సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. నెలకు లక్షల సంఖ్యలో జరుగుతున్న డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల కారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. జనవరి మినహా గత ఐదు నెలల్లో రూ.400 కోట్ల కన్నా ఎక్కువ ఆదాయం రాగా, ఏప్రిల్‌లో మాత్రం రికార్డు ఆదాయం రానుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో ఇంకా నాలుగు రోజుల కార్యకలాపాలు మిగిలి ఉండగానే రూ.436 కోట్ల రాబడి సమకూరింది. దీంతో ఏప్రిల్ ఆదాయం ఏకంగా రూ.500 కోట్లు దాటి రిజిస్ట్రేషన్ల శాఖ చరిత్రలోనే రికార్డు సృష్టిస్తుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.
నాలుగేళ్లు.. రూ.13 వేల కోట్లు
వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత యేటా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూనే వస్తోంది. ఈ నాలుగేళ్లలో రూ.13 వేల కోట్ల వరకు ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ లావాదేవీలు గణనీయంగా పుంజుకున్నాయి. డిసెంబర్‌లో తొలిసారిగా ఆదాయం రూ.400 కోట్లు దాటింది. ఆ తర్వాతి నెలలో రూ.367 కోట్లకు తగ్గినా, ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రూ.453 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ల శాఖలో ఇదే రికార్డు స్థాయి రాబడి కావడం గమనార్హం. మార్చిలో స్వల్ప తగ్గుదలతో రూ.441 కోట్లు వచ్చింది. ఏప్రిల్‌లో మాత్రం ఊహించని రీతిలో రూ.500 కోట్లు దాటే పరిస్థితి కనిపిస్తోంది.
లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు..
ఈనెల 25వ తేదీ వరకు రూ.436.4 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.409.277 కోట్లు వచ్చాయి. ఈ నెలలో ఇప్పటికే లక్షకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరగడం ఉన్నతాధికారులకు కూడా అంతుచిక్కడం లేదు. బుధవారం నాటికి 1,03,231 లావాదేవీలు జరిగాయని, ఇంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శివార్లలో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం ఒక్క రోజే రూ.23.2 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. నాలుగు పని దినాలు మిగిలి ఉన్న నేపథ్యంలో రూ.500 కోట్ల మార్కుకు చేరుకుంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment