యోధా పాట్కర్ | Tribals oppose campaign development projects in Odisha | Sakshi
Sakshi News home page

యోధా పాట్కర్

Published Mon, Jun 6 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

యోధా పాట్కర్

యోధా పాట్కర్

బయోగ్రఫీ
అశాంతి, అస్థిమితం, అభివృద్ధి నిరోధకం.. ఈ మూడూ కలిస్తే.. మేధా పాట్కర్! ఇది ప్రభుత్వాల మాట. పర్యావరణ సంరక్షణ, మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక ప్రక్షాళన... ఈ మూడింటి కోసం ప్రభుత్వాలను మూడు చెరువుల నీళ్లు తాగిస్తే.. మేధా పాట్కర్!! ఇది ‘నర్మద’ను నమ్ముకున్నవారి మాట. నర్మదా నది నీళ్లను నిజంగా దాహం లేనివాళ్లు తాగినా, నర్మదా నది నీళ్లను నిజంగా రైతులు కానివాళ్లు తాకినా మేధకు ఆగ్రహం వస్తుంది. ఆమె పోరాటం... జల జనిత జ్వాల! ఆమె ఆరాటం జన జీవన మహోజ్వల.
 
ఈమధ్యే మేధ.. మోదీ, అమిత్‌షాల తలలపై నర్మద నీళ్లను కుమ్మరించారు. ఉజ్జయినీ కుంభమేళాకు 172 కోట్ల లీటర్ల నీటిని నర్మదా నది నుంచి తరలించడం ఆమెకు నచ్చలేదు. ఇక మేధ, తర్వాత ఏం చేయబోతున్నారన్నది ఈ దేశంలోని ప్రభుత్వాలు తెలివిమీరి, తెలివితక్కువగా తీసుకోబోయే  విధ్వంసకర నిర్ణయాలను బట్టి మాత్రమే ఉంటుంది.
 
ప్రభుత్వం ‘డామ్’ ఇట్ అంది!
మేధ 1989 లో నర్మదా బచావో ఆందోళన్ (ఎన్బీయే) మొదలు పెట్టినప్పుడు ఆమె వయసు 35 సం. నర్మదా నదిపై ఆనకట్టలు కట్టడానికి వీల్లేదని ఆమె ఆందోళన. అతి పెద్ద సర్దార్ సరోవర్ డ్యామ్‌ను అసలే కట్టనివ్వకూడదని ఆమె ప్రతిఘటన. ప్రభుత్వం వింటుందా? అభివృద్ధి అంటుంది. సర్దార్ సరోవర్ ఒకటేనా.. నర్మద మీద ఇంకా 30 పెద్ద డ్యాములు, 135 మీడియం డ్యాములు, 3000 చిన్న డ్యాములు కట్టుకోవచ్చుని ట్రిబ్యునలే చెప్పాక ప్రభుత్వానికి మాత్రం ఆగాల్సిన పనేముంది? 2006లో వర్క్ మొదలుపెట్టింది. రెండేళ్లలో ఒక కొలిక్కి తెచ్చింది. కేసుల కొర్రీలతో ఇప్పటికీ డ్యామ్ నిర్మాణం జరుగుతూనే ఉంది.
 
మేధ అన్నం, నీళ్లు మానేశారు
నర్మద మధ్యప్రదేశ్‌లో పుట్టింది. అమర్‌కంఠ్ కొండల్లో.
మేధ మహారాష్ట్రలో పుట్టారు. ముంబైలో.
నర్మద మూడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర.
మేధ.. నర్మదపై డ్యామ్‌ల నిర్మాణానికి వ్యతిరేకంగా రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారు.
ఇప్పుడు ఆమె వయసు 61 ఏళ్లు.
ఆమె ఉద్యమం వయసు 27 ఏళ్లు.
ఇప్పటి వరకు మేధ చేపట్టిన అతి పెద్ద ఆందోళన 2006లో ఢిల్లీలో ఆమె చేసిన నిరాహార దీక్ష. మొన్న ఏప్రిల్‌కి ఆ దీక్షకు పదేళ్లు. (అదే ఏడాది జూన్‌లో మేధ వ్యతిరేకిస్తున్న సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం మొదలైంది).
 
కూతురి దీక్ష.. తల్లికి బెంగ
మేధ దీక్షకు కూర్చున్నప్పుడు ప్రభుత్వం కన్నా ముందు ఆందోళన చెందే వ్యక్తి ఇందు ఖనోల్కర్. మేధ తల్లి ఆమె. 2006లో మేధ ‘నిరశన’కు కూర్చున్నప్పుడు 77ఏళ్ల ఇందు.. ఎప్పుడూ లేనంతగా కలత చెందారు. అందుకు కారణం ఉంది. మేధకు తిండి మానేసి, పిడికిలి బిగించి కూర్చోవడం మామూలై పోయింది. ఆమె ఆరోగ్యం దెబ్బ తింటుందేమోనని తల్లి బెంగ. 1996లో ఓసారి మేధ 82 రోజుల నిరశనలో కూర్చున్నారు.

అప్పట్నుంచి కూతురి నిరశనలను, ధర్నాలను లెక్కించడం మానుకున్నారావిడ! మొదట్లో అప్పుడప్పుడు వెళ్లి వేదిక మీద కూతుర్ని చూసుకుని వచ్చేవారు. ఏం చేస్తోందో, ఎలా ఉందోనని. మేధ పక్కన ఎవరెవరో ఉండేవారు. ఆదివాసీలు, పర్యావరణ పరిరక్షకులు, సామాజిక కార్యకర్తలు, ఇంకా... వచ్చిపోతూ, పూలగుచ్ఛాలు ఇచ్చిపోతుండే సెలబ్రిటీలు. వాళ్లను చూసి తన కూతురు కరెక్టే అనుకునేవారు ఇందు. 2006 నిరశనకు ఆమె వెళ్లలేదు. మేధ సోదరుడు మాత్రం ముంబై నుంచి ఢిల్లీ వెళ్లి ఆమెతో కొద్దిసేపు కూర్చుని వచ్చేశాడు.
 
ఏప్రిల్ 17 సోమవారం 2006
‘పునరావాసం కల్పించండి’ అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ వార్త అందగానే ఎవరో వచ్చి మేధకి నిమ్మరసం అందించారు. నిజానికైతే అక్కడి నుంచి ఆమె వెంటనే ముంబై బయల్దేరి వెళ్లాలి. ఆమె కుటుంబ సభ్యులు కూడా అదే ఆశించారు. కానీ ఆమె ఢిల్లీలోనే ఇంకో ఉద్యమ కార్యక్రమంలో నిమగ్నమైపోయారు. రెండు రోజుల తర్వాత గానీ తల్లికి కూతురు అందుబాటులోకి రాలేదు! ‘ఎక్కువ తినొద్దు. చాలా రోజులుగా ఖాళీ కడుపుతో ఉన్నావు కదా. తింటే వాంతి అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త’.. ఇంతకుమించి ఆమె చెప్పేదేమీ ఉండదు. మేధ తల్లికి బీపీ ఉంది. షుగర్ ఉంది. తన కూతురికీ అవి రావచ్చేమోనని ఆమె భయం.
 
300కు పైగా నిరాహార దీక్షలు
మేధ కాలేజీ రోజుల్లో ఎంత చురుగ్గా ఉన్నారో, ఇప్పుడూ అంతే పోరాట పటిమతో ఉన్నారు. మేధ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌లో ఎం.ఎ. (సోషల్ వర్క్) చదివారు. పీహెచ్‌డీని, ఫ్యాకల్టీగా టాటాలో వచ్చిన అవకాశాన్నీ వదులుకుని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఐదేళ్ల పాటు ముంబై మురికివాడలలో పనిచేశారు. తర్వాత రెండేళ్లు ఈశాన్య గుజరాత్‌లోని ఆదివాసీ జిల్లాల్లో సేవలను అందించారు. మరో ఐదేళ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలోని నర్మదా నదీ పరివాహక ప్రాంతాలలో పర్యటించారు. డ్యామ్ నిర్మాణాలతో అక్కడి ఆదివాసీలకు జరగబోయే నష్టాన్ని పసిగట్టి ప్రభుత్వాన్ని డీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ‘నర్మదా బచావో ఆందోళన్’ ప్రారంభం అయింది అప్పుడే.
 
‘నిర్మాణం మనిషి బతుకును కూల్చేయకూడదు’ అన్నది మేధ సిద్దాంతం. ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఆమె ఈ మూడున్నర దశాబ్దాలలోనూ అనేక పోరాటాలు చేశారు. 300 కు పైగా నిరాహార దీక్షలు చేశారు!
 
బాల్యంలో మేధ ఎలా ఉండేది?
మేధ దయ గల అమ్మాయి! చిన్నప్పుడు తల్లితో కలిసి నడుస్తున్నపుడు.. చేయి చాచిన ప్రతి యాచకునికీ డబ్బు ఇమ్మని తల్లిని పోరేది. స్కూల్లో తెలివైన విద్యార్థిని. ఎప్పుడూ క్లాస్ ఫస్టే. వక్తృత్వపు పోటీల్లోనైతే ఇక చెప్పే పనిలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడేది. తన వాదనను స్పష్టంగా వినిపించేది. దాదర్‌లోని కింగ్ జార్జి స్కూల్లో ఆమె చదువుకుంది. (ఇప్పుడది రాజా శివాజీ స్కూలు). మేధ టీచర్లకు ఆమె అంటే ఎంతో ఇష్టం. మేధలో సేవాభావాలు మొలకెత్తడానికి పుష్పాభావే అనే టీచరే కారణం.
 
ప్రధానంగా తల్లిదండ్రుల ప్రభావం మేధపై ఎక్కువగా ఉంది. తండ్రి వసంత్ ఖనోల్కర్ స్వాతంత్య్ర సమరయోధుడు. సామాజిక కార్యకర్త. కార్మిక సంఘం నాయకుడు. తల్లి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. పోస్టు మాస్టర్‌గా రిటైర్ అయ్యారు.  ఉద్యోగంలో ఉన్నప్పుడు, రిటైర్ అయ్యాక కూడా ఆమె ఎన్నో సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ‘ఉమెన్  ఇన్ డిస్ట్రెస్’ అని మృణాల్ గోర్ సంస్థ ఒకటి ఉండేది. దాంతో పాటు, ‘స్వాధార్’ అనే సంస్థలో ఆమె పని చేశారు. మేధ తండ్రి కూడా 1999లో... ఆయన చనిపోయే ముందు వరకు సంఘహితం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇదంతా మేధ బాల్యపై ప్రభావం చూపింది. క్రమంగా ఆమెను ఉద్యమాల వైపు నడిపింది.
 
విజ్ఞానం.. పోరాటానికి ఆయుధం
ఉద్యమ జీవితం మేధను రాటు తేల్చింది. పోలీసులు, కేసు లు, ఆరోగ్యం దెబ్బతినడం.. వేటినీ లెక్క చేయలేదు తను. అనుకున్నది సాధించాలి. అదే లక్ష్యం. అదే ధ్యేయం. విద్య, విజ్ఞానం ఆమె చేపట్టిన ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలబడ్డాయి. టాటా ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడు మేధ వందల పుస్తకాలు చదివారు! ఉద్యమాలకు ప్రధాన శత్రువు.. చెడు రాజకీయం. ఆ చెడును.. సమాజంలోని మేధావుల, ఆలోచనాపరుల మద్దతుతో ఎదుర్కోగలిగారు మేధ. కానీ అది అంత తేలికైన విషయం కాదని ఈ యోధురాలికి ప్రతి సందర్భంలోనూ అర్థమౌతూనే ఉంది. అయినా.. ఈ జ్వాల ఆరేది కాదు. ఆమె దీక్ష చల్లారేదీ కాదు.
 
మేధ రాజకీయాలు
మేధా పాట్కర్ 2014 జనవరిలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆమె నేతృత్వంలోని ‘నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్’ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతునిచ్చింది. మేధ కూడా ఆ ఎన్నికల్లో ఈశాన్య ముంబై నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. 2015లో ఆమ్ ఆద్మీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
 
మేధ అవార్డులు
రైట్ లైవ్‌లీ అవార్డు 
గోల్డ్‌మన్ ఎన్విరాన్‌మెంట్ అవార్డు 
గ్రీన్ రాబిన్ అవార్డు 
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అవార్డు  
థామస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డు 
దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 
మమతా ఫూలె అవార్డు 
మదర్ థెరిస్సా అవార్డు
 
మేధ ఉద్యమాలు
నర్మద బచావో ఆందోళన్ (డ్యామ్ నిర్మాణాలకు వ్యతిరేకం)
నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్ (సామాజిక న్యాయం కోసం మేధ నెలకొల్పిన కూటమి)
వరల్డ్ కమిషన్ ఆన్ డ్యామ్స్ (మేధ నేతృత్వంలోని కమిషన్)
టాటా నానో ప్లాంట్, సింగూర్ (ప్లాంటు స్థాపనకు వ్యతిరేకం)
లావాసా (మహారాష్ట్రలోని లావాసా సిటీ నిర్మాణానికి వ్యతిరేకం)
గోలిబర్ కూల్చివేత (ముంబైలోని గోలిబర్ ప్రాంతంలో కూల్చివేతలకు నిరసన)
హీరానందిని భూ కుంభకోణం (అక్రమ కట్టడాలపై న్యాయపోరాటం)
కొవ్వాడ న్యూక్లియర్ ప్రాజెక్టు (భూసేకరణలపై నిరసన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement