుపాయల నడుమ ఉన్న ప్రదేశాన్ని ‘మాంధాతృపురి’, ‘శివపురి’ అనే పేర్లతో పిలుస్తారు. మాంధాత కట్టించిన శివాలయం, ఇతరాలయాలను ఆకాశం నుంచి చూస్తే ‘ఓంకారాకారంలో కనిపిస్తాయి. అందువల్ల ఈ స్వామికి ఓంకారేశ్వరుడని పేరు వచ్చింది. భక్తుల మలినాలు తొలగించేవాడు కనుక అమలేశ్వరుడని కూడా అంటారు.
 
కావేరి, నర్మద నదుల సంగమస్థానంలో ఉన్న దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న ఓంకారేశ్వరుని లీలావిశేషాలు అపూర్వమైనవి. నర్మద నదీమతల్లి ఇక్కడ మూడు క్షేత్రాలకు నిలయంగా భాసిల్లుతోంది. ఉత్తరం ఒడ్డున శివపురి ఉంది. దానిని శివనగరమంటారు. ఈ శివపురిలోనే ఓంకారేశ్వరుని జ్యోతిర్లింగ మందిరం, దక్షిణభాగాన బ్రహ్మదేవుని మందిరం ఉన్నాయి.

ఈ భాగంలోనే మరోవైపున విష్ణుపురి ఉంది. ఇక్కడ శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నాడు. విష్ణుపురికి, బ్రహ్మపురికి మధ్యన గోముఖ్ ఘాట్ ఉంది. ఈ ఘాట్‌లోని జలాలు అత్యంత పవిత్రమైనవిగా చెబుతారు. గోముఖ్‌ఘాట్‌కి సంబంధించిన ఓ పవిత్రధార నర్మదానదిలో కలుస్తుంది. ఆ కారణంగా దీనిని కపిల సంగమం అని పిలుస్తారు. ఓంకారేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో కోటితీర్థం ఉంది. ఈ తీర్థంలో స్నానం చేసి, ఓంకారేశ్వరుడిని దర్శించుకుంటే కోటితీర్థాల దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుందని పురాణాల ద్వారా అవగతమవుతోంది.
 కావేరి, నర్మద నదుల సంగమస్థానాన్ని మాంధాత ద్వీపమని కూడా పిలుస్తారు.

రాజు మాంధాత శివభక్తుడు. ఓ రోజున శివనామస్మరణ చేస్తూ ప్రస్తుతం ఉన్న ఓంకారేశ్వరక్షేత్రానికి వచ్చాడు. ఆ పర్వతం ఓం ఆకారంలో దర్శనమివ్వడంతో మాంధాత ఆ పర్వతాన్ని వేదికగా చేసుకుని శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ఆ తపస్సుకు సంతోషించి మాంధాతకు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. మాంధాత శివుని ఆ క్షేత్రంలో శాశ్వతంగా కొలువుండమని కోరాడు. శివుడు అందుకు అంగీకరించి ఆనాటినుంచి ఈ పర్వతంమీద కొలువై ఉన్నాడని పురాణ  కథనం. సుమారు రెండువేల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్న ఈ క్షేత్రం అలనాటి రాజుల శిల్పకళాభిరుచికి నిదర్శనంగా నిలుస్తోంది.

మౌర్యులు, గుప్తులు, పరమార రాజుల పాలనలో ఈ క్షేత్రం ఎంతో వైభవంగా వెలుగొందింది. ఓంకారేశ్వరదర్శనం బహుజన్మల పాపాలను ప్రక్షాళనం చేస్తుందని, ఇక్కడి స్వామిని బిల్వదళాలతో పూజిస్తే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. అమ్మవారు ఓంకారేశ్వరిగా వెలుగొందుతోంది.

 ఇక్కడ నర్మదామందిరం చూడదగ్గది. స్వామిపాదాల చెంతనే తానెప్పుడూ ఉండాలని  కోరుకున్న నర్మదానది, శివసాక్షాత్కారంతో ఆ వరం పొంది ఓంకారేశ్వర క్షేత్రంలో ప్రవహిస్తోందని స్థలపురాణం చెబుతోంది. నర్మదామాత మందిరానికి సమీపంలో రాజామాంధాత మందిరం కూడా ఉంది.
 
ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని మూడు విభాగాలుగా విభజించవచ్చు. మొదటిమందిరంలో ఓంకారేశ్వర స్వామి, రెండోవిభాగంలో జుంకేశ్వరస్వామి కొలువుదీరారు. మూడవది మహాకాల్ మందిరం. అతిపురాతనమైన ఈ ఆలయాలలో  పిండిరూపంలో, లింగరూపంలో ఉన్న రెండు ఆలయాలు దర్శనమిస్తాయి. ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి ఎదురుగా భగవాన్ శంకరుడు కొలువైన ఓ పాతాళగృహం దర్శనమిస్తుంది. ఇక్కడ శంకరుడు, నాగేంద్రుడు, పార్వతి అమ్మవార్లను దర్శించుకోవచ్చు. ఇక్కడే మరోచోట సిద్ధేశ్వర స్వామి మందిరం ఉంది. ఈ సిద్ధేశ్వర స్వామికి సమీపంలో కొలువుదీరిన కేదారేశ్వరస్వామిని దర్శించుకుంటే కేదారనాథ్ వెళ్లినంత పుణ్యం లభిస్తుందట.
 
ఓంకారక్షేత్రాన ఉన్న లింగం చాలా పెద్దది. అమలేశ్వర లింగం చిన్నది. అమ్మవారు అన్నపూర్ణాంబ. ఈ రెండు లింగాలను ఒకేస్వామిగా భావిస్తారు. ఈ క్షేత్రాన్ని దేవలోకమని కూడా పిలుస్తారు. ఓంకారేశ్వర క్షేత్రంలో ప్రదక్షిణలు చేస్తే కైలాస ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రతీతి. ఈ యాత్రాసందర్శనం వల్ల మానస సరోవర యాత్రాసందర్శనం చేసినంత ఫలం లభిస్తుందని, ఇక్కడ గల నర్మదానదిలో స్నానం చేసి, నర్మదామాతను పూజించిన వారికి శివసాక్షాత్కారం కలుగుతుందని పురాణోక్తి. కార్తీక, మాఘమాసాలలో ఇక్కడ చేసే జపతపాలు అఖండ పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని స్థలమాహాత్మ్యం చెబుతోంది. ఈశ్వరునికి ప్రీతిపాత్రమైన ఈ క్షేత్రంలో చేసే ఎలాంటి దానమైనా ఆయన కటాక్షానికి నోచుకుంటుందని ప్రతీతి.
 
ఇండోర్‌నుంచి 77 కిలోమీటర్లు, మాంధాత రైల్వే స్టేషన్ నుంచి 12 కిలోమీటర్లు, ఉజ్జయిని నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో భక్తులకు అవసరమైన భోజన, వసతి సదుపాయాలు లభిస్తాయి.

 - దాసరి దుర్గాప్రసాద్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement