సాక్షి, హైదరాబాద్: మద్యపాన వ్యసనపరుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డాక్టర్ చీటీ ఉంటే లిక్కర్ ఇస్తారన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నా యి. ఈనెల 14 వరకు కచ్చితంగా మందు వి క్రయాలు ఉండవని, అప్పటివరకు మద్యంపై ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని స్పష్టం చేస్తున్నాయి. కేరళ తరహాలో డాక్టర్ల సూచన మేరకు మద్యం ఇవ్వాలన్న ప్రతిపాదన అసలు మన రాష్ట్రంలో లేనేలేదని ఎక్సైజ్ ఉన్నతాధికారులు కొట్టిపారేస్తున్నారు. గత నెల 29న రోజుకు రెండు గంటలపాటు రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుస్తారనే ఊహాగానాలు ప్రచారం లోకి వచ్చాయి.
ఈ ప్రచారాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కొట్టిపారేసింది. మద్యం దుకాణాల మూసివేతపై గత నెల 31 వరకు ప్రకటించిన గడువు ముగిసిన రోజే, ఈనెల 14 వరకు మళ్లీ మూసివేత ఉత్తర్వులు జారీ చేశాయి. అయితే, వ్యసనపరుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేరళ రాష్ట్రం తరహాలో డాక్టర్లు సూచిస్తే లిక్కర్ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం ఇంకా జరుగుతోంది. దీంతో మందుబాబులు మళ్లీ లిక్కర్‌పై ఆశలు పెట్టుకుంటున్నారు. దీన్ని ఎక్సైజ్ యంత్రాంగం కొట్టిపారేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల 14 వరకు రాష్ట్రంలోని మద్యం దుకాణాలు తెరచుకునే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఈనెల 14 తర్వాతే అప్పటి పరిస్థితిని బట్టి రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాలా వద్దా అనే నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో ఇక మందుబాబులు ఈ నెల 14 వరకు నోరు కట్టేసుకోవాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment