సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఎక్సైజ్ శాఖ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ పవిత్ర నర్మద నదికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించేందుకు చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎక్సైజ్ అధికారులు మాత్రం ఆ నదిలోనే వందల లీటర్ల మద్యాన్ని గుమ్మరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులు డ్రమ్ముల్లో ఉన్న మద్యాన్ని నదిలో కలిపారు. ఈ ఘటన దార్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మిశ్రా మాట్లాడుతూ.. పవిత్ర నదిలో మద్యం కలపడం ద్వారా నేరానికి పాల్పడ్డారని విమర్శించారు. ఈ చర్య హిందువుల మత నమ్మకాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. నదిని కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులు వింత వాదనకు దిగారు. తమ సిబ్బంది ఎలాంటి మద్యాన్ని నదిలో కలపలేదని తెలిపారు. మద్యం తయారీలో ప్రాథమికంగా ఉపయోగించే పదార్థాన్ని మాత్రమే నది తీరంలో గుంటల్లో పూడ్చినట్టు పేర్కొన్నారు. నది పవిత్రత గురించి తమకు పూర్తి అవగాహన ఉందని.. తాము దానిని దెబ్బతీసేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment