అదిగో...మహిష్మతి | Standing on the banks of the Narmada river, the castle ahilyabayi | Sakshi
Sakshi News home page

అదిగో...మహిష్మతి

Published Tue, Dec 27 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

అహిల్యాబాయి హోల్కర్‌ కోట

అహిల్యాబాయి హోల్కర్‌ కోట

యాత్ర

మహిష్మతి రాజ్యాన్ని ‘బాహుబలి’ సినిమాలో చూసి ఉంటారు. ఆ పేరున్న పట్టణాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌కి వెళ్లాలి. నగిషీలు చెక్కిన ప్రాకారాలు, ఠీవీగా నిల్చున్న కోటగోడలు చుట్టూ ఉండగా మధ్యన నందీశ్వరుడితో సహా కొలువుదీరాడు మహేశ్వరుడు. నిత్యం శివార్చనతో ప్రశాంతమైన నర్మదానది ప్రణమిల్లగా మన అంతఃచేతనంలో పరవశాలను నింపుతూ దర్శనమిస్తాడు మహేశ్వరుడు. ఆయన పేరు మీదుగానే ‘మహేశ్వర్‌’ అని పట్టణ నామం స్థిరపడింది. అలా అక్కడ భక్తులకు అనంతమైన ఆశీస్సులను మహేశ్వరుడు అందిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఖార్గోన్‌ జిల్లాలో ఉందీ మహేశ్వర్‌ పట్టణం. ఆగ్రా–ముంబై వెళ్లే 3వ నెంబర్‌ జాతీయ రహదారికి కేవలంS13 కిలోమీటర్లు, ఇండోర్‌ నుంచి 91 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణానికి లెక్కలకందని విశిష్టతలెన్నో ఉన్నాయి.

శరీరానికి హృదయం దేవాలయం ఎలాగో సుసంపన్నమైన మహేశ్వర్‌ కోటకు హృదయం మహేశ్వరుడి మందిరం. ఈ కోట అహిల్యాబాయి హోల్కర్‌ కోటగా కూడా ప్రసిద్ధి. 18వ శతాబ్దిలో మరాఠా రాణి, రాజమాత అహిల్యా బాయి హోల్కర్‌ తన భర్త మరణా నంతరం మహేశ్వర్‌ ఆలయాన్ని నడిబొడ్డుగా చేసుకొని దుర్భేద్యమైన కోటను నిర్మించారు. ఇక్కడ నుంచే మాళవ (మాల్వా) దేశాన్ని ఆమె పరిపాలించారు. శివ భక్తురాలైన అహిల్యా దేవి ఎన్నో శివాలయాలను పునరుద్ధరించారు. వాటిలో గుజరాత్‌లోని ద్వారక, సోమనాథ్, కాశీ విశ్వనాథ్‌ మందిరం, ఉజ్జయిని, నాసిక్, విష్ణుపాద మందిర్, గయ.. ఆలయాల లాంటివి ఎన్నో ఉన్నాయి. వీటితో పాటు నర్మదానది ఒడ్డున ఎన్నో దేవాలయాలు, ఘాట్లను నిర్మింపజేశారు. నర్మదానది ఒడ్డున నిల్చుని అహిల్యాబాయి కోట ఘాట్లను వీక్షిస్తుంటే ప్రసిద్ధ చిత్రకారుడు కాన్వాస్‌ మీద అందమైన చిత్రాలను తీర్చిదిద్దినట్టుగా దర్శనమిస్తుంది ఈ ప్రాంతం.

రామాయణ కాలం నాటి సామ్రాజ్యం
మహేశ్వర్‌ ప్రాచీన నామం మహిష్మతి. రామాయణ, మహాభారతాలలో ఈ మహిష్మతి సామ్రాజ్య ప్రస్తావన ఉంది. అంటే, రామాయణ కాలం నాటి కన్నా ముందే ఈ రాజ్యం ఉందన్నమాట. నర్మదా నదికి సమీపంలో ఉన్న సహస్రార్జున మందిరాన్ని సందర్శిస్తే అలనాటి విశేషాలు కళ్లకు కడతాయి. గోపురాలు నాటి కథలు చెబుతాయి. ఈ ప్రాచీన పట్టణాన్ని సోమవంశ సహస్రార్జున క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు తన రాజ్యానికి రాజధానిగా చేసుకొని, పరిపాలించేవాడు. ఇతడినే శ్రీ సహస్రార్జున అనేవారు. ఇతని గురించి మన ఇతిహాసాలలో గొప్ప ప్రస్తావన ఉంది.

ఒక రోజు సహస్రార్జునుడు తన 500 మంది భార్యలతో నదీ తీరానికి వాహ్యాళికి వెళ్లాడట. అయితే, 500 మంది భార్యలు ఉల్లాసంగా ఆడుకోవడానికి అనువైన ప్రాంతం కనిపించక, ప్రవహించే పవిత్ర నర్మదానదిని తన వెయ్యి బాహువులతో నిలువరించాడట. విశాలమైన ఆ నర్మదానదీ మైదానంలో అందరూ ఆనందంగా విహరిస్తున్న సమయంలో రావణాసురుడు ఆకాశమార్గాన పుష్పకవిమానంలో వెళుతూ, ఈ ప్రాంతంలో దిగాడట. నదీ మైదానం విశాలంగా కనిపించడంతో ఇసుకతో చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించి, పూజలు ప్రారంభించాడట. సహస్రార్జునుడి భార్యలు ఆటలు ముగించి, నది ఒడ్డుకు చేరుకోవడంతో అతను నెమ్మదిగా నీటిని విడుదల చేశాడట.

ఇప్పటికీ అవే 11 అఖండ దీపాలు
దీంతో రావణుడు ప్రతిష్ఠించిన ఇసుక శివలింగాన్ని నర్మదానది నీరు తుడిచిపెట్టేసుకుంటూ వెళ్ళింది. రావణుడు ఆగ్రహించాడు. సహస్రార్జునుడితో యుద్ధానికి దిగాడట. çసహస్రార్జునుడు తన వెయ్యి బాహువులతో రావణుడిని ఓడించి, అతడిని కట్టేసి, పది తలల మీద పది దీపాలు, కట్టేసిన రెండు చేతుల మధ్య మరో దీపం ఉంచి తన ఇంటికి బందీగా తీసుకెళ్లాడు. తన కొడుకు ఊయలను రావణాసురుడితో ఊపించి, ఆ తర్వాత వదిలేశాడట. ఇప్పటికీ మహేశ్వర్‌లోని సహస్రార్జున దేవాలయంలో 11 అఖండ దీపాలు నాటి నుంచి నేటి వరకు వెలుగుతూనే ఉండటం విశేషం.

అలాగే, అగ్నిదేవుని కృప ఈ పట్టణానికి రక్షగా ఉందని ఎన్నో కథనాలున్నాయి. సహస్రార్జునుడి తదనంతరం నిషాద రాజ్యం రాజు నిల మహిష్మతి రాజ్యాన్ని చేజిక్కించుకుని పరిపాలించాడు. కురుక్షేత్రయుద్ధం ముగిశాక ధర్మరాజు రాజయ్యాడు. భూమినంతా జయించడానికి యాగాన్ని ప్రారంభించాడు. అంతా ఆక్రమించుకున్నా, మహిష్మతి మాత్రం వీరి హస్తగతం కాలేదు. ధర్మరాజు తమ్ముడు సహదేవుడు అగ్నిదేవుడి రక్షణ వల్లే మహిష్మతి తమ హస్తగతం కావడం లేదని గుర్తించాడు. అగ్నిని ప్రసన్నం చేసుకుని, మహిష్మతిని తమ రాజ్యంలో కలిపేసుకున్నారు పాండవులు. అలా ఆర్యావర్తంలో మహిష్మతి ఈశ్వరుడి నామంతో మహేశ్వర్‌గా రూపుమార్చుకుంది.

దేవాలయాల రాజ్యం
సహస్రార్జునుడి మందిరం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. కాగా ఈ ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వర మందిరం, కాశీ విశ్వనాథ, చతుర్భుజి నారాయణ, అహిల్యామాత, చింతామణి గణపతి, పండరినాథ్, భవానీ మాత, గోబర్‌ గణేశ్, అనంత్‌నారాయణ, ఖేడాపతి హనుమాన్, రామ– కృష్ణ, నర్సింగ్, కాళేశ్వర, జ్వాలేశ్వర మందిరాలున్నాయి. బాణేశ్వర్‌ శివ మందిరం నర్మదానది మధ్యలో ఉంటుంది. దీని వల్ల ఈ మందిరం ఓ ద్వీపంలో ఉన్నట్టు గోచరిస్తుంది.

వింధ్యవాసినీ శక్తిపీఠం
మహేశ్వర్‌లోని వింధ్యవాసినీ భవాని శక్తిపీఠాలలో ఒకటి అంటారు. ఏక్‌ ముఖి దత్త మందిరాన్ని ఇక్కడ కొత్తగా నిర్మించారు. దీన్ని శివదత్త ధామంగా పిలుస్తారు. 30 ఎకరాలలో సువిశాలంగా నిర్మించారు. జగద్గురు కృపాళూజీ మహారాజ్‌ వేవేల విధాలుగా మహేశ్వర్‌ దేవాలయాన్ని కీర్తిస్తూ అఖండ సంకీర్తనల్ని వెలువరించారు. జీవితమంతా మహేశ్వర్‌లోనే ఉన్నారు.   

ఉత్సవాల కోలాహలం
అహిల్యాబాయి కోటలో కొంత భాగాన్ని ప్రాచీన హోటల్‌గా మార్చారు. మహేశ్వర్‌లో నాగపంచమి, గుడి పడవా, తీజ్, శ్రావణమాసంలో అన్ని సోమవారాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. చివరి సోమవారం మాత్రం కాశీవిశ్వనాథుని పూజ జరిపి భంగు (గంజాయి) ప్రసాదంగా పంచుతారు. మహాశివరాత్రి, సమోటి అమావాస్య, ఇతర అన్ని పండగలు విశేషంగా జరుపుతారు. ప్రతి ఏటా సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం మహేశ్వర్‌లోని స్వాధ్యాయ భవన్‌ ఆశ్రమం మహా మృత్యుంజయ రథయాత్రను ప్రారంభిస్తుంది.

సినిమాలలో మహేశ్వర్‌!
నర్మద నదీ తీరప్రాంతమంతటా ఎన్నో ప్రకృతి అందాలు కొలువుదీరాయి. వీటిలో మహేశ్వర్‌లోని కోట ఘాట్లు, ప్రాకారాలు ప్రత్యేకమైనవి. ఈ కోట లోనూ, చుట్టుపక్కల ప్రాంతాలలో తరచూ హిందీ, తమిళ, కన్నడ సినిమాల చిత్రీకరణ జరుగుతుంటుంది. వీటిలో ప్రముఖంగా ఎ.ఆర్‌.రెహ్మాన్‌ మ్యూజిక్‌ వీడియో, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘నీర్జా’ సినిమాలు, చారిత్రక టీవీ సీరియల్స్‌ ఇక్కడే చిత్రీకరించారు. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడి వాతావరణం చలిగా, పొడిగా సందర్శనకు అనుకూలంగా ఉంటుంది.

దేశీయ చేనేత... మహేశ్వరి చీరలు
మహేశ్వర్‌ 5వ శతాబ్ది నుంచి చేనేతకు ప్రసిద్ధి గాంచింది. దేశంలోని చేనేతలలో ఉత్తమమైన వస్త్రంగా పేరొందింది. మహేశ్వర్‌ దేవాలయాన్ని సందర్శించి, విశేషాలు తెలుసుకోవడం ఒక ఎల్తైతే, ఆ పట్టణానికి మరో ప్రత్యేకత – రంగురంగుల మహేశ్వరి చీరలు. ఇవి కాటన్, పట్టులో లభిస్తాయి. చారలు, పువ్వుల అంచులతో చూడగానే ఆకట్టుకుంటాయి ఈ చీరలు.

మధ్యప్రదేశ్‌ టూరిజమ్‌ హనుమాంతియాలోని నర్మదానది డ్యామ్‌ బ్యాక్‌వాటర్‌లో ‘జల్‌ మహోత్సవ్‌’ పేరుతో రెండేళ్లుగా డిసెంబర్‌–జనవరి నెలల్లో ఉత్సవాలు జరుపుతోంది. ఈ సందర్భంగా హనుమాంతియాలోని టూరిస్ట్‌ కాంప్లెక్స్, మహేశ్వర్, ఓంకారేశ్వర్‌ల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. వివరాలకు: మధ్యప్రదేశ్‌ టూరిజమ్, టూరిస్ట్‌ ప్లాజా, బేగంపేట, హైదరాబాద్‌.9866069000 /9951080605లలో సంప్రతించవచ్చు.

ఇలా వెళ్లచ్చు!
హైదరాబాద్‌ నాంపల్లి, సికింద్రాబాద్‌ స్టేషన్‌ల నుంచి మ«ధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాకు రైలు సదుపాయం ఉంది. ఇక్కడ నుంచి మహేశ్వర్‌కు 120 కిలోమీటర్లు. రోడ్డుమార్గంలో వెళ్లడానికి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

ఇండోర్‌లో దేవీ అహిల్యాబాయి హోల్కర్‌ పేరున అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి మహేశ్వర్‌కి 95 కిలోమీటర్లు.

–  నిర్మల చిల్కమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement