పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మోదీ
కెవాడియా (గుజరాత్): సమైక్య భారత నిర్మాత, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు సమున్నత గౌరవం... విచ్ఛిన్నంగా ఉన్న భారత భూభాగాల్ని ఏకం చేసిన ధీశాలికి నిలువెత్తు నివాళి. పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 182 మీటర్ల(597 అడుగులు) సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. గుజరాత్ నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యాంకు సమీపంలో సాధు బెట్ అనే దీవిలో కొలువుదీరిన ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అని నామకరణం చేశారు.
వైమానిక దళ విమానాలు, హెలికాప్టర్లు జాతీయ పతాక రంగులు వెదజల్లుకుంటూ విగ్రహానికి సమీపంగా దూసుకెళ్లిన దృశ్యాలు కనువిందు చేశాయి. ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ప్రకృతి సోయగాల నడుమ, సంప్రదాయ దుస్తుల్లో పటేల్ ఠీవిగా నడుస్తున్నట్లున్న ఈ విగ్రహాన్ని.. సాధు కొండల్లో నక్షత్ర ఆకారం లోని పునాదిపై నిర్మించారు. సమైక్య భారత కలను నిజం చేయడానికి తమ రాజ్యాల్ని వదులుకున్న రాజ వంశాల జ్ఞాపకార్థం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో ఒక మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలని మోదీ గుజరాత్ ప్రభుత్వానికి సూచించారు. పటేల్ విగ్రహం మన దేశ ఇంజినీరింగ్, సాంకేతిక నైపుణ్యాలకు నిలువుటద్దం అని కొనియాడారు.
నర్మదా డ్యాంకు సమీపంలో నివసిస్తున్న గిరిజనులకు ఈ విగ్రహం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ఆ ప్రాంతంలో పర్యాటక రంగం ఊపందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విగ్రహ నిర్మాణం కోసం భూములు వదులుకున్న రైతులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లి, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజ నిర్వహించిన మోదీ..విగ్రహం పాదాల వరకు వెళ్లి పటేల్‌కు పుష్పాంజలి ఘటించారు. విగ్రహం కింది భాగంలో నిర్మించిన మ్యూజియంతో పాటు, 135 మీటర్ల ఎత్తులో ఏర్పాటుచేసిన పర్యాటకుల గ్యాలరీని సందర్శించారు.
భారత మనుగడకు భరోసా
భారత్‌ను ముక్కలు చేయాలనుకున్న కుట్రలకు ఎదురునిలిచిన పటేల్ ధైర్యానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఆనాడు దేశ అస్థిత్వంపై సందేహాలు వ్యక్తం చేసినవారికి భారత మనుగడపై అచంచల భరోసాను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై కూడా ప్రధాని ధ్వజమెత్తారు. పటేల్ లాంటి జాతీయ హీరోలకు స్మారకాలు నిర్మించడం ద్వారా తాము ఏమైనా నేరాలకు పాల్పడ్డామా? అని ప్రశ్నించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన తరువాత మోదీ 55 నిమిషాలు ప్రసంగించారు. 550 సంస్థానాలను విలీనంచేసిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ సేవల్ని కొనియాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ఆయనకు తగిన గుర్తింపు లభించలేదని అన్నారు. పటేల్ భౌగోళిక సమైక్యతకు పాటుపడితే తమ ప్రభుత్వం జీఎస్టీ లాంటి సంస్కరణల ద్వారా ఆర్థిక సమైక్యతకు కృషిచేస్తోందని వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లలో జాతి హీరోల గౌరవార్థం నిర్మించిన పలు స్మారకాల్ని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు.
‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’కు స్ఫూర్తి
‘భారత జాతిని విచ్ఛిన్నం చేయాలనుకున్న కుట్రలను అడ్డుకున్న పటేల్ ధైర్యం, శక్తిసామర్థ్యాలు, అంకితభావాన్ని ఈ విగ్రహం ప్రపంచానికి, భావి తరాలకు చాటిచెబుతుంది. ఇదే స్ఫూర్తితో ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ సాధన దిశగా ముందడుగు వేయాలి. జాతి హీరోలకు స్మారకాలు నిర్మించాలన్న మా ఆశయాల్ని కొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారు. పటేల్ లాంటి యోధుల సేవల్ని కీర్తించినందుకు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇవన్నీ వింటుంటే మేము ఏమైనా నేరం చేశామా అని అనిపిస్తుంది. జాతిని ఏకం చేసిన గొప్ప వ్యక్తికి తగిన గౌరవం దక్కాలని దేశం మొత్తం కోరుకుంటోంది. దేశ విభజనకు జరుగుతున్న దుష్ట ప్రయత్నాలకు ప్రజలంతా గట్టి జవాబు ఇవ్వాలి. ఒకవేళ ఆనాడు పటేల్ వల్ల దేశం ఏకం కానట్లయితే హైదరాబాద్‌లో చార్మినార్ సందర్శనకు, గుజరాత్‌లోని జునాగఢ్‌లో సింహాల్ని చూసేందుకు, సోమనాథ్ ఆలయంలో పూజలు చేసేందుకు ప్రజలకు వీసాల అవసరం వచ్చి ఉండేది’ అని మోదీ అన్నారు.
డీజీపీల సదస్సు ఇక్కడే!
ఈ సంవత్సరం జరగనున్న అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీల వార్షిక సమావేశానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమ షెడ్యూల్ ఇంకా ఖరారు కాకున్నా, పటేల్ విగ్రహం వద్దే ఈ సమావేశాలు నిర్వహించడానికి కేంద్ర హోం శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత డిసెంబర్ ద్వితీయార్థంలో ఈ కాన్ఫరెన్స్ జరిగే అవకాశాలున్నాయి. విగ్రహం సమీపంలోని కెవాడియా గ్రామంలో గుడారాల్లో డీజీపీలు, ఐజీలకు బస కల్పించాలని యోచిస్తున్నట్లు హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సివిల్ సర్వీసుల పితగా పేరొందిన సర్దార్ పటేల్ పేరిట హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారులకు శిక్షణనిచ్చే అకాడమీ(ఎన్‌పీఏ)ని నెలకొల్పారు.
ఐక్యతా విగ్రహం విశేషాలివీ..
► విగ్రహ నిర్మాణానికి వాడిన సామగ్రి: 70 వేల టన్నుల సిమెంట్, 24,500 టన్నుల ఉక్కు, 1,700 మెట్రిక్ టన్నుల కంచు
► నిర్మాణ వ్యయం: రూ. 2,989 కోట్లు
► విగ్రహం ప్రాజెక్టు విస్తీర్ణం: 20,000 చదరపు మీటర్లు
► పర్యాటకులు సమీపంలోని ప్రకృతి అందాల్ని చూసేందుకు విగ్రహం లోపల 135 మీటర్ల ఎత్తులో గ్యాలరీ ఏర్పాటు
► ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తయిన చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం ఎత్తు 153 మీటర్లు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం కన్నా పటేల్ విగ్రహం రెట్టింపు ఎత్తయినది.
► పెద్ద రాయిని తొలిచి విగ్రహాన్ని చెక్కాలని భావించినా, అంతటి కఠినమైన రాయి లభించకపోవడంతో సిమెంట్, స్టీల్, కంచుతో నిర్మించారు.
► గుజరాత్ సీఎంగా ఉండగా పటేల్‌కు భారీ విగ్రహం నిర్మించాలని మోదీ సంకల్పించారు. 2013లో దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
► లార్సెన్ అండ్ టుబ్రో సంస్థ రికార్డుస్థాయిలో 33 నెలల్లో కట్టింది.
► 2 వేలరకాల పటేల్ ఫొటోల్లో ఒకదాని ఓకే చేసి దానిలా విగ్రహాన్ని మలిచారు.
► విగ్రహాన్ని మొత్తం 5 జోన్లుగా విభజించారు. ఒకటో జోన్‌లో మోకాళ్ల కింది భాగం, రెండో జోన్‌లో తొడలు(149 మీటర్లు), మూడో జోన్‌లో పర్యాటకుల గ్యాలరీ(153 మీటర్లు), నాలుగో జోన్‌లో మెయింటెనెన్స్, ఐదో జోన్‌లో తల, భుజాలు ఉన్నాయి. 4, 5 జోన్లలోకి ప్రవేశం నిషేధం.
► విగ్రహంలో ఏర్పాటుచేసిన లిఫ్ట్ సెకనుకు 4 మీటర్ల వేగంతో సందర్శకులను 135 మీటర్ల ఎత్తులోని గ్యాలరీకి తీసుకెళ్తుంది.
► పర్యాటకుల గ్యాలరీలోకి ఒకేసారి 200 మంది వెళ్లొచ్చు.
► సందర్శకుల గ్యాలరీ నుంచి సర్దార్ సరోవర్ డ్యాంతో పాటు 12 కి.మీ పొడవైన గరుడేశ్వర రిజర్వాయర్‌ను వీక్షించవచ్చు.
► విగ్రహం దగ్గరికి వెళ్లాలంటే రూ.120, విగ్రహం లోపల 135 మీటర్ల ఎత్తులోని గ్యాలరీలోకి వెళ్లాలంటే టికెట్ రూ.350 చెల్లించాలి.
► విగ్రహ ప్రవేశంలోని మ్యూజియంలో పటేల్ జీవిత విశేషాలు, స్థానిక గిరిజన ప్రజల జీవన విధానాలపై ప్రదర్శనను ఏర్పాటుచేశారు.
గాంధీకి భారీ విగ్రహం ఏదీ?: విపక్షాలు
న్యూఢిల్లీ: ఉక్కుమనిషి సర్దార్ పటేల్ మాదిరిగా జాతిపిత మహాత్మా గాంధీకి భారీ విగ్రహం ఎందుకు ఏర్పాటుచేయలేదని విపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. పటేల్ లాంటి స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వాన్ని బీజేపీ హైజాక్ చేసిందన్నాయి. పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూనే, ఆయన చలవతో ఏర్పడిన వ్యవస్థలను కేంద్రం ధ్వంసం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల్ని నాశనంచేయడం ద్రోహానికి ఏమాత్రం తక్కువ కాదని అన్నారు. దళిత నాయకుల విగ్రహాలు ఏర్పాటుచేసినప్పుడు తనపై విమర్శలు గుప్పించిన బీజేపీ, ఆరెస్సెస్‌లు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీకి ఎక్కడా సర్దార్ పటేల్ అంతటి భారీ విగ్రహం లేదని, బీజేపీ అలాంటి నిర్మాణాన్ని ఎందుకు చేపట్టలేదో చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ కోరారు. పటేల్ కాంగ్రెస్ నాయకుడని, ఆయన్ని తమవాడిగా చెప్పుకునే హక్కు బీజేపీకి లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే బీజేపీ పటేల్ విగ్రహంతో రాజకీయాలు చేస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పటేల్, గాంధీ, అంబేడ్కర్.. ఇలా ఒక్కోసారి ఓ మహానాయకుడిని బీజేపీ గుర్తుచేసుకుంటుందని, అవన్నీ ఎన్నికల జిమ్మిక్కులేనని అన్నారు.
పటేల్ భారీ విగ్రహం పాదాల చెంత నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ
సర్దార్ పటేల్ విగ్రహం కింది భాగంలో ఏర్పాటుచేసిన మ్యూజియంలో మోదీ
విగ్రహం లోపల పర్యాటకుల గ్యాలరీ నుంచి సర్దార్ సరోవర్ డ్యాం విహంగ వీక్షణం
Comments
Please login to add a commentAdd a comment