ఆదాయం ఫుల్లు | 8000 Crores Income For Excise Department In Telangana | Sakshi
Sakshi News home page

ఆదాయం ఫుల్లు

Published Mon, Sep 28 2020 3:27 AM | Last Updated on Mon, Sep 28 2020 5:05 AM

8000 Crores Income For Excise Department In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది ఏప్రిల్‌ అంతా రాష్ట్రంలో వైన్‌ షాపులు లేవు.. బార్లు, క్లబ్బులు, పబ్బులు తెరుచు కోలేదు. మే 6న వైన్‌ షాపులు ఓపెన్‌ అయ్యాయి. బార్లు, క్లబ్బులు తెరుచుకునేందుకు 2 రోజుల క్రితమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాలుగైదు నెలలుగా లిక్కర్‌ అమ్మకాలు ఈ వైన్‌ షాపుల ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. అయినా... రాష్ట్రంలో మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కలిపి ఎక్సైజ్‌ శాఖకు వచ్చిన ఆదాయం అక్షరాలా.. ఏడు వేల తొమ్మిది వందల ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు. అంటే దాదాపు రూ.8 వేల కోట్లు. సగటున నెలకు రూ.2 వేల కోట్లు అన్నమాట. ఇదేదో అంచనా వేసిన లెక్క కాదు. జలగం సుధీర్‌ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు తెలంగాణ బ్రేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఇచ్చిన అధికారిక సమాధానం. అంటే కరోనా కాలంలోనూ నెలకు రూ.2 వేల కోట్ల మద్యం ఖాళీ చేశారు మన మందుబాబులు. 

ఏటేటా పెరుగుదల...
తెలంగాణ బ్రేవరేజెస్‌ కార్పొరేషన్‌ సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తే.. రాష్ట్రంలో ఎక్సైజ్‌ ఆదాయం ఏటేటా పెరిగిపోతోంది. 2017–18లో మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లోనూ ఎక్సైజ్‌ ఆదాయంలో వృద్ధి కనిపించింది. ఇక, ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే (మద్యం విక్రయాలు జరిగింది నాలుగు నెలలే) రూ.8 వేల కోట్ల వరకు రాబడి వచ్చింది. అంటే, రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది వచ్చిన మొత్తం ఆదాయం రూ.6,095.03 కోట్ల కంటే.. ఈ ఏడాది ఐదు నెలల్లో వచ్చిన ఆదాయమే ఎక్కువన్న మాట. ఇక, ఇదే ఒరవడి కొనసాగితే ఈ ఏడాది ఎక్సైజ్‌ ఆదాయం రూ.20 వేల కోట్లు దాటుతుందని అంచనా. బార్లు, క్లబ్బులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఒకట్రెండు రోజుల్లో అవి కూడా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించను న్నాయి. దీంతో మరికొంత ఆదాయం పెరుగుతుందని ఎక్సైజ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

చావుల్లేవ్‌...
ఇక, సమాచార హక్కు చట్టం కింద అడిగిన మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2014–15 నుంచి రాష్ట్రంలో మద్యం తాగి ఎవరూ చనిపోలేదని వెల్లడించింది. ఏ జిల్లాలోనూ ఇలాంటి మరణాలు సంభవించలేదని తెలిపింది. అదే విధంగా రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌లో మాత్రమే మద్యం నాణ్యతా పరీక్షల కోసం ప్రయోగశాలలున్నాయని, వీటి ద్వారా వచ్చిన అనుమతుల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు మద్యం సరఫరా చేస్తామని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా డీలర్ల నుంచి ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసి రిటైల్‌ విక్రయాల కోసం డిపోల ద్వారా పంపిణీ చేస్తుందని కూడా సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement