nation development
-
Viksit Bharat Sankalp Yatra: నాలుగు పెద్ద కులాలు.. పేదలు, యువత, మహిళలు, రైతులు
న్యూఢిల్లీ: గత పదేళ్ల తమ పరిపాలన ప్రజల్లో తమ ప్రభుత్వంపై అంతులేని విశ్వాసాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరించాయని, ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధిని విస్మరించాయని ఆక్షేపించారు. గురువారం ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో భాగంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తన దృష్టిలో పేదలు, యువత, మహిళలు, రైతులు అనే నాలుగు పెద్ద కులాలు ఉన్నాయని, ఆ కులాలు అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నాలుగు కులాల సాధికారతే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలను తాను కచి్చతంగా నెరవేరుస్తాన్న సంగతి ప్రజలకు తెలుసని వెల్లడించారు. ప్రజల ఆశీస్సులు కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ సంతృప్తస్థాయిలో అందిస్తామని ప్రకటించారు. ఇందుకోసమే ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’కు శ్రీకారం చుట్టామని తెలపారు. భారత్ ఇక ఆగిపోదు.. అలసిపోదు ప్రజల ఆకాంక్షలు మొదలైన చోటునుంచే ‘మోదీ గ్యారంటీ’ ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి ఉద్గాటించారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని ప్రజలు తీర్మానించుకున్నారని, భారత్ ఇక ఆగిపోదు, అలసిపోదు అని తేలి్చచెప్పారు. ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’కు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన ప్రజా స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ‘డ్రోన్ దీదీ యోజన’ ప్రారంభం మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందజేసేందుకు ఉద్దేశించిన ‘డ్రోన్ దీదీ యోజన’ను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. ఈ పథకం కింద 2024–25 నుంచి 2025–26 వరకు ఎంపిక చేసిన 15,000 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేస్తారు. ఆయా సంఘాలు ఈ డ్రోన్లను వ్యవసాయ పనుల కోసం రైతులకు అద్దెకు ఇచ్చి, ఆదాయం ఆర్జించవచ్చు. మహిళలకు వారి గ్రామాల్లో గౌరవ ప్రతిష్టలు దక్కాలని తాను ఆశిస్తున్నానని మోదీ చెప్పారు. కొత్త శిఖరాలకు భారత ఆర్థిక వ్యవస్థ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, నిర్ణయాలతో మన దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త శిఖరాలకు చేరిందని ప్రధానమంత్రి మోదీ వివరించారు. ఎన్నెన్నో నూతన ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గురువారం ఢిల్లీలో రోజ్‌గార్ మేళాలో ఆయన మాట్లాడారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా నియమితులైన వారికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలో అట్టడుగు వర్గాలకు సైతం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దుబాయ్ వెళ్లిన ప్రధాని మోదీ వాతావరణ మార్పులు, వాటి ప్రభావాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ తన హామీలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పులను తట్టుకునేందుకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును, సాంకతికతను అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేయాలని ఆయన కోరారు. ఐరాస కార్యక్రమం కాప్–28లో భాగంగా శుక్రవారం జరిగే వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి దుబాయ్‌కి బయలుదేరారు. -
అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించండి
న్యూఢిల్లీ: రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం ‘ఎక్స్’లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ, ప్రతికూల రాజకీయాలతో జనం విసుగెత్తిపోయారని వెల్లడించారు. బీజేపీని గెలిపిస్తే ప్రజలకు ఇచి్చన హామీలన్నీ అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. జనం ఆకాంక్షలను నెరవేర్చడం తమ బాధ్యత అని వివరించారు. కాంగ్రెస్ ఇస్తున్న డొల్ల హామీలు నమ్మొద్దని, సుపరిపాలన అందించే బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. తమ పార్టీ పట్ల జనం అచంచల విశ్వాసం చూపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ వల్లనే ప్రగతి సాధ్యమని వారు నమ్ముతున్నారని వివరించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల కలిగే మేలు ఏమిటో మధ్యప్రదేశ్ ప్రజలు ఇప్పటికే గుర్తించారని తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అదికారంలోకి తీసుకురావాలని ఛత్తీస్‌గఢ్ ప్రజలకు సూచించారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించి, బీజేపీని గెలిపిస్తారన్న నమ్మకం తనకు సంపూర్ణంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
Hindustan Times Leadership Summit: మళ్లీ జనం మద్దతు మాకే
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచి్చన నాటినుంచి 2014 దాకా మన దేశం నానా రకాల మానసిక అడ్డంకులతో సతమతమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి నిజమైన, ఊహాత్మక, అతిశయోక్తులతో కూడిన అన్ని అడ్డంకులనూ అధిగమించాం. అద్భుతమైన, అభివృద్ధి చెందిన, ప్రగతిశీల భారతానికి తిరుగులేని రీతిలో బలమైన పునాదులు వేశాం‘ అని ప్రకటించారు. అందుకే 2024 సాధారణ ఎన్నికల్లో ప్రజలు కూడా అన్ని అడ్డంకులనూ కూలదోసి బీజేపీకే మద్దతిస్తారని ధీమా వెలిబుచ్చారు. ఫలితాలు కూడా అన్ని అడ్డంకులనూ దాటుకుని వస్తాయన్నారు. నిజానికి కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతమే మన దేశం పాలిట నిజమైన అడ్డంకులుగా నిలిచాయన్నారు. వాటిని కూలదోయడంతో సామాన్యుడు సాధికారత సాధించాడని ప్రధాని చెప్పారు. శనివారం ఆయన హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో మాట్లాడారు. 2047లో సమిట్ థీమ్ ’భారత్ అభివృద్ధి చెందింది: ఇప్పుడేంటి?’ అని ఉండబోతోందని చమత్కరించారు. ‘జమ్మూ కశీ్మర్లో ఆరి్టకల్ 370ని రద్దు చేస్తే ఆకాశం విరిగి పడుతుందనేలా కొందరు లేనిపోని భయాందోళనలు కలిగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ చర్యతో కశీ్మర్లో ఉగ్రవాదం అంతమవుతోంది. పర్యాటకం బ్రహా్మండంగా పెరుగుతోంది‘ అని మోదీ చెప్పారు. ‘అప్పట్లో కశీ్మర్లో ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా భారత్ అంతర్జాతీయ సమాజం మద్దతు కోసం చూసేది. కానీ, అప్పట్లో సరిహద్దుల ఆవలి నుంచి నిత్యం ఆ దాడులను ప్రేరేపించినవారు ఇప్పుడు సాయం కోసం అంతర్జాతీయ సమాజం కేసి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి‘ అంటూ పాకిస్తాన్‌కు మోదీ చురకలు వేశారు. మంచి రాజకీయాలు మంచి ఆర్థిక విధానాలు కలిసి సాగగలవని తాము రుజువు చేశామన్నారు. -
సుస్థిర ప్రభుత్వం వల్లే దేశ ప్రగతి, ప్రపంచ కితాబు: మోదీ
మెహసానా: దేశమంతటా ప్రస్తుతం కనిపిస్తున్న శరవేగమైన ప్రగతి, ప్రపంచవ్యాప్తంగా కురుస్తున్న ప్రశంసలకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండటమే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సోమవారం గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఖెరాలు వద్ద రూ.5,950 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం భారీ జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఓపెన్ టాప్‌కార్‌లో రోడ్ షో చేశారు. తర్వాత మాట్లాడారు. సుదీర్ఘ కాలం పాటు ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఎన్నెన్ని అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టవచ్చో, ఎంతటి ప్రగతి సాధించవచ్చో చెప్పేందుకు గుజరాతే ఉదాహరణ అన్నారు. ‘‘మీ నరేంద్ర బాయ్ ఎలాంటివారో మీకు బాగా తెలుసు. మీరు నన్ను ప్రధానిగా కాకుండా మీ సొంత నరేంద్ర బాయ్‌గా చూస్తారు. నేనేదైనా వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చి తీరతానని కూడా మీకు తెలుసు’’ అన్నారు. -
శుభోదయం.. నవోదయం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం దేశ అభివృద్ధి ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. స్వావలంబన, అభివృద్ధి భారత్‌కు ఇదొక శుభోదయమని చెప్పారు. మన పార్లమెంట్ కొత్త భవనం ఇతర దేశాల ప్రగతికి సైతం స్ఫూర్తిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. ఆదివారం పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం సందర్భంగా లోక్‌సభ సభామందిరంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘నవ భారత్’ ఆశలు ఆకాంక్షలను, నూతన లక్ష్యాలను కొత్త భవనం ప్రతిబింబిస్తోందని అన్నారు. ఇక్కడ తీసుకొనే ప్రతి నిర్ణయం దేశ మహోన్నత భవిష్యత్తుకు పునాది వేస్తుందని చెప్పారు. పేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దివ్యాంగులు, ఇతర అణగారిన వర్గాల సాధికారతకు ఇక్కడే ముందడుగు పడుతుందని వివరించారు. పార్లమెంట్ కొత్త భవనంలోని ప్రతి ఇటుక, ప్రతి గోడ పేదల సంక్షేమానికే అంకితమని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... బానిస మనస్తత్వాన్ని వదిలించుకుంటున్నాం ‘‘75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని దేశ ప్రజలు అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పార్లమెంట్ కొత్త భవనాన్ని తమ ప్రజాస్వామ్యానికి కానుకగా ఇచ్చుకున్నారు. దేశ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నా. మన దేశ వైవిధ్యాన్ని, ఘనమైన సంప్రదాయాన్ని పార్లమెంట్ కొత్త భవన నిర్మాణశైలి చక్కగా ప్రతిబింబిస్తుండడం హర్షణీయం. వందల సంవత్సరాల వలస పాలన వల్ల అణువణువునా పాకిపోయిన బానిస మనస్తత్వాన్ని నవ భారతదేశం వదిలించుకుంటోంది. మహాత్మాగాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం దేశ ప్రజలను మేల్కొల్పింది. నూతన చైతన్యాన్ని నింపింది. స్వాతంత్య్ర కాంక్షను రగిలించింది. స్వాతంత్య్ర పోరాటానికి అంకితమయ్యేలా ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగించింది. రాబోయే 25 ఏళ్లలో దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు అదే తరహాలో పనిచేయాలి. సహాయ నిరాకరణ ఉద్యమం 1922లో ముగిసింది. మరో 25 ఏళ్లకు.. 1947లో స్వాతంత్య్రం వచ్చింది. 2047లో మనం వందో స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోబోతున్నాం. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవడానికి మనమంతా కంకణబద్ధులమై పనిచేయాలి. కొత్త భవనం.. ప్రజాస్వామ్య దేవాలయం ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, 140 కోట్ల మంది ఆకాంక్షలకు, కలలకు ప్రతిరూపం. మన స్వాతంత్య్ర సమర యోధుల కలలను సాకారం చేయడానికి ఇదొక వేదిక. ఇది మన ప్రజాస్వామ్య దేవాలయం. భారతదేశ దృఢసంకల్పం ప్రపంచానికి ఇస్తున్న సందేశమిది. ప్రతి దేశ చరిత్రలో అమరత్వం పొందిన క్షణాలు కొన్ని ఉంటాయి. కాలం ముఖచిత్రంపై కొన్ని తేదీలు చెరిగిపోని సంతకంగా మారుతాయి. 2023 మే 28 కూడా అలాంటి అరుదైన సందర్భమే. పేదల ప్రజల సాధికారత, అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం గత తొమ్మిదేళ్లుగా కృషి చేస్తున్నాం. ఇది నాకు సంతృప్తినిస్తున్న క్షణం. పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. గ్రామాలను అనుసంధానించడానికి 4 లక్షల కిలోమీటర్లకుపైగా రహదారులు నిర్మించాం. 50,000కుపైగా అమృత సరోవరాలు(చెరువులు), 30,000కుపైగా కొత్త పంచాయతీ భవనాలు నిర్మించాం. పంచాయతీ భననాల నుంచి పార్లమెంట్ కొత్త భవనం దాకా కేవలం ఒకేఒక్క స్ఫూర్తి మమ్మల్ని ముందుకు నడిపించింది. అదే.. దేశ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి. కొత్త దారుల్లో నడిస్తేనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. భారత్ ఇప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. నూతనోత్సాహం కనిపిస్తోంది. కొత్త ఆలోచన, కొత్త ప్రయాణం. దిశ కొత్తదే, విజన్ కొత్తదే. మన విశ్వాసం, తీర్మానం కూడా కొత్తవే. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. భారత్ ముందుకు నడిస్తే ప్రపంచం కూడా ముందుకు నడుస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ ఆవిర్భావానికి సాక్షి ఇప్పటి అవసరాలకు పాత భవనం సరిపోవడం లేదు. అందుకే కొత్తది నిర్మించాం. కొత్తగా మరికొంత మంది ఎంపీలు చేరనున్నారు. 2026 తర్వాత పునర్వ్యస్థీకరణతో పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. సెంగోల్‌కు తగిన గౌరవం దక్కుతుండడం సంతోషకరం. చోళ సామ్రాజ్యంలో సెంగోల్‌ను కర్తవ్య మార్గం, సేవా మార్గం, జాతీయ మార్గానికి గుర్తుగా పరిగణించేవారు. కొత్త భవన నిర్మాణంలో 60,000 మంది కార్మికులు పాల్గొన్నారు. ఇక్కడి డిజిటల్ గ్యాలరీని వారికే అంకితమిస్తున్నాం. ఈ కొత్త భవనం ఆత్మనిర్భర్ భారత్ ఆవిర్భావానికి, వికసిత భారత్ దిశగా మన ప్రయాణానికి ఒక సాక్షిగా నిలుస్తుంది. భారత్ విజయం ప్రపంచ విజయం భారత్‌లాంటి పూర్తి వైవిధ్యం, అధిక జనాభా ఉన్న దేశం పరిష్కరించే సవాళ్లు, సాధించే విజయాలు చాలా దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. రాబోయే రోజుల్లో భారత్ సాధించే ప్రతి విజయం ప్రపంచం సాధించే విజయంగా మారుతుంది. భారత్ కేవలం ఒక ప్రజాస్వామ్య దేశం కాదు, ప్రజాస్వామ్యానికి తల్లి కూడా. మన ప్రజాస్వామ్యమే మనకు స్ఫూర్తి. మన రాజ్యాంగమే మన బలం. ఈ స్ఫూర్తికి, బలానికి ఉత్తమమైన ప్రతీక పార్లమెంట్. పాత కొత్తల కలయికకు పరిపూర్ణ ఉదాహరణ పార్లమెంట్ నూతన భవనం. శతాబ్దాల బానిసత్వం కారణంగా మన ఉజ్వలమైన భవన నిర్మాణ శైలికి, పట్టణ ప్రణాళికకు దూరమయ్యాం. ఇప్పుడు ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించుకుంటున్నాం. పార్లమెంట్ కొత్త భవనాన్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారు. మన వారసత్వం వైభవం, నైపుణ్యాలు, సంస్కృతితోపాటు రాజ్యాంగ వాణికి సైతం ఈ భవనం ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన సామగ్రితో కొత్త భవనం నిర్మించాం. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్‌కు ఇదొక గుర్తు. ప్రారంభోత్సవం సాగింది ఇలా..! అత్యాధునిక హంగులు, సకల సదుపాయాలతో నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటు కొత్త భవనాన్ని ఆదివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అట్టహాసంగా ఒక ఉత్సవంలా సాగిన ఈ వేడుకలో ప్రధాని చారిత్రక ప్రాధాన్యమున్న అధికార మార్పిడికి గుర్తయిన రాజదండం (సెంగోల్)ను లోక్‌సభ ఛాంబర్లో ప్రతిష్టించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితమిచ్చారు. ► సంప్రదాయ దుస్తులు ధరించిన ప్రధాని మోదీ ఉదయం 7.30 గంటలకి పార్లమెంటుకు వచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధానికి ఎదురేగి స్వాగతం పలికారు. ► పార్లమెంటు ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్రధాని మోదీ నివాళులర్పించారు ► అక్కడ నుంచి నేరుగా కొత్త భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన పూజామండపానికి చేరుకున్నారు. అక్కడ ప్రధానికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కర్ణాటక శృంగేరి మఠాధిపతులు వేద మంత్రాలు పఠిస్తూ ఉంటే ప్రధాని మోదీ గణపతి హోమం నిర్వహించారు. దీంతో పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ► అనంతరం వేద పండితులు ప్రధానికి శాలువా కప్పి ఆశీర్వాదాలు అందజేశారు. ► అక్కడ నుంచి తమిళనాడు నుంచి వచ్చిన 21 మంది పీఠాధిపతులు వద్దకి వెళ్లారు. వారికి నమస్కరించారు. అప్పటికే పూజలు చేసి సిద్ధంగా అక్కడ ఉంచిన చారిత్రక సెంగోల్ ఎదుట ప్రధాని సాష్టాంగ నమస్కారం చేశారు. వారు అందించిన సెంగోల్‌ను చేత పుచ్చుకున్న ప్రధాని మోదీ వీనుల విందుగా నాదస్వరం వాయిస్తూ ఉంటే, వేద పండితులు మంత్రాలు పఠిస్తూ ఉంటే స్పీకర్ ఓం బిర్లా వెంటరాగా ఒక ఊరేగింపుగా వెళ్లి సెంగోల్‌ను లోక్‌సభ ఛాంబర్లోకి తీసుకువెళ్లి స్పీకర్ కుర్చీకి కుడివైపు ప్రతిష్టించారు. ► అనంతరం స్పీకర్ ఆసీనులయ్యే సీటు దగ్గర ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేశారు. ► లోక్‌సభ నుంచి తిరిగి ప్రధాని మోదీ పూజాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ఆవిష్కరించి నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేశారు. ► అనంతరం కొత్త భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కొంతమంది కార్మికులకు శాలువాలు కప్పి సత్కరించారు. వారి ప్రతిభకి గుర్తింపుగా జ్ఞాపికలను బహూకరించారు. ► అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ► దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.75 స్మారక నాణేన్ని ప్రధాని ఆవిష్కరించారు. త్రిభుజాకారంలో ఉన్న కొత్త భవనం ముద్రించి ఉన్న స్టాంపు, కవర్ని కూడా ఆవిష్కరించారు. ► రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పంపించిన సందేశాలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చదివి వినిపించారు. ► కార్యక్రమంలో భాగంగా లోక్‌సభలో నేతల సమక్షంలో జాతీయ గీతం అయిన జనగణమన వినిపించారు. ► ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్. జైశంకర్, అశ్వినీ వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ► నూతన భవనం ప్రారంభోత్సవానికి కనీసం 20 విపక్ష పార్టీలు హాజరు కాలేదు. -
2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’
న్యూఢిల్లీ: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్య సాధనకు ఆధునిక సాంకేతికత దోహదపడతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్ విప్లవ ప్రయోజనాలు ప్రజలందరికీ దక్కేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా భారీస్థాయిలో ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ‘అన్లీషింగ్ ద పొటెన్షియల్: ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్ టెక్నాలజీ’ పేరిట మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. చిన్న తరహా పరిశ్రమలపై భారంగా మారిన నిబంధనలను తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. టెక్నాలజీతో పేదలకు లబ్ధి అన్ని రంగాల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని నరేంద్ర మోదీ వెల్లడించారు. 5జీ, కృత్రిమ మేధ(ఏఐ)పై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోందన్నారు. సాంకేతికతతో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పెనుమార్పులు రాబోతున్నాయన్నారు. ఒకే దేశం, ఒకే రేషన్‌తోపాటు జన్ ధన్ యోజన, ఆధార్, మొబైల్ నెంబర్(జేఏఎం)కు టెక్నాలజీయే ఆధారమని అన్నారు. దీనివల్ల పేదలకు లబ్ధి చేకూరుతోందని హర్షం వ్యక్తం చేశారు. సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఏఐ ద్వారా పరిష్కరించగలిగిన పదింటిని గుర్తించాలని నిపుణులకు సూచించారు. 21వ శతాబ్దాన్ని టెక్నాలజీ ముందుకు నడిపిస్తుందని, దీన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో ప్రజల జీవనాన్ని సులభతరం చేయడానికి ప్రతి బడ్జెట్లోనూ పెద్దపీట వేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని ఒక అవరోధంగా పరిగణించవద్దని ప్రజలకు సూచించారు. -
ఉచిత పథకాలు దేశానికి ప్రమాదకరం
జలౌన్: ఉచిత పథకాల ద్వారా ఓట్లు దండుకునే సంస్కృతి దేశం అభివృద్ధికి చాలా ప్రమాదకరమని ప్రధాని మోదీ అన్నారు. ఇటువంటి తాయిలాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆయన హెచ్చరించారు. యూపీలో రూ.14,850 కోట్లతో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను జలౌన్ జిల్లా కైతెరి గ్రామం వద్ద శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ రహదారితో వాహనాల వేగం మాత్రమే కాదు, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని చెప్పారు. చిత్రకూట్– ఢిల్లీ మధ్య ప్రయాణ కాలం మూడు నుంచి నాలుగు గంటలు తగ్గుతుందని కూడా చెప్పారు. ‘‘మన దేశంలో రేవడీ(ఉత్తర భారతంలో ఒక స్వీట్ పేరు)లు పంచుతూ ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవడీలతో ప్రజలను కొనుగోలు చేయవచ్చని అనుకుంటున్నారు. ఈ సంస్కృతి దేశం అభివృద్ధికి ప్రమాదకరం. రేవడీ సంస్కృతితో కొత్త ఎక్స్‌ప్రెస్ వేలు, ఎయిర్‌పోర్టులు, డిఫెన్స్ కారిడార్లు రావు. ఈ సంస్కృతిని దేశ రాజకీయాల నుంచి పారదోలినప్పుడే కొత్త రహదారులు, కొత్త రైలు మార్గాలు నిర్మించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవచ్చు’’అంటూ ఎన్నికల సమయంలో ఉచిత పథకాలను ప్రకటించే రాజకీయ పార్టీలపై పరోక్షంగా విమర్శలు చేశారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు సులువైన రేవడీ సంస్కృతిని వదిలి, రాష్ట్రాభివృద్ధికి తీవ్రంగా పాటుపడుతున్నాయని ప్రధాని చెప్పారు. దేశ అభివృద్ధికి పునాదులు: కేజ్రీవాల్ ఉచిత పథకాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇస్తున్న విద్య, ఆరోగ్యం, విద్యుత్ సౌకర్యాలు ఓట్లు గుంజే తాయిలాలు కావని తెలిపారు. మన దేశం ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచేందుకు పునాది వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలని పేర్కొన్నారు. -
దేశ ఆర్థికాభివృద్ధిలో సీఏలది కీలకపాత్ర
పారదర్శకంగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు: ఐసీఏఐ అధ్యక్షుడు దేవరాజరెడ్డి దేవరాజరెడ్డి, నీలేశ్ వికమ్సేను సన్మానిస్తున్న ఎస్‌ఐఆర్‌సీ ప్రతినిధులు, చిత్రంలో సాక్షి ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి తదితరులు సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థికాభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల(సీఏ)ది క్రియాశీలక పాత్ర అని, వీరందరూ పారదర్శకంగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) అధ్యక్షుడు ఎం.దేవరాజరెడ్డి అన్నారు. ఐసీఏఐకి తొలిసారిగా అధ్యక్షుడైన తెలుగు వ్యక్తి దేవరాజరెడ్డితో పాటు ఉపాధ్యక్షుడు నీలేశ్ వికమ్సేను మంగళవారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయినిగమాగమంలో హైదరాబాద్ బ్రాంచ్ ఆఫ్ ఎస్‌ఐఆర్‌సీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవరాజరెడ్డి మాట్లాడుతూ.. ‘‘అందరి ప్రోత్సాహం వల్లే నేను ఈ రోజు ఐసీఏఐ అధ్యక్షుడి స్థాయి వరకు రాగలిగా. విధి నిర్వహణలో భాగంగా దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రధాన దృష్టి పెడతా. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్ట్స్(ఐఎఫ్ఆర్ఎస్)కు అనుగుణంగా భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్స్‌లో బోధనా మార్పులు తీసుకొచ్చాం. ఐసీఏఐలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ డెరైక్టరేట్ నుంచి టెక్నికల్ డెరైక్టరేట్ వరకు వివిధ విభాగాల్లో సృజనాత్మకతకు పెద్దపీట వేశాం’’ అని చెప్పారు. ఐటీ కంపెనీల మాదిరిగానే భవిష్యత్తులో ‘అకౌం టింగ్ హబ్’ వస్తుందని ఉపాధ్యక్షుడు నీలేశ్ అన్నారు. ‘‘సీఏ పరీక్ష నిబంధనలతో ఐదు శాతం మంది మాత్రమే పాస్ అవుతున్నారు. నాలుగేళ్ల పాటు కష్టపడి చదివిన మిగతా 95 శాతం మంది నిరాశకు లోనవుతున్నారు. అందుకే ఐఐటీ, ఐఐఎం మాదిరిగా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి పరిమిత సంఖ్యలో విద్యార్థులను ఎంపిక చేసుకొని శిక్షణ ఇస్తే బాగుంటుంది. దీంతో చాలా మంది విద్యార్థులకు కెరీర్ ఇచ్చినవారం అవుతాం’’ అని ‘సాక్షి’ అడ్మిన్ అండ్ ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులతోపాటు సీనియర్ సీఏ సభ్యులు పాల్గొన్నారు. -
మోదీ నేతృత్వంలోనే దేశాభివృద్ధి
సారంగాపూర్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య అన్నారు. మండలంలోని జామ్, సారంగాపూర్, బీరవెల్లి తదితర గ్రామాల్లో మంగళవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాలకు చెందిన సుమారు 150మంది పార్టీలో చేరగా భూమయ్య కండువాలు వేసి వారిని పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు జరిగాయన్నారు. పలు ప్రధాన కార్యక్రమాలను చేపట్టి దేశాభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో స్వచ్ఛమైన భారతదేశాన్ని చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు రచ్చ మల్లేశ్, ఆడెపు మహేందర్, సుమన్ తదితరులున్నారు.