Huge income
-
టీటీడీ ఆదాయం అదుర్స్
-
ఆదాయం ఫుల్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్ అంతా రాష్ట్రంలో వైన్ షాపులు లేవు.. బార్లు, క్లబ్బులు, పబ్బులు తెరుచు కోలేదు. మే 6న వైన్ షాపులు ఓపెన్ అయ్యాయి. బార్లు, క్లబ్బులు తెరుచుకునేందుకు 2 రోజుల క్రితమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాలుగైదు నెలలుగా లిక్కర్ అమ్మకాలు ఈ వైన్ షాపుల ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. అయినా... రాష్ట్రంలో మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కలిపి ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఆదాయం అక్షరాలా.. ఏడు వేల తొమ్మిది వందల ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు. అంటే దాదాపు రూ.8 వేల కోట్లు. సగటున నెలకు రూ.2 వేల కోట్లు అన్నమాట. ఇదేదో అంచనా వేసిన లెక్క కాదు. జలగం సుధీర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు తెలంగాణ బ్రేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చిన అధికారిక సమాధానం. అంటే కరోనా కాలంలోనూ నెలకు రూ.2 వేల కోట్ల మద్యం ఖాళీ చేశారు మన మందుబాబులు. ఏటేటా పెరుగుదల... తెలంగాణ బ్రేవరేజెస్ కార్పొరేషన్ సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తే.. రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం ఏటేటా పెరిగిపోతోంది. 2017–18లో మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లోనూ ఎక్సైజ్ ఆదాయంలో వృద్ధి కనిపించింది. ఇక, ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే (మద్యం విక్రయాలు జరిగింది నాలుగు నెలలే) రూ.8 వేల కోట్ల వరకు రాబడి వచ్చింది. అంటే, రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది వచ్చిన మొత్తం ఆదాయం రూ.6,095.03 కోట్ల కంటే.. ఈ ఏడాది ఐదు నెలల్లో వచ్చిన ఆదాయమే ఎక్కువన్న మాట. ఇక, ఇదే ఒరవడి కొనసాగితే ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయం రూ.20 వేల కోట్లు దాటుతుందని అంచనా. బార్లు, క్లబ్బులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఒకట్రెండు రోజుల్లో అవి కూడా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించను న్నాయి. దీంతో మరికొంత ఆదాయం పెరుగుతుందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చావుల్లేవ్... ఇక, సమాచార హక్కు చట్టం కింద అడిగిన మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2014–15 నుంచి రాష్ట్రంలో మద్యం తాగి ఎవరూ చనిపోలేదని వెల్లడించింది. ఏ జిల్లాలోనూ ఇలాంటి మరణాలు సంభవించలేదని తెలిపింది. అదే విధంగా రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌లో మాత్రమే మద్యం నాణ్యతా పరీక్షల కోసం ప్రయోగశాలలున్నాయని, వీటి ద్వారా వచ్చిన అనుమతుల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు మద్యం సరఫరా చేస్తామని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా డీలర్ల నుంచి ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసి రిటైల్ విక్రయాల కోసం డిపోల ద్వారా పంపిణీ చేస్తుందని కూడా సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. -
రైలు టికెట్ రద్దు: మీకో షాకింగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: వెయిట్‌లిస్ట్ చేసిన టికెట్లను రద్దు చేయడం మర్చిపోయారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. భారతీయ రైల్వే కాన్సిలేషన్ టికెట్ల ద్వారా కోట్లాది రూపాయలను సంపాదించింది. వినడానికి ఆశ్చర్యంగా వున్నా.. రైల్వే ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లు రద్దు, లేదా రద్దు చేసుకోవడం మర్చిపోయిన టికెట్ల ద్వారా....అక్షరాల 9వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సొంతం చేసుకుంది. గత మూడు ఏళ్లలో దేశవ్యాప్తంగా వెయిటింగ్ లిస్టులో ఉండి రద్దు కాని టికెట్ల ద్వారా రూ. 9 వేల కోట్ల ఆదాయం వచ్చిందని స్వయంగా రైల్వే సమాచార సంస్థ కేంద్రం (సీఆర్ఐఎస్) వెల్లడించింది. రాజస్థాన్ కోటాకు చెందిన సామాజిక కార్యకర్త సుజిత్ స్వామి సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరడంతో సీఆర్ఐఎస్ ఈ వివరాలను వెల్లడించింది. జనవరి 1, 2017 నుండి జనవరి 31, 2020 మధ్య కాలంలో (మూడేళ్లు) వెయిటింగ్ లిస్టులో ఉన్న 9.5 కోట్ల మంది తమ టికెట్లను రద్దు చేసుకోలేదు. తద్వారా ఈ ప్రయాణికుల నుండి అత్యధికంగా రూ .4,335 కోట్లు సంపాదించింది. అలాగే టికెట్ల క్యాన్సిలేషన ద్వారా రూ.4335కోట్లను ఆర్జించింది. ఇలా గత మూడేళ్లలో టికెట్ రద్దు ఛార్జీలు, వెయిట్‌లిస్ట్ టికెట్లను రద్దు చేయకపోవడం వల్ల భారతీయ రైల్వే 9,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. ఆన్లైన్ ద్వారా ఐఆర్సిటిసి రైలు టిక్కెట్ల బుకింగ్‌లో ఖచ్చితమైన పెరుగుదల ఉందని తెలిపింది. 2017- 2020 జనవరి 31 వరకు మొత్తం 145 కోట్ల మంది ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోగా, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా పాత బుకింగ్ పద్ధతిలో 74 కోట్ల మంది టికెట్లను తీసుకున్నారు. భారతీయ రైల్వేల రిజర్వేషన్ పాలసీ, రీఫండ్ పాలసీ (రద్దు చేసుకున్న టికెట్లపై ప్రయాణికులకు తిరిగి వచ్చే సొమ్ము)లో చాలా వివక్ష వుందని సుజిత్ స్వామి ఆరోపించారు. అలాగే ఆన్లైన్ బుకింగ్, కౌంటర్ బుకింగ్‌ల మధ్య చాలా వ్యత్యాసం వుందని, ఇది ప్రయాణికులపై అనవసరపు భారాన్ని మోపుతోందని వాదించారు. తద్వారా రైల్వే అన్యాయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోందంటూ స్వామి రాజస్థాన్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కాగా రైల్వే టిక్కెట్లను కాన్సిల్ చేసినపుడు, పూర్తి డబ్బులు కాకుండా.. సర్వీస్ ఛార్జీలు కోత పెట్టి, మిగతా సొమ్మును వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తుందన్న సంగతి తెలిసిందే. నిర్ణీత సమయానికి 48 గంటల లోపు టికెట్లను కాన్సిల్ చేసుకుంటే.. చార్జీలు ఏసీ ఫస్ట్ క్లాస్ / ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ల రద్దు ఛార్జీ రూ. 240 + జీఎస్టీ ఏసీ 2 టైర్, ఫస్ట్ క్లాస్ టిక్కెట్ల రద్దు ఛార్జీ రూ. 200 + జీఎస్టీ ఏసీ 3 టైర్ / ఏసీ చైర్ కార్ / ఏసీ 3 ఎకానమీ క్లాస్ టిక్కెట్ల కోసం రద్దు ఛార్జీ రూ. 180 + జీఎస్టీ స్లీపర్ క్లాస్ టిక్కెట్ల కోసం, రద్దు ఛార్జీ రూ. 120. సెకండ్ క్లాస్ టిక్కెట్లపై రూ. 60 -
‘అనైతిక’ ఆరోపణలకు ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: కంపెనీ టాప్ మేనేజ్మెంట్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతోందంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంకా ప్రాథమిక ఆధారాలేమీ లభించలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ‘ప్రస్తుతం ప్రాథమిక ఆధారాలేమీ లేవు. గుర్తు తెలియనివారు చేసిన ఆరోపణలపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సదరు ఆరోపణల విశ్వనీయత, నిజానిజాల గురించి కంపెనీ వ్యాఖ్యానించే పరిస్థితిలో లేదు‘ అని నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీకి (ఎన్ఎస్ఈ) తెలియజేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కంపెనీని నియమించుకున్నామని, అలాగే అంతర్గతంగా స్వతంత్ర ఆడిటర్ ఎర్న్స్ట్ అండ్ యంగ్‌తో కూడా చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. ఆరోపణల్లో ప్రస్తావించిన నిర్దిష్ట ప్రక్రియలను సమీక్షించాల్సిందిగా స్వతంత్ర ఆడిటర్‌ను కోరినట్లు ఇన్ఫీ వివరించింది. భారీ ఆదాయాలు చూపించడం కోసం ఇన్ఫీ సీఈవో సలిల్ పరీఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతున్నారంటూ పేరు వెల్లడించని కొందరు ఉద్యోగులు కంపెనీ బోర్డుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆధారాలు కూడా అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సత్వరం ఇన్ఫోసిస్ యాజమాన్యం విచారణ ప్రారంభించింది. అటు అమెరికాలో కూడా సెక్యూరిటీస్ ఎక్సే్ఛంజీ (ఎస్ఈసీ) దీనిపై విచారణ జరుపుతోంది. ఈ ఆరోపణల గురించి ముందుగానే ఎందుకు వెల్లడించలేదన్న దానిపై ఎన్ఎస్ఈ వివరణ కోరిన మీదట.. ఇన్ఫోసిస్ తాజా అంశాలు తెలియజేసింది. సోమవారం ఇన్ఫోసిస్ షేరు 3 శాతం పెరిగి రూ. 709 వద్ద క్లోజయ్యింది. -
ఏప్రిల్ @ రూ.500 కోట్లు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. నెలకు లక్షల సంఖ్యలో జరుగుతున్న డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల కారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. జనవరి మినహా గత ఐదు నెలల్లో రూ.400 కోట్ల కన్నా ఎక్కువ ఆదాయం రాగా, ఏప్రిల్‌లో మాత్రం రికార్డు ఆదాయం రానుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో ఇంకా నాలుగు రోజుల కార్యకలాపాలు మిగిలి ఉండగానే రూ.436 కోట్ల రాబడి సమకూరింది. దీంతో ఏప్రిల్ ఆదాయం ఏకంగా రూ.500 కోట్లు దాటి రిజిస్ట్రేషన్ల శాఖ చరిత్రలోనే రికార్డు సృష్టిస్తుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగేళ్లు.. రూ.13 వేల కోట్లు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత యేటా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూనే వస్తోంది. ఈ నాలుగేళ్లలో రూ.13 వేల కోట్ల వరకు ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ లావాదేవీలు గణనీయంగా పుంజుకున్నాయి. డిసెంబర్లో తొలిసారిగా ఆదాయం రూ.400 కోట్లు దాటింది. ఆ తర్వాతి నెలలో రూ.367 కోట్లకు తగ్గినా, ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రూ.453 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ల శాఖలో ఇదే రికార్డు స్థాయి రాబడి కావడం గమనార్హం. మార్చిలో స్వల్ప తగ్గుదలతో రూ.441 కోట్లు వచ్చింది. ఏప్రిల్‌లో మాత్రం ఊహించని రీతిలో రూ.500 కోట్లు దాటే పరిస్థితి కనిపిస్తోంది. లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు.. ఈనెల 25వ తేదీ వరకు రూ.436.4 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.409.277 కోట్లు వచ్చాయి. ఈ నెలలో ఇప్పటికే లక్షకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరగడం ఉన్నతాధికారులకు కూడా అంతుచిక్కడం లేదు. బుధవారం నాటికి 1,03,231 లావాదేవీలు జరిగాయని, ఇంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శివార్లలో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం ఒక్క రోజే రూ.23.2 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. నాలుగు పని దినాలు మిగిలి ఉన్న నేపథ్యంలో రూ.500 కోట్ల మార్కుకు చేరుకుంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది. -
గండికి భారీ ఆదాయం
చక్రాయపేట : జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయస్వామి ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. ఆలయ సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన హుండీ లెక్కింపులో రూ. 25, 21, 685లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రావణ మాసం కావడంతో ఈ నెలలో భారీ సంఖ్యలో భక్తులు అంజన్నను దర్శించుకున్నారు. హుండీలో నగదుతోపాటు 60గ్రాముల బంగారం, 1.872గ్రాముల వెండి, 26 అమెరికా డాలర్లు, 12సింగపూర్ డాలర్లు, పదిజర అరబిక్ హంసలు, 31కువైట్ డాలర్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మెన్ రాజారావుతోపాటు పాలకమండలి సభ్యులు, బ్యాంకు సిబ్బంది, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెస్సార్టీసీకీ భారీ ఆదాయం
సాక్షి, ముంబై: నష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) గణేశ్ ఉత్సవాల పుణ్యమా.. గట్టెక్కింది. ఉత్సవాల సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కొంకణ్‌లోని సింధుదుర్గ్, రత్నగిరి, సావంత్వాడి తదితరా జిల్లాలకు లక్షలాది ప్రయాణికులను ఎమ్మెస్సార్టీసీ చేరవేసింది. ఆర్టీసీ బస్సులన్నీ వంద శాతం ప్రయాణికులతో రాకపోకలు సాగించాయి. ఈ వారం, పది రోజుల్లో మంచి ఆదాయం వచ్చిందని ముంబై రీజియన్ ఆర్టీసీ జనరల్ మేనేజరు రాహుల్ తోరో తెలిపారు. ఉత్సవాల సమయంలో మొత్తం 7,984 ట్రిప్పులు నడిపి 3.51 లక్షల మందిని చేరవేసింది. ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే రైళ్లు వివిధ కారణాల వల్ల ఆలస్యంగా నడిచాయి. అందులో ఉత్సవాలకు రెండు రోజుల ముందు ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడం, రైళ్ల రాకపోక వేళలు అస్తవ్యస్తమయ్యాయి. అనేక రైళ్లను రద్దు చేసుకోవల్సి వచ్చింది. ఇక కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించక తప్పలేదు. ఇది ఆర్టీసీకి కలిసొచ్చింది. సాధారణ రోజుల్లో.. సాధారణ రోజుల్లో ముంబై పరిసర ప్రాంతాల్లోని వివిధ బస్ డిపోల నుంచి కొంకణ్ దిశగా 1,686 ట్రిప్పులు నడుస్తాయి. గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 26-29 మధ్యన అదనంగా 1,924 ట్రిప్పులు నడిపారు. ఈ నెల 8వ తేదీన ఉత్సవాలు పూర్తయిన తరువాత తిరుగు ప్రయాణంలో సుమారు అంతే సంఖ్యలో ట్రిప్పులు, అంతే సంఖ్యలో ప్రయాణికులను చేరవేసిన ఆర్టీసీ మంచి ఆదాయాన్ని రాబట్టింది. ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని గణేశ్ ఉత్సవాలు కొంత మేర ఆదుకున్నాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.