న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం దేశ అభివృద్ధి ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. స్వావలంబన, అభివృద్ధి భారత్‌కు ఇదొక శుభోదయమని చెప్పారు. మన పార్లమెంట్ కొత్త భవనం ఇతర దేశాల ప్రగతికి సైతం స్ఫూర్తిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. ఆదివారం పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం సందర్భంగా లోక్‌సభ సభామందిరంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
‘నవ భారత్’ ఆశలు ఆకాంక్షలను, నూతన లక్ష్యాలను కొత్త భవనం ప్రతిబింబిస్తోందని అన్నారు. ఇక్కడ తీసుకొనే ప్రతి నిర్ణయం దేశ మహోన్నత భవిష్యత్తుకు పునాది వేస్తుందని చెప్పారు. పేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దివ్యాంగులు, ఇతర అణగారిన వర్గాల సాధికారతకు ఇక్కడే ముందడుగు పడుతుందని వివరించారు. పార్లమెంట్ కొత్త భవనంలోని ప్రతి ఇటుక, ప్రతి గోడ పేదల సంక్షేమానికే అంకితమని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...
బానిస మనస్తత్వాన్ని వదిలించుకుంటున్నాం
‘‘75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని దేశ ప్రజలు అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పార్లమెంట్ కొత్త భవనాన్ని తమ ప్రజాస్వామ్యానికి కానుకగా ఇచ్చుకున్నారు. దేశ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నా. మన దేశ వైవిధ్యాన్ని, ఘనమైన సంప్రదాయాన్ని పార్లమెంట్ కొత్త భవన నిర్మాణశైలి చక్కగా ప్రతిబింబిస్తుండడం హర్షణీయం. వందల సంవత్సరాల వలస పాలన వల్ల అణువణువునా పాకిపోయిన బానిస మనస్తత్వాన్ని నవ భారతదేశం వదిలించుకుంటోంది.
మహాత్మాగాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం దేశ ప్రజలను మేల్కొల్పింది. నూతన చైతన్యాన్ని నింపింది. స్వాతంత్య్ర కాంక్షను రగిలించింది. స్వాతంత్య్ర పోరాటానికి అంకితమయ్యేలా ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగించింది. రాబోయే 25 ఏళ్లలో దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు అదే తరహాలో పనిచేయాలి. సహాయ నిరాకరణ ఉద్యమం 1922లో ముగిసింది. మరో 25 ఏళ్లకు.. 1947లో స్వాతంత్య్రం వచ్చింది. 2047లో మనం వందో స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోబోతున్నాం. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవడానికి మనమంతా కంకణబద్ధులమై పనిచేయాలి.
కొత్త భవనం.. ప్రజాస్వామ్య దేవాలయం
ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, 140 కోట్ల మంది ఆకాంక్షలకు, కలలకు ప్రతిరూపం. మన స్వాతంత్య్ర సమర యోధుల కలలను సాకారం చేయడానికి ఇదొక వేదిక. ఇది మన ప్రజాస్వామ్య దేవాలయం. భారతదేశ దృఢసంకల్పం ప్రపంచానికి ఇస్తున్న సందేశమిది. ప్రతి దేశ చరిత్రలో అమరత్వం పొందిన క్షణాలు కొన్ని ఉంటాయి. కాలం ముఖచిత్రంపై కొన్ని తేదీలు చెరిగిపోని సంతకంగా మారుతాయి. 2023 మే 28 కూడా అలాంటి అరుదైన సందర్భమే. పేదల ప్రజల సాధికారత, అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం గత తొమ్మిదేళ్లుగా కృషి చేస్తున్నాం. ఇది నాకు సంతృప్తినిస్తున్న క్షణం. పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం.
గ్రామాలను అనుసంధానించడానికి 4 లక్షల కిలోమీటర్లకుపైగా రహదారులు నిర్మించాం. 50,000కుపైగా అమృత సరోవరాలు(చెరువులు), 30,000కుపైగా కొత్త పంచాయతీ భవనాలు నిర్మించాం. పంచాయతీ భననాల నుంచి పార్లమెంట్ కొత్త భవనం దాకా కేవలం ఒకేఒక్క స్ఫూర్తి మమ్మల్ని ముందుకు నడిపించింది. అదే.. దేశ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి. కొత్త దారుల్లో నడిస్తేనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. భారత్ ఇప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. నూతనోత్సాహం కనిపిస్తోంది. కొత్త ఆలోచన, కొత్త ప్రయాణం. దిశ కొత్తదే, విజన్ కొత్తదే. మన విశ్వాసం, తీర్మానం కూడా కొత్తవే. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. భారత్ ముందుకు నడిస్తే ప్రపంచం కూడా ముందుకు నడుస్తుంది.
ఆత్మనిర్భర్ భారత్ ఆవిర్భావానికి సాక్షి
ఇప్పటి అవసరాలకు పాత భవనం సరిపోవడం లేదు. అందుకే కొత్తది నిర్మించాం. కొత్తగా మరికొంత మంది ఎంపీలు చేరనున్నారు. 2026 తర్వాత పునర్వ్యస్థీకరణతో పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. సెంగోల్‌కు తగిన గౌరవం దక్కుతుండడం సంతోషకరం. చోళ సామ్రాజ్యంలో సెంగోల్‌ను కర్తవ్య మార్గం, సేవా మార్గం, జాతీయ మార్గానికి గుర్తుగా పరిగణించేవారు. కొత్త భవన నిర్మాణంలో 60,000 మంది కార్మికులు పాల్గొన్నారు. ఇక్కడి డిజిటల్ గ్యాలరీని వారికే అంకితమిస్తున్నాం. ఈ కొత్త భవనం ఆత్మనిర్భర్ భారత్ ఆవిర్భావానికి, వికసిత భారత్ దిశగా మన ప్రయాణానికి ఒక సాక్షిగా నిలుస్తుంది.
భారత్ విజయం ప్రపంచ విజయం
భారత్‌లాంటి పూర్తి వైవిధ్యం, అధిక జనాభా ఉన్న దేశం పరిష్కరించే సవాళ్లు, సాధించే విజయాలు చాలా దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. రాబోయే రోజుల్లో భారత్ సాధించే ప్రతి విజయం ప్రపంచం సాధించే విజయంగా మారుతుంది. భారత్ కేవలం ఒక ప్రజాస్వామ్య దేశం కాదు, ప్రజాస్వామ్యానికి తల్లి కూడా. మన ప్రజాస్వామ్యమే మనకు స్ఫూర్తి. మన రాజ్యాంగమే మన బలం. ఈ స్ఫూర్తికి, బలానికి ఉత్తమమైన ప్రతీక పార్లమెంట్. పాత కొత్తల కలయికకు పరిపూర్ణ ఉదాహరణ పార్లమెంట్ నూతన భవనం.
శతాబ్దాల బానిసత్వం కారణంగా మన ఉజ్వలమైన భవన నిర్మాణ శైలికి, పట్టణ ప్రణాళికకు దూరమయ్యాం. ఇప్పుడు ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించుకుంటున్నాం. పార్లమెంట్ కొత్త భవనాన్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారు. మన వారసత్వం వైభవం, నైపుణ్యాలు, సంస్కృతితోపాటు రాజ్యాంగ వాణికి సైతం ఈ భవనం ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన సామగ్రితో కొత్త భవనం నిర్మించాం. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్‌కు ఇదొక గుర్తు.
ప్రారంభోత్సవం సాగింది ఇలా..!
అత్యాధునిక హంగులు, సకల సదుపాయాలతో నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటు కొత్త భవనాన్ని ఆదివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అట్టహాసంగా ఒక ఉత్సవంలా సాగిన ఈ వేడుకలో ప్రధాని చారిత్రక ప్రాధాన్యమున్న అధికార మార్పిడికి గుర్తయిన రాజదండం (సెంగోల్)ను లోక్‌సభ ఛాంబర్‌లో ప్రతిష్టించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితమిచ్చారు.
► సంప్రదాయ దుస్తులు ధరించిన ప్రధాని మోదీ ఉదయం 7.30 గంటలకి పార్లమెంటుకు వచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధానికి ఎదురేగి స్వాగతం పలికారు.
► పార్లమెంటు ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్రధాని మోదీ నివాళులర్పించారు
► అక్కడ నుంచి నేరుగా కొత్త భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన పూజామండపానికి చేరుకున్నారు. అక్కడ ప్రధానికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కర్ణాటక శృంగేరి మఠాధిపతులు వేద మంత్రాలు పఠిస్తూ ఉంటే ప్రధాని మోదీ గణపతి హోమం నిర్వహించారు. దీంతో పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది.
► అనంతరం వేద పండితులు ప్రధానికి శాలువా కప్పి ఆశీర్వాదాలు అందజేశారు.
► అక్కడ నుంచి తమిళనాడు నుంచి వచ్చిన 21 మంది పీఠాధిపతులు వద్దకి వెళ్లారు. వారికి నమస్కరించారు. అప్పటికే పూజలు చేసి సిద్ధంగా అక్కడ ఉంచిన చారిత్రక సెంగోల్ ఎదుట ప్రధాని సాష్టాంగ నమస్కారం చేశారు. వారు అందించిన సెంగోల్‌ను చేత పుచ్చుకున్న ప్రధాని మోదీ వీనుల విందుగా నాదస్వరం వాయిస్తూ ఉంటే, వేద పండితులు మంత్రాలు పఠిస్తూ ఉంటే స్పీకర్ ఓం బిర్లా వెంటరాగా ఒక ఊరేగింపుగా వెళ్లి సెంగోల్‌ను లోక్‌సభ ఛాంబర్‌లోకి తీసుకువెళ్లి స్పీకర్ కుర్చీకి కుడివైపు ప్రతిష్టించారు.
► అనంతరం స్పీకర్ ఆసీనులయ్యే సీటు దగ్గర ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేశారు.
► లోక్‌సభ నుంచి తిరిగి ప్రధాని మోదీ పూజాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ఆవిష్కరించి నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేశారు.
► అనంతరం కొత్త భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కొంతమంది కార్మికులకు శాలువాలు కప్పి సత్కరించారు. వారి ప్రతిభకి గుర్తింపుగా జ్ఞాపికలను బహూకరించారు.
► అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
► దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.75 స్మారక నాణేన్ని ప్రధాని ఆవిష్కరించారు. త్రిభుజాకారంలో ఉన్న కొత్త భవనం ముద్రించి ఉన్న స్టాంపు, కవర్‌ని కూడా ఆవిష్కరించారు.
► రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పంపించిన సందేశాలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చదివి వినిపించారు.
► కార్యక్రమంలో భాగంగా లోక్‌సభలో నేతల సమక్షంలో జాతీయ గీతం అయిన జనగణమన వినిపించారు.
► ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్. జైశంకర్, అశ్వినీ వైష్ణవ్, మన్‌సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.
► నూతన భవనం ప్రారంభోత్సవానికి కనీసం 20 విపక్ష పార్టీలు హాజరు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment