న్యూఢిల్లీ: భారత్ స్థిరమైన వృద్ధి సాధించడం వెనుక బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రధాన కారణాలుగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. 2014కు ముందున్న ఫోన్ బ్యాంకింగ్ స్థానంలో గత ఎనిమిది సంవత్సరాల్లో డిజిటల్ బ్యాంకింగ్ ప్రవేశపెట్టడం స్థిరమైన వృద్ధికి దోహదపడినట్టు చెప్పారు. యూపీఏ సర్కారు హయాంలో ఫోన్ బ్యాంకింగ్ ద్వారా ఎవరికి రుణాలు ఇవ్వాలి, నియమ నిబంధనలపై ఆదేశాలు ఫోన్ ద్వారా వెళ్లేవన్నారు.
ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా.. దాని బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే అంత పురోగమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (డీబీయూలు) ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫోన్ బ్యాంకింగ్ విధానంలో ఫోన్ ద్వారానే బ్యాంకుల నిర్వహణను నేతలు నిర్ధేశించేవారని వ్యాఖ్యానించారు.
ఫోన్ బ్యాంకింగ్ రాజకీయాలు బ్యాంకులను సంక్షోభం పాలు చేశాయని, వేలాది కోట్ల రూపాయిల స్కామ్‌లకు దారితీశాయని విమర్శించారు. తమ ప్రభుత్వం పారదర్శకతపై దృష్టి పెట్టి బ్యాంకింగ్ రంగాన్ని మార్చేసినట్టు చెప్పారు. ‘‘నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏలు) గుర్తించడంతో పారదర్శకత వల్ల వేలాది కోట్ల రూపాయిలను తిరిగి బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొచ్చాం. బ్యాంకులకు నిధుల సాయం అందించాం. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్యలు తీసుకున్నాం.
అవినీతి నిరోధక చట్టాన్ని సంస్కరించాం’’ అని ప్రధాని వివరించారు. దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) చట్టాన్ని తేవడం ఎన్‌పీఏల సమస్యకు పరిష్కారం లభించినట్టు చెప్పారు. కస్టమర్లు బ్యాంకుల దగ్గరకు వెళ్లడం కాకుండా, వారి దగ్గరకే బ్యాంకులు వచ్చేలా డిజిటల్ బ్యాంకింగ్‌తో మార్పులను తీసుకొచ్చినట్టు వివరించారు. మారుమూల ప్రాంతాలకూ బ్యాంకు సేవలను చేరువ చేయడానికి అధిక ప్రాధాన్యం చూపించినట్టు చెప్పారు.
చిన్న వర్తకులూ డిజిటల్‌కు మారాలి..
గ్రామాల్లోని చిన్న వర్తకులు సైతం పూర్తిగా డిజిటల్ లావాదేవీలకు మళ్లాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రతీ బ్యాంకు శాఖ 100 మంది వర్తకులను తమతో అనుసంధానించాలని కోరారు. ఈ చర్య మన ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తు సన్నద్ధంగా మార్చేస్తుందన్నారు. ‘‘డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలు అన్నవి నేడు మన ఆర్థిక వ్యవస్థకు, స్టార్టప్ ప్రపంచానికి, భారత్‌లో తయారీకి, స్వావలంబన భారత్‌కు గొప్ప బలం’’అని ప్రధాని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ కలయిక అవినీతి నిర్మూలనకు సాయపడుతున్నట్టు తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా లబ్ధిదారులకు రూ.25 లక్షల కోట్లను బదిలీ చేసినట్టు ప్రకటించారు.
పీఎం–కిసాన్ పథకం కింద మరో వాయిదా ప్రయోజనాన్ని సోమవారం బదిలీ చేయనున్నట్టు చెప్పారు. ఈ పథకం కింద ఒక్కో రైతుకు ఒక ఎకరానికి రూ.6,000 (మూడు వాయిదాలుగా) ప్రయోజనం లభించనుంది. బ్లాక్‌చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీని తీసుకురావాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘డిజిటల్ కరెన్సీ అయినా, డిజిటల్ లావాదేవీలు అయినా ఇందులో ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ చర్య పొదుపులను పెంచుతుంది. భౌతిక కరెన్సీని తగ్గిస్తుంది. తద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment